Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 14


    
    శోభన్ కు నెత్తురు సలసల కాగింది! అవును! ఎంత గర్వం? ఎంక అహంకారం? పిలిచినా తోసివేస్తుందా. ఏం చూచుకొని ఇంత నిర్లక్ష్యం తనపైన? ఇంగ్లీషు సినిమాలు అర్దంకాగానే ఒక గొప్పా?  వాటిని గురించి ఇంగ్లీషులో మాట్లాడగానే తనో గొప్ప దొరసాని అయిపోయిందా?ఆ  విశ్వంగాడ్ని చూడగానే ఈ వేళ తనయందు నిరాదరణకల్గింది! బహుశ: ఏడుస్తుందేమో - తనకు విశ్వంలాంటి ఇంగ్లీషులో మాట్లాడగలిగిన మొగుడు దొరకనందుకు. అసలు, వెధవది, కందుకూరులో ఇంగ్లీషు సినిమాలు రావు. వున్న రెండు హాళ్లల్లో పాతసినిమాలు వస్తుంటై. అక్కడ తను బి. ఏ. దాకా చదివినా, ఇలా ఇంగ్లీషులో మాట్లాడుకోవడం గానీ. ఇంగ్లీషు  నవలలు చదవడం గానీ తన కలవాటులేదు ఈ శాంత గుంటూరులో చదివిందిగదా! అక్కడ ఆమెకు కావలసినన్ని ఇంగ్లీషు సినిమాలు, నవల్సు వుండేవిగామోసు!ఈ ఇంగ్లీషుతో పెండ్లినాడే గొడవలు జరిగాయి. ఎవడో గొట్టం గాడు పెండ్లి అయింతరువాత బోజనాలు చేస్తూ, 'ఏమోయి? మార్కులెలా వచ్చాయి"  అన్నాడు తను చెప్పాడు - ఇంగ్లీషులో ముప్పైఏడుపర్సెంటని. పెండ్లికూతురు ఫ్రెండ్ అన్నది - ఇంతలో 'మా శాంతకు అరవై పర్సంటనీ' తనకు చచ్చే చావైంది. ఆ తరువాత  ఐదారు గంటలదాకా శాంతముఖం చూడలేక పోయినాడు. ఆనాడే ఆమెకు తనంటే విముఖత్వం వచ్చి వుండాలి.  పాపం! ఏం చేస్తుంది! కట్నాలిచ్చి, ఇంగ్లీషునవలలు తెచ్చిచ్చి, సినిమాలు చూపించి, తనతో వాదించే ఇంజనీరు భర్తను తెచ్చుకో లేకపోయింది గదా! ఇవాళ అలాంటివాడు కన్పడగానే తన దురదృష్టం కొట్టవచ్చినట్లు కనబడి వుంటుంది. అందుకే తనను పురుగును చూచినట్లు చూచి, పోయి దూరంగా పడుకొంది. అయితే తనపై  ఈ అసహ్యం ఎన్నాళ్లుంటుందో?మళ్లీ ఆ వెధవాయ్, విశ్వంగాడిని కొంపకు రమ్మంది. ఇక వాడు వచ్చినప్పటినుండి ఇంగ్లీషు సినిమాలు, నవల్సూ చర్చ మొదలెడతాడు గామోసు. అప్పుడు తను ఈమె దృష్టిలో మరింత చవట అయిపోతాడు. ఛీ!   ఎంత బుద్దితక్కువై ఈ బి. ఎ. ను తగిలించుకొన్నాను?  తగిలించుకొన్నానుపో!  మార్క్సు ఒచ్చేదాకైనా ఆగి వుండాల్సింది. అసలీ మార్కుల గొడవతోనే శోభనం నాటి మొదటిరాత్రి నీరసంగా  జరిగిపోయింది. తమను గదిలోకి పంపించేముందు ఈ శాంత ఫ్రెండే, ఏదో కూసింది. 'జాగ్రత్తేవ్! అసలే ప్రావీణ్యమంతా పాపం ఆయనమీద చూపించేవ్!  అసలే ఆయనగారికి మార్కులు తక్కువ పాపం!" అన్నది చిన్నగానే శాంతతోటి. అయినా. తనకు వినపడనే వినబడింది. అయినా శాంత, ఏం సమాధానం చెబుతుందో. అని చెవులు రిక్కించి శాంత. తనకు గుండెలో రాయిపడింది. ఇంగ్లీషు తను వ్రాయగలడు గాని, మాట్లాడలేడు. అసలు ఆ అవకాశం తనకు హైద్రాబాదొచ్చిందాకా చిక్కలేదు. హైద్రాబాద్ లోనైనా సాధ్యమైనంతగా తప్పించుకొనేవాడు ఇంగ్లీశషులో మాట్లాడే వాళ్లను. ఆ భయంతోనే శోభనం గదిలో  అడుగుపెట్టాడు. తను వెళ్లి పాన్పుమీద కూర్చున్నాడు. శాంత వచ్చి మంచం దగ్గర  నిలబడింది. సినిమాలో శోభనం సీన్సు చాలా అసహజంగా చూపిస్తారు. కానీ తనకేదో సిగ్గు, దడ ప్రారంభమైంది. అందులో ఇంగ్లీషులోనే మాట్లాడుతుందేమో నన్న బెరుకు ప్రారంభమైంది. ఏంటో, ఈ శోభనం అంతా న్యూసెన్సు. గుట్టుగా జరిగిపోవాల్సింది. పదిమంది రావడం, దంపతులను గదిలోకి నెట్టడం, అంతా బయట వుండటం, ఇదంతా పరమ సిగ్గుచేటు. నిలబడిన శాంత మంచం మీదకొచ్చి కూర్చుంది. తను మాట్లాడిద్దామనే అనుకొన్నాడు. కాని వెధవది గొంతులో వుండలాగా వుండిపోయింది.
     అయినా అతి ప్రయత్నంలో 'శాంతా!" అన్నాడు. పలుకలేదు శాంత. తను హైద్రాబాద్ లో ఇల్లు తీసుకున్నా నని చెప్పాడు. 'మరి హైద్రాబాద్ లో ఇంత క్విక్ గా, ఫామిలీ పుటప్ చేయాలంటే చాలా డిఫికల్టీస్ వుంటాయి.  అవన్నీ ఇంత క్విక్ గా ఎలా ఓవర్ కం అయ్యారు?' అన్నది శాంత.  ఆమాత్రం ఇంగ్లీషు తనకర్దమైనా ఆ నాల్గుముక్కలు తెలుగులో చెప్పగూడదూ! ఎంత గర్వం? తనకు గాంగా ఇంగ్లీషు ఎక్కువ మార్కులొచ్చాయని కాబోలు. ఇక తను మాట్లాడక, పాన్పుపై ఒకప్రక్కగా ఒదిగి పడుకున్నాడు. కాని శాంత తెల్లవార్లూ, అలా కూర్చుంది. తెల్లవారి పోయింది.
     మధ్యాహ్నం భోజనాలవగానే మేనమామ తనతో మాట్లాడాడు. ఏంరా! తెల్లవార్లూ వృధాగానే గడిపావటనే! నీకేం పొయ్యేకాలం? ఆడ పెండ్లివారంతా నోళ్లు నొక్కుకొంటున్నారు' అని ఏవేవో చెప్పాడు. మరుసటిరోజు రాత్రి తాను ముందుగా గదిలో కెళ్లాడు. శాంత వస్తూనే పాన్పు మీదనుండి ఒక దుప్పటి దిండూ తీసుకొనివెళ్లి, దూరంగా క్రింద దుప్పటి వేసుకొని. దిండు పెట్టుకొని పడుకొంది - ఈరోజు లాగానే. తననుకొన్నాడు! ఇంత సిగ్గులేకుండా ఈమె రాత్రి సంగతి అందరికీ చెప్పుకొన్నందుకు. తను పిల్చాడు, శాంతను -  కొద్దిగా కోపంగానే 'శాంతా ఇలారా! అన్నాడు. ఇవాల్టికి ఇక్కడే కోపంగానే 'శాంతా ఇలారా! అన్నాడు. ఇవాల్టికి ఇక్కడే పడుకుంటాను లెండి అన్నది - అచ్చం ఈరోజన్నట్లె. తనకు కోపం వచ్చింది. పోయి శాంత చేయిపట్టుకొని రమ్మని  ఆమెను లేవదీసుకొని మంచం దగ్గరకు తీసుకొచ్చాడు. 'రాత్రి సంగతి అందరికీ ఎందుకు చెప్పావ్?' అనడిగాడు'నేనేం చెప్పలేదు. వాళ్లు గ్రహించగలరు అంది. ఎలా గ్రహిస్తారు!  తలుపులు మూసివున్నాయి గదా! అంటే తనతో, అబద్దాలు చెప్తున్నది! ఎంత ఇంగ్లీషులో ఎక్కువ మార్కులొచ్చినా  ఆపాటి గ్రహించలేని మందకొడి బుర్రగాదు తనది. అయినా సమాధానపడ్డాడు. తరువాత రెండురోజులు హాయిగా గడిచి  పోయినై.  కానీ శాంత అంది. 'మొగవాళ్లిలాటి విషయాలలో ఉత్సుకత చూపకపోతే ఏదో లోపం వుందనుకుంటారు అంది' అంటే తనలో లోపంవుందని ఆరోజు అందరికి చెప్పిందన్నమాట. ఛీ!ఛీ! ఎంత అవమానం! బహుశ:, ఈ రోజు అలా అనుకుందేమో. ఆ విశ్వంగాడ్ని చూచాక మార్కులు తక్కువ వచ్చిన బి. ఎ. గాడు - అందులో లోపంగూడా వున్నవాడు అంటే అసహ్య మేసిందేమో? శోభన్ మనస్సంతా దహించుకుకొని పోయింది. ఇప్పుడే తేల్చాలి అనుకొన్నాడు. కోపంతో, ఈర్ష్యతో మండిపోతున్నాడు శోభన్.
     ఆ విశ్వంగాడు ఇంగ్లీషు సినిమాలు, నవల్సూ అని దీన్నిబుట్టలో పెట్టడం ఎంతసేపు?  అందులో,  తనంటే తక్కువ భావం కలిగివుండే లోపంగూడా వున్న దనుకుంటున్న దేమో! ఏమిటా లోపం? అంటే తనకు మొగతనం లేదనేగా ఆమె భావం? శోభన్ లేచాడు, సోఫా దగ్గరకొచ్చాడు.


     "శాంతా! శాంతా!' అని పిల్చాడు. 'ఏంటండి' అంది శాంత నిద్రపోతూనే. 'నువ్వు వచ్చి నా దగ్గర పడుకో' అన్నాడు అనంగానే. పోదురూ! ఇవాల్టికి నేనిక్కడే పడుకుంటా అని మళ్లీ నిద్రలోకి జారింది శాంత .
     శోభన్ భగ్గున  మండిపోయాడు. ఎంత నిర్లక్ష్యం? గొంతుపిసికి చంపుదామన్నంత కోపం వచ్చింది శోభన్ కు.
     అయినా తమాయించుకొని మళ్లీ వచ్చి మంచంమీద కూర్చున్నాడు. అయిపోయింది? అంతా అయిపోయింది!? శాంతకు తనంటే ఇష్టంలేదు. విశ్వంగాడితో లేచిపోవడానికింకెంతో టైం లేదు అనుకొన్నాడు శోభన్.
     మళ్లీ తెరలాగా వచ్చింది శోభన్ కు కోపం. వేగంగా వెళ్లి, శాంతను భుజం పట్టుకొని కుదిపాడు. ఆమె నిద్ర మత్తుతో  గొణుగుతూ, లేచి కూర్చున్నది. అయినా  తూలుతూ, వాలిపోతుంటే  శోభన్ శాంతను పట్టుకొని నిలబెడ్తున్నాడు.
     శోభన్ అడిగాడు 'శాంతా! చెప్పు! నేనంటే నీకు ఇష్టం లేదా? నన్ను లోపంవున్న మగవాడనే అనుకొంటున్నావా?'  అని అడిగాడు.
     ఈ మాటతో శాంతకు ఝల్లున మెళుకువ వచ్చింది. శోభన్ వైపుచూచి నవ్వింది.' 'ఏంటండీ మీరనేది?' అన్నది. మళ్ళీ శోభన్ ప్రశ్నలను పునరావృతం చేశాడు.
     ఛీ! పొండి! నేనివాల్టికిక్కడే పడుకుంటా" నని మళ్లీ సోఫాపై వ్రాలిపోయింది శాంత .
     శోభన్ కు కోపంతో. అవమానంతో వళ్లు వణికింది. తేలిపోయింది! నేనంటే ఈమెకు ప్రేమలేదు! నన్ను నపుంసకు  డనుకుంటూంది! శాంతను గొంతుపిసికి  చంపేద్దామని కోపంతో  వణుకుతూ, శాంత దగ్గర కెళ్లాడు. శాంత ప్రశాంతంగానిద్రపోతున్నది . ఛీ! ఈమెకు ముఖం చూపడమెలాగా: తన జీవన్మరణ సమస్యను ఎంత  తేలికగా త్రోసివేసింది. ఇక బ్రతకడం వృధా!
     అనుకొని, వేగంగా వంటింట్లోకెళ్లాడు శోబన్. సామాన్లకు ఒకపెద్ద చాంతాడు కట్టివున్నది. దాన్నివిప్పి నడిం గదిలో కొచ్చాడు. ఒక  కుర్చీ తెచ్చుకొని. దాని చేతులమీద నిలబడ్డాడు. నిలబడి, పైనవున్న కొక్కేనికి తాడు ముడిపెట్టి, తన గొంతుకకు ఉరి బిగించుకొని కుర్చీని కాల్తో తన్నేశాడు!
                                                           *    *    *    *
     మరుసటిరోజు సాయంకాలం నాల్గు గంటలైంది. శోభన్ తండ్రి, మామ, శోభన్ శవానికి దహనసంస్కారం చేసి ఇంటికొచ్చారు. శాంతతల్లి శాంతను శాంతపరుస్తున్నది. శాంత గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది.
     'తల్లీ! ఇంతఘోరం ఎలా జరిగింది తల్లీ! అన్నది శాంత అమ్మ. శోభన్ తండ్రి. శాంతతండ్రి, తలలు చేతపట్టుకొని కూర్చున్నారు. శాంత రెండురోజులు కాపురంలోని విషయాలు అప్పటికే రెండుసార్లు చెప్పింది. అందులో విశేషాలేం లేవు. ఎందుకు శోభన్ ఇంత అఘాయిత్యం చేశాడో తెలీదంది శాంత. ఆఖరుకు అన్నది -
     'అమ్మా! రాత్రి ఎనిమిదింటికి బహిష్టయ్యాను. వారు తన దగ్గర పడుకోమన్నారు. సిగ్గువల్ల, సంగతి చెప్పలేక సోఫా మీద పడుకొన్నాను. నడుమ నడుమ ఏంటో మాట్లాడించారు, ఇంతే! వేకువజామున మూడింటికి లేచిచూస్తే వారు పక్కమీద లేరు. దొడ్లోకి వెళ్దాం అని నడింగదిలో కొచ్చి చూస్తే ఈ ఘోరం? అన్నది' శాంత వెక్కి వెక్కి ఏడుస్తూ.
                                                  *   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS