"నీకేమైనా మతిపోయిందా? మా కంపెనీ కోటిరూపాయల్ది."
"అయ్యుండచ్చు. కానీ, గత పది సంవత్సరాలుగా ఒక రూపాయి కూడా సభ్యులకి లాభం పంచలేదు. షేరు ధర పదోవంతు కూడా లేదు మార్కెట్ లో-"
శర్మ ఆలోచనలో పడ్డాడు. ఇందులో ఏదైనా తిరకాసు వుందా అని రవి అన్నాడు- "చూడండి నిజానికి నెలకి పదివేలు అంటే నేను ఎగిరి గంతేసి వప్పుకోవాలి. కానీ మీ షేర్లు ఎందుకు అడుగుతున్నాను? మీలో ఒకడిగా కలిసిపోవటానికి! అప్పుడే నాకూ పనిచేయాలన్న తపన వుంటుంది. అయిదు శాతం షేర్లవల్ల నాకు తిండికి సరిపోయే డబ్బుకూడా వస్తుందని నేను అనుకోను." రవి తన కంపెనీ గురించి ఇంత స్టడీ ఎప్పుడు చేశాడో అర్ధంకాలేదు. అతడు అన్ని కంపెనీలనీ అలాగే స్టడీ చేస్తున్నాడని మాత్రం తెలీదు. ఏమైతేనేం, వర్మ కొంచెం ఆలోచించి, వప్పుకున్నాడు మొత్తానికి.
అలా రవి తేజా టెక్స్ టైల్స్ లో షేర్ హోల్డర్ అయ్యాడు.
ఆ రోజునుంచీ తేక కంపెనీ పరుగు మొదలు పెట్టింది. మొత్తం కంపెనీ అంతా కాదు. కేవలం ఆప్లిక్ విభాగం దానికి అధిపతి రవి. ఆ ఒక్క విభాగం లాభాలే మొత్తం కంపెనీ పోషించవలసిన స్టేజి వచ్చింది. ముందెక్కడో చెప్పినట్టు 1978-79 లో ఈ ఆప్లిక్ వర్క్ ఆంద్రదేశాన్ని వూపేసింది.
తేజా టెక్స్ టైల్స్ కంపెనీలో అరవై శాతం పైగా షేర్లు శర్మవే. ఆయనకీ వున్న గుర్రప్పందేల పిచ్చి మిగతా డైరెక్టర్లకి తలనొప్పిగా వుండేది. కంపెనీ మూలధనాన్ని ముట్టుకునేవాడు కాదు. కానీ లాభాలన్నీ గుర్రాలమీద పెట్టేవాడు. అందువల్ల అభివృద్ధి కుంటుపడింది. ఎన్నో సంవత్సరాల్నుంచీ ఇది జరుగుతూ వుంది. రవి, తన బాధ్యతని ఒక యజ్ఞంలా నిర్వహిస్తూ వచ్చాడు. ఆర్నెల్లలో అతడు మొత్తం మార్కెట్టు చదివాడు. బోంబేడైయింగ్, విమల్ లాంటి కంపెనీల షేర్లు రోజురోజుకీ ధర పెరుగుతున్నాయి. కేవలం తమ కంపెనీదే పెరగటం లేదు. దీనికి కారణం అందరికీ తెలుసు. కానీ ఎవరూ ఏమీ చెయ్యలేరు. సంవత్సరం గడిచింది. ఈ లోపులో అతడు తేజా టెక్స్ టైల్స్ వెనుక ఒక బలమైన శక్తిగా రూపొందాడు.
ఇలా వుండగా ఒకరోజు చిత్రమైన సంఘటన జరిగింది.
'ప్రేమ మంజరి' అనే గుర్రం గెలుస్తుందని శర్మకి నిశ్చయంగా తెలిసింది. దానిమీద ఇరవై లక్షలు కాద్దామని దృఢనిశ్చయంతో వున్నాడు. కానీ డబ్బులేదు. ఎన్ని విధాలో ట్రై చేశాడు. షేర్లు కుదువపెడదామనుకున్నాడు కూడా. కానీ మార్కెట్ లో ఆ షేర్లని తనఖా పెట్టుకోవటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కాలు గాలిన పిల్లిలా తిరగసాగాడు.
సరీగ్గా అప్పుడు మిగతా డైరెక్టర్లతో కలిసి రవి అతడికో పరిష్కారం సూచించాడు.
తేజా టెక్స్ టైల్స్ 'ఒక్కరోజు' కోసం శర్మకి ఇరవై లక్షలు అనధికారంగా అప్పు ఇచ్చేటట్టూ, ఆ గుర్రం ఓడిపోయిన పక్షంలో శర్మ తన షేర్లన్నీ వదిలేసుకొనేట్టూ, గెల్చిన పక్షంలో ఇరవైశాతం కంపెనీకి దానంగా ఇచ్చేటట్టూ....
శర్మకి ఈ ప్రపోజల్ అర్ధంకాలేదు. డైరెక్టర్లందరూ కూర్చున్నారు. వాళ్ళ ఇంటిలో, క్రిందహాల్లో ఈ సమావేశం జరిగింది. "మీరేం చెపుతున్నారో నాకు అర్ధంకావడంలేదు. ఇరవై లక్షలకి నా అరవై శాతం వదులుకుని, మొత్తం తేజా టెక్స్ టైల్స్... నేను స్థాపించింది దాంతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలా?"
"గుర్రం ఓడిపోతే అంతే" అన్నాడు రవి. "....అసలు గుర్రం ఓడిపోతే 'తేజ' అన్న కంపెనీయే వుండదు, ఇక తెగతెంపులు ప్రసక్తి ఏముంది?"
"అదేమిటి?"
"అవును బట్టల తయారీకి స్థాపించిన ఫ్యాక్టరీ తాలూకు డబ్బుని ఈ విధంగా గుర్రప్పందాల్లో పోగొట్టుకున్నామని ఏ ఒక్క సభ్యుడు పోలీసు కంప్లెయింటు యిచ్చినా అంతా జైల్లో వుంటాం. ఎవరికీ ఏడు సంవత్సరాలకి తక్కువ శిక్ష పడదు. ఇక తేజా కంపెనీ ఏముంటుంది?"
శర్మకి అతడు చెపుతున్నది అర్ధం అయింది.
"ఒకవేళ గెలిస్తే?"
"గెలిస్తే ఆ ఇరవై లక్షల మీదా మీకో ముఫ్ఫై లక్షలు లాభం వస్తుంది. లాభం మీరుంచుకోండి. మీకీ సాయం చేసినందుకు మాకు ఇరవై శాతం షేరు 'దానం' 'చేస్తున్నారు. అంతే!"
"అంటే 60% నుంచి నా షేరు 40% తగ్గిపోతుంది. కంపెనీ వ్యవహారాల్లో నాకే మాత్రం పలుకుబడి వుండదు. అంతేగా." ఎవరూ మాట్లాడలేదు. తన గుర్రాల బలహీనతని అవతలివాళ్ళు ఉపయోగించుకుంటున్నారేమో అన్న అనుమానం కలిగింది శర్మకి దాన్ని ఖండిస్తూ రవి అన్నాడు -
"మీరు మాకిచ్చిన షేర్ల ని కూడా మేము మీ పేర ట్రస్ట్ లోనే వుంచుతాం. అంటే దానిమీద వచ్చే లాభాలు కూడా మీకే చెందుతాయి."
"అంటే కేవలం ఒక్కరోజు మీరు నాకు ఇరవై లక్షలు చేబదులు ఇచ్చినందుకు - నేను నా కంపెనీ మీద అధికారాలు మీకు వప్పగించి, లాభాలు మాత్రం తీసుకోవాలి..... అవునా."
"కేవలం ఒక్కరోజు అప్పు ఇచ్చినందుకు కాదు. మా ఆరుగురు డైరెక్టర్ల భవిష్యత్తు జైల్లో గడపడం - అనే రిస్కు తీసుకున్నందుకు..."
శర్మ ఆలోచించాడు. "సరే, మీరు చెప్పినట్టే చేద్దాం. ఇరవై లక్షలు యివ్వండి. కానీ ఈ డబ్బు నా కిచ్చినట్టు ఏ రికార్డులోనూ వుండకూడదు. అదీ నా తరపునుంచి షరతు."
అతడు చెపుతున్న దేమిటో అక్కడున్న వారందరికీ అర్ధమయింది. గుర్రం ఓడిపోతే ఇరవై లక్షలూ పోతాయి. తేజా టెక్స్ టైల్స్ డైరెక్టర్లందరూ అరెస్టవుతారు. శర్మ మాత్రం అవడు (కంపెనీ డబ్బులేక మూతపడుతుంది. అది వేరే సంగతి) తుమ్ముతే వూడే ముక్కు వున్నా ఒకటే లేకున్నా ఒకటే.
గుర్రం గెలిస్తే, మరుసటిరోజు డబ్బు జమ అవుతుంది. శర్మ షేర్లు శర్మకే వుంటాయి. అధికారం మాత్రం వుండదు. అతడికేమీ నష్టంలేదు.....డైరెక్టర్లు ఆలోచనలో పడ్డారు. అందరూ దాన్ని రవి మీదకు తోసేశారు. శర్మ లేకుండా ఈ రిస్కు తీసుకోవటం వారికి ఇష్టంలేదు. చివరికి ఆ బాధ్యత తానొక్కడూ తీసుకోవటానికి రవి ఒప్పుకున్నాడు. అంటే - ఒకవేళ ఈ విషయం బయటపడితే రవే, ఆ డబ్బు కంపెనీ నుంచి తీసి ఇచ్చినట్టు పోలీసుల ముందు వప్పుకోవాలి. అలా అగ్రిమెంటు కుదిరింది.
ఒకరికి జీవితంలో ఆనందం ఇచ్చే వ్యసనం-
మరొకరికి నిచ్చెన మెట్లమీద జీవస్మరణ సమస్య
ఆ రాత్రి రవికి నిద్ర పట్టలేదు - టెన్షన్ తో-
పై గదిలోంచి ఇదంతా విన్న మరొకామెకి కూడా!
6
ఆ మరుసటిరోజు మూడింటికి, శర్మ తప్ప - మిగతా వాళ్ళంతా తేజ టెక్స్ టైల్స్ బోర్డ్ రూమ్ లో కూర్చుని వున్నారు. అందరి మొహాల్లోనూ టెన్షన్ కనపడుతూంది.
"మనం ఈ ఏర్పాటువల్ల శర్మగారితో శాశ్వతంగా మనస్పర్ధలు కొని తెచ్చుకుంటున్నామేమో" అన్నాడు డైరెక్టరు. "ఇప్పటివరకూ ఈ కంపెనీలో ఆయన చెప్పింది వేదం."
"అది గుర్రం గెలిస్తే సంగతి, ఓడిపోతే ఏమవుతుందో ఆలోచించండి. కంపెనీ శాశ్వతంగా మూతపడుతుంది."
"రవి జైలుకి వెళతాడు" పూర్తిచేశారు మరొకరు. సమయం మూడుగంటలా పది నిముషాలు అయి వుంటుంది.
ఇంతలో ఒక డైరెక్టర్ అన్నాడు. "శర్మ... మనిషి మంచివారే కానీ ఆయనకీ గుర్రాల పిచ్చి పోకపోతే ఆ కంపెనీ బాగుపడదు. ఇంకొంతకాలం ఇలాగే సాగుతే మనలో మనమాట-నేనింతవరకూ ఎవరికీ చెప్పలేదు. ఈ షేర్లన్నీ అమ్మేసి కంపెనీ నుంచి తప్పించుకుందామనుకున్నాను."
"నేనూ అంతే కేవలం ఆయనమీద గౌరవంతో ఆయనేం చేసినా వప్పుకుంటూ వచ్చాను. కానీ ఎంతకాలం? కానీ దానికీ ఒక హద్దు వుందిగా కంపెనీ ముఖ్యం".
రవి మాట్లాడకుండా వాళ్ళ సంభాషణ వింటున్నాడు. నిజానికి సమస్య వాళ్ళెవరిదీ కాదు, తనది. మనసులో మాత్రం అనుకున్నాడు- ఈపాటికి గుర్రం పరుగెత్తటం ప్రారంభించి వుంటుంది.
అందరూ తమ తమ ఆలోచనల్లో వుండగా 3.20కి ఫోన్ మ్రోగింది. ఒక డైరెక్టర్ రిసీవర్ ఎత్తాడు.
రవి గుండె వేగంగా కొట్టుకోసాగింది.
అవతలి వైపు నుంచి ఫోన్ పది సెకన్లు విని- పెట్టేస్తూ "డియర్ ఫ్రెండ్స్! "ప్రేమమంజరి" గుర్రం నాలుగు లెంగ్తుల్లో గెలిచిందట" అని ప్రకటించాడు చిరునవ్వుతో.
