19
పది ఊళ్ళ లో పేరు మోసిన అయిదుగురు పెద్ద మనుష్యుల సమక్షంలో రైతులు ఒక పరిష్కారానికి తల ఒగ్గారు. మార్కెటు రేటు కట్టీ దాన్ని మూడు భాగాలుగా చేశారు. ఇన్నాళ్ళూ ఆశ్రయించుకుని ఉన్నందుకైతే నేమి, ఆ భూమిని అభివృద్ధి చేసి అంత విలువకు తెచ్చినందుకైతే నేమి- ఒక భాగం మాఫీ (రద్దు) చేశారు. మిగిలిన రెండు భాగాలనూ నాలుగు భాగాలు చేశారు. ఒక భాగం అప్పుడు కట్టాలి. మరొక భాగం మూడు నెలలో కట్టగానే కొలతలు , అగ్రిమెంట్లు. తరవాత మరొక మూడు నెలలకు మిగిలిన రెండు భాగాలూ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ ఖర్చులు రైతులవే! ఇది పరిష్కారం.
దీనికి పెద్ద మనుష్యులంతా ఆమోద ముద్ర వేసి పత్రం వ్రాసి సాక్షి సంతకాలు చేశారు.
రైతులు చాలా సంతోషంగా కనిపించారు. గిరిధారి సమర్ధతనూ, కార్య దక్షతనూ అందరూ ప్రశంసించారు.
"మొత్తమంతా ఎనభై వేలు. ఇప్పుడు ఇరవై వేలు వచ్చింది." అన్నాడు కృష్ణ.
"మిగిలింది నమ్మకంగా ఇస్తారా మళ్ళీ పేచీలు పెట్టకుండా?" అనడిగింది కాంతమ్మ గారు.
"ఇప్పటి కింతవరకూ నరుక్కోచ్చాం. వాళ్ళకు కాగితాలు ఏమీ వ్రాసి ఇవ్వలేదు గదా?"
"అన్నయ్యా!"
"ఊ...."
"ఇదంతా అయన శ్రమ..."
"అవును. ఏం చేద్దామంటావు? అయన కేం చెయ్యగలం మనం!"
"అలా అని ఊరుకుంటామా?" అంది అపర్ణ.
"రెండు సార్లు భోజనం చేస్తేనే మన రుణాన పడిపోతున్నట్లు "ఫీల్" అయ్యే మనిషి! చాలా మొహమాటస్థుడు. నాకేం తోచకుండా ఉంది."
'అతనికి దేనిపట్లా ఆసక్తి లేదు. ఒక ప్రతిఫలం కోరి అయన మన కోసం శ్రమించలేదు. అలాంటి ప్రయత్నాలు చేస్తే అతన్ని అవమానించిన వాళ్ళమవుతాం. ఆ సంగతి గుర్తుంచుకోండి అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ" అంది కాంతమ్మ గారు.
"మరేం చేద్దాం, పిన్నీ?' కృష్ణ మాటలకు -- "ఏమీ చెయ్యకుండా ఊరుకోవటమే " అని జవాబిచ్చింది కాంతమ్మ గారు.
అంతటితో ఆ ప్రసంగం ఆగిపోయింది.
* * * *
"ఈరోజు మన కోక ప్రయాణం తగిలింది. బయలుదేరండి మరొక ప్రశ్న వెయ్యకుండా! రాత్రికి తిరిగి రాగలనుకుంటాను. అలా కాకపొతే ఇబ్బంది ఒక జత బట్టలు బాగ్ లో వేసుకుని ఉంచుకోండి! వివరాలు మాత్రం నన్నడగవద్దు. పిన్నీ, అపర్ణా చెబుతారు."
"అయితే పెళ్ళి చూపులన్న మాట!"
"కరెక్ట్' కృష్ణ ఆడపిల్లలా సిగ్గు పడ్డాడు.
"నా పెళ్ళి వినాయకుడి పెళ్ళిలా తయారైంది." అన్నాడు మళ్ళీ.
అతని అవస్థ చూస్తె జాలి కలిగింది గిరిధారికి.
"దిగులు పడకు, మిత్రమా! త్వరలోనే నీవొక ఇంటి వాడివౌతావు. రాత్రి జాగారణ'లూ, పగటి నిద్రాలూ పెరుగుతాయి."
"మీరలా బనాయిస్తే ఏం చెప్పను గానీ-- ఇప్పుడు మాత్రం రాత్రులు నిద్ర పోతున్నానా!" తల వంచుకునే అన్నాడు కృష్ణ.
"నవ్వుతూ అన్నాను. వయసు వచ్చిన యువకుడు వివాహానికి ఆసక్తి చూపటం , తొందర పడటం తప్పు కాదు. ఆస్తి వ్యవహారం 'సెటిల్' అయింది. పెళ్ళి కూడా త్వరలోనే జరుగుతుంది."
కృష్ణ గిరిధారి వంక కృతజ్ఞతగా చూశాడు.
"మీరు మాకు చాలా చేస్తున్నారు! మేము మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తోచని అయోమయంలో పడ్డాం."
"అలా మీలో మీరు తర్జన భర్జన లు పడకండి! భగవంతుని దయవల్ల నేనలాంటి స్థితిలో లేను."
కృష్ణ మాట్లాడలేదు.
గిరిధారి తయారయ్యాడు. ఇద్దరూ కలిసి కృష్ణ ఇంటి వైపు నడిచారు.
* * * *
పెళ్ళి కూతురు హైస్కూలు చదువుతో ఆపేసింది. అందచందాలు ఫరవాలేదు. కృష్ణ, అపర్ణ, కాంతమ్మ గారు - అందరి ముఖాల్లోనూ వధువు పట్ల ప్రసన్నతా సంతృప్తీ గోచరించాయి.
పిల్ల తండ్రి ముకుందం గారు విషయాలన్నీ స్పష్టంగా చెప్పారు. అయన మాటలూ, మర్యాదా మరీ అతిగానూ కాకుండా, తక్కువ గానూ కాకుండా సమపాళంగా ఉన్నాయి. అమ్మాయి ఒక్కర్తే వారికి. ఆమె తరవాత ముగ్గురు మగ పిల్లలు. పిల్లలంతా చక్కని క్రమశిక్షణ లో పెరిగారు. ఎవరి నెలా గౌరవించాలో, ఎంత వరకు ఉండాలో తెలుసు!
సంబంధం అందరికీ నచ్చింది. కాంతమ్మ గారు, అపర్ణ కూడా ఈ సందర్భంలో ఒక్క మాట పైన ఉండటం అదనపు విశేషం.
ప్రత్యేకంగా సంప్రదించుకుని నిర్ణయించిన మంచి రోజు ముకుందం గారికి చెప్పి ఆనాడు తమ ఊరు రమ్మని ఆహ్వానించి వచ్చేశారు.
* * * *
ఒక సక్రమమైన ఆలోచన చేసి సంకల్పించిన క్రియ కెదురు లేనట్లు కృష్ణ పెళ్ళి సునీలతో జరిగిపోయింది. అచ్చట్లూ, ముచ్చట్లూ అన్నీ సంప్రదాయం ప్రకారం పూర్తీ అయేసరికి ఇరవై రోజులు దాటింది. ఇంట్లో రోజుకొక పండుగ వలె ఉంది.
కృష్ణ పడక గది నుంచి బయటికే రావటం లేదు. సునీల పాపం, అక్కడే ఉండమన్న పతి మాట తప్పలేక, ఎప్పుడూ అక్కడే ఉంటె ఇవతల వారు ఏమనుకుంటారో ననీ సిగ్గుతో చితికి పోతున్నది.
ఇంతవరకూ గిరిధారి ఆమె నోటి మాట వినలేదు. అతనింకా ఇక్కడే భోజనం చేస్తున్నాడు. క్రితం రోజు 'వద్దు' అనుకుని వెళ్ళక పోయేసరికి కృష్ణ స్వయంగా వచ్చి పిలుచుకుని వెళ్ళాడు. ఇప్పుడతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కొత్త దంపతుల జంట రోజూ గ్రామ సంచారం చేసి వస్తున్నారు. సినిమాలు చూస్తున్నారు. పెళ్ళికి రాని ముఖ్య స్త్రీ జనం రోజూ వచ్చి కొత్త కోడలిని చూసి పోతున్నారు. మంచి ఈడు, జోడూ అని మెచ్చుకుంటున్నారు. అంతవరకూ అయితే బాగానే ఉండును. అపర్ణను -- "నీ పెళ్ళి ఎప్పుడమ్మాయీ?' అని పరామర్శిస్తున్నారు.
"నిజమే! రెండూ ఒకే మారు జరిగితే ముచ్చటగా ఉండేది. కాని దాని రోజేప్పుడో అప్పుడే అది జరుగుతుంది." అంది కాంతమ్మగారు.
"ముందు ఆడపిల్ల పెళ్ళి ఆనవాయితీ గా వస్తోంది. అయినా ఇప్పుడు మాత్రం ఏం మించి పోయింది లెండి! చక్కగా అన్నా వదినలు కన్యాధార పోస్తారు."
ఇలా రకరకాల విమర్శలూ, వ్యాఖ్యాలూ , ప్రతిదీ అది కావలసినవారి కన్నా పక్క వారి తపన ఎక్కువ. అడపాదడపా గిరిధారి చెవుల పడుతున్నాయి కొన్ని.
నెల రోజులు గడిచేసరికి అంతా సర్దుకుంది. హడావుడి తగ్గింది. కొత్త కోడలు చిన్న చిన్న పనులు చేస్తుంది. అప్పుడప్పుడూ ఆమె మాట వినిపిస్తుంది.
గిరిధారిని సునీలకు ప్రత్యేకంగా పరిచయం చేశాడు. అతన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. ఆనాటి నుంచి అతన్ని ఆమె -- "అన్నగారూ!' అని పిలవసాగింది.
రైతులు ఇవ్వవలసిన రెండవ వాయిదా సొమ్ము ముట్టింది. అందుకు కృష్ణ ద్వారా కావలసిన అగ్రిమెంట్లు కూడా తయారై వారి కందటం జరిగింది.
20
కృష్ణ ఆనాడు ఒక ప్రత్యేకమైన నూతనాంశం గిరిధారి దృష్టికి తెచ్చాడు. అతన్ని సలహా అడిగాడు.
అతను మేడ మీద రెండు గందులు వేయిస్తాడుట. వాటికి అన్ని సౌకర్యాలు పైనే చేయిస్తాడుట. అదీ విషయం.
"ఇందులో నేను కల్పించుకోగలిగిందేముంది? నన్ను సలహా అడగవలసినంత ప్రత్యెక విషయం కూడా కాదు. పిన్ని గారినీ, అపర్ణనూ, సునీలనూ అడిగి వీలు ఉంటె చేసుకోండి!"
` "అయింది. క్రిందనే లంకంత ఇల్లు. ఇంకా పైన దేనికిరా' అన్నది పిన్ని. అపర్ణ పకపక నవ్వి, 'ఇది కొత్త కోడలి గారి కోరికా, నీ కోరికా ?" అన్నది. పెద్ద ఇల్లు కావచ్చు. సునీల కోరిక కావచ్చి. నాలుగు వెలతో పూర్తీ అవుతుంది. ఏమంటారు?"
"నేననేదేమీ లేదు. మీ ఇష్టం."
"వేయించండి. గదులు. మీ ముచ్చట తీరాక అద్దె కివ్వవచ్చు. నష్టం వచ్చే పని మాత్రం కాదు."
"నీల కూడా అదే అంటుంది. ఇంతమాత్రపు దానికి మరొకర్ని సలహా అడగట మేమిటని ఆమె మొదటే అన్నది."
సునీల పైకి కనిపించేటంత అమాయకురాలు కాదని గిరిధారి కి ఓకే కొత్త విషయం స్పురించింది. ఆమె అసాధ్యురాలైతే పాపం, కృష్ణ చాలా నలిగిపోతాడు. దాన్ని దృష్టిలో ఉంచుకుని అతనికి సలహా చెప్పాడు.
"కృష్ణా! ఏదైనా మీ అంతట మీరు అలోచించి నిర్ణయించడం నేర్చుకోండి! కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైనా మీరు అవతలివారు గీసిన గీతల పై నడుస్తున్నారన్న అభిప్రాయం రానివ్వటం మంచిది కాదు."
"ఇంతకూ ముందు మీరే చెప్పారు ---- మేడ గదుల విషయంలో అందరినీ అడగమని."
"అప్పుడు ఆలోచన మీ స్వంతమనుకున్నాను నేను. స్వంతమైన ఆలోచనకు మరొకరి సలహా జోడించటం తప్పు కాదు, కాని అందులో మంచి చెడ్డలు మాత్రం స్వయంగా నిర్ణయించుకోగలగాలి. ముఖ్యంగా ఇంట్లో ఆడవారి మెజారిటీ ఎక్కువైనప్పుడు యజమాని చాలా నేర్పుగా వ్యవహరించడం నేర్చుకోవాలి. నన్నడిగితే మీరిలా ఏ వ్యాపకమూ లేకుండా రోజులు నేట్టేయటం ఆరోగ్యం కాదంటాను."
"ఏం చెయ్యమంటారు?"
"ఏదైనా చెయ్యండి! చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకోండి! లేదా ఏదైనా షాపు తెరవండి! సంపాదన పెంచుకునే మార్గాలు చూడండి! అంతేకాని ఎప్పుడూ ఇంట్లో ఆడవారి కెదురుగా కూర్చోవద్దు! ఒక 'రొటీన్' ఉండాలి మీకు!"
కృష్ణ మాట్లాడలేదు. పది నిమిషాలు మౌనంగా కూర్చుని వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనను బట్టి తను చెప్పింది అతనికి నచ్చలేదని గ్రహించాడు. కృష్ణ స్వభావం చిత్రమైంది. అతన్ని ఆకర్షించి ఆకట్టుకున్న వారి ప్రభావంలో అతని వ్యక్తిత్వం పని చేస్తుంది. ప్రస్తుతం అతను సునీల ప్రభావంలో ఉన్నాడు. ఆమెగారు ఇంటినే కొలిక్కి తెస్తుందో వేచి చూడటం తప్ప చేయగలిగింది లేదు.
* * * *
