Previous Page Next Page 
మమత పేజి 12

"వీణా... పది నిమిషాల్లో వెళ్ళిపోతా - మీరు చాలా బిజీగా వున్నారని తెలిసికూడా వచ్చా - ఒక్క విషయం వివరంగా చెప్పండి" వీణ ఉలిక్కిపడింది.
"అనాధాశ్రమం ఎక్కడుందీ, ఎంతకట్టాలీ, మనం పిల్లని తెచ్చుకోవాలంటే ఇంకా వాళ్ళకి ఏమేమి చెప్పాలి? ఆమధ్య మా చుట్టాలిలాగే తెచ్చుకున్నారట! నేను ఢిల్లీ వెళ్ళాను మా చెల్లెలి దగ్గరికి - ఆర్నెల్లకోసారి పిల్లని చూపించాలటగా!" జానకి గలగలా మాట్లాడేస్తుంటే వీణ చూస్తూంది.
"ఆ ఎడ్రస్ చెప్పండి!"
జానకి మాటలన్నీ వినిపిస్తున్నాయి లోపలున్న రాజీవ్ కి.
'వీణ ఏం చెప్తుందీ, పాపం..!' అనుకుంటూ, అయినా ఇందులో రహస్యం దేనికీ. తనే చెప్తాడు అన్ని విషయాలు అనుకుంటూ బయటకొచ్చిన రాజీవ్ ఎదురుగా వున్న ఆమెను చూసి విస్తుపోయాడు. జానకి క్షణం కంటి రెప్పవేయకుండా అలానే చూస్తూ వుండిపోయింది.
'మీరా..?' అన్నాడు రాజీవ్.
'మీరా..?' అంది జానకి వెంటనే.
వీణ ఆశ్చర్యంగా ఇద్దరికేసి చూసింది.
జానకి, రాజీవ్ బియస్సీలో క్లాస్ మేట్స్! చాలా చలాకీగా, అందంగా వుండేది జానకి... ఒకసారి మధ్యవర్తుల ద్వారా జానకి తండ్రి, రాజీవ్ తండ్రికి కబురు పెట్టాడు- పెళ్ళీ సంబంధం కోసం.
కానీ, రాజీవ్ తల్లికి ఇష్టంలేదు. జానకికి తల్లి లేదు....అంతేకాదు జానకి తండ్రి మరో పెళ్ళి చేసుకున్నాడు. అంతే..!
తర్వాత రెండేళ్ళకి ఎమ్ ఎస్సీ పూర్తిచేసి ఊరొచ్చాక తెలిసింది- జానకి కులాంతర వివాహం చేసుకుందనీ, భర్త గొప్పధనవంతుడనీ... కానీ-జానకి కన్నా పదిహేనేళ్ళు పెద్దవాడని!
-ఇవన్నీ తల్లి చెప్తే విన్న రాజీవ్ "పాపం.... నన్ను చేసుకుందామని ఎంతగానో అనుకుంది జానకి, నువ్వే పడనివ్వలేదు!" అన్నాడు.
"ఛాల్లే... అలా లేచిపోయి వెళ్ళి పెళ్ళి చేసుకున్నందుకు ఓ పిల్లా పాపా లేరూ - పైగా ఒట్టి అనుమానం మనిషట వాడు!" అంది తల్లి - ఆ తర్వాత తల్లి ఏం చెప్పిందో వినలేదు రాజీవ్ - అయ్యో, పిల్లా పాపా లేరా!
మళ్ళీ ఇన్నాళ్ళకి జానకిని చూసిన రాజీవ్ కి చాలా సంతోషమేసింది.
"ఏం చేస్తున్నారూ..?" అన్నాడు.
జానకి అప్పటిలాగే అందంగా వుంది. గొప్ప ధనవంతురాలిలా, హుందాగా గర్వంగా కనిపించింది రాజీవ్ కి.
జానకి ఏదో ఆలోచిస్తోంది. విధి ఎంత విచిత్రంగా మారిపోతుందీ - ఒకనాడు ఇతన్నే తను వివాహం చేసుకోవాలనుకుంది!
జానకి చిన్నగా నవ్వి "ఏం చేస్తానూ, ఇల్లు, భర్త అంతే, ఏం మీరేం చేస్తున్నారూ?"
"నేను మాత్రం ఏం చేస్తానూ, ఇల్లు, భార్య కొడుకు అంతే!" అన్నాడు నవ్వేసి.
అలా వీరిద్దరీ స్నేహమూ అర్ధమైపోయిన వీణకి హాయిగా వుంది. మమతని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టింది.
"మీ చెల్లెలు, నేను ఇక్కడ కొచ్చాక ఫ్రెండ్సు అయ్యాము. అదీ క్లబ్బు ద్వారా!" అంది జానకి.
జానకి, రాజీవ్ ఎక్కడుంటాడో, ఏం చేస్తున్నాడో కనుక్కుంది. "అదృష్టవంతులు" అంది -
"అంటే..?" అన్నాడు రాజీవ్.
'అదే- నిలకడగా వుద్యోగం వుంటే అదో హాయి! మేం చూడండి - మా వారు ఎక్కడకెక్కడికో మారిపోతూనే వుంటారు - నాలుగేళ్ళు ఢిల్లీలో వున్నాం- ఇప్పుడిక్కడ!' అంది గలగలా నవ్వి.
"రండి మా యింటికి!" అంది విజిటింగ్ కార్డు తీసిచ్చి. "ఆయన కంపెనీలో నేనొక డైరెక్టర్నీ, పార్టనర్ ని - అఫ్ కోర్సు పార్టనర్ ని" అంది జానకి.
అంతలో వీణ రెండు కప్పుల కాఫీ, బిస్కట్లు తెచ్చి బల్లమీదుంచింది.
గడియారం వంక చూసుకుంది జానకి.
"మీ చెల్లాయి తెచ్చిన ఈ పసిపిల్ల గురించి వివరాలడగటానికి కొచ్చాను. ఇవాళ ముఖ్యంగా..."
వీణ లోపలికెళ్ళిపోయింది. రాజీవ్ క్షణం మాట్లాడలేదు.
"ఎక్కడుంటుంది ఈ అనాధాశ్రమం? మీకు తెలిస్తే, నన్ను తీసికెళ్ళండి, చూస్తాను" అంది.
రాజీవ్ ముఖాన పట్టిన చెమట తుడుచుకున్నాడు. రహస్యమేముందీ, మనసుని గట్టి చేసుకున్నాడు.
"మీరడుగుతోన్నవేవీ నాకు తెలియవు"
"అంటే..?"
"అదే - అనాధాశ్రమం ఎడ్రసు" అన్నాడు నెమ్మదిగా.
'వీణ చెప్తుంది లెండి" అంది.
రాజీవ్ నవ్వాడు. "నేనే చెప్తాను.... ఆ పాప నాది!"
అంటే-
"అదే నా గుమ్మంలో వదిలి వెళ్ళారెవరో - దాన్ని నేను పెంచి పెద్దదాన్ని చేయాలి - ఆ బాధ్యత నాదే!"
"ఏమిటీ..?" - అంది జానకి అర్ధంకాక.
రాజీవ్ అన్నాడు - "నిజానికి ఇది నా యింట్లో పెరగాలి. కానీ, నా భార్య సుమతికి ఎందుకో ఇష్టంలేదు. ఏం చేస్తానూ - ఏ అనాధశ్రమంలోనో దింపేయమంది- నాప్రాణం ఒప్పుతుందా- ప్రస్తుతం మా వీణ కొన్ని రోజులు పెంచుతుంది. తర్వాత సంగతి చూద్దాం"
రాజీవ్ వైపు చిత్రంగా చూసింది జానకి.
"ఎవరైనా గుమ్మంలో పిల్లనొదిలి వెళ్ళిపోయే తల్లులుంటారా?- అయ్యో..!" జానకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి - ఎందుకు సుమతి వద్దందో తెలిసింది. ఎవరి పాపమో, తనెందుకు పెంచాలీ అనుకుందేమో.
జానకి అప్రయత్నంగా అనేసింది-
"నాకిచ్చేయండి, నేను దాన్ని మహారాణిలా చూస్తాను, మీరొచ్చి చూస్తూ వుండండి" అంది బతిమాలుతున్నట్టుగా.
వీణ గబుక్కున గదిలోంచి బయటకొచ్చింది- "ఆ పిల్ల నాది, ఆమెవరు యియ్యడానికి, మీరెవరు తీసుకోడానికి..?" అంది మమతని ఎత్తుకుని.
"మీ టెలిఫోన్ నెంబరివ్వండి!" అంది రాజీవ్ తో జానకి. కార్డు తీసుకుంది.
వీధిలో కారు హారన్ మోగుతోంది.....ఇందాకా భార్యని ఇక్కడ దింపి పనిమీద వెళ్ళి వచ్చాడు మాధవరావు, జానకి భర్త..!
కారు హారన్ వినబడగానే "వెళ్ళొస్తా వీణా..!" అంటూ వెళ్ళిపోయింది జానకి.
దీర్ఘంగా నిట్టూర్చాడు రాజీవ్... "హమ్మయ్య పీడ వదిలింది" అనుకుంది వీణ.
"అంత ఈవిడ గోలే ఇది- ఆయన ఒప్పుకోడు- చాలా డబ్బున్న మనిషి, చాలా గర్విష్టి! - పాపం, జానకిని చూస్తే జాలేస్తుంది. కానీ, మనమేం చేస్తాం?" అంది వీణ సామాన్లు సర్దుకుంటూ.
రాజీవ్ అలానే కూచున్నాడు సోఫాలో. మమత ఒళ్ళో కదులుతోంది. మనసు రకరకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరిగా వుంది -
నిజంగానే ఈ పిల్లని జానకి కిచ్చేస్తే ఏం, మనసు ఎటో వెళ్ళిపోయింది- వీణకి ఆనాడు తను ఆపద్ధర్మంగా అప్పగించాడు అంతే! అయినా... వీణకి పిల్లాడున్నాడు, మళ్ళీ నెల తప్పింది... ఈ బాధ్యత వీణకి తప్పించేస్తే ఎలా వుంటుందీ!! వీణ ఆ పనీ ఈ పనీ చేసుకుంటోంది. రాజీవ్ అలానే ఆలోచిస్తున్నాడు...పైగా వీణ దగ్గర పిల్ల పెరుగుతోందంటే ఎప్పటికైనా సుమతి తనని నానా మాటలూ అంటుంది.... అనాధాశ్రమంలో వదిలానని అనుకుంటోంది ... జానకి నిజంగా పెంచగలదు - భర్తని ఒప్పించుకుంటుంది ఎలాగో! - రాజీవ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఓ క్షణం.
"వీణా... మీ ఆయన ఎప్పుడొస్తాడూ?' అన్నాడు.
"రాత్రి తొమ్మిదవుతుంది" అంది లోపలనుంచే.
రాజీవ్ వెళ్ళిపోయాడు. జానకి తనకిచ్చిన ఫోను నెంబరు కార్డు చేతిలో కదులుతోంది. తను చేయబోతున్న పని మంచిదా, కాదా... వితర్కించుకుంటూ మంచంమీద వాలిపోయాడు రాజీవ్.
రాజీవ్ వెళ్ళిపోయాక వీణకి భయమేసింది- ఈ పిల్లని జానకికి యిచ్చేస్తాడేమోనని..! మళ్ళీ మరో నిమిషంలో అనిపించింది- 'అయినా... నా పిల్లకాదుగా, తీసికెళ్ళనీ!' అని. మమత లేత చేతుల్ని ముద్దు పెట్టుకుంది. "నిన్ను నేనెవరికీ ఇవ్వను" అంటూ గుండెలకి.   
                                     *    *    *
రాత్రి పది దాటింది...
వీణ, పిల్లాడు, మమత నిద్రపోతున్నారు. వీధిలో నిలబడ్డ రాజీవ్ ని చూసి తలుపు తీసాడు రవి. ఇద్దరూ మేడ మీద గదిలో కూర్చున్నారు.
"నువ్వనుకుంటున్నంత తేలిక కాదు రాజీవ్ పిల్లని పెంచటం! వీణ ఇప్పటికే తల్లి కనుక మరో పిల్లని చూడగలదు - జానకి విషయం ఏమో చెప్పటం కష్టం. నాలుగురోజులు చూసి, మావారొద్దన్నారని ఈ ఇంట్లో దించేయగలదు - అప్పుడేం చేస్తావ్?" అన్నాడు రవి.
"నిజమే కానీ, వీణకి కూడా ఎందుకు అనవసరమైన బరువు? పైగా- ఇప్పుడు నెల తప్పింది కూడా! దీనికి నేనే ఏదో ఉపాయం ఆలోచిస్తా - ఒకవేళ మమతని నేనే తీసికెళ్ళిపోవచ్చు కూడా! ఏమంటావూ..?" అన్నాడు రాజీవ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS