Previous Page
అసుర సంధ్య పేజి 11


    బస్సు ఒక్క కుదుపుతో ఆగింది.
    అతను బస్సు దిగాడు. అందరితో పాటు. వాచీ చూసుకున్నాడు. ఎనిమిదిన్నర కావస్తోంది. గుడ్డిగా కాస్తున్న వెన్నెట్లో మెలికలు తిరిగి ఉన్న రోడ్డూ , దాని కిరువేపులా పెరిగి ఉన్న చెట్లూ, తుప్పలూ చూడం గానే అతనికి ప్రాణం పోయినట్లే ఉంది. కనుచూపు మేరలో ఎక్కడా వూరు లేదు. డ్రైవరూ కండక్టర్ కిందికి దిగి "ఏం చేద్దాం?' అంటే "ఏం చేద్దాం?' అనుకోసాగారు.
    ప్రయాణికులు ఉస్సూరుమన్నారు. బస్సు చెడి పోయిందిట. ఎప్పటికి కదులుతుందో?
    అతనికో సంగతి ముందే అర్ధమైంది. లేకపోతె అడవి లాంటి ఆ ప్రదేశంలో అర్ధాంతరంగా బస్సు ఆగదు. ఏనాడు చెయ్యని పల్లెటూరి ప్రయాణం , దేనికో విఘ్నం. సిగరెట్ వెలిగించుకుని కండక్టర్ దగ్గరికి పోయాడు.
    "ఆ వూరా! అదుగో! ఆ దుబ్బులు దాటితే మరో రోడ్డు తగులుతుంది. దాని వెంటే ముక్కుకు సూటిగా వెళితే మీ వూరు వస్తుంది."
    "రోడ్డు ఎంత దూరం?"
    "ఎంతోసా సార్! అరమైలు"
    కాళ్ళ పడ్డ పాము, కరవక మానుతుందా! అనుకుంటూ సంచితో ముందుకు కదిలాడు అతను. ఎవరో కవి రాసిన ప్రశ్నార్ధకాల పద్యం గుర్తొచ్చిండతనికి. ఆ రైలు ఆరున్నర కి రావటం ఏమిటి? వచ్చింది పో? రాత్రికి ఉండి పోకుండా తను బస్సేక్కటం ఏమిటి? ఎక్కాడు పో? ఈ అవాంతర మేమిటి?
    ఏమైనా తాను వెళ్లి తీరాలి.
    హుషారుగా ఈల వేసుకుంటూ తను నడవసాగాడు. పైకి హుషారుగా ఈల వేస్తున్నా అతనికి మనసులో బెరుగ్గానే ఉంది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ కధ కదల బోతున్నది. తాను ముక్కూ మొహం ఎరగని వాళ్లతో వ్యవహరించబోతున్నాడు. అంతేకాదు తనకి అసహ్యం, కోపం ఉన్న వ్యక్తీ కూడా ఉన్నాడందులో, అతనితో నేయ్యానికి తను వెడుతున్నాడు. అది సాధించటం తన కర్తవ్యం.
    అమ్మ ఇచ్చిన ఆనతి అది.
    అతనికి తన గతం అంతా ఒక్కసారి తలపుకు వచ్చింది. అతను గొప్పగా చదువుకోలేదు. చదువు కునేందుకు తగిన పరిస్థితులు లేవు. తన తండ్రి శ్రీమంతుడు కాదు. చాకిరి చేసి పోషించగల తెగింపు కలది కాదు తన తల్లి. కొందరు మనుషులు మరోకరి కింద పని చెయ్యటం నామోషీ అనుకుంటారు. తన తల్లీ అంతే. తను చదువుకున్న కొద్ది పాటి చదువూ డింకీలు వాలకం తోనే సాగింది. ఉద్యోగాల్లో చేరటానికి కావలసిన కనీసార్హత సంపాదించుకోగానే ఉద్యోగంలో చేరాడు.
    అతనికి ఎన్నో ఆశలుండేవి. అతని తల్లికీ ఉండేవి. మాట పట్టింపుల్తో పిచ్చి నమ్మకాల్తో విడిపోయి జీవితాంతం నరక వేదన అనుభవించే కుటుంబాల జాబితాలో తమ కుటుంబం కూడా చేరకూడదు. తప్పు చేయటం మానవ సహజం. కాని ఏది తప్పో, ఏది వప్పో చెప్పగల వారెవరు? మనసులోనే కోరికల్ని కుళ్ళ బెట్టుకుని, పైకి మేడి పళ్ళలా మనుషులు తిరగాలన్న బుద్ది తక్కువ శాసనం ఈ లోకంలో ఎవరు చేశారో? అది తప్పని ఎన్ని వేల సంఘటనలు గొంతెత్తి ఘోషించినా తిరిగి ఆ తప్పు జరుగుతూనే వుంది. అది సరిదిద్దటానికి తనూ ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో తనకు ఆసక్తి ఉన్నా, తన తల్లికి జరిగిన అపకారం, తన తల్లిని పెట్టిన క్షోభ తనని వెనక్కి లాగింది. కాని ఆమె అలా అనుకోలేదు. తనను వెళ్లమన్నది. తను ఇప్పుడు అందుకే బయలుదేరాడు.
    ఈ కార్యం సాధించాలి అమ్మ కోసం! మంచి కోసం!
    సిగరెట్ తర్వాత సిగరెట్ వెలిగించుకుంటూ వడివడిగా అతను నడవ సాగాడు. దారి కిరువైపులా చెట్లుమందమందంగా వస్తున్న గాలికి మెల్లిగా తలలూ పుతున్నాయి. ఆ చెట్ల వెనకాల ఏముందో? దూరం నుంచి చూస్తె ఆకాశాన్ని మూసెయ్యటానికి ఏదో నల్లటి తేర అక్కడ కట్టినట్టు ఉంది. దుమ్ముతో అతని పాదాలు నిండి పోసాగాయి. వెధవ పల్లెటూరి రోడ్డు తారన్నా చేసి ఉండదు సరి కదా మోకాల్లోతున ఎర్ర మన్ను.
    దాదాపు మైలు మైలున్నర నడిచాడతను. ఈ రాత్రికి ఎలానైనా ఆ వూరు చేరాలన్న సంకల్పం తో అతను మొండిగా ముందుకు నడవసాగాడు  అలా కొంత దూరం నడిచాక "ఒహోయ్' అన్న కేక వినిపించి అతను ఆగిపోయాడు. బాటకి కాస్తంత దూరాన ఉన్న చెట్ల మధ్య ఏదో మానవాకారం కనిపించింది. అతను ఆగటం చూసి ఏవూరు మనదీ?' అన్నాడు అవతల మనిషి.
    "పట్నం" అన్నాడతను.
    "ఏ వూరు పోవాలి?"
    "అతను చెప్పాడు.
    "ఎట్టెట్టా? ఇలా రండి "అన్నాడతను.
    ఏమిటీ పిడకల వేట అనిపించినా అతగాడికి వూరు పోయే దగ్గర తోవ ఏదన్నా తేలుస్తుందేమో నన్న ఆశతో అటు కదిలాడు తాను. అవతలి మనిషి ఇతను దగ్గిర దాకా వచ్చాక ఎవరింటి కెళ్ళాలెం?' అన్నాడు. "మీది ఆ వూరేనా?' అని అడిగాడు తను. "ఆ వూరే!...నేనడిగింది చెప్పరేం?" అన్నాడతగాడు . అతను సమాధానం చెప్పేసరికి అతగాడి లో చిత్రమైన మార్పు వచ్చింది. అతగాడికి నలభై అయిదు సంవత్సరాలుంటాయి అతనేమో యువకుడు. వయసు ఇచ్చిన భరోసా వల్లనో, లేక అతను చెప్పింది ఇచ్చిన భరోసా వల్లనో పల్లెటూరి ఆసామి బహువచనం మానేసి "అట్టాగా? అక్కడ నీకేం పని?' అన్నాడు.
    అతను అంతా చెప్పాడు.
    ఆ తర్వాత ఏం జరిగింది? పల్లెటూరి ఆసామీ యువకుడ్ని చూసి చీదరించు కున్నాడు. విసుక్కున్నాడు. తన తల్లి నైచ్యాన్ని, అతని నైచ్యాన్ని కడిగి పోశాడు. తెగిపోయిన సంబంధం తిరిగి పాదుకోవటానికి కూడా పూర్వ జన్మ సుకృతం ఉండాలన్నాడు. ఇంటి పరువు ప్రతిష్టలతో నిమిత్తం లేక పోయినప్పుడు ఇంటితో సంబంధం ఎందుకు? ఈనాడు తను నాలుగు డబ్బులు కలిగి ఉన్నాడు గనుక ఈ ప్రేమ పుట్టుకొచ్చింది. పాతికేళ్ళ తర్వాత చచ్చి సాధిస్తోంది ఆ 'భడవా ముండ."
    అతనికి ఆవేశం హెచ్చి పోయింది. తను వచ్చిన కర్తవ్యం మరచి పోయాడు. తన మనసులో ఉన్న అక్కసు నంతా మాటల రూపంలో వెళ్ళ కక్కసాగాడు. దాంతో ముసలి అతను కూడా రెచ్చి పోయాడు. చేతిలో ఉన్న కొడవలి ఝుళిపిస్తూ 'ఆ తప్పుడు ముండ కొడుకువి కాదూ నువ్వు? ఎక్కడికి పోతై ..." అని ఇంకా ఏదో అనబోయాడు తారాస్థాయి లో.
    అంతే!
    యువకుడి లో యుక్తా యుక్తా విచక్షణా జ్ఞానం నశించి పోయింది. దారిద్ర్యం తో, కడుపు మంటతో తానూ తన తల్లీ బతికితే బతికామో? కాని ఒకర్ని మోసం చెయ్యాలన్న తలంపు ఆమెకు గాని, తనకు గాని కలలో కూడా లేదు. ఆ తల్లి ఈ చండాలుడి కుటుంబాన్ని గురించి ముఖ్యంగా అతడి కూతుర్ని గురించి అంతగా చెప్పి ఉండక పొతే ఈ చాయలకు కూడా వచ్చి ఉండేవాడు కాదు తాను. క్రోధం నిలువెల్లా దహించి వేస్తుండగా అవతలి వ్యక్తీ నించి కొడవలి లాక్కున్నాడతను. ఆ ఆసామీ కూడా వూరుకోలేదు. కొడవలి లాక్కున్నాడన్న కోపంతో బలంగా యువకుడి దవడ మీద కొట్టాడు.
    మరుక్షణాన పదునుగా ఉన్న కొడవలి ఆ ముసలాడి మెడ పైన సర్రున గీసుకు పోయింది. చావు కేక పెడుతూ అతను నేల కూలిపోయాడు. ఇతను పక్కనున్న చెట్టుకు చేరగిల బడిపోయాడు.
    నేల మీద పడిన ఆసామీ విలవిలా తన్నుకున్నాడు. చేతిలో ఉన్న పచ్చటి రెమ్మలు పిడికిట్లో బిగుసుకు పోయాయి. కొద్ది నిముషాల్లో అతను చూస్తూ ఉండగానే ఆసామి లోంచి హంస లేచి పోయింది.
    అతను హత్య చేశాడు!
    చాలా సేపటి దాకా అతనికి మనసంతా మొద్దు బారినట్లై పోయింది. జరిగిన పని ఘోరమైనది . ఎవరి కోసం తాను ఇంత దూరం వచ్చాడో ఆ మనిషిని తన చేతుల్తో తానె హత్య చేశాడు. తన ఒళ్ళు తాను మర్చిపోయాడు. అతను తనని తాను తిట్టుకున్నాడు. భరించరాని వేదనతో కుతకుత లాదిపోయాడు. యాంత్రికంగా జేబులో నుంచి తీసిన ఆగ్గి పెట్టెనూ, సిగరెట్ పెట్టెనూ కసిగా అవతలికి విసిరివేశాడు.
    అక్కడ అట్లాగే ఎంతసేపు కూర్చున్నాడో?
    చివరికి మెల్లిగా సర్వాయవాలూ కూడదీసుకుని అక్కడి నించి లేచాడు. తను మేనమామ పోలిక అని అంటుండేది అమ్మ. అది నిజమని ఈ క్షణాన ఋజువైంది . తనెంత మూర్కుడో చనిపోయిన ఆ పెద్ద మనిషి కూడా అంత మూర్కుడు. బిగుసుకు పోయిన ఆ కట్టెకు, జరగకూడని ఈ కధకు మూలమైన ఆ కట్టే లో ఒకనాడు నివాసం చేసిన జీవుడ్ని తలచుకుంటూ నమస్కారం చేసి మెల్లిగా అక్కడి నుంచి కదిలి పోయాడు.
    ఆ తర్వాత చాలా రోజులు గడిచి పోయాయి. అనుక్షణమూ, అదే దృశ్యం మనసులో మెదల సాగింది. అతనిది పశ్చాత్తాపమా? పూర్తిగా అదే కాదేమో? చనిపోయిన మనిషి మీద అతనికి ఏనాడూ సదభిప్రాయం లేదు . పైగా వల్లమాలిన కసి మాత్రం ఉంది. కాని అతని చావు ఇలా జరగటం, ఏ పాపమూ ఎరగని అమాయకులు అనాదులై పోవటం దారుణం. అది అలా జరగటానికి వీల్లేదు. తన తల్లి కోరిక తీరాలి. ఈ కుటుంబం బాగుపడాలి. అందుకు మార్గం ఒకటే కనిపించింది.

                         *    *    *    *
    మాధవరావు ఏమీ మాట్లాడలేదు. మునసబు గారు కళ్ళు మూసుకుని మంచం మీద అలాగే ఉండి పోయారు. గోడ కానుకుని నిలబడ్డ పాలేరు కంటికీ, మంటికీ ఏకధారగా కారుతున్న కన్నీళ్ళ ను తుడుచుకోలేక అవస్థ పడ్డాడు.
    పెరటి గుమ్మంలోకి అంత క్రితమే వచ్చిన వరలక్ష్మీ, సుభద్రమ్మ స్థాణువులైన ఉండి పోయారు. చాలా సేపటి దాకా అక్కడ భయం కరమైన నిశ్శబ్దం రాజ్యం చేసింది.
    మాధవరావు గొంతు సవరించుకుంటూ "ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మనకన్నా బలీయ మైన శక్తి ఏదో మనల్ని అడిస్తున్నదని. అది ఏదో తెలుసుకో గలిగితే ......' అన్నాడు.
    రాజారావు జవాబు చెప్పలేదు.
    "వెళ్దామా?' అన్నాడు మాధవరావు.
    రాజారావు తల వూపాడు.
    "పడండి మునసబు గారూ."
    మునసబు గారు కళ్ళు తెరిచి "మీరు పదండి వస్తాను" అన్నాడు.
    మాధవరావు లేచి నిలబడ్డాడు. రాజారావు లేచి అత్తయ్య, వరలక్ష్మీ కూచున్న దిక్కేసి చూశాడు. వరలక్ష్మీ నీళ్ళు నిండిన కళ్ళతో బేలగా చూసిందతని వైపు . ఆ ఒక్క చూపు సహస్త కంఠలతో ఆ అమాయకురాలి క్షోభ అతనికి చెప్పినట్లైంది. అతను గభాలున అత్తయ్య పాదాల మీద వాలిపోయి భోరున పసిపిల్లవాడిలా ఎడిచేశాడు. సుభద్రమ్మ గారు నోట్లో చెంగు కుక్కుకున్నది.
    విధి నిర్వర్తించవచ్చిన మాధవరావు కు కూడా కళ్ళు చెమర్చాయి.
    రాజారావు తనను తాను కూడదీసుకుని మాధవరావు తో వీధిలోకి వచ్చాడు. ఇద్దరూ కొంత దూరం మవునంగా నడిచారు ఆ తర్వాత మాధవరావు అన్నాడు "మీరు నన్ను చూసి ఆశ్చర్యపోయినట్టు లేదే?' అని.
    "ఆశ్చర్యం దేనికి?' అన్నాడు రాజారావు.
    మాధవరావు ఒక్క క్షణం వూరుకుని అన్నాడు. "మునసబు గారు చిత్రమైన మనిషి. ఆయనకి ఎవరంటే ప్రేమ ఉన్నదో, ఎవరంటే ద్వేషం ఉన్నదో తెలుసుకోవటంచాలా కష్టం. నన్ను ప్రత్యేకంగా పిలిపించి తీసుకొచ్చిందాయనే. అయన సహాయమే లేకపోతె.......' ఆ తర్వాత ఏం చెప్పాలో తోచనట్లు ఆగిపోయాడతను.  
    రాజారావు పేలవంగా నవ్వాడు.
    ఇద్దరూ మరికొంత దూరం నడిచారు. దేవాలయం దరిదాపుల్లోకి రాబోతుండగా వాళ్లకి పోలీస్ వేన్ ఎదురైంది. మాధవరావును చూసి వేన్ ఆగింది. రాజారావు చెప్పులు విడిచి దేవాలయం దిక్కుకి తిరిగి నిమీలిత నేత్రాలతో నమస్కారం చేశాడు. అతనిప్పుడు విచారంగా లేడు సంతోషంగా ఉన్నాడు. అతనికి ఏమేమో చెప్పాలని ఉంది కాని ఏదో గొంతులో అడ్డం పడుతున్నది . మనసులోనే అతను భగవంతుడికి క్షమాపణ చెప్పుకున్నాడు.
    మాధవరావు అతను తిరిగి వస్తుంటే భారమైన మనసుతో అతన్ని వేన్ ఎక్కించారు. నేరాలు అందరూ చేస్తారు. కొందరి నేరాలకు చట్టం ఉంది. కొందరి నేరాలకు చట్టం లేదు. అంటే శిక్ష లేదు. చచ్చిపోయిన రాఘవయ్య గారేలాంటి వాడో మాధవరావు , మునసబు గారి ద్వారా విని ఉన్నాడు. అయన చేసింది ఏముంది మంచి పని? అది ఎవరన్నా ఆలోచిస్తారా? ఒక మనిషిని నిలువునా ప్రాణం తియ్యటం నేరం. డానికి శిక్ష ఉంది. కాని మనసుని రంపపు కోత పెట్టి జీవితాంతం పీల్చి పిప్పి చేసే వారి సంగతేమిటి? అది ఎవరన్నా ఆలోచిస్తారా? అందుకు విరుగుడు ఏముంది?
    మాధవరావుకి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. తమ వూళ్ళో ఒక షావుకారు ఉన్నాడు. అతని 'వ్యాపారం' వల్ల ఎన్ని కుటుంబాలో నాశన మైనాయి. అతను ప్రతి సాయంత్రాన పార్కులన్నీ తిరిగి చీమల పుట్టల దగ్గర బియ్యం పిండి, చల్లుతాడు. అది పుణ్యం కోసం!
    మాధవరావు "మునసబు గారు రావాలయ్యా!" అన్నాడు డ్రైవర్ తోటి. అతను క్రీగంట రాజారావు వంక చూస్తూ నిలుచున్నాడు రోడ్డు మీద. రోడ్డు మీద పోతున్న జనం వాన్ వంక వింతగా చూస్తూ కదిలి పోతున్నారు. రాజారావు కళ్ళు మూసుకుని వాన్ లో కూచుని ఉన్నాడు.
    మునసబు గారు మాధవరావు ఎలా హత్యా నేరాన్ని భేధించారో పాలేరుతో విజ్రుంభించి ఉపన్యసిస్తున్నాడు-- ఆ ఇంట్లో అదెవరు వింటున్నారు ? వరలక్ష్మీ వింటున్నదా? ఆ పిల్ల కట్టుకున్న రంగుల మేడ కాలిపోయింది మరి! సుభద్రమ్మ వింటున్నదా! ఆమె ఇంటి మొండి గోడలు శిధిలమై , జీర్ణమై గాలిలో కొట్టుకు పోతున్నాయి.
    ఎవరూ వినటం లేదు. వినరేమో కూడా.

                               ఐ పోయింది.  


 Previous Page

WRITERS
PUBLICATIONS