"చిత్తం" అంటూ చిత్రగుప్తుడు యమభటులకు సైగ చేశాడు.
యమభటులు వెళ్లి ఇద్దరు వ్యక్తులను పెడరెక్కలు విరిచి తోడ్కొని వచ్చారు.
ఒకతను ముదుసలి, మరొకతను యువకుడు. వాళ్ళ వైపు చూసి "మీ నామధేయములేమి?" ముసలి వ్యక్తీ అనుమానంగా అడిగాడు.
"నామదేయములు"
"అంటే?" మొహం చిట్లించి అడిగాడు యువకుడు.
"అనినచో.....మీ పేర్లు" అని యమధర్మరాజు వైపు తిరిగి.....
"ప్రభూ! ఈ ముదుసలి ఎన్ని మార్లు బాధించినా "భ్రమరా! నీకన్నా విల్లె నయం...." అని పలవరించుచున్నాడు. పైగా చిరునవ్వులు చికిలించుచున్నాడు.
"ఎవరా భ్రమరా?"
"అది నా పెళ్ళాం" ముసలి వ్యక్తీ టక్కున అన్నాడు.
"అటులనా ? అమెయన్న అంత ప్రేమా?" అడిగాడు అచ్చెరువొందుతూ యమధర్మరాజు.
"ప్రేమా....కంకిపాడు దోమా" కోపంగా అన్నాడు ముసలి వ్యక్తీ.
"ఈ మానవుడి భాష ఏమి చిత్రంగా యున్నది. కంకిపాడు దోమ యనగా....."
"అంతా నా తలరాత" నుదురు కొట్టుకున్నాడు ముసలి వ్యక్తీ.
"ఓహొ........కంకిపాడు దోమయనిన 'అంతా నా తలరాత'యని అర్ధమా? బాగున్నది.....బాగున్నది. మీ బాష లేస్సగున్నది" అంటూ వెంటనే కోపంగా-
"నీకు మా నరకలోకమన్న బొత్తిగా భయము లేకున్నదా? మా శిక్షలు భయపెట్టుట లేదా?" అడిగాడు ముసలి వ్యక్తీ వైపు తిరిగి.
అప్పుడు సగమర్ధమైంది. ముసలి వ్యక్తికీ. వెంటనే పగలబడి నవ్వి.....నవ్వి .....కడుపు పట్టుకుని "యమధర్మరాజా! ఇంక నేను నవ్వలేను. అసలే ముసలిముండా వాడిని. ఆయాసం వచ్చుచున్నది" అన్నాడు.
యమధర్మరాజు చిత్రంగా అతనివేపు చూసి.
"అంత ఆశ్చర్యం ఎందుకు? అయినా మా శిక్షలు చూసి సురులే భయకంపితులవుతున్నారు? మీరేమి?" కాసింత అనుమానంగా అడిగాడు.
నవ్వడం ఆపి అన్నాడు ఆ ముసలి వ్యక్తీ.
"ప్రభూ! "ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినుర వేమా" అన్న పద్యం గురించి మీకు తెలియదు. నాకు పెళ్లయింది. పెళ్ళయిన మగవాడు, పెళ్ళయ్యాక సర్వనరక సుఖాలు అనుభవించేస్తాడు. మా ఆవిడ పెట్టె చిత్ర విచిత్రమైన శిక్షల కన్నా మీ శిక్షలు గోప్పవేమి కాదు...." అన్నాడు.
"మీ అర్ధాంగి అన్నీ బాధలు పెట్టునా?"
"పిచ్చి యమధర్మరాజా! అర్ధాంగులన్నా అరకొరకాదు. పూర్తీ నరకములు చూపించే నెరజాణలు. మీరు భూలోకమునకు విచ్చేసి పెళ్ళి చేసుకుని చూడుడు. మీకే తెలియును" అన్నాడు తన తల మీద వున్న బుడిపేలను రుద్దుకుంటూ.
యమధర్మరాజు కుతూహలంగా దివ్యదృష్టితో ఆ ముసలి వ్యక్తీ గతం వీక్షించసాగాడు సుక్ష్మంగా.
* * *
ఆ ముసలి వ్యక్తీ తొలిరాత్రి......
అతని భార్య భర్త పాదాల దగ్గరకు వచ్చి రెండు పాదాలు ఠపిమని లాగి ఓ కొబ్బరి కాయ అతని పాదాల మీద కొట్టి "నన్ను ఆశిర్వదించండి" అంది.
అతని పాదాలు పగిలి పచ్చి పండ్లయ్యాయి.
పొద్దునే బట్టలుతికే పని, మధ్యాహ్నం వంటపని, రాత్రి అంట్లపని , ఇంటిపని మొగుడి చేత చేయించింది.
పొరపాటున పక్కింటి అమ్మాయి వంక చూస్తే "ఏంటి.....దాని వంక చూస్తున్నారు. గుడ్లు పెరికించేస్తాను......హన్నా.....దాన్ని నాకు సవితిగా తెద్దామనే" అంటూ గుడ్లురుముతోంది.
అలా ఆ మొగుడిచేత పాతిక సంవత్సారాలు నానా చాకిరి చేయించింది. ఓరోజు నిద్దర్లోనే "ఒసే భ్రమరం......నేనింకా నీకు సేవలు చేయలేనే......చేయలేను" అన్నాడు.
అంతే.....యమధర్మరాజు తన పాశంతో అతని ప్రాణం తీశాడు.
వెంటనే "నా మొగుడు నన్ను వదిలి వెళ్ళాడు. ఇప్పుడు నా ఇంటి పనులు , వంట పనులు ఎవరు చేస్తారు దేవుడో......" అంటూ మొగుడి శవం మీద పడి ఏడ్చింది.
* * *
ఉలిక్కిపడ్డాడు అదంతా దివ్యదృష్టితో చూసిన యమధర్మరాజు.
"ఔరా.....నువ్వు పోయావన్న బాధకన్నా తన పనులు ఎవరు చేస్తారన్న భాదే నీ భార్యను మిక్కిలి బాధిస్తున్నది....." అన్నాడు ముసలి వ్యక్తీ వైపు చూస్తూ యమధర్మరాజు.
"చిత్తం.....ఇప్పుడు చెప్పండి. అదే పెట్టిన బాధల కన్నా ఈ బాధలు ఏపాటివి?
హ్హ....హ్హ.....హ్హా...." అన్నాడు ఆ ముసలి వ్యక్తీ.
"మరి నీ సంగతి?" అన్నట్టు యువకుడి వైపు చూసాడు.
ఆ యువకుడు తనలో తను నవ్వుకుంటూ "స్టార్ ప్లస్.....బిబిసి.....వాషింగ్ పౌడర్ నిర్మా.....బూస్ట్ ఈజ్ ద సిక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ....ఫ్రీ....ఫ్రీ....కేర్ ఫ్రీ.....అంతరంగాలు అనంత మనన చదరంగాలు.....ఓ కళంకింతా.....మర్మదేశం....." ఇలా తనలో తను గొణుక్కుంటూన్నాడు.
యముడు మళ్ళీ దివ్యదృష్టితో చూశాడు. ఆ యువకుడు టీవిని అదేపనిగా చూసిచూసి పిచ్చెక్కి చచ్చాడని అర్ధమైంది.
యమధర్మరాజుకు కర్తవ్యం బోధపడింది.
"చిత్రగుప్తా! ఈసారి శాంతంగా పిలిచాడు.
"ప్రభూ! ధన్యుణ్ణి. ఈసారి ఝడుసుకు చావలేదు. సెలవీయండి" అన్నాడు అతి వినయంగా.
"ఈ ముదుసలి వ్యక్తిని తలకిందులుగా వేలాడదిసి ఎదురుగా ఈ ముదుసలి భార్య ప్రతిమను పెట్టుడు. ఆ ప్రతిమను చూస్తూ భయభక్తులతో మన శిక్షలు అనుభవిస్తాడు. ఇతనికి దియే తగిన శిక్ష....."
"ప్రభూ....అంత పెద్ద శిక్ష వద్దు" నెత్తినోరు కొట్టుకుని మొత్తుకున్నాడు ముసలి వ్యక్తీ.
"మరి ఈ పాపికి?"
"భూలోకములోవున్న బుల్లి పెట్టెనొకటి పట్టుకురండు. అందులో చిత్ర విచిత్రమగు దృశ్యములను అదే పనిగా చూపించుడు. దానితో మతి చలించి మనమనినచో భయం పెరుగును...."
చిత్రగుప్తుడు సాష్టాంగపడపోయి "సమవర్తి! మీ తెలివి అమోఘం. మీ వ్యాయచతురత అద్వితీయం. మిమ్మల్ని సాటిరాగల వారెవరూ లేరు. ఎంత చక్కని శిక్షలు విధించితిరి. మీ మేధాశక్తి విశ్వరూపం చూసిన భాగ్యము కలిగినది."
యమధర్మరాజు చాతి రెండు అంగుళాలు పెరిగింది.
"చిత్రగుప్తా! ఇదిగో......" అంటూ మెడలోని హారాన్ని అతనికి కానుకగా ఇచ్చాడు.
"ప్రభూ! మరోసారి సాష్టాంగపడవలయునా?" యమధర్మరాజు మెడలో వున్న మరో పచ్చల హారము వైపు చూస్తూ అన్నాడు ఆశగా చిత్రగుప్తుడు.
"వద్దోద్ద్దు" అన్నాడు భయంగా యమధర్మరాజు.
"ప్రభూ! తమరి గొప్పతనము సర్వలోకములకు తెలియవలయునని నా కోరిక" అన్నాడు యమధర్మరాజు ఇచ్చిన హారము వంక మిక్కిలి సంతోషంగా చూస్తూ.
