Previous Page Next Page 
వసుంధర కథలు-13 పేజి 10


    గదంతా ప్రకాశవంతమయింది.
    రమేష్ గదంతా పరిశీలనగా చూస్తున్నాడు. వున్నట్లుండి ఉలిక్కిపడ్డాడు. విమల పడుఉకున్న మంచం క్రింద నుంచీ ముసలిదని తల బయటకు వచ్చింది. గది కాంతివంతం కావడమూ రమేష్ తన్ని చూడడమూ గమనించిందేమో-ముసలిదాని తల మళ్ళీ లోపలకు వెళ్ళిపోయింది.
    క్షణమాత్రం రమేష్ శరీరం జలదరించింది. ఆ తర్వాత "నువ్వు ఇక్కడుంటున్నావా ముసలిదాణా-"అంటూ అతడు మంచంవైపు నడిచి అక్కడ ఆగిపోయాడు.
    తనిప్పుడేం చేయాలి? వంగుని మంచంక్రింద వెతకాలా లేక అక్కను లేపాలా? ఆలస్యమైతే మాయలమారి ముసలిది ఎక్కడ తప్పించుకుని పారిపోతుందోనని అతడు చటుక్కున వంగుని మంచంక్రింద దూరాడు.
    మంచంక్రింద అతడికి ఎవ్వరూ కనబడలేదు. కానీ క్షణాలమీద అతడికి నిద్ర ముంచుకుని వచ్చింది. ఎంత ఆపుకుందామనుకున్నా నిద్ర ఆగలేదు. అలాగే ఆ మంచం క్రింద సోలిపోయాడు.
    కొద్దిసేపటికి మళ్ళీ ఆ గదిలో దీపం వెలిగింది. విమలను ముసలిది తట్టి లేపింది. విమల ఆ ముసలిదాన్ని చూసి భయపడింది.
    దానికి కోరలున్నాయి. ముసలిదాన్ని కోరలతో చూడ్డం ఆమెకు అదే ప్రధమం. విమల కెవ్వుమని అరవబోతే ముసలిదే ఆమె నోరు మూసింది.
    "నేను నిన్ను మర్యాదగా కోరిక కోరితే నువ్వు నామీద నీ తమ్ముణ్ణి నిఘా వేయిస్తావా - ఈసారికి దయతల్చి వదిలిపెట్టాను. ఇంకోసారి ఇలాంటి పనిచేస్తే మీ యింటిల్లపాదినీ చంపేస్తాను-" అంటూ భయం కరంగా నవ్వింది చంద్రమ్మ.
    "నన్ను క్షమించు...." అంది విమల.
    "నిన్ను క్షమించను. ఒక్క రోజు టైమిస్తున్నాను. ఈ యింట్లోంచి పోకపోయావో మీ అందరి రక్తం తాగడం మొదలుపెడతాను-" అంది చంద్రమ్మ.
    విమల ఏదో అనబోయింది. కానీ ఆమెను మత్తు ఆవహించింది.

                                      9

    మర్నాడు ఏడింటికి మంచంమీంచి విమలా, మంచం కిందనుంచి రమేష్ ఒకేసారి కాలింగ్ బెల్ చప్పుడుకు లేచారు.
    ఇద్దరూ తమ తమ అనుభవాలు చెప్పుకున్నారు.
    "ఈ యిల్లు అమ్మేయడం మంచిది-" అంది విమల.
    "ఈ పరిశోధన ప్రమాదకరమేనని నాకూ అనిపిస్తున్నది-" అన్నాడు రమేష్.
    దెయ్యం విశేషం ఇద్దరకూ విచిత్రంగానే ఉన్నది. ఆ రాత్రికి ఆ యింట పడుకొనరాదని కూడా వారసుకున్నారు.
    "ఈ ఒక్క రాత్రీ గడిస్తే రేపుదయానికి బావవచ్చేస్తారు-" అంది విమల.
    "బావ వచ్చి మాత్రం ఏం చేయగలడు? ఆ దెయ్యం గదిలో ఎలా ప్రవేశిస్తున్నదీ మనకు తెలియడంలేదు. మంచం కింద ఎంతగానో పరిశీలించాను. నాకేమీ తెలియలేదు...." అన్నాడు రమేష్.
    "అది దెయ్యమే-ఆ విషయమై ఈ సందేహమూ లేదు...."
    "సరే-ఈవేళ ఏం చేద్దాం?" అన్నాడు రమేష్.
    "భోజనాలు చేసి పక్కింటికి పోదాం. ఉదయం మీ బావరాగానే విషయమంతా చెప్పితే ఏం చేయాలో ఆయనే చెబుతారు. ఏమంటావు?" అంది విమల.    
    "సరే-నువ్వు చెప్పినట్లే చేద్దాం-కానీ...." అని ఏదో అడగబోయి ఊరుకున్నాడు. బావగారివల్ల ఏమవుతుందని అతడికి తోచింది.
    ఇద్దరూ వంటయింట్లో కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ. ఈలోగా వీధి గదిలోంచి ఓ కేక వినిపించింది.
    "ఎవరో చూసి రారా!" అంది విమల.
    రమేష్ వీధిలోకి వెళ్ళాడు.
    తలుపులు తీసే వున్నాయి. గుమ్మంలో ఓ యువతి నిలబడి వున్నది. ఆమె అత్యంతాధునికంగా కనబడుతున్నది. అందగత్తె కూడా వయసు పాతికేళ్ళు వుండవచ్చునేమో!
    ముఖ్యంగా ఆమె జీన్సులో ఉండడంవల్ల నేమో రమేష్ ఆమె నుండి వెంటనే దృష్టి మరల్చుకోలేక పోయాడు.
    "ఈ యింటి యజమాని ఉన్నారా?" అన్నదామె.
    "మా బావలేడు. అక్క వుంది-" అన్నాడు రమేష్.
    "వారినే పిలవండి-" అన్నదామె.
    రమేష్ లోపలకు వెళ్ళి-"అక్కా తప్పకుండా ఇది భద్రమ్మ ఆడుతున్న నాటకం-" అన్నాడు.
    "ఏమిట్రా-" అంది విమల అర్ధంకాక.
    "తర్వాత చెబుతాను. ముందు మనింటికి వచ్చినామెను పలకరించు-" అన్నాడు రమేష్.
    విమల వెళ్ళి ఆమెను పలకరించింది.
    "మీరు ఇల్లు అమ్ముతారని తెలిసి వచ్చాను. మీరు కొన్న రేటుకి పాతిక వేలు ఎక్కువిస్తాను. మీకు చౌకలో మంచి ఇల్లు కూడా చూసి పెడతాను-" అన్నదామె.
    "మేము ఇల్లు అమ్ముతామని ఎవరు చెప్పారు? అంది విమల.
    "ఎవరో కలలో చెప్పారు-" అని నవ్విందామె.
    విమల బుర్ర చురుగ్గా పని చేస్తోంది. ఈ యిల్లు యాభై వేలకు కొన్నాడు భర్త పాతికవేలు అప్పు, ఇప్పుడది డెబ్బైఅయిదువేలకు అమ్మేస్తే అది తమకు బాగా లాభసాటి. అందులోనూ దెయ్యాల కొంప......కానీ ఈమెకు ఇల్లు అమ్ముతామని యెవరు చెప్పారు?
    ఈ ఇల్లు తమచేత అమ్మించడం కోసం ఎవరైనా దెయ్యం నాటకం ఆడుతున్నారనుకుందామనుకున్నా ఈ వచ్చినామే ఇంటి ఖరీదుకు పాతికవేలు యెక్కువిస్తానని కూడా అంటున్నది. అంటే తమకిది లాభాసాటి బేరమే! ఇప్పట్లో ఎవరూ ఈ యింటికింత ధర ఇవ్వరు.
    "రేపు మా వారు ఊర్నించి వస్తారు. వారినడిగి చెబుతాను...." అంది విమల. కానీ అప్పటికే ఆమె మనసులో నిర్ణయమైపోయింది. ఈ దెయ్యాల కొంపలో దిన దిన గండంగా బ్రతకడంకంటే ఇల్లు లాభానికమ్ముకుని పోవడమే మేలు!
    ఆమె బయటకు వెళ్ళగానే అక్కకు సైగచేసి తనూ బయటకు పోయాడు రమేష్. అతడలా యెందుకు వెళ్ళాడో ఆమెకు అర్ధంకాలేదు.
    ఓ గంటతర్వాత అతడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు.
    "ఏం చేశావురా-?" అంది విమల.
    "మనింటికి ఇల్లు కొంటానంటూ వచ్చినామె ఎవరో తెలుసా? సినీతార భద్రమ్మ, రోజూ రాత్రి మనకు చంద్రమ్మ వేషంలో కనబడుతూ ఈ రోజు అసలు వేషంలో కనబడింది. సినీ నటుందరి ముఖాలూ నాకు కంఠోపాఠం కాబట్టి కానీ లేనిపక్షంలో ఆమెను గుర్తుపట్టడం అంత సులభంకాదు.
    ఆమెను అనుసరిస్తూ వెళ్ళాను. నా అదృష్టంకొద్దీ-నాన్నగారి స్నేహితులైన మనూరి పోలీసు ఇన్ స్పెక్టరు బాబూరావుగారు కనబడ్డారు. ఆయనకు ఆమె గురించి చెప్పి ఆమె మనని పెడుతున్న ఇబ్బందులు వివరించి ఆమెబారినుంచి మనని రక్షించమని చెప్పాను. ఆమె సంగతి ఆయన చూసుకుంటాడు. ఈ రోజు ఆమె బాధ మనకి వుండదు. హాయిగా మనింట్లో మనమే పడుకొనవచ్చు..." అన్నాడు రమేష్.
    "నువ్వు చెప్పేది నాకు అర్ధంకావడంలేదు-" అంది విమల.
    "ఈ రాత్రికి మనకు దెయ్యం భయముండదని హామీ ఇస్తున్నాను-" అన్నాడు రమేష్.
    నిజంగానే ఆ రాత్రికి దెయ్యం రాలేదు.
    
                                    10

    మర్నాడు నిద్రలేచేక - "అయితే దెయ్యం పోయిదంటావా మనింట్లో నుంచి-" అంది విమల.
    "పోయినట్లే - బాబూరావుగారు మనింటికి వచ్చి అన్ని వివరాలూ చెబుతానన్నారు-" అన్నాడు రమేష్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS