ముసలమ్మ మంచంమీదనుంచి లేవటం లేదు. అతి కష్టంమీద పాయిఖానాకీ, నీళ్ళు పోసుకోవడానికీ లేస్తుంది. ఆవిడ చెయ్యి పట్టుకు జాగ్రత్తగా నడిపించాలి. అత్తగారి సేవలన్నీ శాంతమ్మ మీదే పడ్డాయి. పూర్తిగా వంటపని భానుమతి చూసుకుంటూంది. ముసలమ్మ మందులకీ, శంకరం పరీక్షకీ డబ్బు అప్పు తెచ్చారు. అప్పులు తీర్చడం కోసం చారుమతి ప్రైవేట్లు చెప్పేది. ఉదయం అయిదు గురు, సాయంత్రం అయిదుగురు అమ్మాయిలు వస్తారు. ఇంత కష్టపడినా వచ్చే అదనపు ఆదాయం తక్కువే. ఇంట్లో పరిస్థితలు మరీ దిగజారిపోయాయి. చాకలిని పూర్తిగా మానిపించేశారు. మాలతి, భానుమతి కలిసి రోజూ బట్టలు ఉతుకుతారు, చెల్లెళ్ళిద్దరి స్కూలు చీరలు గంజిపెట్టి ఆరవేసి, ఇస్త్రీ చేస్తుంది భానుమతి. సినిమాలు చూడటం మానేశారు. వారానికో, పది రోజులకో సినిమా చూడకపోతే శంకరానికి ఉపవాసం చేసినట్టు ఎంతో వెలితిగా ఉండేది. కాని చెల్లెలు ముందర 'డబ్బు కావాలి' అంటూ చెయ్యి జాపడానికి సిగ్గు.
చారుమతికంటే ఒక ఏడు పెద్దవాడు శంకరం. తక్కిన ఇద్దరు చెల్లెళ్ళూ "అన్నా" అని పిలిచినా, చారుమతి మాత్రం "శంకరం" అనే పిలిచేది. చిన్నతనంనించి లేకలేక అబ్బాయి పుట్టాడని శంకరాన్ని ఇంట్లో తల్లీ, తండ్రీ, మామ్మా అపురూపంగా చూడటంతో, చారుమతికి అన్న అంటే కొంచెం ఈర్ష్య ఎప్పుడేనా కొంచెం లోపం శంకరంలో కనిపిస్తే చారుమతి దాన్ని పెద్దగా ఎత్తి చూసి ఎగతాళి చేసేది; ఎత్తిపొడిచేది.
డిసెంబరు నెలలో సూర్యారావు సంవత్సరీకాలు జరిపారు. తండ్రిని మరోసారి తలుచుకుని దుఃఖించారు అంతా.
"సంసార భారమంతా నామీద పెట్టి నువ్వెందుకు వెళ్ళిపోయావు, నాన్నా" అంటూ ఒంటరిగా కూర్చుని ఏడ్చింది చారుమతి.
ఇంట్లో అప్పులు పెరుగుతున్నాయి. మాలతికి శంకరానికి పరీక్షలకి డబ్బు కట్టాలని అప్పు తెచ్చారు. సూర్యారావు సంవత్సరీకాలు జరపడానికి శాంతమ్మ తన చేతి బంగారు గాజులు అమ్మేస్తూంటే చూసి బాధపడ్డారు అంతా. తన నిస్సహాయస్థితికి వ్యథ, శంకరం పరీక్షలు తప్పుతున్నందుకు కోపం వచ్చాయి చారుమతికి.
"అన్నిటికీ ఎందుకు బాధ పడతావు, చారూ? నారు పోసినవాడు నీరు పోస్తాడంటారు. రోజులు ఎలాగో ఎలా వెళ్ళిపోతాయి. నువ్వు దిగులుపడకు; మనసు కష్ట పెట్టుకోకు" అంటుంది భానుమతి.
భానుమతి స్థైర్యం లేదు చారుమతికి. భానుమతిలో ఏదో వేదాంతం ఉంది. ఏదీ విపరీతంగా తీసుకుని బాధ పడదు. "భగవంతుడే ఉన్నాడు పైన", "మనం చేసుకున్న కర్మ", "దురదృష్టం" అనే మాటలతో నిశ్చింతగా గడుపుతుంది. అక్క నిశ్చింత, గంభీరత్వం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది చారుమతికి.
13
మే నెల వచ్చింది. మళ్ళీ మల్లెలు, మామిడిపళ్ళు వచ్చాయి. మాలతి ఎస్. ఎస్. ఎల్. సి. పద్మ ఇంటరు, శంకరం, శ్రీదేవి బి. ఎ. పరీక్షలు రాశారు.
మే ముఫ్ఫయ్యవ తారీఖున శ్రీదేవి పెళ్ళికిముహూర్తం పెట్టారు. శ్రీదేవికి పెళ్ళికొడుకు బావ వరస అవుతాడు. అతను ఇంజినీరు. హైదరాబాద్ లో ఉన్నాడు. శ్రీదేవికి దగ్గిరవాడైనా, వాళ్ళిద్దరూ కలుసుకోవడం తక్కువ. పెళ్ళిదాకా అపరిచితులుగానే ఉండిపోయారు.
పెళ్ళి ఇంకా మూడు రోజులు ఉందనగా, చారుమతి, పద్మ కలిసి శ్రీదేవి ఇంటికి వెళ్ళారు. తనదగ్గిర చాలా రోజులు పెట్టుకుని చదివించడంవల్ల కలిగిన అభిమానంతో శ్రీదేవి మేనత్త పెళ్ళి తమ ఇంట్లోనే జరగాలని కోరింది. వారి ఇంట్లో వెనక పెరడంతా శుభ్రంచేసి కొత్తగా ఇసుక పరిపించారు. పెద్ద పందిరి వేస్తున్నారు. ఇంటికి వెల్లలువేసి, పచ్చటి మామిడాకు తోరణాలు కట్టారు. గుమ్మాలకు కొత్త రంగులు వేశారు.
ఆ రోజు శ్రీదేవిని పెళ్ళికూతురని చేశారు. చారుమతి, పద్మ లోపలికి వెళ్ళేసరికి శ్రీదేవి అక్కలు ఆమెను అలంకరిస్తున్నారు. కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్కతో శ్రీదేవికి కొత్త అందం వచ్చింది. ముఖంలో సంతోషం కొట్టవచ్చినట్టు కనిపిస్తూంది. దాచుకోవాలని ప్రయత్నించినా దాగని చిరునవ్వు. పెద్దక్క ప్రభావతి పూలజడ కుడుతూ ఉంటే, చిన్నక్క లక్ష్మీదేవి శ్రీదేవి కాళ్ళకు పారాణి రాస్తూంది.
"అబ్బ, ఇప్పుడా వచ్చారు?" అంది స్నేహితురాళ్ళను చూడగానే శ్రీదేవి.
"ఉదయం లేచినదగ్గిరనించీ మీ ధ్యాసే అయిపోయింది దీనికి. మరిదిగారి తలపే లేదు" అంది చిన్నక్క లక్ష్మీదేవి.
"పైకి మా పేర్లు చెబుతుందండీ. మనసులో అంతా ఆయన ధ్యాసే" అంది చారుమతి కూర్చుంటూ.
శ్రీదేవి సిగ్గుపడుతూ నవ్వింది. పద్మకూడా చారుమతి పక్కనే కూర్చుంది. శ్రీదేవిని అలంకరిస్తున్నంతసేపు ఇద్దరక్కలు చెల్లెలిని పెళ్ళికొడుకు పేరు ఎత్తి ఏడిపిస్తూనే ఉన్నారు. మధ్య మధ్య వారి భర్తలు కూడా వచ్చి మరదలిని హాస్యం చేస్తున్నారు. వాతావరణం అంతా ఎంతో సరదాగా, హాయిగా, ఆనందంగా ఉంది. ఇంటినిండా చుట్టాలు వచ్చారు; ఇంకా వస్తున్నారు.
శ్రీదేవి ఇద్ద రాడపిల్లల తరవాత పుట్టింది. ఆఖరి పిల్ల కావడంతో పెళ్ళి పెద్దఎత్తున చేస్తున్నారు. శ్రీదేవికి అన్నదమ్ములు లేరు. కాని పెద్దమ్మ కొడుకులు, పిన్నమ్మ కొడుకులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా దూరదూర ప్రదేశాలనించి వచ్చారు. వాళ్ళే పందిరి అలంకరణ చూస్తున్నారు. రంగుకాయితాలతో అలంకరించడం, రంగుబల్బులు అమర్చడం, పెండ్లి ఫోటోలు తియ్యడం - సగం హడావిడి మగపిల్లలదే.
ఆ రోజంతా అక్కడే ఉండి, రాత్రి భోజనం చేసి ఇళ్ళకు బయలుదేరారు పద్మ, చారుమతి. పెళ్ళి రెండురోజులు తనదగ్గిరే ఉండాలని, ఇంట్లో మాలతి ఎలాగా లేదుకనక, శంకరాన్నేనా పెళ్ళికి తీసుకురావాలని చారుమతిని మరీమరీ కోరింది శ్రీదేవి. భానుమతి పైకి వెళ్ళటం మానుకుంది. ఎక్కడికీ వెళ్ళదు.
పద్మ రిక్షా ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది.
రాత్రి పది గంటలు అవుతూ ఉంది. అంతరాత్రి వేళ ఒంటరిగా నడిచివెళ్ళలేక, చారుమతి రిక్షా కట్టించు కుంది. 'ఎన్నాళ్ళయింది రిక్షా ఎక్కి!' అనుకుంది మనసులో. సూర్యారావు పోయాక రిక్షా ఎక్కడం మానేశారు చారుమతి ఇంటివాళ్ళు. 'ఆ పావలా పెడితే ఒక కూర కొనుక్కోవచ్చును' అనిపిస్తుంది.
'శ్రీదేవి పెళ్ళికి ఎలా వెళ్ళటం? ఒక్క మంచి చీర లేదు. వెళ్ళకపోతే బాగుండదు, అది బాధ పడుతుంది. అందరూ చక్కటి ఖరీదైన పట్టుచీరలు కట్టుకుని వస్తారు. నేను వాయిల్ చీరతో వెళ్ళనా? మంచి వాయిల్ చీర కూడా లేదు. ఒక కొత్తచీర కొనుక్కుంటే బాగుండును. కొనడానికి డబ్బేది? బట్టలకొట్టు ముఖం చూసి ఏన్నర్ధమైంది. ఇప్పుడే కాదు, ఈ జీతం, ఈ ఖర్చులతో ఎప్పటికైనా కొత్త చీర కొనుక్కోడానికి సాధ్యమౌతుందా?' చారుమతి ఇల్లు చేరేదాకా మధనపడుతూనే ఉంది.
రిక్షావాడికి డబ్బులు ఇచ్చి ఇంట్లో అడుగు పెట్టేసరికి ముసలమ్మ వరండాలో మంచంమీద నిద్రపోతూ కనిపించింది. వంటింట్లో దీపం వెలుగుతూనే ఉంది. 'అమ్మ ఇంకా ఏం చేస్తూ ఉంది?' అనుకుంటూ వంటింట్లోకి తొంగి చూసింది. శాంతమ్మ, భానుమతి భోజనం చేస్తున్నారు. చూస్తూ కొయ్యలా నిలబడిపోయింది.
"ఏం చారూ, ఎప్పుడు వచ్చావు? తలుపు శబ్దమే కాలేదు. ఏమిటి అలా నిలబడిపోయావు?" అంది శాంతమ్మ, తల ఎత్తి కూతుర్ని చూస్తూ.
"ఏం తింటున్నారమ్మా?" అంది కంచాలు చూస్తూ, కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ చారుమతి.
తల్లీ కూతుళ్ళిద్దరూ ఉప్పు, పచ్చిమిరపకాయ నంజుకుని వట్టి అన్నం తింటున్నారు. అందులోకి నేతిచుక్కకూడా లేదు.
"ఏమే, నువ్వు అన్నం తిన్నావా? నీకోసం కంచంలో అన్నం మూతపెట్టాను. ఇంతవరకూ నీకోసం చూసి, ఇప్పుడే మేం భోజనాలకి కూర్చున్నాం" అంది భానుమతి, చారుమతి దృష్టిని మళ్లిస్తూ.
"ఆఁ, తినే వచ్చాను" అంది చారుమతి, తను శ్రీదేవి ఇంట్లో తిన్న భోజనం గుర్తుచేసుకుంటూ. తను తిన్న పిండివంటలూ, కూరలూ జ్ఞాపకం వచ్చి, వాంతి చేసుకోవాలనిపించింది.
చారుమతి అక్కడే వంటింటి గుమ్మంమీదే కూర్చుంది. "అమ్మా, కందిపొడి వేసుకోలేకపోయారా?" అంది తల్లిని చూస్తూ.
"కడుపు నిండటానికి ఏమైతేనేమే! కందిపొడి రోజూ వేసుకుంటే కడుపునొప్పి వస్తుంది" అంది శాంతమ్మ.
దూరంగా తనకి ఉంచిన కంచంలోనించి కొద్దిగా కూరా, ఒకపక్క కందిపొడీ కనిపిస్తున్నాయి. కందిపొడి వేసుకుంటే కడుపునొప్పి రావటంకాదు, పిల్లలకి అదికూడా లేకుండాపోతుందని తల్లి భయం. చారుమతి మనసులోనే కుంగిపోయింది.
ముసలమ్మకి పచ్చళ్ళూ, కందిపొడీ పడవు. ఒక రోజు పెడితే మరునాటినించీ కడుపునొప్పి, విరోచనాలు అవుతాయి. ఆవిడకోసం రోజూ కొద్దిగా కూర చేస్తుంది భానుమతి. ఆవిడ తినగా మిగిలినది తమ్ముడికీ, చారుమతికీ వడ్డిస్తుంది.
'ఇలాంటి పరిస్థితులలో నేను చీరేం కొనుక్కోను? శ్రీదేవికి బహుమతి ఏమి ఇవ్వను?' అనుకుంది చారుమతి. సెలవులవడంవల్ల ఎవరూ ప్రైవేట్లకి రావటం లేదు. ఇంటి ముందు శంకరం "గది అద్దెకు ఇవ్వబడును" అని పెద్ద బోర్డు తగిలించినా, ఎవరూ ఇంతవరకు అద్దెకి దిగలేదు. గదికోసం వచ్చిన విద్యార్ధులకీ, బ్రహ్మచారులకీ అద్దెకి ఇవ్వడానికి శాంతమ్మ అంగీకరించలేదు. 'ఎవరికో ఒకరికి ఇచ్చెయ్యాలి' అనుకుంది చారుమతి దృఢంగా.
డాబామీద అందరూ పడకలకి చేరినప్పుడు చెప్పింది, "ఈమారు గది కావాలని ఎవరు వచ్చినా అద్దెకి ఇచ్చెయ్యండి" అని.
డాబామీద మనుష్యులు తక్కువైపోయి, డాబా విశాలంగా కనిపిస్తూంది. మాలతి పరీక్షలవగానే భగవతిని చూసివస్తానంటూ విశాఖపట్నం వెళ్ళింది. సూర్యారావు ఖాళీ ఎప్పుడూ భర్తీచెయ్యలేనిది.
* * *
