Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 10


    సిగరెట్ వెలిగించుకున్న సుదర్శనరావు సుకృతితో వివరణలా అన్నాడు- "నువ్వు ఫోటోజనిక్ గా వుండేదీ లేనిది తెలిసేది స్టిల్సు మూలంగానే."
    "ఒకవేళ ఫోటోజనిక్ గా వుండకపోతే...." టక్కున అడిగింది.
    "కంగారుపడకు. ఏదో ఓ కేరక్టర్ యిస్తాను."
    నిస్త్రాణగా పైకి లేచింది. మొత్తం నాశనమయ్యాక సుదర్శనరావు యిలా మాట్లాడుతున్నందుకు ఆమె బాధపడడంలేదు. బాధపడడమంటూ జరిగితే అది పతనమైనందుకే తప్ప పాత్ర దొరకనందుకుకాదు.
    అనుభవం తర్వాత చాలామంది అమ్మాయిల దగ్గరలాగే తన అవకాశవాదాన్ని ప్రదర్శించిన సుదర్శనరావు ఇప్పుడు ఆలోచిస్తున్నదొక్కటే. ఫీచర్స్ విషయానికి వస్తే సుకృతి ప్రస్తుతం సినిమా రంగంలోని లీడింగ్ హీరోయిన్స్ కన్నా అందమైనది. ఒక్క మంచి అవకాశం చాలు ఆమె పైకి దూసుకుపోవటానికి అదే ఇవ్వకూడదన్నది అతడి ఆలోచన. ఒక్క సినిమాతో సూపర్ స్టారైతే రేపు ఈ పడక సుఖాలు  తనకు దక్కవు. అందుకే కొంతకాలం తనపై ఆధారపడిన ఆర్టిస్టుగానే మిగిలిపోవాలి. సరిగ్గా యిదే ఆలోచనతో ఆమెకు కథానాయిక పాత్ర యివ్వకూడదని నిర్ణయించుకున్న సుదర్శనరావు "డబ్బెంత కావాలి?" అన్నాడు.
    "ఈ ఒక్క రాత్రికా."
    "గుడ్ జోక్" పగలబడి నవ్వాడు. "మీ అమ్మ ట్రీట్ మెంటుకి అవసరమన్నావుగా."
    "సుదర్శనరావుగారూ....." నిర్వేదంగా అంది సుకృతి. "అమ్మ కోసం నేను పెట్టుబడిగా పెట్టింది వెలకట్టలేని నా జీవితాన్ని కాబట్టి మీరివ్వాల్సింది బోలెడంత అని నేనటం లేదు. నేను ఇప్పటికి కావాలనుకుంటున్నది పాతికవేలు."
    ఒక్క అనుభవంతో ఆమె ఎంత రాటుతేలిందీ అంటే ఏభైవేలు అందించిన సుదర్శనరావుతో అంది- "దేనికింత డబ్బు?"
    నవ్వాడు గర్వంగా "నువ్వు వెలకట్టలేని ఆనందాన్ని ఇచ్చినందుకు."
    "కానీ నేను మీకు ఆనందాన్నిచ్చింది డబ్బు కోసం కాదు."
    "మరి?"
    "సినిమాలో అవకాశం కోసం. యస్.....అందుకే మీకు లొంగాను. ఆ సినిమాలోని పారితోషికంగా మీ నుంచి పాతికవేలు అడిగాను.....లేదూ నేను చేసిన వ్యభిచారానికే అంత డబ్బూ అని మీరంటే నా జవాబు ఒక్కటే, అలా డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఏ హోటల్లో అయినా కాల్ గర్ల్ గా మారేదాన్ని. అసలు ఈ రాత్రి మీకు లొంగింది కూడా అనాలోచితంగానే సుదర్శనరావుగారూ. అవతల నా తల్లి పరిస్థితి కాస్త బెటరుగా వుంటే ఇంకా ఆలోచించేదాన్నేమో కానీ వ్యవధిలేదు. నేనుగా నన్ను కోల్పోవటమే లేక అమ్మని పోగొట్టు కోవడమో ఏదో ఒకటి జరగాలి. ఈ రాత్రి నేను కనీసం పాతికవేలు సంపాదించకపోతే ఆ మాత్రం అమ్మ బ్రతికుండగా నేను ఉపయోగపడక పోతే ఓ జీవిత కాలం నేను బాధపడాల్సి వచ్చేది. ఇప్పుడు బాధపడవా అంటే దానికి నేను జవాబు చెప్పలేను. చెప్పగలిగే మెచ్యూరిటీ నాకు లేదు. కానీ ఇందులో.....ఈ పతనంతో అణువంత సంతృప్తి వుంది. రేపు నేను నటిని అయినా, కాకపోయినా నాకు జన్మనిచ్చిన తల్లికి కొంతైనా ఉపయోగపడగలిగానుగా అది చాలు" పాతికవేలు టేబుల్ పై వుంచి మిగతా పాతిక వేలతో ఆమె వెళ్ళిపోయింది.
    చాలా సేపటిదాకా తేరుకోలేకపోయాడు సుదర్శనరావు. అతను డైరెక్ట్ చేసిన సినిమాలల్లో ఒకటి అరా తల్లికోసమో లేక భర్త కోసమో యిలా పతనమైన స్త్రీ పాత్రల్ని సృష్టించాడు. సెంటిమెంటల్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగాడు కానీ వాటిలో యింతటి జీవం లేదు.
    అదికాదు అతడ్ని అంతగా కదిలించింది. ఇప్పుడో ఎప్పుడో అతడికీ తెలీదు కానీ సుకృతి నటి అయితే చాలా త్వరలో ఈ దేశాన్ని శాసించబోతూంది. అంత అరుదైన వర్చస్సుని కాదు, పతనం తర్వాత కూడా ఆమెలో కనిపించిన "గ్రేస్" అతడ్ని అంతగా ఆకట్టుకుంది.
    అయితే అతడు వూహించనిధి ఒకటే....
    ఒక 'రాత్రి' పతనంతో రేపు సుకృతి ఎందరి నిద్రలేని కాళరాత్రులకు కారణం కాబోతూందని.
    
                                                         *    *    *    *
    
    తెలతెలవారుతుండగా హాస్పిటల్ కి వచ్చిన సుకృతి డబ్బుని డ్యూటీ డాక్టరుకి అందించింది.
    తల్లి పరిస్థితి నిన్నటంత ప్రమాదకరంగా లేదని తెలిసిన సంతృప్తి మూలంగానో లేక స్పృహలోలేని అమ్మను సైతం చూడలేకనో దూరంగా వుండిపోయింది తప్ప ఆమె బెడ్ ని సమీపించలేకపోయింది.
    అమ్మని స్పృశించాలనుంది. కానీ ధైర్యం చేయలేకపోతూంది.....కళ్ళు మూసుకుని పడుకుని వున్న అమ్మది నిద్ర అయితే ఆ నిద్రలో సైతం తను కలగనేది కూతురి గురించే అని సుకృతికి తెలుసు. అందుకే కళ్ళలో నీటిపొరలు పేరుకుంటున్నాయి.
    "సుకృతీ"
    అప్పుడు చూసింది సుకృతి.....ఎంతసేపైందో అలివేలు తన సమీపంలో నిలబడి యిప్పుడు పలకరిస్తూంది.
    అలివేలు కళ్ళలోకి సూటిగా చూడలేనట్టుగా నడిచింది కారిడార్ లోకి......
    "ఆగమ్మా" ఆంటీలా కాక అమ్మంత ప్రేమగా పిలిచింది అలివేలు "నిన్నే."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS