Next Page 
రామ్ శాస్త్రి పేజి 1

       
                           రామ్ శాస్త్రి
                                                           వి.ఎస్. సుక్తాంకర్ ....

                       


    అది పవిత్ర 'చతుర్మాస్" కాలం. ఆ ఉదయం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. వేకువ జాము నుంచీ "మాహాలీ' గ్రామం చాలా సందడిగా ఉంది. మామిడాకు తోరణాలు, కొబ్బరి కాయలు, పువ్వులతో అందంగా అలంకరించి ఉన్న ఒక పందిరి ముందు మోగుతున్న సన్నాయి వాద్యం గ్రామ ప్రజలని ఆహ్వానిస్తోంది. ఆ పందిరిని ఒక సంపన్నుడయిన 'సర్దార్ ' వేయించాడు. అయన వూరు పూనా. పీష్వా అనుగ్రహం వల్ల 'సుబేదార్' పదవి లభించింది. ఉద్యోగంలో చేరటాని కని ఉత్తరాదేశానికి పయనమయి దారిలో ఇక్కడ ఆగాడు. పవిత్ర కృష్ణానదీ తీరం మీద మన్న మాహులీ పండితులకి ప్రసిద్ది చెందినది. అందులో చతుర్మాన్ కాబట్టి సర్దార్ గ్రామంలోని పండిత వర్గానికి దక్షిణలు ఇప్పించే ఏర్పాట్లు చేశాడు.
    ఈ వార్త విన్న బ్రాహ్మణులు -- పిన్నలూ పెద్దలూ కూడా -- అక్కడ పోగయ్యారు. ఇక శుభకార్యం ప్రారంభం కాబోతున్నదనగా ఒక చిన్న అసభ్యకరమయిన సంఘటన జరిగింది. మధ్య వయస్కుడయిన బ్రాహ్మణుడొకతను ఏడెనిమిదేళ్ళ పిల్లవాడిని బలవంతంగా ఈడ్చుకు వచ్చాడు. పందిరి లోపలికి వెళ్ళే ముందు అతని చెవిలో ఇలా వూదాడు--- 'ఇదిగో రామ్ ! మళ్ళీ చెబుతున్నాను జాగ్రత్త! ఇవాళ దక్షిణ వదుల కొనటానికి వీల్లేదు తెలిసిందా! ఎవరయినా అడిగితె గ్రామ పాఠశాలలో చదువు కున్నానని ధైర్యంగా చెప్పెసేయి...."
    "కాని మామయ్యా-- పాఠశాలకే వెళ్ళని వాడిని కదా! ఎలా చెప్పను?' అని వెక్కిళ్ళ మధ్య అడిగాడు చిన్న పిల్లవాడు.
    "నోర్మూయ్ ." అని రహస్యంగానే బెదిరించాడు అతని మామ హరి భట్. అతని చెవి మెలేస్తూ "నే చెప్పినట్లు చెయ్యక పోయావా చీరేస్తాను." అంటూ రామ్ ని మొరటుగా లోపలికి నెట్టాడు.
    పందిరిలోని గుంపునీ, వేదిక మీద ఆడంబరంగా అలంకరించుకుని కూర్చున్న సర్దార్ నీ, అతనికి ఇరువైపులా ఎర్ర శాలువాలు కప్పుకుని కుండలాలు ధరించి కూర్చున్న ఇద్దరు పండితులనీ చూడగానే రామ్ భయం మరింత ఎక్కువ అయింది.
    "దాతగా , పండిత పోషకులుగా పూనా నగరంలో అశేష కీర్తీ గడించిన ధర్మ ప్రభువులు మన అధిపతి సర్దార్ తరపున మీకందరికీ స్వాగతం పలుకుతున్నాను!" అన్నాడు వారిద్దరిలో ఒక పండితుడు గంబీరంగా.
    వెంటనే రెండవ పండితుడు , "సోదరతుల్యులయిన పండితులంతా ముందుకి వచ్చి తమ అర్హత'లని వివరించి వీరు ఇచ్చే దక్షిణ స్వీకరించవచ్చు!" అని, కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ ఇలా అన్నాడు ; "అయితే విద్యార్హతలు లేని వారు పండిత పోషణ కోసం ఇస్తున్న ఈ దక్షిణ స్వీకరించరాదని గ్రహించాలి! వంచన మహా పాపం అని గమనించాలి!"
    రెండవ పండితుని చివరి వాక్యం రామ్ వ్యాకులాన్ని మరింత అధికం చేసింది. పందిరి నుంచి జారు కుందామని ప్రయత్నించాడు కాని తన మామ పట్టు వదిలించు కోలేకపోయాడు. హరిభట్టు అతని మొహంలోకి ఉరిమి చూసి తొడపాశం కూడా పెట్టాడు.
    దక్షిణలు ఇవ్వటం ప్రారంభం అయింది. ఒక్కొక్కరూ వేదికని సమీపించి పండితులకి తమ విద్యార్హతలని వివరించారు. వారి వాటిని క్లుప్తంగా పరీక్షించి తగిన దక్షిణ ఇప్పించి పంపేశారు.
    విద్యాహీనుడయిన హరి భట్ వంతు వచ్చింది. అతను పండితులకి అతి వినయంగా నమస్కరించి , "అయ్యా౧ నా పేరు హరి భట్. "దశ గ్రంధి' ని ఈ గ్రామం కాదు కాని స్వగ్రామమయిన 'నాయీ ; లో నా పాండిత్యాన్ని ఎరగని వారు లేరు' అన్నాడు. పండితులకి ఇతని వాలకం అనుమానాస్పదంగానే ఉన్నప్పటికీ తమ ప్రశ్నలకి గడుసుగానే సమాధానాలు ఇవ్వటం చేత అయిదు వెండి రూపాయలు దక్షిణ ఇప్పించారు. హరి భట్ రామ్ ని చూపించి, "వీడు నా మేనల్లుడు. గ్రామ పాఠశాలలో చదువు కుంటున్నాడు. చాలా బుద్ది మంతుడు." అన్నాడు.
    రామ్ అమాయకపు చూపులు పండితులని ఆకర్షించాయి. అతని విద్యాభ్యాసాన్ని పరీక్షించటానికి ప్రయత్నించకుండానే అతని చేతిలో ఒక రూపాయి ఉంచారు. "బాబూ నువ్వు బుద్ది మంతుడివిగా చదువు కుంటున్నందుకు చాలా సంతోషం. ఇంకా బాగా చదువుకుని గొప్ప పండితుడివయి పేరు తెచ్చుకోనాలని ఆశీర్వదిస్తున్నాము" అన్నారు.
    కరుణాపూరితాలయిన వారి మాటలు రామ్ అంతః కరణాన్ని కదిలించి వేశాయి. కళ్ళ వెంబడి నీరు వచ్చాయి. తల వంచుకుని గద్గ స్వరంతో "అయ్యా క్షమించండి! నేను చదువుకోవడం లేదండి -- అసలు పాఠశాలలో ఎప్పుడూ చదువు కోలేదండి!" అని చప్పున రూపాయిని వేదిక మీద ఉంచేసి నేరుగా ఇంటికి పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు.
    పందిరిలో అల్లకల్లోలం బయలుదేరింది. తను మోసం చెయ్యటమే కాక పసివాడికి సయితం వంచించటం నేర్పుతున్నాడని హరిభట్టు ని అందరూ నానా మాటలూ అన్నారు. అతను చేసేది లేక చల్లగా బయటికి జారుకున్నాడు.
    భర్త పోయిన తర్వాత రాదాభాయి ఇరుగుపొరుగు వారి ఇళ్ళలో ధాన్యం దంచీ, పిండి విసిరి జీవితం సాగిస్తోంది. ఈ అతి స్వల్పమయిన అర్జనతో రెండు పూటలూ సరిగ్గా గడవని ఆమె తన కొడుకు రామ్ ని పాఠశాలలో ఏమి చదివిస్తుంది? కొన్ని నెలలుగా వరసకి అన్నగారాయిన హరి భట్ స్వగ్రామం వదిలి వచ్చి ఆమెతో ఉంటూ వీలయిన సహాయం చెయ్యటం చేత కొంత తెరిపిగా ఉంది. ఉదయం జరిగిన సంఘటన తో ఆమెకి ఈ సహాయం కూడా లోటయింది. నిప్పులు కక్కుతూ వచ్చిన హరి భట్, ముద్దు చేసి చెడ గొట్టటం వల్లనే పిల్లవాడిలా తయారయ్యాడని చెల్లెలి మీద మండిపడి, ఆమె ఎంత ప్రాధేయ పడినా వినిపించుకోకుండా మూటా ముల్లె ఎత్తుకుని స్వంత వూరు' వెళ్ళిపోయాడు.
    తల్లి దుఃఖాన్ని చూసిన రామ్ చాలా బాధపడ్డాడు.
    "అమ్మా మామయ్య వెళ్లిపోయాడని నా మీద కోపంగా ఉంది కదూ! కాని నేను అయన చెప్పిన పని చేస్తే నన్నింకా కోప్పడే దానివి." అని జరిగినదంతా చెప్పాడు.
    రాదాభాయి కోపం మటు మాయమయి పోయింది. "బాబూ రామ్ . అనవసరంగా నీ ,మీద కోపం తెచ్చు కున్నాను! దేవుడికి మన మీద దయ లేదు. డానికి బాధపడను. కాని భగవంతుడు నీకీ వయసులోనే ఇంత గొప్ప బుద్ది నిచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది!" అంటూ కొడుకుని హృదయానికి హత్తుకుంది.
    రామ్ భయం పోయినా అతనిలో మరొక భావం మొలకెత్తింది. దక్షిణ ఇచ్చిన పండితులకి చదువు మీద ఎంత గౌరవం ఉందొ చూసిన అతనికి తనూ చదువుకుంటే బాగుండు ననిపించింది.
    "అమ్మా ఇంకోటి చెప్తాను కోప్పడవుగా? మనం బీదవాళ్ళం, నేను పాఠశాలలో చదువుకోలేను. కానీ, మన జాగీర్దార్ గారి అబ్బాయి "భయ్యా సాహెబ్" నా ఈడు వాడే! అతని కోక పండితుడు ఇంటికొచ్చి చదువు చెప్తాడు. కొందరు పిల్లలు కూడా వచ్చి పాఠాలు వింటారు. నీకు జాగిర్దార్ గారి ఇంటావిడ తెలుసు కదా! నన్నూ పాఠాలు విననివ్వమని ఆవిడతో చెప్పవూ?' అని వేడుకున్నాడు.
    'అలాగే రామ్ ! కాని నువ్వు వట్టి అల్లరి వాడివి! అక్కడేం గొడవ తీసుకోస్తావో నని నా భయం . నీ చదువే కాకుండా నా ఉద్యోగం కూడా ఊడకుండా బుద్ది మంతుడిగా ఉండాలి తెలుసా!"
    "లేదమ్మా నేనేం అల్లరి చెయ్యను! ఇవాళే వెళ్లి ఆవిడికి చెప్పవూ?' రామ్ చాలా ఉత్సాహంగా అడిగాడు.
    మర్నాటి నుంచీ రామ్ జాగిర్దార్ గారి ఇంట్లో పాఠాలు వినటం మొదలు పెట్టాడు. ప్రతిరోజూ విన్నవన్నీ తల్లికి చెప్పేవాడు. కొడుకు చురుకుదనానికి ఆవిడ పొంగి పోయేది. కాని ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు.

                            
    ఒకనాడు పండితుడు జాగిర్దార్ గారు పిలిస్తే లోపలికి వెళ్ళాడు. ముఖ్య శిష్యుడు భయ్యా సాహెబ్ పిల్లలందరినీ బిళ్ళం గోడు ఆడటానికి తీసుకు వెళ్ళాడు. గారాబానికి అలవాటు పడ్డ పిల్లవాడు కాబట్టి ఆటలో నియమాలని అనుసరించకుండా వోడిపోయినప్పుడు కూడా కర్ర వదిలేవాడు కాడు. రామ్ దీనిని సహించ లేకపోయాడు. రెండు మూడు సారులు వూరుకుని అతని చేతిలోని కర్రని బలవంతంగా లాక్కున్నాడు. భయ్యా సాహెబ్ కి కోపం వచ్చింది. రామ్ తనని కొట్టాడని గట్టిగా ఏడవటం మొదలు పెట్టాడు.
    శిష్యుడి ఏడుపు విన్న పండితుడు హడావిడిగా బయటికి పరిగెత్తుకు వచ్చాడు. కోపాన్నంతా రామ్ మీద చూపించి అతను చెప్పింది వినిపించుకోకుండా నాలుగు వాయించి, 'భయ్యా సాహెబ్ కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకో" అని గద్దించాడు.
    రామ్ ఈ అన్యాయాన్ని సహించలేక విదిలించుకుని పారిపోయాడు. పారిపోయాడే కాని తన తల్లికి రాబోయే కష్టాలు తలుచు కున్నప్పుడు అతనికి కన్నీరగలేదు. తన వల్లనే ఆమె ఆర్జన కాస్తా తగ్గిపోతుందని తనని తనే తిట్టుకున్నాడు.
    అదే సమయంలో "జాన్ బా' అనే రైతు తన ఎడ్ల బండి అటు తోలుకు పోవటం చూశాడు. రామ్ తండ్రి బ్రతికి ఉన్నప్పుడు జాన్ బా , అతనూ మంచి స్నేహితులు. తన మిత్రుడు మరణించిన తర్వాత జాన్ బా అతని భార్యనీ, కుమారుడి నీ మరిచి పోకుండా అభిమానంగానే చూసుకునేవాడు.
    రామ్ ఒక్క ఉదుటున బండి వద్దకి పరిగెత్తాడు . "ఎంతదాకా వెడుతున్నారండి?' అని అడిగాడు.
    'సతారా, ఏం వస్తావా?' అని జాన్ బా నవ్వుతూ ఎదురు ప్రశ్న వేశాడు.
    "అవును!' రామ్ జాన్ బా ఆశ్చర్యం నుంచి కోలుకోకముందే తన కధంతా చెప్పి సతారా లో "అన్ గల్ షావుకార్' ఇంట్లో పని ఇప్పించమని వేడుకున్నాడు. జాన్ బా అన్ గల్ శావుకార్ ఇంట్లో గడ్డి వేస్తూ ఉంటాడని రామ్ కి తెలుసు. జాన్ బా కి రామ్ ని చూస్తె జాలి వేసింది.
    'సరే ఎక్కు!" అన్నాడు.
    రామ్ సంతోషంగా బండిలోకి ఎక్కి కూర్చున్నాడు. అయితే వూరి పొలిమేర దాటే ముందు దారిలో ఎదురయిన వారిని ఒకరిని తను జాన్ బాతో సతారా వెళ్లి పనిలో చేరపోతున్నట్లు తల్లితో చెప్పమని కోరాడు.


Next Page 

WRITERS
PUBLICATIONS