Next Page 
మనం మిగిలేం పేజి 1


                              మనం మిగిలేం
                                                       --కందుకూరి లింగరాజు


                     
    
    "బావా!" ఇలా మాట్లాడలేకపోయింది రుక్మిణి. కంఠంలో పెగలి వెళ్ళకక్కలేని దుఃఖం. గత ఐదు సంవత్సరాలనుండి అండగా నిలబడిన అత్తయ్య ఇక కన్పించకుండానే మట్టిలో కలిసిపోయింది. ఒక్క భావన, అనుభూతి దూలాలకు, వాసాలకు పుట్టినిల్లయి నిండిన ఏకాకి గృహంతప్ప.
    క్షణికం గడపవద్ద ఆగేడు. ఎర్రబడిన కనుకొలకుల్లో తులసితీర్ధంలా కన్నీళ్ళు. గుండెలు వేగిరపడ్డాయి. అమ్మలో ఇమిడి ఇంకిపోయిన ఆర్ద్రతలోనే రుక్మిణిని తెచ్చుకుంది. తన చేతులతో జడవేసి పువ్వులు తురిమింది. తన నగలే సవరించి బుగ్గను చుక్కపెట్టి, కల్యాణం బొట్టు తీర్చి, తన తర్వాత తాళం చెవులు పుచ్చుకుంటుంది అన్న ధీమాతోనే ఉంది, అది వటవృక్షమే అయితే. మూడు రోజుల క్రితం, తన్ను  దగ్గరగా పిల్చి, కన్నీళ్లు చిలుకుతుంటూనే-
    "పిచ్చీ! నే వెళ్ళిపోతే నిన్నెవరు చూస్తారురా!" లోకంలో మాతృస్థానపు సొత్తు ఆ ప్రశ్న.
    "ఎందుకమ్మా, అల్లా బెంబేలు పడతావు? ఏదో చిన్న నలత. రెండు రోజుల్లో తగ్గి పోదూ?" తను అన్నాడు.
    "నీకు తెలియదురా, బాబూ!" మృగ్యం గానే నవ్వింది. రోజూ పూజలుచేసి నింపిన సింహాసనంలో నింగి అంతా నిండిన అవకాశం అన్నట్లు.
    "ఒక్కటడుగుతా..."
    "చెప్పమ్మా!"

                                    
    "నువ్వు రుక్మిణిని పెండ్లి చేసుకుంటానని చేతిలో చెయ్యి వెయ్యరా. ఆ సంతోషంతో కళ్ళు మూసుకుంటూ."
    చూచాయగా అమ్మలో మొలకెత్తిన బీజం, అది అంకురార్పణ అవుటకు దోహదం, అన్నీ తనకు తెలుసు. కాలేజీల్లో ఆటలు, పాటల మద్య స్వేచ్చగా తన వయస్సు నిండు కుంటున్న రోజుల్లో, ఈ తలంపు రాలేదు. తను రానివ్వలేదు. తనకు తాను ప్రశ్నించుకుంటే రుక్మిణిని ఎప్పుడూ తనకు కాబోయే గృహిణి అన్న అద్దాల్లోంచి చూడలేదు. తనకు మేనరికం అన్న వతులోనే సెలవుల్లో, సమయం దొరికినప్పుడల్లా వేళాకోళం చేసి, లేవుడీ చేసేవాడు.
    అమ్మ చీరకొంగు అడ్డం పెట్టుకుని కన్నీళ్ళు తుడుచుకునేది. నాన్నారు ముసి ముసిగా నవ్వేవారు మీసాల పండుల్లోంచి. అప్పుడు -
    "నీ మొగుడే కాదుటే?" అమ్మ అడ్డు.
    "చచ్చినా బావని పెండ్లి చేసుకోను!" రుక్మిణి కోపం.
    "ఏం?" నాన్నారు మధ్య సన్నాయి నొక్కు.
    అప్పటికి అది ఆగిపోయేది. ఇప్పుడు ఈ లేవలేని స్థితిలో, మృత్యుముఖంలో తల దూర్చేను అన్నట్లు ఆవరించిన నిస్పృహలో అమ్మే అడిగింది.
    "నీ ఇష్టం."
    "అదికాదు. చేతిలోచెయ్యి వెయ్యి!"    
    అమ్మేనా మాట్లాడింది? భయం ఆవరించింది. ఏమిటిది? అమ్మలో నించుని అడిగించినవారు ఎవరు? అర్ధం కాలేదు. నెమ్మదిగా చెయ్యి ఎత్తేడు. భావి ఆలోచించికాదు. రుక్మిణిని ఊహించుకుని కాదు. తనకు తెలియని నిర్వచనం లేని ఉద్వేగంలోనే.
    అంతే!
    ఆ పసుపు కుంకుమలతోనే అమ్మ కళ్ళుమూసింది. చిరునవ్వు పెదిమల మీద తొణికిస లాడుతూనే ఉంది. తనే చీకట్లోకి వెళ్ళి పోయేడు.
    నరనరాలు ఆక్రోశిస్తే, గళం చించుకుని ఇప్పుడు, ఆనాటి జవాబు ఇవ్వలేని సమాధానం చెపుదామనుకున్నా, నోరారగా 'అమ్మా' అన్న శబ్దం విశ్వంలో కంపించి, అణగారిపోయే కంపనమే తనకు ప్రసాదించింది.
    "ఎందుకు ఏడుస్తావ్, రుక్మిణీ?"
    బావురుమంటూనే కుప్పకూలిపోయింది. గుమ్మంమీదనే కూర్చుని కళ్ళు వత్తేడు.
    "దుఃఖం మ్రింగుకోవాలి. ఏంచేస్తాం" అన్నాడు. దానితర్వాత ఏమని అనాలో తనకు తెలియలేదు. ఓదార్పు అనునయం తనకు రాలేదు.
    ఈ క్షణంలో రుక్మిణికి ఆ యింట్లో తన స్థలమేమిటి అన్న దిగులు కలిగి ఉండవచ్చును. లేక అత్తయ్య తర్వాత తను ఆక్రమించగలిగిన స్థానం ఏమిటి అన్న సంశయమూ రేకెత్తి ఉండవచ్చు. అది తన భ్రమ, ఊహ అయినా ఇప్పుడు సమాధానం చెప్పవలసిన బాధ్యత తనమీద ఉంది. తను ఇప్పుడు చెప్పలేడు. నిజం ఒప్పుకోవాలంటే తనకే తెలియదు. ప్రస్తుతంలో తను ఇంటికి పెద్దవాడు. తన ఋణవిముక్తి కొరకు నిర్ణీత సంప్రదాయాల సరళిని తు చ తప్పకుండా పాటించడమే కర్తవ్యం.
    "నువ్వు మళ్ళీ కాలేజీకి వెళ్ళాలా?"
    తలూపేడు.
    "మావయ్య ఒక్కరూ..."
    "నువ్వు ఉన్నావుగా? ఆ ధైర్యం మీదనే నేను వెళ్ళాలి."
    "బావా!" గుండె గొంతుకతో కొట్లాడింది అన్నట్లే.
    సావిట్లోకి వచ్చేసరికి నాన్నారిచుట్టూ నలుగురైదుగురు అనునయ సభలో ఉన్నారు. తన్ను చూడగానే ఒక్కసారి తలలు వచ్చి కళ్ళెత్తి ఏవో ఏవో అనడం ప్రారంభించారు.
    పండిన మీసాలమధ్య నిలిచిన అశ్రువుల్లోంచి కిటికీలోని నీరెండ ప్రతిఫలించింది నాన్నారిలో. ఆయనకు అమ్మతో సాహచర్యం ప్రారంభించి ఏభై వత్సరాలైంది. విడలేని ఎగుడు దిగుడులు దాటి పూర్వీకుల పునరావృత్తితో వేసిన పందెర అది. తనకూ దుఃఖం వచ్చింది. కళ్ళు తుడుచుకునే బయటపడ్డాడు.
    తను ఎక్కడికైనా పారిపోవాలన్న ఆక్రోదన కలిగింది. తను పెరిగినా, తండ్రి తనకు ఎప్పుడూ దగ్గరగా రాలేదు. తను ఆయన ఆప్తుల్లో ఒకడు కాలేదు. ఆ దూరపుపరిధుల్లో తను ఏటేటా పైకి ఎక్కడం, ఆయన గొప్పలు చెప్పుకోవడం వరకే సరిపోయింది. అమ్మదగ్గ్ర్ మాత్రం తను సొలసినా, ఆ ఆప్యాయత రాలేదు. తనేదో దూరంగా ఉన్నట్లే ఉండిపోయేడు ఆ ఇంటికి.
    ఇది కాస్త కటువుగా ఉన్న సత్యం అయినా అసత్యం కాలేదు. లోకం ఒప్పుకోలేని విప్లవం తనలో ఏదో ఎదురుతిరుగుతూనే ఉంది. అది నిర్ధారణ తను చెప్పలేడు, అప్పుడప్పుడు ఆవ్యక్తంలో చిందే ఈ విపరీత భావన తప్ప.
    ఒక్క రుక్మిణిని గురించే తను ఆలోచించవలసి వచ్చినా, తన మనస్సు ఈషణ్మాత్రం కూడా మమత, కోర్కె దానిమీద పెంపొందించుకోడానికి ఇచ్చ చూపటం లేదు. వాళ్ళందరికీ తనమీద - ఆఖరికి రుక్మిణికి కూడా - ఉన్న భరవసాను తను ఎప్పుడూ విలువైన తూకంతో తూచలేదు. ఎర్రగా, తనంత ఎత్తు, పెద్ద కళ్ళు, చాకలిపద్దు చదువు, వంటింటి బావుటా, ఉన్నతుల్లో మెలితిరిగినా, తన ఉద్దేశ్యం మారలేదు. అదంటే ఏదో తన తోబుట్టువులాగే దృష్టి నిలిచిపోయింది. ఈ మారిన పరిస్టితుల్లో నైనా తనకు పరివర్తన రావటం లేదు.
    ఒక్క విషయం నిరుకు. ఈరోజు కాక పోయినా ఇంకో రోజులో, తన తండ్రి నిలదీయడం, తోడి బంధువులు ఊతనియ్యడం జరుగుతుంది. ఆ రాత్రి చెప్పలేని వాగ్ధానం ఇంకో విధంగా తనమీద ఆంక్ష అవుతుంది. ఇది తనకు ఇష్టంలేదు. ఓవిధంగా కొన్నాళ్ళు తనుదూరంగా ఎక్కడికైనా వెళ్ళడానికి ఇది కొంతవరకూ కారణం అయిఉంటుందా అన్న భావన పోయింది.
    కొన్నాళ్ళు.....మధు, రావు జ్ఞాపకం వచ్చేరు. మధు తనగదిలో ఉండేవాడు. రావు క్లాసు మేటు రోజూ సూర్యోదయం కాకుండా లేచి, స్నానం చేసి, కృష్ణా జినం వేసుకుని ఘంటన్నర ముక్కు పట్టుకుని కుస్తీ పట్టేవాడిని చూస్తే తనకు నవ్వు వచ్చేది. అపహాస్యం క్రింద ఉండేది. ఇంగ్లీషు చదువులు, తెలుగు ఒరవడి అన్న విరుద్ధ సమ్మేళనం మధు.
    "స్వర్గలోకంనుండి విమానం, రంభా తిలోత్తమ....." తను అనేవాడు.
    "ఎందుకు రాకూడదూ?" మొరాయింపు.
    "ఇప్పటినుండీ ఇల్లా అయితే ఇక శకుంతల పుట్టడం తర్వాయి అవుతుంది."
    "ఆరోజు నువ్వూ తయారవుతావురా. అప్పుడు...."
    ఆ సమాధానం ఇప్పుడు ఝుయ్యిమంది. ఎప్పుడో ఎక్కడో తను చేసేవాడు. చాలారోజులే అనుష్ఠానాలన్నీ జరిపించేడు. అది ఆచ్చాదన క్రింద వస్తూంది. ఈ తలంపు వచ్చినపుడే తను తనుగా ఉండలేక పోతాడు.
    మధు ఇంటికి వెళ్ళితే ఎందుకో మనస్సు ఊగులాడింది. ఇధమిత్ధంలేని ఉయ్యాల. రావు, మధు ప్రవృత్తికి పూర్తిగా వ్యతిరేకం. సర్వం మధుమయం అంటాడు. కైపు నిషాల కైవారం అది. తను ఆ ఇరువురి మధ్యా సాహచర్యం ఉన్నా ఆ రెండ స్వభావాలూ అంటలేదు. దీనికి కారణం సత్య అయి ఉండవచ్చునని చాలాసార్లు అనుకొన్నాడు.
    తను ఉన్న ఇంటికి రెండు ఇళ్ళ అవతలనే ఉండేది. వినికిడివల్ల తండ్రి బ్రాహ్మడు కాడని, తల్లిమాత్రం అవునని, అది లేచిపోయిన ఉద్వాహం అని, ఆ ఫలితమే సత్య అని తెలుసు. సత్యతో తన పరిచయం ఎల్లా ప్రారంభించిందో తను ఇప్పుడు నిర్ణీతంగా చెప్పలేడు. అయినా సత్య మనసు విప్పి మాట్లాడుతుంది. మధు, రావు కలిసిన కలగూరగంప ప్రవృత్తి సత్యది. అక్కడ నిష్ఠానియమం, చిలిపితనం కలిసిఉన్నాయి. తన శరీరం సత్యతో ఉండాలనిపిస్తుంది.
    నల్లగా, దుబ్బుగా, జీడిపిక్క కనుపాపలతో సత్య మెరుస్తుంది. ఎప్పుడూ తెల్లటి బట్టలు వేసుకుంటుంది. ఆంగ్ల ఆంధ్రాలు అనర్గళంగానే మాట్లాడుతుంది. బీద అంతస్థు అయినా, గొప్పవారి ఛాయల్ని దాటుతుంది ప్రవర్తన.
    వయస్సును బట్టి యువకుల్లో కలిగే వాంఛ చిహ్నమే సత్యతో తన స్నేహం అని చాలాసార్లుమధనపడ్డా, అదినిరుకుగా నిల్వలేదు. ఏదో ఓ ఆపేక్ష, సామీప్యత కోరుకున్నతనవలపు. అందులో తప్పు, ఒప్పు అన్న విచక్షణలేని పాయ, తను నిర్వచించలేని అనుభూతి అది.
    బస్సులో కూర్చున్నప్పుడే, "మీరు రామ చంద్రయ్యగారి అబ్బాయిగారు కాదూ?" అన్న ప్రశ్న. లంక పొగాకు చుట్ట, చివర్లకు గెంటుతూనూ బొర్రమీసాలు.
    తలూపేడు. డ్రైవరు, కండక్టరు ఉలిక్కిపడ్డారు.
    "అమ్మగారు మాలక్ష్మిలాంటిది. కడుపు నిండా భోజనం పెడితేనేకాని ఊరుకునేది కాదు. ఎప్పడు వెళ్ళినా భోజనంచేస్తేనే సంతోషపడేది. అన్నపూర్ణే ఆవిడ." తాదాత్మ్యంలోనే అంటున్నాడు.
    "ఆ ఇంటికి వెళ్ళాలంటే కాళ్ళు ఆడటం లేదు, బాబూ." రుగ్దంలో దుఃఖపడుతున్నాడు ఆసామీ.
    క్షణికం అమ్మ, నాన్న కూడా సాదృశ్యమైనారు. విభిన్నప్రవృత్తులే అయినా, కాడి తొలగలేదు. దారి తప్పనూలేదు వాళ్ళ జీవితాల్లో. ఎవరి విలువలు వాళ్ళు ప్రజల్లో చిలకరించేరు. అది వాళ్ళవాళ్ళ ఉన్నతి, అభ్యుదయం, పురోగమనం.
    బస్సు దిగేసరికి సంధ్యాకాలం అయ్యింది. చెట్ల వెనుక సూరీడు ఎర్రరంగు కలుపుకున్నాడు, సారించిన కుంచె రక్తం గడ్డకట్టినట్లు నలుపే చిందుతూంది, మసకల్లోనుండి చిక్కగా.
    సత్య ఇంటికి వచ్చేసరికి భళ్ళున చీకటి పారింది. గుండెలు కొట్టుకున్నాయి. సత్యకు, తనకు స్నేహం అన్న ఎరిక తప్ప ఇంకో బధుత్వం లేదు. పిలుపులేదు. ఒక్క క్షణిక భావోద్రేకంలో పడి సత్య ఇంటికి బయలుదేరేడు. తనకు ఏదో, తనకే తెలియనది కావాలి. అది దొరుకుతుందన్న నీటిమీద వ్రాతలా ఆశకు, నాన్నారి చాదస్తం, రుక్మిణి ఏడ్పు భరించలేకనే బయటపడ్డా, ఇప్పుడు ఈ లిప్తంలో సత్య ఏవిధంగా తన్ను మారుస్తుంది? ఏం జరుగుతుంది? ఈ రాత్రి, చివురింపుల్లో ఏ జీమూతాలు ఆక్రమించుతాయి అన్న సందిగ్ధతే కలిగింది.


Next Page 

WRITERS
PUBLICATIONS