ఇందుమతి
కాదంబరి
.jpg)
రాజశేఖర మూర్తి కేంద్ర ప్రభుత్వం సచివాలయం లో ఒక ఉన్నతాధి కారి. కొత్త డిల్లీలో తన ఆఫీసు గదిలో కూర్చుని మామూలుగానే పని చేసుకుంటున్నాడు ఒకానాటి మధ్యాహ్నం. రెండు వైపులా కోట గోడల లాగ ఆఫీసు ఫైళ్ళు పేరుకుని ఉన్నాయి. పత్రికలూ, విడి కాగితాలూ బల్ల మీద చిందర వందరగా పడి ఉన్నాయి. ఇంతలో రింగురింగు మని టెలిఫోను మోగింది. రిసీవర్ తీశాడు రాజశేఖర మూర్తి.
.jpg)
"మూర్తి స్పీకింగ్."
"రిసెప్షన్ సర్. మిస్టర్ నారాయణ రావ్....ఆఫ్ విజయవాడా విషెస్ టూ సీయూ."
"హూ? మిస్టర్ నారాయణ్ రావ్....ఆఫ్ విజయవాడా ? ప్లీజ్ షో హిమ్ ఇన్."
కళ్ళజోడు తీసి బల్ల మీద పెట్టి అలొచనలొ పడ్డాడు రాజశేఖర మూర్తి. 'మిస్టర్ నారాయణ్ రావ్.-----తన బావమరిది నారాయణ రావు గారు. ఇరవై ఏళ్ళయింది చూసి. ఉత్తరం పత్రం లేకుండా ఏమిటీ రాక? ఇన్నేళ్ళ తరవాత అయన తన ఇంటికి రావడం ! ఏం పని మీద వచ్చారో డిల్లీ? తన చిరునామా ఎలా తెలిసిందో?' అని పలు విధాల ఆలోచించుకుంటున్న రాజశేఖర మూర్తి తలపూలకు అంతరాయం కలిగిస్తూ తలుపులు తెరచుకుని తానె వచ్చారు నారాయణ రావుగారు. ఆయనకు దారి చూపి తీసుకుని వచ్చిన చప్రాసీ సలాం పెట్టి వెళ్లి పోయాడు. లేచి ఎదురుగా వెళ్లి నారాయణరావు గారిని కౌగలించు కున్నాడు రాజశేఖర మూర్తి.
"రండి, బావగారూ, రండి. బహుకాల దర్శనం. ఎప్పుడు వచ్చారు? ఎక్కడ దిగారు? ఏం పని మీద వచ్చారు? ఒక్కరే వచ్చారా? ఒక్క ఉత్తరం ముక్క వ్రాస్తే స్టేషను కే వచ్చి కలుసుకునే వాడ్నే " అని ఊపిరాడకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు రాజశేఖర మూర్తి.
'మీ కోసమే వచ్చాను, బావగారూ . ఇవాళ ఉదయమే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ లో రాక. బండి రెండున్నర గంటలు లేటు. మీకోసం వచ్చిన వాణ్ణి ఇంకెక్కడ దిగుతాను? మీ ఇంటి అడ్రస్ తెలియక సామాను స్టేషను లోనే క్లోజ్ రూమ్ లో పెట్టి ఇలా వచ్చేశాను. ఇంక ఏం పని మీద వచ్చానంటారా? ఆ సంగతులన్నీ మెల్లిగా మాట్లాడుకుందాం. విశేషమేమంటే , ఇక మీ అంతట మీరు ఎన్నడూ మా ఇంటికి వచ్చేటట్టు లేదని నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను."
"ఎంతమాట, బావగారూ! మీ ఇంటికి రాకపోవటానికి మీరు నాకేం ద్రోహం చేశారని?"
"ఈ ఇరవై సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చారటా?"
"రాలేదు బావగారూ నాదే తప్పు. నిజానికి ఈ ఇరవై సంవత్సరాలలో నేను మన ప్రదేశం వచ్చింది నాలుగు సార్లు మాత్రమె. మొదటిసారి వచ్చినప్పుడు నాకే మనస్కరించక రాలేదు. రెండవసారి వచ్చినప్పుడు మీకు అనవసరంగా బాధ కలిగించిన వాణ్ణి అవుతానేమో నని వెనకాడాను. మూడోసారి విజయవాడ మీదుగా ప్రయాణం చెయ్యటమే కాని అక్కడ దిగలేదు. ఆఫీసు పని మీద వచ్చినందు వల్ల టైము లేకపోయింది. నాలుగో సారి వచ్చినప్పుడు మీ ఇంటికి వెళ్లాను, బావగారూ. మీరు లేరన్నారు. ఎవరూ నన్ను గుర్తించినట్టు లేదు. ఇక వచ్చేశాను."
"అది మా దురదృష్టం . పోనివ్వండి. అయితే మమ్మల్ని మరిచి పోలేదన్న మాట?"
"ఎలా మరిచి పోతాను, బావగారూ! మరిచి పోగలిగిన సంబంధమా మనది? పదండి ముందు, స్టేషను కి వెళ్లి సామాను తీసుకుని ఇంటికి వెళదాం" అని టెలిఫోన్ తీసి ఇంటికి ఫోన్ చేశాడు రాజశేఖర మూర్తి.
"నిర్మలా, నేను రాజుని మాట్లాడుతున్నది. విజయవాడ నించి నారాయణరావు బావగారు వచ్చారు. సామాను స్టేషను లో ఉంచి వచ్చారట. వెళ్లి తీసుకుని ఒక గంటలో వచ్చేస్తాం. కాస్త కాఫీ చేసి, వేడినీళ్ళు పెట్టి ఉంచుతావు కదూ?"
"అలాగే" అన్నది రాజశేఖర మూర్తి భార్య నిర్మల.
దారిలో నారాయణ రావు గారు కుశల ప్రశ్నలు ఆరంభించారు.
"నాన్నగారేలా ఉన్నారు? క్షేమమేనా?"
"లేదండి. పన్నెండు సంవత్సరాలు పక్షపాతం తో తీసుకుని ఈ మధ్యనే పోయారాయన."
"అయ్యయ్యో! నాకు తెలియనే తెలియదు సుమండీ! మాణిక్యమ్మ గారెలా ఉన్నారు?"
"ఆవిడా మంచాన పడింది. ఎనభై ఏళ్ళు దగ్గిర పడుతున్నాయి. ఓపిక లేదు. పైగా ఉబ్బసం."
"పిల్ల లేంతమంది?"
"నలుగురు. ఇద్దరు మగ పిల్లలూ, ఇద్దరాడపిల్లలు."
"మీ పెద్దనాన్న గారి ద్వారా మీ వార్తలు అప్పుడప్పుడు కొంచెం తెలుస్తుంటాయి. ఆరునెలల కిందట ఒక మాటు అయన విజయవాడ వస్తే అయన దగ్గిరే మీ ఆఫీసు అడ్రసు తీసుకున్నాను. అప్పటికి మీ నాన్నగారింకా క్షేమంగానే ఉన్నారను కుంటాను."
"ఈమధ్య నేనండి, మూడు నెలలయింది అయన పోయి."
ఇంతలో స్టేషను చేరారు బావమరుదులిద్దరూ. సామాను తీసుకుని టాక్సీ లో వేసుకుని ఇంటికి బయలు దేరారు. దారిలో మళ్ళీ కుశల ప్రశ్నలు సాగాయి.
"కిందటి సారి మా ఊరు వెళ్ళినప్పుడు విన్నాను మామగారు పోయారని. చాలా విచారించాను. అత్త గారు క్షేమమా?' అన్నాడు రాజశేఖర మూర్తి.
"ఆ కులసాగానే ఉన్నది."
"ఆనంతపురం లోనే ఉంటున్నారా?"
";లేదండీ. ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. మా దగ్గిరే ఉంటూ ఉంటుంది."
"మీ కెంత మంది పిల్లలు?"
"ముగ్గురు మగపిల్లలూ, తరవాత ముగ్గురాడపిల్లలూనూ."
"నేనేరిగినది పెద్ద పిల్లవాడు ఒక్కడే. కేశవరావు గారూ కుటుంబం క్షేమమా?"
"ఆ అయన బందరు లో ఉన్నాడు. ఆయనకీ ఆరుగురు పిల్లలు."
"మాధవరా వెక్కడ?"
"అర్మీలోనే ఉంటున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నలుగురు పిల్లలు. మధుసూదన ప్లీడరు గా ప్రాక్టీసు పెట్టాడు. వాడికీ ముగ్గురు పిల్లలు. మా పిన తండ్రి గారు పోయిన సంగతి మీకు తెలిసే ఉంటుంది."
"విన్నాను. త్రివిక్రముడి కి , వామనుడి కి కూడా పెళ్ళిళ్ళు అయి ఉండాలి."
"ఆ ఆ వాళ్ళూ ఏవో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. త్రివిక్రముడి కి ఇద్దరాడ పిల్లలు. వామనుడి కి ఒక పిల్లవాడు."
"దివాకర రావు ఎక్కడ ఉన్నారిప్పుడు?"
"ఇప్పుడాయన విశాఖ పట్నం మెడికల్ కాలేజీలో ఉంటున్నారు. నాటికీ,నేటికీ ఆయనకు పిల్లలు లేరు. రేవతి భర్త విజయవాడ కాలేజీ లో లెక్చరరు. డానికి ముగ్గురు పిల్లలు."
"బాగుంది, బావగారూ. మిమ్మల్ని అందరినీ మళ్ళీ కళ్ళారా చూసినట్లుంది."
ఇంతలో టాక్సీ ఇల్లు చేరింది. లోపలికి వెళ్ళటం తోనే నిర్మల చెంబుతో నీళ్ళు తీసికొని వచ్చి, "నమస్కారం అన్నయ్యా. కాళ్ళు కడుక్కోండి" అని ఇచ్చి వెళ్ళింది. నారాయణరావు గారికి కళ్ళలో నీరు చిమ్మినట్లయింది."
"పిల్లలేవ్వరూ ఇంట్లో లేరు. సాయంకాలం నాలిగింటికి కాని రారు." అన్నాడు రాజశేఖర మూర్తి.
కాళ్ళు కడుక్కుని కాఫీ తాగిన తరవాత నారాయణ రావు గారు మాణిక్యమ్మ గారి దగ్గిరికి పోయి ఆమె వేసిన కుశల ప్రశ్నలన్నింటి కి జవాబులు చెప్పారు. సాయంకాలం పిల్లలందరూ ఒక్కొక్కరే ఇంటికి వచ్చి తండ్రి ఇంట్లో ఉండడం చూసి ఆశ్చర్య పోయారు. ఒక్కొక్కరినే నారాయణరావు గారికి పరిచయం చేశాడు రాజశేఖర మూర్తి.
"వీడు మా జ్యేష్టుడు , ప్రభాకర్ బి.ఎస్.సి చదువుతున్నాడు. ఇదిగో మా పెద్ద పిల్ల శ్రీలేఖ. ఈ సంవత్సరం హైయర్ సెకండరీ పరీక్ష కి వెడుతుంది. వీడు సుధాకర్. తొమ్మిదో క్లాసు . ఇది ప్రియదర్శిని. ఏడో క్లాసు. పిల్లలూ ఈయన నారాయణరావు మామయ్యా గారు . మిమ్మల్ని అందర్నీ చూసిపోదామని విజయవాడ నించి వచ్చారు.
పిల్లలందరూ ఆయనకు నమస్కారాలు చేశారు అయన మనస్సు సంతోషంతో నిండిపోయింది.
రాత్రి భోజనాలయిన తరవాత నారాయణరావు గారు వచ్చిన పని బయట పెట్టారు.
"బావగారూ, ఇరవై సంవత్సరాల కిందట నేను మిమ్మల్ని ఒక కోరిక కోరాను. ఎంత బతిమాలినా మీరు నా మాట విన్నారు కాదు. నా కోరిక మన్నించారు కారు. మన సంబంధం ఎప్పటి కైనా పునః ప్రతిష్టితం కావాలని ఇన్నాళ్ళూ కలలు కన్నాను. ఈ మాటైనా మీరు నా మాట తీసివేయ్యరనే ఆశతో పదకొండు వందల మైళ్ళు ప్రయాణం చేసి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నా పెద్ద పిల్ల చంద్ర ప్రభ ని మీ పెద్దవాడు ప్రభాకర్ కి చేసుకోవాలి."
నారాయణరావు గారు నెమ్మదిగా హృదయ పూర్వకంగా చేసిన ఆ ప్రతిపాదన రాజశేఖర మూర్తి హృదయం లో కల్లోలమే రేపింది.
"ఇదిగో అమ్మాయి ఫోటో" అని చంద్ర ప్రభ చాయా చిత్రాన్ని రాజశేఖర మూర్తి చేతికి అందించాడు నారాయణరావు గారు. తన కళ్ళను తానె నమ్మలేక పోయాడు రాజశేఖర మూర్తి. ఆ ఫోటోలో ఉన్న ప్రతిరూపం అతని కల్లోలిత హృదయాన్ని మరింత మదించి వేసింది.
"ఇది నిజమా, బావగారూ? యెగతాళి కాదు కదా? ఏమిటీ సారూప్యం? అదే నుదురు, అవే కళ్ళు, అదే ముక్కు, అవే చెంపలు , అవే పెదవులు, అదే మందహాసం.!"
రాజశేఖర మూర్తి మనస్సు కాలగతి లో ఇరవై అయిదు సంవత్సరాలు వెనక్కి పోయింది.
