నన్ను నన్నుగా ప్రేమించు
---కందర్ప విజయలక్ష్మి

అనుకోని విషయం కాకపోయినా అనుకోనంత తొందరగా వచ్చి పడిపోయిన మార్పు చూసుకొని ఆశ్చర్యపడుతూ కిటికీలో కూర్చుంది లీల.
"మూడు రోజు లయిపోయింది' అనుకొంది. "రోజు లేమిటీ ... మూడు రాత్రి ళ్ళయిపోతేనూ" అన్నది మధ్యాహ్నం భోజనాల దగ్గర ఆడపడుచు వేళాకోళం చేస్తూ.
కిటికీ కున్న గాజు తలుపుల అద్దంలో తను తనక్కనిపిస్తున్నాది. తనే అందులో తన క్కనిపిస్తున్నా, తనలో లేనితనా లేవో తనలోంచి తవ్వి తనకే తనివితీరా చూపిస్తూంది అద్దం.
పొడుగ్గా వేలాడుతున్న జడ ముందుకి లాక్కుంది లీల. చేత్తో ఇలా రాసి చూసుకొంది. ఇందులో ఏవో ముద్రలేయని మూగ స్పర్శలు ముద్దు ముద్దుగా పలకరిస్తున్నాయి.
ప్రభాకరం ఈ జుట్టుని స్పృశిస్తూ గ్రీసుదేశపు జానపద కథ చెప్పాడు...... ఓ రాజకుమార్తెకి అందమైన సువర్ణ వేణీభరం ఉందట. సప్త ద్వీపాల రాజకుమారుడు సరదాగా సముద్రపు ఒడ్డుకి షికారుకి వెళ్ళి కెరటాలు కొట్టి తెచ్చిన సువర్ణ కేశం చూసి ఈ స్వర్ణకేశ సుందరి తన కెందుకు లభ్యం కాదని తొందరపడ్డాట్ట....
ప్రభాకరం ప్రేమలో పౌరాణికం, జానపదం ధ్వనించే ఆదర్శం, ఆవేశం ఉన్నాయి. రాజకుమార్తెవి నువ్వే నన్నాడు.....సిగ్గేస్తుంది. గర్వం వస్తుంది. ఒళ్లంతా అరక్షణంలో ముడుచుకుపోయి మరుసటి అరక్షణంలో నిటారుగా అయిపోతుంది. ఒక జుట్టుకేనా? ప్రతి అవయవానికీ ఆరాధన పంచిపెట్టి భాష్యం చెబుతాడు.
పచ్చని ఆ బుగ్గమీద నల్లని ఈ అగరు చుక్క ..... తన కెప్పుడైనా ఉండేదా? పెద్ధనాన్న గారి శ్యామల పెళ్ళిలో తోడు పెళ్ళికూతురు వేషం వేయించిన నాడు పెట్టారు ఇలాటి చుక్క. అద్దంలో చూసుకొని, 'నా కొద్ధర్రా ఈ వేషం' అంటే - 'ఈ వేషం దీనికి వెయ్యకండర్రా. ఈ కుందనబ్బొమ్మని చూసేడంటే ఆ పెళ్ళికొడుకు ఆ చందనబ్బొమ్మ నా కక్కర్లే దంటాడో ఏమిటోనూ!' అని ముసిలి ముత్తైదువులు ముసిముసి నవ్వులు విసిరి తనని పొంగవేశారు.

ఈ మూడు రోజుల్లో అనంతమైన, శాశ్వత మైన మార్పులు వచ్చేస్తున్నాయి....
సన్నంగా తీగలా అతి నాజూగ్గా, అది నాజూకా నీరసమా అన్నంత సుకుమారంగా ఉంది లీల, వచ్చే ఆలోచనలు వేటిమీదా తన కధికారం లేకపోవడం గమనించి ఆశ్చర్యపడుతూంది. కిటికీలోంచి సంధ్య కాంతి ప్రసరించి ఆమె కళ్ళను మిలమిలలాడిస్తూంది. క్షణాకికోసారి ఆ వెలుతురికి తట్టుకోలేక కిందికి చూస్తూంది లీల. అలా చూసుకోవడంలో ఓ ముహూర్తంలో పైటలో నిగనిగలాడుతున్న మాంగల్యం వేపు చూసుకొంది. ఈ నిగనిగలూ, ఈ తళతళలూ నిమిష నిమిషానికీ శాశ్వతమైన ఆకర్షణ పెంచుతూ జీవితానికి అర్ధం కల్పిస్తాయేమో!
"లీలా!"
ఎవరో, ఎక్కడో అస్పష్టంగా పిలుస్తున్నట్టున్న ధ్వని క్రమంగా జయప్రద పిలుపుగా స్వరమూ, రూపమూ సంతరించుకొని దగ్గరి కొచ్చింది.
ఆలోచనల దొంతర్లు చెదిరిపోయాయి.
"ఇక్కడేం చేస్తున్నావు, లిలా! నీకోసం ఇల్లూ వాకిలీ గాలించాను.... నాదే పొరపాటులే. నువ్విక్కడ-ఈ గదిలోనే ఉంటావని ముందుగానే ఊహించి ఉండవలసింది!"
లీల నవ్వుకొని 'దొరికిపోయాన్లే' అన్నట్టు ముఖం పెట్టింది. ముగ్ధహాసంతో ఆ నవ్వు ప్రసన్నమైంది.
వీపుమీద చిన్న దెబ్బ వేసింది జయప్రద. "ఏమిటే, తల్లీ, ఇక్కడ ఇలా కలలు కంటున్నావు?"
కలలేమి టన్నట్టు కనుబొమలు విశాలం చూసింది లీల.
"మాట్లాడవేమే, చుక్కా?" బుగ్గమీద చుక్కమీద పొడిచింది జయప్రద. "నేను రాత్రి బండికి వెళ్ళిపోతాలే. నీతో చెబుదామని అరగంట నుంచీ వెతుక్కుంటూ తిరుగుతున్నాను. నీ దర్శనమే కాలేదు. పొద్దుగూకితే ఎలాగూ కనబడవు. అందుచేత వెలుతురు ఉండగానే ..."
"అదేమిటి - అప్పుడే వెళ్ళిపోవాలా?"
"అప్పుడే ఏమిటి - ఎప్పుడో వెళ్ళిపోవలసింది. అయినా ఇప్పు డీ పళంగా వెళ్ళిపోననుకో" అని తిప్పు కొంటూ అన్నది జయప్రద, అందులో లీలపైన ఏదో హేళన ఇమిడ్చి.
"అబ్బ.....వెళ్ళచ్చులేవే."
"నీకేం-హాయిగా కూర్చుని బంగారు కలలు కంటూ ఎన్నైనా చెబుతావు. నాకోసం అవతల పేషెంట్సు పడిగాపులు పడి కూర్చుంటారు. అందులో ఆ ఇరవై నాలుగో నంబరు బెడ్ మీద ఆ జూనియర్ రచయిత ఉన్నాడే - పాపం! అతను నా కోసం చేరేడు నర్సింగ్ హోమ్ లో నేను కనిపించకపోతే అత నేమైపోతాడో!"
"ఏమీ అయిపోడు. ఏ నర్సో జాగ్రత్తగా చూస్తుందిలే."
"ఆఁ సరిగా అదే మరి నా బెంగానూ! అందుచేత చూశావూ, నే నీ రాత్రి బండికి వెళ్ళాలి, తల్లీ!"
"ఆఁ ఏం ఫరవాలేదు లెద్దూ. బావగారు చూసు కుంటార్లే - ఇరవై నాలుగో బెడ్ అబ్బాయి సంగతీ, పదిహేడో బెడ్ మీది అమ్మాయి సంగతీను" అని హాస్యం చేసిన లీల క్షణంలో ముఖం మార్చుకొని, "అది కాదే. నువ్వింకో రెండు రోజు లుండాలి. అంతేనే. వాళ్ళ గురువు గారి దగ్గరికి తీసుకెళతారుటే నన్నూ! ఆయన గారి మాటల ధోరణీ అదీ చూస్తే నా కేమిటో - కోసం కాదు గానీ - అదేమిటో ఇబ్బందిగా ఉందే. నువ్వూ ఆ ఊరొస్తే బావుండును-నా కింకా కొత్త తీరలేదే." ప్రాధేయపడుతున్నట్టు అడిగింది లీల.
"పిచ్చిపిల్లా! ఈ కొత్త నాలాంటివాళ్ళెన్నాళ్ళున్నా తీరేది కాదే, తల్లీ. పైగా ఏదో రహస్యం చెబుతున్నట్టు - "మే మందరం ఎవరి దారిని వారు వెళ్ళి పోతేనే -" అన్నది జయప్రద.
"ఊరుకొందూ నీ సరసాలూ, నువ్వూనూ! రెండు రోజులుండి వెళ్ళవే, తల్లీ, అంటేను! తెల్లారేసరికి ఆ గురువుగారి ఊరికి ప్రయాణంట. ఆయనెవరో - అక్కడింక ఎవరుంటారో -బెంగెట్టుకు చస్తున్నా న్నేను."
"ఓస్ ఇంతేనా! మరేం ఫర్వాలేదులే! గురువుగారంటే. మీ వారికీ దేశభక్తీ, గురుభక్తీ, శిశు శిక్షణా - ఇలాంటి అమూల్య గుణాలు నేర్పిన మహనీయులు. అక్కడ మరెవ్వరూ ఉండరు. మీవారి గురుపత్ని, భూములు, పాలేర్లు, గుమాస్తా, మునసబు, కరణం, గేదెలు, పెంపుడు కుక్క ...... ఇలాంటివన్నీ ఉంటాయి. అక్కడి జనం అంతా నీ సౌందర్యానికీ, సౌశీల్యానికీ నివాళులు పట్టి కీర్తించి పంపిస్తారు. భయపడకు."
"నువ్వుకూడా ఆ ఊరు రావే, బాబూ!"
"ఇంక నీతో మాట్లాడుతూ ఎంతసేపు కూర్చొన్నా ఇంతేగానీ..." జయప్రద ఆమె భుజం మీద చెయ్యి వేసి మంచందాకా నడిపించుకు వెళ్ళింది. మంచం మీద లీల కూర్చోగానే, "వెళతానే, అమ్మాయీ, నేను వెళ్ళి తీరాలి" అంది.
లీల ఆమెవైపు ఖాళీగా చూసిందంతే.
"లీలా ..." ఏదో ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టింది జయప్రద. "నీ పెళ్ళి జరగడం నా కెంతో సంతోషంగా ఉంది. మీ ఆయన చదువుకున్న వారు; సంస్కారం, ఇమాజినేషన్ ఉన్నవారు. ముఖ్యంగా ఇంత ఉండి మరింత సంపాదించుకుంటున్న వారూ కావడం నా కెంతో ఆనందంగా ఉంది. సాధారణంగా నేను పెళ్ళిళ్ళకీ వాట్లకీ వెళ్ళలేను కదా. నీ విషయంలో బద్దకించకుండా రాగలిగినందుకు కూడా నా కెంతో కులాసాగా ఉంది. మనిద్దరం ఎంతో దగ్గరగా తిరిగిన స్నేహితురాళ్ళం. అయినా ..."
"ఏమిటే ఈ స్పీచంతాను?"
"ఆఁ. ఆఁ ... అదే వట్టి స్పీచిచ్చి ఏమీ బహుమతి ఇవ్వకుండా వెళ్ళుతున్నానని నువ్వంటావని తెలుసులే." హఠాత్తుగా చిలిపితనం తెచ్చుకు నవ్వింది జయప్రద. "అందరిలాగా కల్యాణ మంటపంలో ఇచ్చే బహుమతి కాదు నే తెచ్చింది. అందుచేత దాచాను .... దానికేం గాని - నేను నీతో ఏది కావాలంటే అది మాట్లాడవచ్చా?"
"అంటే?"
"నేనేం మాట్లాడినా నువ్వేమీ అనుకోనని మాటి స్తావా?"
"బాగానే ఉంది. నువ్వు నాతో మాట్లాడడం నేనేదో అనుకోవడం - పైగా మాతివ్వడం ఒకటీ...."
"సరే, అలా తోటలోకి వెళదాం, రా మరి."
"అబ్బా - చెప్పే దేదో ఇక్కడే చెబుదూ! నే నిప్పుడు తోటలోకీ, దొడ్డిలోకీ రాలేను. కనబడ్డ వాళ్ళంతా పలకరిస్తూ బోరు కొడతారు" అని మంచం మీద కూర్చున్నదల్లా దిండు మీదికి వాలిపోయింది లీల. "ఇక్కడేం బావులేదా ఏమిటి?"
"ఇక్కడ బావుందీ!" జయప్రద ఎగతాళిగా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంది.
"అయితే విద్య తల కెక్కినట్టే."
"అబ్బ-ఏమిటే నీ మాటలూ నువ్వూ! మరీ గిడసదేరిందానిలా." హఠాత్తుగా లేచి కూర్చుంది లీల. "పద. ఆ చెప్పే దేదో అక్కడే చెబుదువుగాని. ఇక్కడ ఇలా నీ ఎత్తిపొడుపు మాటలు వింటూ కూర్చునేకంటే వాళ్ళ పలకరింపులే నయం."
తోటలో అడుగు పెట్టేరు.
పూలమొక్కలు వారికి స్వాగతం చెప్పాయి. చల్లగాలికీ, నీరెండకీ పులకరింపో, లేక అందమైన అమ్మాయిలు తమ మధ్యకి వస్తున్నారన్న ఆనందమో తెలియదు కాని మంచి విద్వాంసుడి సంగీతానికి ఇంకో విద్వాంసుడి సంగీతంలా తలలూపేయి.
అనుకోకుండా ఇద్దరూ గోడ దగ్గర మూలనున్న రాతి బెంచీ దగ్గరి కెళ్ళారు. అక్కడ జయప్రద హుందాగా కూర్చోబోతూ ఉంటే - "అబ్బా, అక్కడొద్దే, అది పగలల్లా వేడెక్కి ఉంటుంది" అని లీల ముందుగా కింద చతికిలబడింది. జయప్రద తప్పనిసరిగా లీల దగ్గరి కొచ్చింది.
"ఏమి సుకుమారమే!"
"అవును, సుకుమారమే మరేమిటో ఉపన్యాసం చెప్పు."
జయప్రద చిరునవ్వుతో లీలవైపు చూసింది..... అవును.....సుకుమారమే .....నిశితదృష్టితో చూస్తేనే కందిపోతుందా అన్నట్టుంది. ఎందుకిలాంటి ప్రాణుల్ని సృష్టిస్తాడో సృష్టి కర్త! మనిషి చేసుకొంటున్నాడు కదా రకరకాల గాజుబొమ్మలు, పింగాణీ, దంతపుబొమ్మలు- అవన్నీ అపురూపంగా అందాల అద్దాల బీరువాల్లో అతి జాగ్రత్తగా దాచుకొంటాడుగా ..... ఈ సజీవ ప్రతిమను ఏ హృదయపేటిక నిక్షిప్తం చేసుకొని భరించ గలదు! .... ప్రేమించిన వస్తువును పొందటమే ప్రయోజకత్వంగా భావించే ఈ ప్రతిభామయ ప్రపంచంలో ఇలాంటి చిత్ర శిల్పాన్ని దాచెయ్యాలంటేమాత్రం ఏ సౌందర్యలోభికి చేతనవుతుంది!?
"ఏమిటే, బాబూ, ఆ చూపు?"
"ఏం లేదే. నిన్నే చూస్తున్నాను. ఎంత అదృష్ట వంతుడే మీ ఆయన!"
"పాపం! ... అయితే?"
"అయితే ఏముంది? ఈ అదృష్టాన్ని కలకాలం నిలబెట్టుకో గలిగితే ఆయన గొప్ప తెలివైనవారు కూడా అవుతారు."
"నిలబెట్టుకోవడమా?"
"చెపుతా, చెపుతా .... ఏదీ, నీ చెయ్యి ఇలా ఇయ్యి." డాక్టర్లా కాకుండా జ్యోతిషం చెప్పేదానిలాగ జయప్రద లీల చేతిని చూడ్డానికి అరచేతిని విప్పింది. లీల చప్పున పిడికిలి బిగిస్తూ, "అదా! పొద్దున్న ద్వారం మీద చెయ్యేసి త్వరగా వెళుతూ ఉంటే చెక్క పేడు దిగింది లేవే. దీనికి నువ్వేమీ మందులు రాయక్కర్లేదు" అంది.
