నిష్టూర ప్రేమ
----ఛాయా

"నువ్వేం చీర కట్టుకుంటావు మరి?" మంజుల ప్రశ్నించింది.
"అదేవిటి, ఎక్కడికీ పైకి పోవటం లేదుగా మనం?"
కనుబొమలు పైకెత్తి అడిగింది ఇందిర. కాలేజీ నించి పది నిమిషాల క్రితమే వచ్చిన ఇందిర ముఖం లో అలసట బాగా కనిపిస్తుంది.

"ఉహూ కానీ పెద్ద మనుషులు భోజనానికి వస్తున్నారు గదా" నవ్వింది మంజుల.
"పెళ్లి చూపులు కావుగా" పొడిగా అంది ఇందిర.
"ఏమో ఎవరికి తెలుసు?" తల తిప్పి నవ్వుకుంది అని మంజుల, చిలిపిగా.
"సరే, నువ్వు ణా వల్ల సిగ్గు పడక్కర లేకుండా ముస్తాబు చేసుకుంటాను కానీ, ఇంతటితో నన్ను వదులు బాబూ" ఇందిర అభ్యర్ధించింది.
"నీకు బొత్తిగా అలంకరణ మీద మోజు లేదు" అని నాజూగ్గా విసుక్కుని మంజుల వెళ్ళిపోయింది.
ఇందిర డిల్లీ వచ్చి అప్పటికి పదిహేను రోజులయింది. ఇంద్రప్రస్ట్ కాలేజీ లో ఉద్యోగం దొరికిందామెకు. ఆమె మేనత్త , మేనమామలు ఆ ఊళ్ళో నే ఉన్నందున ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె రావడానికి అభ్యంతర పెట్టలేదు. పుట్టినప్పటి నుండి చదువు పూర్తీ అయ్యేదాకా వాల్తేరు లోనే గడిపింది ఇందిరా జీవితమంతా. అందుకే అక్కణ్ణించి బయట పడి, ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేయాలని చాలా ఉబలాట పడింది. కూతురి కోర్కె తీర్చడానికి సంసిడ్డులయ్యారు, ఆమె తల్లిదండ్రులు ఆమెను వదిలి పెట్టడం ఇష్టం లేకపోయినా కూడా , ముగ్గురు కూతుళ్ళు మాత్రమే వాళ్ళ సంతానం. ఇద్దరు పెద్ద ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపెశాక , ఆఖరి కూతుర్ని దగ్గిర ఉంచుకుని ఇంతకాలం కాలక్షేపం చేశారు కృష్ణ మూర్తి దంపతులు.
కృష్ణమూర్తి గారి లాగే ఆయన చెల్లెలికి కూడా మగపిల్లలు లేరు. పుట్టిన ఇద్దరాడపిల్లల్లో, పెద్ద పిల్లల్ల నాలుగేళ్ళు బతికి పోయింది. అందుకే మంజుల అంటే గోపాలరావు గారికీ, సుందరమ్మ కు పంచ ప్రాణాలు. ఆనర్స్ చదువుతున్న మంజుల , పంజాబీ పిల్లల చురుకుదనం పుణికి పుచ్చుకుంది. వయస్సులో ఏడాది మాత్రమె చిన్నది అయినా, మంజుల ఇందిర కంటేబాగా చిన్నదానిలా కనిపిస్తుంది. దానికి కారణం ఆమె చిన్నతనపు చేష్టలే నెమో! ఇందిర సరదా మనిషే కానీ, సంకోచం లేకుండా తెగవాగే మంజుల ముందు, అతి నెమ్మదస్తురాలుగా కనిపిస్తుంది.
చాకలి తెచ్చిన చీర కట్టుకుని, ముడి విప్పి జడ వేసుకుని హల్లో కి వచ్చి కూర్చుంది ఇందిర, చేతిలో పుస్తకం తో సహా. మరునాడు క్లాసులో చెప్పవలిసిన పాఠం తయారు చేసుకుంటున్న ఇందిర, మంజుల వచ్చి, "ఎలా ఉన్నాను?" అని అడిగేదాకా ఈ ప్రపంచంలో లేదు.
"మనోహరంగా ఉన్నావు" మంజుల వంక చూస్తూ ఇందిర జవాబిచ్చింది. ఆకుపచ్చ జరీ అంచున్న గులాబీ రంగు చీర పైన, అదే రంగు జాకెట్టు లో పువ్వులా అందంగా ఉంది మంజుల. తల్లీ కూతుళ్ళ హడావుడి చూస్తున్న కొద్ది ఇందిరకు ఆగంతుకుల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువవుతుంది. మంజుల చెప్పిన ప్రకారం మాధవరావనే ఆంధ్రుడు, వాసన్ అనబడే అరవాయనా ఇద్దరూ దగ్గిర స్నేహితులట. ఆ కుటుంబానికి భోజనానికి వస్తున్నారు. ఇద్దరూ పెద్ద ఉద్యోగస్తులూ బ్రహ్మచారులూ అవడం ఒక ఆకర్షణ అయి ఉంటుందని ఇందిర మనస్సులోనే అనుకుంది.
"ఆ పుస్తకం అవతల పెడుతూ కాసేపు" అంటూ ఇందిర చేతిలోని పుస్తకాల్ని లాక్కుని అలమారులో పడేసింది మంజుల. ఇంతలోనే కాలింగ్ బెల్ గణగణ మంది. క్షణం సేపు కదలకుండా నుంచుని ఒక్క పరుగు తీసింది మంజుల తలుపు దగ్గిరికి. అలాగే కూర్చున్న ఇందిరకు "రండి రండ"ని ఆహ్వానిస్తున్న మంజుల గొంతూ, "ఇంట్లో ఉన్నారా" అని హిందీ లో ప్రశ్నిస్తున్న మగ గొంతూ వినబడ్డాయి. రెండు నిమిషాల్లో ఒక యువకుడూ, ఒక యువతీ -- పాతికేళ్ళు ఉంటాయామెకి-- వచ్చారు మంజులతో.
విజయ్ బాత్రానూ, అతని భార్య సుమన్ నీ ఇందిరకు పరిచయం చేసి, తల్లిని పిలవడానికి మంజుల లోపలికి వెళ్ళింది. పొడుగ్గా, హుందాగా ఉన్న సుమన్ అత్యంతాధునికంగా అలంకరించుకుంది. మనిషి మాటలో కూడా అలవర్చుకున్న సభ్యత ఉట్టి పడుతుంది. సుందరమ్మ గారురాగానే దంపతులిద్దరూ హిందీ లో ఆమెను పరామర్శించారు. మంజులా సుమన్ లు ఒక సోఫాలో చేరి, ఒకటే మాట్లాడుకుంటున్నారు. అతనూ, సుందరమ్మ గారూ ధరలను గురించి చర్చ సాగిస్తున్నారు. ఇందిర ఇటూ అటూ వింటూ కూర్చుంది.
మళ్ళీ కాలింగ్ బెల్ మోగగానే , ఉలిక్కిపడి లేచింది మంజుల. మరుక్షణం లో తండ్రి వెనకాలే నడిచి వస్తున్న మంజుల ముఖంలో చిరాకు లీలగా కనిపించింది. మనసులో చిన్నగా నవ్వుకుంది ఇందిర. అతిదులిద్దరూ గోపాలరావు గారిని పలకరించారు. బాత్రాతో అయన ఉత్సాహంగా సంభాషణ లో పడ్డారు. సుందరమ్మ గారు మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది.
ఈసారి కాలింగ్ బెల్ మోగినప్పుడు మాత్రం మంజుల లేవలేదు. సుమన్, మంజులా ఎవరో షీలా అన్న పిల్ల ఈ మధ్య పొందిన అవమానాన్ని గురించి ముచ్చటించు కుంటున్నారు. "ఇందూ, తలుపు చూడమ్మా" అని గోపాలరావు గారనగానే లేచి వెళ్ళింది ఇందిర. తలుపు తియ్యగానే ఇద్దరు యువకులు కనబడ్డారు "లోపలికి రావచ్చా" అంటూ. "తప్పకుండా " అంది ఇందిరా నవ్వుతూ.
"రావు గారు ఇంట్లో ఉన్నారా?" అని అడిగాడోకతను ఇందిర వెనకాల నడుస్తూ.
"ఉన్నారు , రండి" అని హాల్లోకి దారి తీసింది ఇందిర. మంజుల ముఖం చూడగానే వచ్చిన వాళ్ళెవరో బాగా అర్ధమయింది ఇందిరకు.
"హల్లో, రండి, రండి" అంటూ పలకరించింది మంజుల హడావిడిగా.
బాత్రాలకు, వీళ్ళ కూ కూడా పూర్వ పరిచయం ఉంది కాబోలు , వెంటనే మాటలో పడిపోయారందరూ. అందరిలోనూ ఇందిర మౌనంగా కూర్చుని వచ్చిన వాళ్ళను పరిశీలనగా చూడడం మొదలు పెట్టింది. మాధవరావన బడే అయన పొడుగ్గా, ఠీవిగా ఉన్నాడు. "శరత్ బాబు బలిష్ట సుందర యువకుడితనే' అనుకుందామే. వాసన్ మాట మాత్రం అరవయాసతో గుబాళిస్తుంది. ఇంతలో గోపాలరావు గారికి ఇందిర ఉనికి గుర్తు వచ్చింది. "ఈ అమ్మాయి నా మేనగోడలోయ్. పేరు ఇందిర" అన్నాడాయన మాధవరావుతో. మంజుల తో మాట్లాడుతున్న అతను, తల పైకెత్తి చిరునవ్వు నవ్వి, "ఎప్పుడు వచ్చారీ ఊరు?' అని అడిగాడు. మర్యాదకని అడిగినదే కాని, సమాధానం ఆశించి అడిగిన ప్రశ్న కాదని వెంటనే గ్రహించింది ఇందిర. అందుకనే "ఈ మధ్యనే" అంటూ చప్పున లేచి వెళ్ళిపోయింది. పది నిమిషాల తరవాత సుందరమ్మ గారితో మళ్ళీ హాల్లోకి వచ్చింది ఇందిర. బాత్రాలు వెళ్ళిపోడానికి లేచారు. వాళ్ళని సాగనంపడానికి గోపాలరావు గారూ, మంజులా వెళ్ళారు వరండా లోకి. సుందరమ్మ గారు ఏంతో ఆప్యాయంగా ఆ ఇద్దరి తోనూ మాట్లాడుతున్నారు. పుస్తకాల అలమారు దగ్గిరికి వెళ్లి, తన పుస్తకం తీసుకుని , ఒక కుర్చీలో కూర్చుంది ఇందిర. భోజనాల వేళయ్యే దాకా అందరూ దాదాపు ఇందిర ఉనికినే మరిచి పోయారు. వాళ్ళ మాటలను బట్టి ఇందిర కర్ధమయిందేమీటంటే , అప్పుడే మాధవరావు బెజవాడ వెళ్లి తిరిగి వచ్చారు. అక్కడి ఎండలను గురించి, రాజకీయాలను గురించి అంతో మాట్లాడుతున్నారు. "మాధవరా"నన్న పేరు ఏవో జ్ఞాపకాలను వెతుకుతుంది ఇందిర మస్తిష్కం లో . "ఎవరితను?' అని తీవ్రంగా ఆలోచిస్తున్న ఆమె చటుక్కున ఉలిక్కి పడింది . "ఇతనా?' అని అతని వంక తేరిపారా చూసింది. ఆ చూపులో ఇదామిత్దమని చెప్పలేని భారముంది. 'అక్కని తిరస్కరించిన మహానుభావుడి తనే కాబోలు' అని కూడా అనుకుంది. అసలు కదేమిటంటే, ఇందిర కు అందమైన ,మ నెమ్మదైన అక్క ఉంది. ఆమె పేరు నిరుపమ. ఏడాది క్రితం పెళ్లి చూపులకు హైదరాబాదు వెళ్ళాడు మాధవరావు. పిల్ల నచ్చకపోతే నచ్చలేదంటే సరిపోయేది . అలా కాకుండా నిరుపమను గురించి చాలా తేలికగా అసభ్యంగా మాట్లాడాడట మధ్యవర్తి తో. అది విని నిరుపమ కించపడి, అప్పుడు విశాఖ పట్నం లో చదువుకుంటున్న ఇందిరకు రాసింది, ఆడవాళ్ళు అబలలనీ, పురుషులంతా పైశాచిక ప్రకృతి కల వాళ్ళే నని గట్టిగా నమ్మిన ఇందిరకు చెప్పలేని కోపం వచ్చింది. ఆ పురుష పుంగవుడిమీద. ఎప్పుడన్నా జీవితంలో తారస పడితే తగినట్ల్జు బుద్ది చెప్పాలని తీర్మానించు కుంది. తరవాత 8 నెలలకే నిరుపమ కు ఇంకో సంబంధం కుదరటమూ, పెళ్ళయ్యాక భర్తతో కలకత్తా వెళ్లి పోవటమూ కూడా జరిగాయి. అయినా తన అక్క ను అవమానించిన అపరిచిత పురుష సింహాన్ని ఆమె పూర్తిగా మరిచిపోలేదు.
విన్నదాని కంటే ఆకర్షణీయంగా కనబడుతున్న మాధవరావు ని ఏదో విధంగా గాయపరచాలన్న కోర్కె ఉద్ద్రుతమైంది ఇందిరలో. అందుకే భోజనాల దగ్గిర అతను ఇందిరను పలకరించ బోతే నిర్లక్ష్యంగా నవ్వి తల తిప్పెసుకుంది. అతనదేం గమనించకుండా తేలిగ్గా "మీకు మౌనమే ఇష్టంలా ఉంది" అన్నాడు.
