Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 1

                                    ఆంతస్తులూ అంతఃకరణలూ

                                                                                వాచస్పతి

                    

 

హల్లో మేర్క్యూరేలైట్లు పాల వన్నేలలాంటి కాంతిని వెదజల్లుతున్నాయి.
    రేడియో గ్రాం నుండి మృదుమధురమైన లలిత సంగీతం కలిసి పరవశంతో నాట్యం చేస్తున్నట్టుంది.
    అతిధులంతా కొన్ని జట్లుగా ఏర్పడి అతి మెల్లగా మాట్లాడుకుంటున్నారు.
    గాజు కిటికిల్లో నుండి బయట తోటలో జరుగుతున్న హంగామా అంతా బాగా కనిపిస్తుంది.
    పున్నమి నాటి వెన్నెల్లో తోటలోని చెట్లన్నీ కొత్త కొత్త రంగుల్లో తళతళలాడుతున్నాయి.
    నైట్ క్వీన్, విరజాజి, మల్లె, విరజిమ్ముతున్న సౌరభం తోటంతా అజమాయిషీ చేసి ఇంటిలోపలికి ప్రవేశించి ఓ విధమైన మత్తును కలిస్తుంది.
    తోటలో వరసగా కుర్చీలూ, బల్లలూ వేసి ఉన్నాయి. పనివాళ్ళు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నారు.
    హాలు నానుకుని ఉన్న పెద్ద గదిలో ఆడవాళ్లు కూర్చోనున్నారు. అంతా కలిసి ఓ పది మంది కన్నా ఎక్కువ లేరు. పదిమంది పది రకాలుగా ఉన్నారు.
    "ఇదో! సుధీరా!"
    హల్లో నుండి వెళ్ళుతున్న సుధీరను కేకేసింది ఒకామె.
    సుధీర గది లోపలికి వచ్చింది.
    "ఇంకా ఎంతసేపు పడుతుంది? అయన త్వరగా కారు తీసుకురమ్మన్నారు. ఇప్పటికే ఎనిమిదిన్నర కావస్తుంది....." రాళ్ళు పొదిగిన బంగారు గొలుసు రిస్టు వాచీ వైపు చూస్తూ అంది ఆమె.
    "ఓ అరగంటలో అయిపోతుంది"
    "ఇంతకూ ఏమిటి ఆలస్యం? భోజనాలు పెట్టేస్తే వెళ్ళిపోతాంగా? ఐదింటికనంగా వచ్చినవాళ్ళం. " జరీ నైలాన్ చీరలో తళతళ లాడిపోతూ అంది మరోకావిడ.
    "నాన్నగారింకా రాలేదు. బస్సేదో యాక్సిడెంట్ అయిందని ఫోనొస్తే వెళ్ళారు. పది నిమిషాల్లో రాకుంటే అన్ని ఏర్పాట్లు తనే చేస్తానంది అమ్మ. అరగంటకు మీరు తప్పకుండా వెళ్ళవచ్చు.' నవ్వుతూ అంది సుధీర.
    విషయామిటో తెలుసుకుందామని సుధీర చుట్టూ చేరిన వాళ్ళంతా తిరిగి యధాస్తానాల్లో కూర్చున్నారు. సుధీర మేడ మెట్ల వైపు నడుస్తూ కిటికీ మీద పెట్టి ఉన్న పూల కుండీల వైపు పరీక్షగా చూస్తూ నిల్చోనున్న భానుమూర్తి వైపు చూసి దగ్గరగా వెళ్ళింది.
    "ఇక్కడ నిల్చున్నావేం?"
    పరధ్యానం లో ఉన్న భానుమూర్తి ఉలిక్కిపడి తలెత్తి సుధీర ముఖంలోకి చూశాడు-- అయోమయంగా.
    "కొత్తవాడిలా అంత గాభరా పడతావేమిటి? ఐదు గంటలకే రమ్మని అంతగా చెప్పినా ప్రయోజనం లేకపోయిందన్న మాట! ఇప్పుడు గంట ఎంతయిందో తెలుసా?' తెచ్చి పెట్టుకున్న కోపంతో అంది.
    "ఏం చెయ్యను? ఈరోజు కాంపు వెళుతున్నాని చెప్పానా? ఒక్క బస్సూ అందలేదు. నానా అవస్థలూ పడి వచ్చాను?" హల్లో ఉన్న అతిదులందరి వైపు కలయజూస్తూ అన్నాడు.
    "పోనీ , ఆలస్యంగానే వచ్చాననుకో..... ఇక్కడ నిల్చోడమేమిటి?"
    "విజయ ప్రభదేవిగారేక్కడున్నారో తెలీక!" నవ్వుతూ అన్నాడు.
        "అంత పెద్ద పేరే! అక్కయ్య రెండు సార్లంది -- నవ్వింకా రాలేదేమని?"
    "అలాగా! పద మరి."
    "మీనాక్షి రాలేదు కదూ?"
    "ఊహు.... రానంది."
    "ఇద్దరూ మెట్లెక్కి పైకి వెళ్ళారు.
    సిల్కు కర్టెను తొలగించి సుధీర గది లోపలికి అడుగు పెట్టింది.
    భానుమూర్తి సందేహిస్తూ గది బయట నిల్చున్నాడు.
    "ఏవిటి బావా! లోపలికి రాను మరో ప్రత్యేకాహ్వానం కావాలా ఏమిటి?"-- కర్టెను పూర్తిగా తొలగించి భానుమూర్తి ముఖంలోకి చిరుకోపంతో చూస్తూ అంది సుధీర.
    భానుమూర్తి నేరుగా చూశాడు. ఈజీ చెయిర్లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంది విజయ.
    "హల్లో! భానూ! కులాసానా?" - అంది సన్నగా నవ్వుతూ.    
    "మన  విజయే! కూర్చో! అలా చూస్తావేమిటి?" గలగలా నవ్వి అంది సుధీర'.
    భానుమూర్తి సిగ్గుతో కుంచించుకు పోయాడు.
    ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు.
    'చేతిలో పాకేట్టేమిటి?"
    "చిన్న కానుక." పాకెట్ విప్పుతూ అన్నాడు.
    సుధీరా, విజయా కుతూహలంగా చూశారు.
    భానుమూర్తి కాగితం మడతల్లో నుండి ఓ పుస్తకం తీసి విజయ కందించాడు.
    చెయ్యి చాపి పుస్తకం తీసుకుంటూ భానుమూర్తి ముఖంలోకి చూసింది విజయ.
    "ఈ శుభసమయంలో ఏం చెప్పాలో తోచటం లేదు. కానీ నా మనస్సులోని రెండు మాటలూ పుస్తకం లోనే రాశాను" అన్నాడు భానుమూర్తి.
    విజయ ఆత్రంగా పుస్తకం మొదటి పేజీ పేజీ లోకి చూసింది. ఒక్క నిమిషంలో అందులో వ్రాసి ఉన్న నాలుగు మాటలూ పదిసార్లు చదువుకుంది.
    "చిరంజీవి సౌభాగ్యవతి విజయ ప్రభాదేవికి -- శుభాశీస్సులతో -- శుభాకాంక్షలతో --

                                                                                                           భానుమూర్తి'
    "థాంక్యూ!"
    "నోమెన్ షన్."
    పుస్తకం మూస్తూ నిట్టూర్చింది విజయ -- తేలిగ్గా, ఎదుటి వాళ్ళకు వినబడనంత మెల్లగా. ఆ మరుక్షణం లోనే నవ్వింది -- హాయిగా తియ్యగా వెన్నెల కురిసినట్లు.
    "ఏం పుస్తకం ?' పుస్తకం కోసం చెయ్యి చాపుతూ అడిగింది సుధీర'.
    "వైతాళికలు."
    "వైతాళికులా!"
    "అంత ఆశ్చర్యమెందుకు సుధీ?"
    "ఫారిన్ నుండి తిరిగి వచ్చిన డాక్టరు కు కవిత్వంలో పనేమిటి? సెలక్షన్ ఏం బాగాలేదు. బావా!"
    "ఏం? ఎందుకు బాగలేదు? డాక్టరయినంత మాత్రాన కవిత్వం చదువుకోరాదా? మెదడూ, హృదయమూ సమగ్రంగా , సమానంగా వికాసం చెందిన రోజే పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలుగుతుంది."
    "కాదనను. కానీ , పాపం! వాళ్ళకు తీరికేక్కడిది? ఏదన్నా కావ్యం లేక వైతాళికులు తెచ్చావెం?'
    విజయ లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి కర్టెను తొలగించి వీధిలోకి చూస్తూ నిల్చుంది.
    "నవీన కవితాలోకంలో విహరిస్తున్న అందరి కవులూ పరిచయం చేద్దామన్న ఉద్దేశమే! అంత కన్నా మరేం లేదు. ఏ రచన కదే కొత్తదిగా, గొప్పగా వుంటుంది. ఎన్నో అందాలను సంతరించుకుని హృదయాలను ఉయ్యాలలూపుతుంది. ఇది బాగుంది , ఇది బాగులేదు చెప్పడానికి వీల్లేదు. కానీ నాకేందుకనో స్త్రీ రచనలంటే ఎక్కువ ఇష్టం. పదేపదే చదువుతుంటాను."
    "ఏమిటి ? వకుళమాలా?"
    "కాదు, హృదయేశ్వరీ."
    విజయ తల తిప్పుతూ చూసి "ఆ పుస్తకం అంత బాగుంటుందా?' అంది భానుమూర్తి ముఖంలోకి చూస్తూ.
    "అద్భుతం! మనిద్దరం ఆ పుస్తకం కోసం పోట్లాడుకున్నాం గుర్తుందా, సుధీ?"
    "లేకేం? ఇంటర్ లో వుండగా, " నవ్వి అంది సుధీర.
    విజయ తిరిగి వచ్చి కుర్చీలో కూర్చుంటూ "స్కూళ్ళ యినస్పెక్టరు వయ్యావటగా , భానూ?' అంది.
    "ఊ"
    "కాంపులకు బాగా వెళ్ళుతున్నట్లుందే?"
    "నీకెలా తెలుసు?"
    "నీ శరీరం చెప్తుంది."
    "అంటే?"
    "చిక్కి పోలేదూ? ఆవిషయం నీకెవ్వరూ చెప్పలేదా?"
    "ఊహు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే మొదటి సారిగా వింటున్నాను! అయినా డాక్టర్ల లాగే చెప్తారు! అందులోనూ నువ్వు ఫారిన్ నుండి వచ్చావాయే...."
    "అబద్దాలింకా ఎక్కువ చెప్తావన్నమాట!"
    "అలాగాన్నానా?" నవ్వుతూ అన్నాడు.
    ముగ్గురూ కలిసి నవ్వారు.
    "మీనాక్షి రాలేదా?' అంది విజయ.
    "ఊహూ, రానంది. మీనాక్షికీ మధ్య ఒంట్లో బాగుండడం లేదు కూడా" అన్నాడు.
    "మా యింటికి రాదుగా ? పోనీ, రేపు నేనే వచ్చి చూస్తాన్లె!"
    "ఇల్లు ఖాళీ చెయ్యమని యిల్లు గలాయన ఒకే పోరు తున్నాడు. రేపు వేరే యింటికి వెళ్తున్నాము. ఎల్లుండి నేనే తీసి కోస్తాను."
    "విజయ వచ్చిందిగా? ఇక మీనాక్షి జబ్బులన్నీ ఎక్కడివక్కడ పోతాయిలే!" అంది సుధీర నవ్వుతూ.
    భానుమూర్తి అసౌఖ్యంగా బాధపడ్డాడు.
    విజయ ముఖం గంబీరంగా తయారయింది.
    "ఓ! విశాలా! రాణిగారికిప్పుడు తీరుబాటయిందన్నమాట! రావమ్మా! రా!' సుధీర ఎదురెళ్ళి విశాలను తీసుకు వచ్చింది.
    "బాగున్నావా, విశాలా?' విజయ పలకరించింది.
    విశాల తలవూపి నవ్వుతూ తను పట్టుకు వచ్చిన పొట్లం టేబిలు మీద పెట్టింది.
    "ఇతనెవరో తెలుసా?" సుధీర ప్రశ్నించింది.
    విశాలమైన తన కళ్ళనెత్తి భానుమూర్తి వైపు ఓరగా చూస్తూ "తెలీదు" అంది విశాల.
    "తెలీదా? నేను చెప్తుంటానే -- మా భానుమూర్తి బావ. ప్రస్తుతం డి.ఐ. గా పనిచేస్తున్నారు."
    విశాల మౌనంగా తలవంచుకుంది.
    "సొసైటీ లో మెలగడం బొత్తిగా చేతకాదు! నమస్తే చెప్పు!" పెదమలు బిగించి వచ్చే నవ్వాపుకుంటూ అతి కష్టం మీద అంది సుధీర.
    "నమస్తే!" రెండు చేతులు జోడించి అంది విశాల.
    అందరూ ఫక్కున నవ్వారు.
    "ఈమె విశాలాక్షి అని నా స్నేహితురాలు. నా శిష్యురాలు కూడా!"
    "నమస్తే! అయితే ఈ శిష్యురాలి కేందులో శిక్షణ నిస్తున్నావు? మాట నేర్పరి తనంలో కాదు కదా?" సుధీర వైపు , విశాల వైపు మార్చి మార్చి చూసి నవ్వుతూ అన్నాడు భానుమూర్తి.
    "అవును, లేకుంటే యీ కాలం మగవాళ్ళను జయించడం కష్టం!"
    "ప్చ్! నీ ప్రయోజనం నెరవేరినట్లు లేదు"
    "ఏం?"
    "నీ స్నేహితురాల్ని చూస్తె తెలీడం లేదూ?"
    "మాటలు రావనా? కొన్నాళ్ళు ఉండు! నన్ను మించి పోయేటట్లు చేస్తాను!"
    "భోజనాలకు రమ్మంటున్నారు." నౌకరు  వచ్చి చెప్పాడు.
    "నాన్నా వచ్చారా?"
    "ఇప్పుడే వచ్చారు."
    "వస్తున్నాం. నువ్వెళ్ళు."
    విజయ ముఖం రానురాను మరీ గంబీరంగా తయారయింది.


Next Page 

WRITERS
PUBLICATIONS