సరీగ్గా ఆ సమయంలో తలుపు నెట్టుకుని ఓ అమ్మాయి లోనికి రాకుండానే-
"మే ఐ కమిన్ ప్లీజ్" అంది.
సాజిత్ అటువైపుకి చూసి-
"ఓ....పావని-కమిన్! హృదిలోనికి ఎంటరయిన దానిని గదిలోకి పర్మిషన్ అడుగుతున్నావే..." చమత్కరించాడు.
"అందులో నేనొక్కర్తెనే కదా! గదంటే అనేకమంది వస్తారు దీనిలో ఎంటరవ్వాలంటే పర్మిషన్ అవసరం."
"హృదిలో మీరొక్కరేనా?"
"మరి.....వేరే నాకెవరూ కనిపించటం లేదు. తమరు దొంగచాటుగా ఎవరినైనా నన్ను బయటికి నెట్టి ఆహ్వానించటంలేదుకదా....?" పావని అంది.
"అందుకే జాగ్రత్తగా వుండాలంటారు. హృదికి తలుపులూ, కిటికీలూ వుంటాయి. నో అడ్మిషన్ బోర్డు పెట్టుకొని తమరు తలుపు దగ్గర ఓ కర్ర తీసుకుని కూర్చోవాలి."
"ఆ ప్రమాదం ఏం వుండదు సార్! ఉంటే నేనే వుంటాను. బయటికెళితే తలం వేసిమరీ వెళతానుగాని.....మరొకరికా అవకాశం యివ్వను. నో అడ్మిషన్ బోర్డు కాదు నేను పెట్టింది. "పావని నిలయం" అని సిమెంటు అక్షరాల్ని గట్టిగా అతికించాను. దటీజ్ మై ఓన్! అదేమన్నా అద్దెకొంపనుకున్నారా....వారూ-వీరూ చేరటానికి..."
"చూడండి మేడమ్! దొంగలకి ఒకరి 'ఓన్' అనీ, 'రెంటేడ్' అనీ తేడా వుండదు. హృదయాన్ని దోచుకెళ్ళటానికి వారి దగ్గర తాళాలు వుంటాయి. చాలా నేర్పుగా తీస్తారు."
"ఇంతకీ ఏమిటి? ఎవరైనా తాళం పగులకొట్టి చేరారా?! ప్లేటు మారుస్తున్నారు?"
పావని బుంగమూతిపెట్టి, సాజిత్ దగ్గరకు చేరి అతని చెవులు పట్టుకొని సాగదీసింది. అతని ఎర్రటి పెదవులమీద తన పెదవుల్ని వుంచి గట్టిగా ముద్దెట్టుకుంది.
సాజిత్ ఆమెని ఠపీమని తన వడిలోకి లాక్కుని-
"పావని నిలయంలో ఇంకా ఎవరు చేరతారు మేడమ్? దాన్ని పావన, నవజీవన బృందావనంగా మార్చి....అంతా మీరై అణువణువునా ఆక్రమిస్తిరి..."అంటూ తిరిగి ఆమె పెదవుల్ని తన పెదవులతో గట్టిగా వత్తాడు.
అలా వారి మధ్య కాస్సేపు ముద్దుల ముచ్చట్లు తీరాక, పావని టేబుల్ మీద ప్లాస్టిక్ ఫైల్ లో మెరిసే తెల్లటి కాగితాలు, వాటిలో అందంగా టైపు చేసిన అక్షరాల్నీ చూసింది.
"ఏమిటిది?" అంటూ సాజిత్ ముఖంలోకి చూసింది.
"డియర్! ఈ ఫైల్ లో మూడు నాలుగు ఆశ్చర్యకరమైన సందిగ్ధ సమస్యలున్నాయి.
సమాజాన్ని విశ్లేషించి స్థాయిలో వున్న తమరు....ఈ ఫైల్స్ లో వున్న సమస్యలకి ఒక పరిష్కారం యివ్వగలిగితే...." అని ఆగిపోయాడు.
"ఆ....! ఇవ్వగలిగితే...ఏం ప్రజెంట్ చేస్తారు?"
"ప్రేమను మించిన ప్రజంట్ ఏముంది మేడమ్?"
"ఆహా! ప్రేమను మీరు నాకిస్తే...తిరిగి నేనూ మీకిస్తున్నాగదా? ముందుగా కంప్యూటర్స్ తెరలమీద, ఆ తరువాత ఇస్తినమ్మ వాయనం-పుచ్చుకుంటినమ్మ వాయనం'లా తమరు 'డార్లింగ్' అంటే, నేనూ 'డియర్' అంటున్నాకదా?!
తమరో ముద్దిస్తే, నేనూ తిరిగి ఇస్తుంటినికదా! ఇంకా తమరు నాకు అదనంగా ప్రజెంట్ చేసేదేముంది?"
పావని మాటలకు సాజిత్ పెద్దగా నవ్వి.....తరువాత మెల్లిగా అన్నాడు.
"ఇప్పుడు మనం ఇండియన్ టైపు ప్రేమనే ఎంజాయ్ చేస్తున్నాం డియర్! నీవుగనుక ఆ సమస్యను సాల్వ్ చేయగలిగితే.....నీకు చైనీస్ టైపు ప్రేమను రుచి చూపిస్తాను!"
"ఆహా! కొయ్యకండి కోతలు! ఇండియాలో ప్రేమికులు పెదాల్ని ముద్దెట్టుకుంటే-వారు పాదాల్ని ముద్దెట్టుకోరు. వంకాయకూర ఇగురెట్టినా- పులుసెట్టినా కాంటెంట్ ఒకటే.....సార్!" పావని అంది.
"చూశావా మరి ఒక నిజం నీవే చెప్పావ్."
"మనం పెదాల్ని ముద్దెట్టుకుంటే చైనా, జపాన్ వాడు ఆమె పాదాల వంక చూసి -అవెంత చిన్నగా ఉంటే అంతగా సంబరపడిపోయి, ముందుగా పాదాల్ని ముద్దెట్టుకుని.....ఆ తరువాత పైకి వస్తాడు.
మనం పైనుండి క్రిందకు దిగుతాం. వాడు క్రింద నుండి పైకి వస్తాడు."
అందుకు పావని కిలుక్కుమని నవ్వింది.
"మరో విషయం-భోజనం చేస్తాం, అంతా పోయేది పొట్టలోకే గదా! అందుకని ముందుగా ఎవడూ కిళ్ళీ నమిలి -పెరుగన్నం తిని-చారు వేసుకుంటాడా? దానికీ ఓ పద్ధతుంది మేడమ్!"
సాజిత్ అనటంతో....పావని ఆలోచనలో పడింది. తరువాత తేరుకొని-
"అవునూ! ఒప్పుకుందాం! ఇండియా వాడికి ఇండియన్ టైపు లవ్ తెలుస్తుంది. జపనీస్ కుర్రవాడికి జపనీస్ టైపు లవ్ తెలుస్తుంది. నీకు 'జపనీస్' టైపు ప్రేమ ఎలా తెలుసు?"
"పిచ్చి ప్రశ్న మేడమ్!
వరినాటే విధానంలో ఎన్ని పద్ధతులున్నాయి. ఇండియావాళ్ళు ఒక రకంగా నాటుతారు. మనం ఇటీవల జపనీస్ టైపు వ్యవసాయ పద్ధతుల్ని ఎక్కువగా ఫాలో అవుతున్నాం. యూరప్ టెక్నాలజీని అరువు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి-ఇండియాలో జపనీస్ టైపు వ్యవసాయం ఏమిటి? ఒక వ్యవసాయదారుడు ఏది లాభసాటి అనుకుంటే దాన్నే తన పొలంలో అప్లై చేస్తాడు. అలాగే ఓ ప్రేమికుడు కూడా! చైనీస్ టైపులో ప్రేమించటం మధురం అనుకుంటే దాన్నే ఫాలో అవుతాడు.
"అయితే ఇంతకీ సారాంశం...."
"చెప్పానుకదా? నా ఫైల్లో ఉన్న ఒక సమస్యకు నీవు పరిష్కారం చెప్పగలిగితే....నిన్ను ఒక వారంపాటు చైనీస్ టైపులో ప్రేమిస్తాను. అప్పుడు మన ప్రేమ అంతర్జాతీయమవుతుంది" అంటూ సాజిత్ వంగి పావని పాదాల్లో గిలిగింతలు పెట్టాడు. అది ఆమెకు శరీరంలో ఓ సరికొత్త పులకింతయింది. మెలికలు తిరిగి-అతన్ని పెనవేసుకుంది.
మొత్తానికి ప్రియుడిలో తనకు మత్తెక్కించే ఇంటర్ నేషనల్ టెక్నిక్స్ వున్నాయనుకొని ....
"చైనీస్ టైపు ప్రేమేనా....ఇతర దేశాల టైపు ప్రేమలూ వున్నాయా?"
"చాలా దేశాల పద్ధతులున్నాయి. తమరు ఈ ఫైల్లో ఉన్న ఒక్కొక్క సమస్య విశ్లేషించి-సొల్యూషన్ యివ్వగలిగితే.....తమరిని.....ఒక్కొక్క దేశం టైపులో ప్రేమించేసి....మన ప్రేమను 'గ్లోబలైజ్' చేసి అందరికీ ఆదర్శం చేద్దాం."
పావని అతని ఒడినుండి దిగింది.
"అయితే....మీ మెడికల్ ఫైల్లోని మొదటి సంఘటన చెప్పండి. చిటికెలో సొల్యూషన్ యిస్తాను."
సాజిత్ ఫైల్ లోని మొదటి సమస్యను తీశాడు.
"డియర్! మా మెడికల్ ఫైల్లో దీని పేరు "కళ్యాణ్-రేఖ" ప్రాబ్లమ్! ఈ సమస్యలో ఇంతమంది వుండగా దీనికీపెరే ఎందుకు పెట్టారని నీవు నన్ను అడగవచ్చు?
దానికి సమాధానం ఒక్కటే!
సమస్య ఎవరి దగ్గరనుండి మొదలయిందో దానికాపేరె వుంటుంది. అది మెడికల్ సూత్రం!
ఇందులో 'కళ్యాణ్' - 'రేఖ' అనే ఇరువురు....చాలా అందంగా ఉన్న జంట...! మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా, మన్మధుడూ, రతీదేవిలా- అందాలు ఉట్టిపడే అపురూపమైన భార్యాభర్తలు!"
పావని కల్పించుకుని-
"సాజిత్! అంతటితో ఆపెయ్! కం టు ది పాయింట్..." అంది.
సాజిత్ నవ్వి..."నాందీ వాచకం మేడమ్! ఇక తమరడిగే ఆ పాయింట్ ఓ మెడికల్ హాల్లో మొదలయింది" అన్నాడు.
* * * *
అదో పెద్ద హాలు!
'కళ్యాణ్ - రేఖలు' హాలులోకి ఎంటరయ్యారు.
'బాంక్ ఆఫ్ జైగోట్స్' "హాండ్ సమ్ విత్ బ్యూటీ" గోల్డెన్ లెటర్స్ వేదిక వెనుక వ్రేలాడే కర్టెన్ మీద మెరుస్తున్నాయి.
వేదిక ముందు ఓ పదిమంది యువజంటలు....మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా అంతకుముందే ఆసీనులయి వున్నారు.
అప్పటికే ఒక మనిషి చెప్పుకుపోతున్నాడు.
ఆ మనిషి అందంగా వున్నాడు. పైపెచ్చు స్మార్ట్ గా వున్నాడు. అంత లావూ సన్నమూ కాకుండా మధ్యస్థంగా వున్నాడు. గ్రీనిష్ సూట్ లో ఆరోగ్యంగా వున్నాడు. నెత్తిమీది నల్లటి వెంట్రుకలు పైన తిరుగుతున్న ఫ్యాన్ గాలికి అలల్లా కదులుతున్నాయి.
"అవర్స్ ఈజె గ్రేట్ క్లబ్! ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఎంబ్రియో ట్రాన్స్ ఫర్ మెంట్!" ప్రపంచం యొక్క ట్రెండ్స్ ని మార్చాలని మా ప్రయత్నం.
"ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్!" అందమైన వస్తువు ఆద్యంతం ఆనందాన్నిస్తుంది. అదే మీకు వివరించబోతున్నాను.
మన పెరట్లో పుల్లమామిడి చెట్టు మొలిచింది. అది పెరిగి పెద్దదయి పుల్లటి కాయల్ని కాస్తోంది. వాటిని ఎవరూ ఇష్టపడటంలేదు. అంతమాత్రాన చెట్టును సమూలంగా కొట్టివేయమని మా క్లబ్ వారు చెప్పటంలేదు.
తీయమామిడిని అంటు కట్టమంటున్నాం.
సారం మన పెరటి చెట్టు మొదలునుండే వస్తుంది. కాయలుమాత్రం తీయగా వస్తాయి. వాటిని అందరూ యిష్టపడతారు.
ఇదీ అంతే డియర్!
