Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 86


    ఆ తరవాత కొద్ది వారాలకే కాపరానికి పంపించారు.
    వచ్చాక మొదటిరోజున రాత్రి గదిలో అతను మొరటుగా ప్రవర్తించబోతే "నాకూ అట్లా చెయ్యటం యిష్టం" అంది వుత్సాహంగా.
    ఆమె కళ్ళలోని చురుకుదనమూ కరుకుదనమూ చూసి కొంత జంకుతున్నాడు.
    ఆమె వొంటి భాగాలు__ తొడలు, చనుకట్టూ__ అతనికి బాగా కోర్కెగా అనిపిస్తున్నాయి.
    సిగరెట్ పీకతో, చనుగుబ్బ వుబ్బుమీద చిన్నగా కాల్చాడు. "హీఁహీ" అని నవ్వింది. తృళ్ళిపాటుని కప్పిపుచ్చుకుని.
    అతను రెండో సిగరెట్ ముట్టించుకున్నప్పుడు__ కబుర్లు చెబుతూ వేళ్ళతో ఆ సిగరెట్ అందుకుని అతని బుగ్గకి ఆనించబోయింది.
    అదిరిపడి, "ఓసి బ్రహ్మరాక్షసి లంజా" అని అరిచాడు.
    "అబ్బా ఆగండీ. భలే మజాగా అనిపిస్తదండీ మీకూ తెలుసుగా" అంది.
    ఐదో రోజున ఒంట్లో బాగోకపోతే __ విన్నదాన్నిబట్టి అనుమానమొచ్చి, వందన దగ్గిరికి వెళ్ళి చెబితే; ఆమెకి తెలిసిన డాక్టరు దగ్గిరికి తీసికెళ్ళి విజయ్ కుమార్ విషయం చెప్పి, వీడినేమొ టెస్ట్ చెయ్యమంది. డాక్టరమ్మ టెస్ట్ చేసి అదేనని నిర్ధారించి మందులు ఇచ్చింది.
    ఆ రాత్రి__ యెప్పటిలాగే పొద్దుపోయి వచ్చాడు__ అదీ మందుపార్టీ నుంచి.
    "నాకు ఒంట్లో బాగాలేదు తాకకండి" అంది.
    బలవంతం చెయ్యబోతే, "నువ్వు అంటించిన రోగాలే, కీప్ యెవే" అంది.
    "నాకు రోగాలుంటే నాకు అనారోగ్యంగా వుండేదిగా" అన్నాడు.
    "అదేమో నాకు తెలవదు. డాక్టరు చెప్పిన సంగతి అది" అంది.
    "యెవడా నా కొడుకు?"
    "మీకింతకుముందే కొడుకులున్న సంగతి నాకు తెలవదు" అని నవ్వి, "డాక్టరమ్మ చెప్పింది. డాక్టరయ్య దగ్గిరికెళ్ళమంటే అట్లాగే వెళ్తాను" అంది.
    ఆమెకి కాస్త ఆరోగ్యం బాగయ్యాక దగ్గిరికి చేరితే, "నిరోధ్ వాడండి" అంది.
    "ఛఛా. అవన్నీ వేసుకుని అనుభవించేదేంటి" అన్నాడు.
    "మరి లేకపోతే మీ రోగాలు నేను అనుభవించాలి" అంది.
    ముసుగెట్టుకుని మునగదీసుకుని పడుకున్నాడు.
    "నాకు అవసరంగా అనిపిస్తుంది" అంది.
    "మరి బెట్టుసరి పోయావుగా?" అన్నాడు వుత్సాహంగా.
    "నేనూ బయట తిరుగుతాను రోగాల్లేని ఒకరిద్దరితో" అంది.
    "తాట వలుస్తాను"
    "నాకూ చాతనవును. కాగా నువ్వొలిచిన తాట వాళ్ళకి చూపిస్తాను" అంది.
    "నీ పరువే పోతంది" అన్నాడు.
    "ఇంతకంటే పరువు పోయినా పర్లేదు. ఫలానా విజయ్ కుమార్ పెళ్ళాం ఇట్లా తిరుగుతాంది అని నలుగురూ చెప్పుకుంటారు. అది మీకు ఘనతగా అనిపించేటట్లయితే సరే"
    "నీకు విడాకులిస్తాను. పో"
    "ఇవ్వు. ఇస్తే మనోవర్తి డబ్బులివ్వాలి నీ ఆస్తి స్థాయిని బట్టి. దాంతో దర్జాగా బతుకుతాను. లేకపోతే నీలాగే రోగాలింకిపోని మంచివాణ్ని పెళ్ళి చేసుకుంటాను. కాదంటే ఓ చవటని వుంచుకుంటాను" అంది.
    "యెంతకి తెగించావే! నిన్ను గోళ్ళూడగొట్టి మూలబెట్టి వుంటే చచ్చినట్లు పడుందువు"
    కనకదుర్గ తండ్రికీ డబ్బుకీ లంకె. ఒకపట్టాన యెవరికీ ఇవ్వలేడు. "వున్నదంతా అమ్మాయికేగా __ అబ్బాయికి అవసరం అయినప్పుడు తీసుకుంటాడులెండి. ప్రస్తుతం నగదులేదు, అంతా భూమే. వేళచూసి అమ్మాలి. లేకపోతే సగానికి సగం నష్టం అవుతుంది" అని, యేమీ జారొదలలేదు.
    "రొచ్చు తిరుగుళ్ళు మానెయ్యండి. మీ ప్రతాపానికి నేను చాల్లెండి. అడ్డమైన చోటా పొర్లి రావటం దేనికి?" అంది.
    "మక్కిలిరగదంతాను"
    "అప్పుడు నా ప్రియులు వూరుకోరు. మీ మక్కిలిరగదంతారు. మీరు తిరిగే రొచ్చుముండలు మీరు ఛస్తే ఆ కిరాతకుడు చచ్చాడు పీడా విరగాడైందని అనుకుంటారు."
    "నీ పీక నులిమి__"
    "అది నేనూ చెయ్యగలను. ఒక్క బొట్టు చాలు. పిచ్చి వేషాలెయ్యకండి. సీత కరెంటు సంగతి బయటపెట్టి కటకటాల వెనక పెట్టించగలను" అంది.
    ఆశ్చర్యంగా చూసి, అంతలోనే తేరుకుని "చాలా కూపీ లాగినట్టున్నావే? బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నీతో యేనాటికైనా ప్రమాదమే. నిన్ను హతమార్చి _"
    "అట్లాగే. మీతో నాకూ యేనాటికైనా ప్రమాదమే. సీత కరెంటు వంటి సంగతులు వందనకి తెలుసు. వందన జోలికెళ్ళారంటే__ఆ తరవాత మీరు ప్రాణాలతో బతికుండగలరనుకుంటే సరే__మీ యిష్టం"
    నిలువుగుడ్లేసుకుని రెండు నిమిషాలుండిపోయి "నీకు వందనెట్లా తెలుసు?" అన్నాడు.
    "కాన్వెంటులో క్లాస్ మేట్స్ మి. క్లోజ్ ఫ్రెండ్స్ మి.
    "గుడ్లు మిటకరించాడు. మూతి బిగించాడు.
    "చూడండి నేను సీతని కాదు. ప్రాణాలు తీసుకుని చచ్చిపోవటానికి. కనకదుర్గని. ప్రాణాలు తియ్యగలదాన్ని. ఒకవేళ మీరు నా ప్రాణాలు తియ్యటం జరిగితే__ఆ తరవాత మీరు ప్రాణాలతో బతికివుండరు. కనీసం జీవితాంతం కటకటాల వెనక వుండిపోతారు. మీ సంగతి తెలవక చేసుకున్నాను. నా తడాఖా తెలవక మీరు చేసుకున్నారు. మీరు దారికొస్తే ఏ గొడవా వుండదు. లేకపోతే ఈ కనకదుర్గ తడాఖా చూస్తారు. మీరు సీతాపతిగారు కాదు, దుర్గాకుమార్ గారు. మనస్పూర్తిగా అనుకూల దాంపత్యం కోసం ప్రాకులాడుతున్నాను. సాధ్యం కాకపోతే మిమ్మల్ని నాశనం చెయ్యకుండా నేను నాశనమవ్వను. ఆపైన మీ యిష్టం" అంది తాపీగా.
    విజయ్ కుమార్ మంచంమీంచి లేచివెళ్ళి, కుర్చీలో కూర్చుని, కాళ్ళు కుర్చీలో పెట్టుకుని, నుదురు మోకాళ్ళమీద ఆనించాడు. ఇతరుల కళ్ళలోకి నీళ్ళు తెప్పించటం తప్ప తన కళ్ళలోకి నీళ్ళు రావటం తెలియని విజయ్ కుమార్ కళ్ళలోంచి తడి వుబికింది.

                               111

    గత మూడు నెలలలో, అంకినీడు తనకు తానుగా మళ్ళీ బయటిముఖం చూడలేదు. నళినే అప్పుడప్పుడు సాయంత్రాలు కారులో అలా యెటైనా వెళ్ళేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS