ఇదంతా ఒక్క తృటిలో మహా అయితే రెండు నిమిషాల్లో జరిగింది.
"కళ్ళు తెరు" అన్నమాటలు వినిపించాయి.
ఆ గొంతు విక్కీది. నెమ్మదిగా కళ్ళు తెరిచాను. అతని ముఖం నా ముఖానికి దగ్గరగా వుంది! నా శరీరాన్ని అతని శరీరం కప్పుతోంది.
అటూ ఇటూ చేతులు నా చుట్టూ కంచెలా పెట్టి, ఎవరూ మీద పడకుండా చూస్తున్నాడు! ఆ బాధ అతని ముఖంలో కనిపిస్తోంది. అంతా తొడతొక్కిడి!
ఎగ్జిట్ దగ్గర తొక్కిసలాట. జనం బయటికి వెళ్తూ ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటున్నారు.
నేను ఊపిరి బిగబట్టి అతని స్పర్శని భరిస్తున్నాను. ఇప్పుడు భయం వెయ్యడంలేదు...ధైర్యంగా కొత్తగా... ఉద్విగ్నంగా వుంది.
ఇప్పుడు ఆస్పర్శ అలవాటయింది. మనసుకీ, తనువుకీ హాయినిస్తోంది!
అతని రక్షణలో అదోలాంటి నిశ్చింతని అనుభవించాను. ఇంతకన్నా స్త్రీకి ఏం కావాలి? అందుకేనా కవులు స్త్రీని తీగలతో, లతలతో పోలుస్తారు పందిరి ఉంటే పదిలంగా అల్లుకుపోతోందని!
శారీరకమైన ఈ బలం... రక్షణ కవచాల్లాంటి ఈ బాహువులూ... ఇవన్నీ సృష్టిలో భగవంతుడు స్త్రీ కోసమే సృష్టించాడా? ఓ స్త్రీని కాపాడ్తున్న అతని పురుషధీరత్వం అతనికి ఎంతటి తృప్తినిస్తోందీ? అతని ఎద మీద నాకు తెలీకుండానే వాలాను.
అతను నన్ను నెమ్మదిగా నడిపించుకుంటూ బైటికి తీసుకొచ్చాడు.
కార్లో కూర్చున్నాక కానీ ప్రాణాలు కుదుటపడలేదు.
గొడవ చెయ్యాలనే ఒక గ్యాంగ్ వచ్చినట్లున్నారు. "ఏంటీ సోషల్ ఎలిమెంట్స్" అన్నాడు.
అతని మొహంలో విపరీతమైన చిరాకు.
"అమెరికాలో ఇలాంటిచోట్ల గొడవలు జరగవు కదూ!" అన్నాను.
అతను నవ్వి "ఇలాంటిచోట్ల జరగవు. కానీ ఒంటరిగా నిర్మానుష్యమైన చోట్ల మగాడు కూడా నిర్భయంగా తిరగలేడు! ఇక్కడైతే ఆడదే. అది కూడా అర్థరాత్రి ఒంటరిగా తిరగలేదు. ఏది బెటర్ కంట్రీ?" అడిగాడు.
"అవునా?" విస్మయంగా కళ్ళు పెద్దవి చేసి గుండెలమీద చెయ్యి వేసుకున్నాను.
అతను చాలా క్యాజువల్ గా వేసినట్లుగా చెయ్యివేసి దగ్గరికి తీసుకుని "భయం తగ్గిందా?" అన్నాడు.
నాకు ఎందుకో ఆ క్షణంలో అతని నుండి దూరం జరగడం కానీ, ఆ చేతిని తీసెయ్యడం కానీ సంస్కారం అనిపించలేదు!
"థాంక్యూ విక్కీ!" అన్నాను.
కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అతని వల్ల నేను పొందిన రక్షణకీ, ధైర్యానికీ అది చాలా చిన్నమాట! కానీ స్త్రీ సామాన్యంగా అది కూడా చెయ్యదు.
అవన్నీ తన జన్మహక్కులుగా మగవాడి నుండి పొందుతుంది. ఈ ఒక్క విషయం మాత్రం నేను మా అమ్మ నుండి నేర్చుకున్నాను.
అమ్మకి ఆయాసం ఎక్కువగా ఉన్నప్పుడు నాన్నగారు ప్రొద్దుటే అమ్మ మొహం కడుక్కోవటానికి వేడినీళ్ళు పెట్టి ఇచ్చేవారు.
ఆయన అలా ఇవ్వగానే అమ్మ ఆయన చేతిని తన చెంపకి ఆన్చుకుని "థాంక్యూ" అనేది.
రాత్రిపూట అమ్మకి రగ్గు కప్పడానికి ఆయన లేచివస్తే ఇప్పటికీ అదే చిరునవ్వుతో ఆయన చేతిని ముద్దు పెట్టుకుంటుంది! ఆ కమ్యూనికేషనే...ఇన్ని ఏళ్ళయినా... ఎన్ని సమస్యలొచ్చినా ఇద్దరినీ సేదదీరుస్తోంది.
రవివర్మ చిత్రంలాంటి అమ్మ ఈనాడు శిధిల శిల్పంలా మారిపోయినా నాన్నగారి కళ్ళల్లో అదేమెరుపు! నాన్నగారి స్పర్శ ఇన్నేళ్ళొచ్చినా తను ఎంతో అనుభూతిస్తున్న విషయం తెలియజెప్తూ అమ్మచూపులు!
అందుకే...అతని చేతిని నేను తీసెయ్యలేదు. ఇందాక అతను నా శరీరాన్ని అణువు అణువూ నాకు దడికట్టినప్పుడు పోని శీలం ఇప్పుడు పోతుందని నాకు అనిపించలేదు! అతని వేళ్ళలోని స్నేహ మాధుర్యాన్ని నేను అనుభవించాను.
అవే చేతులు... ఒకసారి ఆదరంగా... ఒకసారి స్నేహంగా ఒకసారి కామంతో... ఇంకోసారి కరుణతో కానీ ప్రతిసారీ ఒకేలా అర్థం చేసుకుని విదిలించేస్తుంది స్త్రీ.
కన్నీళ్ళు కార్చడంలో ఎంత సుఖముంది.
అవి తుడిచే ఆత్మీయమైన కరములున్నప్పుడు!
"ముక్తా... ఇప్పుడు ఎలా వుంది?"
ఒక డాక్టర్ లా అడిగాడు.
"బావుంది" అన్నాను.
అతను నెమ్మదిగా నామీద నించి తన చేతిని తొలగిస్తూ "జీవితంలో ఎప్పుడూ భయపడకూడదు!"
మళ్ళీ తనే అన్నాడు.
"యు మస్ట్ ఇంప్లాంట్ యాన్ ఎర్ స్టిక్ కిస్ ఆన్ ది సెడక్టివ్ లిప్స్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బ్రైడ్ ఆఫ్ విక్టరీ."
అతనికి చాలా తెలుసు! జ్ఞానంలో... వయసులో... చదువులో అన్నిట్లో నాకన్నా చాలా ఎక్కువ! విక్కీలాంటి స్నేహితుడు ఉండడం చాలా అదృష్టం.
అతను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు.
* * *
మరునాడు నేను కాలేజీనుండి వచ్చేటప్పటికి ఇంట్లో ఏమిటో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
నాన్నగారు, బావ కూర్చుని సీరియస్ గా నావైపు చూశారు. అమ్మా, అక్కా గడప అవతల నిలబడి నన్ను కాల్చేసేటట్లు చూస్తున్నారు.
నేను మామూలుగా లోపలికి వెళ్ళబోయాను.
"ఆగు...నాన్నగారేదో చెప్పాలట!" అంది అక్క.
నేను నాన్నవైపు చూశాను.
