"ఎక్కడికి వెళ్లాలో తెలియడంలేదు! కాని ఏదో ఒకటి నేను త్వరగా నిర్ణయించుకోవాలి. ఇక ఇక్కడ ఎన్నో రోజులు వుండలేరు!"
"మీరు..... మీరు వెళ్లిపోతే నేను ఇక్కడ ఒక్క క్షణంకూడా వుండలేను! నేనూ వెళ్ళిపోతాను! అమ్మ ఏమయినా బాధపడనీ, తిట్టనీ."
కిటికీలోంచి జయలక్ష్మి తొంగి తొంగి చూడ్డంకనిపించింది శంకరికి. "వెళ్ళు అచ్యుతా! ఇంటిలోకివెళ్లి చదువుకో ఫో"
* * * *
జయలక్ష్మి ప్రసవించింది మళ్లీ ఆడిపిల్లను.
చూడవచ్చిన చుట్టాలతో ఇల్లంతా నిండిపోయింది. కొందరుచూసి ఒకటి రెండు రోజులుండి పోయినా కొందరు బారసాలచేసి వెడతాం అంటూ వుండిపోయారు.
పురిటి మనిషి ఇంట్లోవుంటే పని తక్కువేమీ వుండదు. పైగా చుట్టాలకు మర్యాదలు, వంటా, వడ్డనా, గిన్నెలు కడుక్కోవడం చేసి చేసి అలుపుజ్వరం వచ్చేసింది శంకరికి. జ్వరం వచ్చినా అలాగే స్నానంచేసి వంట చేసేది. జయలక్ష్మి అమ్మమ్మకి చెప్పలేనంత ఆచారం! తడిబట్ట కట్టుకుచేస్తేగాని ఆవిడ భోజనం చేయదు.
జ్వరం, పైగా తడిబట్ట కట్టుకోవడం, జ్వరం విషమించినట్టుగా అయ్యి స్పృహతప్పిపోయింది.
అలా జ్వరంతో మంచంమీద వుండగానే రెండు రోజులు గడిచిపోయాయి. ఆమెగురించి పట్టించుకొనేందుకు ఎవరికీ తీరికలేదు. పైగా సణుగుడు. "సమయంచూసి రోగం తెచ్చుకొంటే ఎలా" అని! ఆమె రెండురోజులనుండి నోట్లో మంచినీళ్లుకూడా పొయ్యకుండా పడివుంటే అచ్యుతం విలవిల్లాడిపోయాడు. దగ్గరగా వెళ్లి పలుకరిద్దామంటే జయలక్ష్మి తన డేగకళ్లతో కనిపెడుతూ వుంటుందేమోనని భయం!
చివరికి ఆరోజు ధైర్యం చేసి గ్లాసులో పాలు తీసికెళ్లాడు "వదినా!"
"........."
"వదినా!"
శంకరి కళ్లు తెరిచిందేగాని మాట్లాడలేదు.
"కొంచెం ఈ పాలు తాగండి!"
"వద్దు! ఏం తాగాలని లేదు!"
"రెండు రోజుల నుంచి చూస్తున్నాను. మీరేం తీసుకోవడం లేదు! ఏం త్రాగకపోతే, తినకపోతే ఎలా?" అతడి గొంతు ఎందుకో వణికింది.
"బతకాలని లేదు, అచ్యుతా! ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఏముందని బ్రతకాలి?"
"అలా అనుకొంటే ఎలా? ఏమీ చేతకాని వాణ్ని. నేననుకోవాలి ఆ మాట!"
"పుట్టింట్లోనే వంట మనిషి, పని మనిషీ కావడం ఎంత అవమానమో నీకు తెలియదు! నేనిక ఎన్నాళ్ళో ఇక్కడ వుండలేను! వెళ్లిపోవాలి. ఎక్కడికైనా వెళ్ళి పోవాలి!" ఉన్మత్తంగా అంది శంకరి.
"ఎక్కడికి వెడతారు?"
"ఈ విశాల ప్రపంచంలోకి! నాకు సాయం చేస్తావా, అచ్యుతం?"
"చేస్తాను! కాని, ఈ పాలు త్రాగాలి మీరు!"
"ఇవ్వు!" సగం త్రాగి "ఇక త్రాగలేను!" అంటూ ఇచ్చేసింది గ్లాసు.
* * * *
జయలక్ష్మి నిద్ర లేచేసరికి ఉదయం ఏడూ, ఏడున్నర అవుతుంది. ఆవిడ లేచి తలకొంగు జాగ్రత్తగా కట్టుకొని, చెప్పులు వేసుకుని పెరట్లోకి వచ్చేసరికి ముఖం కడక్కోవడానికి రెడీగా వేణ్నీళ్లుంచుతుంది శంకరి. కాని, ఈరోజు నీళ్లకాగు క్రింద ఎవరూ మంట పెట్టినట్టులేదు! ఆవిడ కోపంగా "శంకరీ! శంకరీ!" అంటూ కేక పెట్టింది. సమాధానం రాలేదు.
ఆవిడ చరచరా ఇంట్లోకి వచ్చింది.
"ఏం చేస్తున్నావ్? వేణ్నీళ్లు కాచలేదు! ముఖం ఎలా కడుక్కుంటాననుకొన్నావు?"
"........."
అసలు వంటింట్లో ఏ అలికిడి లేదు!
శంకరి లేదా?ఎక్కడ చచ్చింది?
జయలక్ష్మి వంటింటి గుమ్మం దగ్గరికి వచ్చి తొంగి చూసింది.
తెల్లారేసరికి అలికి ముగ్గులు పెట్టి, గిన్నెలు తళతళ లాడేట్టు కడిగి బోర్లించి వుంచేది శంకరి. కాని, ఇవాళ పాచి ఇల్లు అలాగే వుంది! వంట పాత్రలు ఎక్కడివక్కడ పడివున్నాయి.
ఈ శంకరికి ఏమొచ్చింది? మళ్లీ జ్వరం అంటూ ముడుచుకు పడుకోలేదు కదా?
జయలక్ష్మి గాబరాగా శంకరి పడుకొనే చోటికి వచ్చి చూసింది. శంకరి పక్కచుట్టుగాని, శంకరిగాని లేరు! ఆవిడ చురుగ్గా అచ్యుతం పడుకొనే గదిలోకి పరిగెత్తింది. అతడూలేడు. గూట్లో అతడి తాలూకు బట్టలసంచిగానీ, పక్కచుట్టగానీ లేవు.
