"వైద్యం చేయించుకుందుకైనా మీ ఊరు రావాలనుందిరా. మీ ఉళ్ళో డాక్టరు చాలా ఘటికుడి లాగున్నాడు. అన్నీ ఇట్టే పట్టేసి మంచి మందిచ్చాడు. అది వాడినన్నాళ్ళు ఏ బాధ లేదు....' అంది పార్వతమ్మ.
"నీ జబ్బేమిటో వివరంగా చెబితే - అయన కవన్నీ చెబుతాను. అయన రాసిచ్చిన మందు నీకు తెచ్చి పెడతాను ---' అన్నాడు రాజారావు.
"గుండెలు లాగేసినట్లుందిరా . ఆ రెండు క్షణాలూ ఏమిటో కరెంటు షాకు కొట్టినట్లుంది. ప్రాణం పోతుందేమోనని భయం వేస్తుంది--" అంది పార్వతమ్మ.
తర్వాత తమ్ముళ్ళతో చెల్లెళ్ళతో వినోదంగా కాలం గడిపే శాడు రాజారావు. అతను వెళ్ళిపోయే రోజున వెంకట్రామయ్య గారు రాజారావుని పిలిచి ------" ఈ సంబంధం నిశ్చయమై పోవచ్చు. కట్నకానుకల విషయంలో నీ అభిప్రాయమేమిటి?" అనడిగాడు. రాజారావు నవ్వి ----' అన్నీ మీకేతెలుసు నాన్నా - కుర్రవాళ్ళం మేము చెప్పేదేముంది?" అన్నాడు.
వెంకట్రామయ్య సంతృప్తిగా తలాడించాడు.
రాజారావు గ్రామంనించి బయల్దేర్తూన్న క్షణంలో వెంకట్రామయ్యను కలుసుకునేందుకు ఒక వ్యక్తీ వచ్చాడు. అతనెవరో రాజారావుకు తెలియలేదు. కానీ ఎందుకు వచ్చాడో తెలిసి చాలా సంతోషించాడు. ఆ వ్యక్తికీ వెంకట్రామయ్య తండ్రి నాలుగువేలు అప్పిచ్చాడు. వెంకట్రామయ్య కూతురు పెళ్ళి చేయబోతున్నాడని విని - ఆ వ్యక్తీ బాకీ తీర్చడానికి వచ్చాడు. సుమారు పదిహేనేళ్ళ క్రితం రాజారావు తాతగారా వ్యక్తికీ ఆ డబ్బిచ్చి ఉండకపోతే - ఆ వ్యక్తీ కూతురి పెళ్ళి ఆగిపోయుండేది.
రాజారావు మనసు నిండా సంతోషం ఆక్రమించుకుంది ---- "లక్ష్మీ పెళ్ళికి నిజంగానే టైము వచ్చినట్లుంది ----" అనుకున్నా డతను.
6
'అమ్మాయి నచ్చింది ----' అన్నాడు భీమరాజు వెంకట్రామయ్యను రహస్యంగా వీధి గదిలోకి తీసుకెళ్ళి.
వెంకట్రామయ్య ముఖంలో వెలుగు కనబడింది --- 'అనుకున్నాను. అర్హతను గుర్తించగల కళ్ళు మీకే కాదు- మీ అబ్బాయికీ ఉన్నాయని ----"
'మనం అన్నీ మాట్లాడేస్కోవచ్చు --- " అన్నాడు భీమరాజు.
'అలాగే - మీరే చెప్పండి - తాంబూలాలెప్పుడుచ్చుకుందాం ?" అన్నాడు వెంకట్రామయ్య .
భీమరాజు అసహనంగా -- "అవును - అదో తంతుంది కదా -" అన్నాడు.
"మీ ఇంట్లో అన్ని విధాల మా ఇంట్లో ఆడపిల్లకు సంబంధించినంతవరకూ - ఇది మొదటి పెళ్ళి - అన్నీ సంప్రదాయం ప్రకారమే కానిద్దాం -- ' అన్నాడు వెంకట్రామయ్య.
'అవుననుకోండి - ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళ కివన్నీ జరగాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా మేము రాజమండ్రీ వెళ్ళి మూడ్రోజులుంటాం. పురోహితున్నాడిగితే ఈ మూడ్రోజుల్లోనూ మంచి ముహుర్తముందో లేదో చెబుతాడు ----' అంటూ లోపలకు వచ్చాడు భీమరాజు.
"ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ----' అన్నాడు సోమయాజులు.
"ఇంకేం బావగారూ - ఎల్లుండి మీరు రాజమండ్రిలో మేముంటున్న మా చుట్టాలింటికి వచ్చేసేయండి -" అన్నాడు భీమరాజు.
అలాగే నన్నట్లు తలాడించి భీమరాజుని పక్కగదిలోకి పిల్చాడు వెంకట్రామయ్య. భీమరాజు వెళ్ళాడు. ఏ పెళ్ళి విషయంలో నైనా తప్పనిసరయినదీ , అతి ముఖ్యమైనదీ అయిన ఘట్టం ప్రారంభమయింది.
* * * *
"బావగారూ - ఇంక సమయం వచ్చింది - మీ ఉద్దేశం మీరుచెప్పాలి "- అన్నాడు వెంకట్రామయ్య.
"చెప్పడానికే ముంధండీ --మాదీ మీకులాగే పెద్ద కుటుంబం. మాకూ ఆడపిల్లలున్నారు. మీ శక్తి కొలదీ మీరేం చెప్పినా నేను కాదనలేను" -- అన్నాడు భీమరాజు.
భీమరాజు మంచివాడని వెంకట్రామయ్య కర్ధమయింది. అందువల్ల అయన ఎంత కట్నం కోరుతున్నాడో తెలిసేవరకూ తను కమిట్ అవకూడదని అయన నిర్ణయించుకున్నాడు. తనో అంకె చెబితే , భీమరాజు అంతకంటే తక్కువ అడిగే వుద్దేశ్యంలో వుంటే ? తను కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని వెంకట్రామయ్య గ్రహించాడు.
వెంకట్రామయ్యది పెద్ద కుటుంబమని భీమరాజుకు తెలుసు. కానీ మొదట్నీంచి వారిది కాస్త జోరైన కుటుంబమని కూడా ఆయనకు తెలుసు. తీరా ఒక అంకె చెబితే -- వెంకట్రామయ్య అంత కంటే ఎక్కువ కట్నమిచ్చే ఉద్దేశంలో ఉంటే? -- తను కాస్త జాగ్రత్తగా వ్యవహించాలని భీమరాజూ అనుకున్నాడు.
వచ్చిన ఇబ్బందేమీటంటే సంబంధం ఇంచుమించు స్థిరపడి పోయింది. కట్నం బేరం మీద ఆధారపడి లేదు పెళ్ళి. అందుకే ఇద్దరూ మరింత జాగ్రత్తగా వుండదలిచారు.
"ఏది ఏమైనా మీరు మగపెళ్ళి వారు. మీ ఆశలేవో మీకుంటాయి . అవేమిటో కాస్త తెలియబరిస్తే నా శక్తి కొద్ది నేను ప్రయత్నిస్తాను. సంకోచించకుండా చెప్పండి బావగారూ -------' అన్నాడు వెంకట్రామయ్య.
'ఆశలకంతేముంది బావగారూ - మావాడి కైతే పదిహేను వేలదాకా యిస్తామంటూ వచ్చారనుకొండి. కానీ మనిషికి డబ్బొక్కటే ప్రధానం కాదు గదా - అందులోనూ పెళ్ళనేది నూరేళ్ళ పంట. నేను మీలాంటి సంప్రదాయమైన కుటుంబం కోసమే ఇంత వరకూ అగాననుకోండి. మరి మీరు సందేహించకుండా మీ మాట చెప్పేయండి - ' అన్నాడు భీమరాజు.
"ఏం చెప్పనండీ - పైసా కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకుంటా మంటూ కనీసం నాలుగు సంబందా లైనా వచ్చాయి మా లక్ష్మీకి. కానీ మీరు చెప్పినట్లు పెళ్ళంటే నూరేళ్ళ పంట. అమ్మాయి సుఖం ముఖ్యం కానీ డబ్బు కోసం చూసుకుంటామా? మీ సంబంధం మొక్కటే ఇంతవరకూ నా మనసుకు నచ్చింది . మీరేమంటే అదే!" అన్నాడు వెంకట్రామయ్య.
భీమరాజుకు మరి తప్పలేదు. ఆఖరి ప్రయత్నంగా ---"మీ పెద్దబ్బాయిలిద్దరికీ పెళ్ళిళ్ళ అయిపోయాయి. కాబట్టి ఇచ్చి పుచ్చుకోవడాల విషయం మీకే బాగా తెలియాలి. అబ్బాయిదైనా అమ్మాయిదైనా మా ఇంట్లో ఇదే మొదటి పెళ్ళి ' -- అన్నాడు.
మోహనరావుకీ, రాజారావుకీ కట్నాలు జోరుగానే ముట్టాయి. వాటి ఫలితంగానే వెంకట్రామయ్యగారి అప్పులు చాలావరకూ తీరిపోయాయని చాలామంది చెప్పుకుంటుంటారు. భీమరాజు పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకురావడం వెంకట్రామయ్యకు కాస్త ఇబ్బందే అయింది. ఒక్క క్షణం అలోచించి -- 'ఆ వియంకుళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు వాళ్లకిలా నేనెక్కడ చేయగలన్లెండి ? ఏదో ఆ పెళ్ళిళ్ళు జరిగాయి కాబట్టే ఇప్పుడు నేను ఆడపిల్ల పెళ్ళి చేస్తానంటూ ముందుకు రాగల స్థితికెనా వచ్చాను ----" అని ఊరుకున్నాడు.
ఇద్దరి మధ్యా కాసేపు మౌనం రాజ్యమేలింది. చివరకు వెంకట్రామయ్య ధైర్యం చేసి -----"బావగారూ , పైకి పటాటోపంగా కనబడుతున్నా మా ఆర్ధిక పరిస్థితి మీరే ఊహించుకోగలరనుకుంటాను. పేద అరుపులు అరవడం నాకు చేతకాదు. నా శక్తి కొలది అని మీరే అన్నారు కాబట్టి నా మాట చెప్పేస్తున్నాను. ఇదైనా ఇవ్వగలిగి అనే మాట కాదు ఏదో - ఇంట్లో తోలి శుభకార్యం అనే అభిప్రాయంతో చెబుతున్నాను. మొట్టమొదటి ఆడపిల్ల పెళ్ళి కాబట్టి - అన్నీ కాస్త ఘనంగానే చేయాలనుకుంటున్నాను. కట్నం మాత్రం అయిదువేలు ....' అని ఆగిపోయాడు.
భీమరాజు ముఖంలో కాస్త ఉత్సాహం కనపడింది. ఇప్పటికో అంకె బయటపడింది. అదీ అంత నిరుత్సాహజనకంగా లేదు. దీంతో బేరం కొనసాగించవచ్చు ------' బాగానే వుంది కానీ బావగారూ -- మీరు మరోక్కమాటు ఆలోచించాలి . పదిహేను వేల కట్నం కాదని మీ సంబంధాన్ని కొచ్చేమంటే కనీసం పదివేలైనా వుండకపోతే - బంధువర్గంలో లోకువై పోతాం. అదీకాక పెళ్ళీడు కెదిగిన కూతురుంది నాకు. ఇద్దరు కొడుకులకు పెద్ద కట్నాలు తీసుకుని పెళ్ళి చేసిన మీరే కూతురి పెళ్ళికి అయిదు వెలిస్తానంటే - ఆ డబ్బు తీసుకుని కొడుకు పెళ్ళయ్యాక నేను నా కూతురికివ్వగల కట్న మేమిటో మీరే చెప్పండి బావగారూ ---' అన్నాడు భీమరాజు లౌక్యంలో నిష్టూరాన్ని మిళితం చేస్తూ.
