Previous Page Next Page 
మధుపం పేజి 8


    "దినేష్ నీకు సిగ్గు వేయడం లేదా. పెద్ద చదువులు చదివావు. కార్పోరేట్ ఆఫీసులో మంచి ఉద్యోగం , సంఘంలో పరపతి అన్నీ ఉండి ఇంత చీప్ గా , ఇంత సంస్కార హీనంగా ఓ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తావా?' హరిత అసహ్యంగా చూస్తూ దులపడం మొదలుపెట్టింది. "ఏమిటి పాతకాలం అబ్బాయిల్లా అమ్మాయి రాసిన ఏ ఉత్తరమో పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసినట్టు చేస్తే, ఈ కాలం అమ్మాయిలని అంత తక్కువ అంచనా వేయకండి. నౌ గెట్ లాస్ట్. నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది" అతన్ని తలుపు వైపు తోస్తూ అతని చేతిలో సెల్ లాక్కుని ఆ ఫోటోలు అన్నీ డిలీట్ చేసి సెల్ విసిరేసి తలుపు దడాలున మూసింది హరిత.
    "ఇంక ఆలస్యం చెయ్యకుండా వెళ్ళు. గౌతమ్ కి ఈ విషయం నీ ద్వారానే తెలియాలి. వెళ్ళు అంతా చెప్పు" హరిత అంది.
    "ఇప్పుడు చెపితే.... గౌతమ్ రియాక్షన్....." నసిగింది కార్తీక.
    "ఎలా రియాక్ట్ అయినా ఫేస్ చెయ్యి. జీవితాంతం భయంతో, టెన్షన్ తో బతకడం కంటే అది నయం. వెళ్ళు పెళ్ళి తప్పినా ఫర్వాలేదు. జీవితం అంతా టెన్షన్ లో బతకడం కంటే...."
    
                                             *    *    *    *
    "కార్తీకా, నిన్న అంటీ వచ్చి చెప్పిందగ్గర నించి, నీవు నిజాయితీగా నాతో చెపుతావా లేదా అని ఆలోచిస్తున్నాను. చెప్పావు థాంక్స్." కార్తీక చెప్పిందంతా విని తేలిగ్గా అన్నాడు గౌతమ్.
    "అమ్మ వచ్చి చెప్పిందా?" ఆశ్చర్యంగా అంది కార్తీక.
    "ఆ,.... ఆవిడ వచ్చి నీ ప్రాబ్లం చెప్పి, తెలివి తక్కువగా కొంత, అనుభవరాహిత్యంతో కొంత, అన్నీ నాకు తెలుసు అనే నీ అహం గురించి చెప్పి, నాతో అంతా చెప్పమని సలహా ఇచ్చానని, కూతురు చెపుతుందో లేదోనని తనే వచ్చి చెప్పానని , అంతా విని ఏ నిర్ణయం తీసుకున్నా తమకి అమోదమేనని , నిజం దాచి, అనుక్షణం వాడి బెదిరింపులకి భయపడి జీవితాంతం కూతురు టెన్షన్ లో బతకడం ఒష్టం లేదని ఆవిడ చెప్పారు . నిజంగా ఆవిడ సంస్కారం ముందు నేనే ఇంకే విధంగా నిర్ణయం తీసుకోగలను. కేవలం నీవు పెళ్ళికి ముందే ఈ నిజం చెప్పాలని మాత్రం ఆశించాను. నా నమ్మకాన్ని నిలబెట్టావు. థాంక్స్" అన్నాడు గౌతమ్.
    "లేదు గౌతమ్, నిన్నే వద్దామనుకున్నాను. ముందు వాడికి బుద్ది చెప్పాలని నేను, హరితా మాట్లాడుకుని ఆ రాస్కెల్ అట కట్టించాం" అని జరిగిందంతా చెప్పి "ఇంక మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళడులే. ఇప్పుడు నీతో చెప్పాక ఎంత రిలీఫ్ గా ఉందొ.....' రిలాక్స్ గా కూర్చుంటూ అంది.
    "కార్తీకా , ఓ మాట చెప్పనా..... మీ అమ్మగారు చెప్పింది నిజం. ఈ కాలం అమ్మాయిలు చదువుకున్నా ప్రపంచజ్ఞానం తక్కువ. తెలివి తక్కువగా ఈనాటికీ అబ్బాయిల మాయమాటలకి లొంగిపోతున్నారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు, ఫేస్ బుక్ ల విజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఇదివరకటి కంటే జాగ్రత్తగా ఉండాలి కానీ, ఆర్ధిక స్వాతంత్ర్యం ఉన్న అహంకారంతో తప్పటడుగులు వేస్తున్నారు."
    "ఏయ్ ప్రవచనాలు చెప్పకు. ఇంట్లో అమ్మ ఇక్కడ నువ్వా.... అమ్మాయిలని అంత తక్కువ అంచనా వేయద్దు. మాకూ తెలుసు ఎలా ఎదుర్కోవాలో" గర్వంగా అంది.
    "ప్రవచనాలలో చెప్పేవి ఆనాటికే కాదు ఈనాటికీ ఆచరించదగ్గవే. అమ్మాయిలని వంటింట్లో కూచోమని ఎవరూ చెప్పడం లేదు. అతిగా పోయి గీత దాటితే నష్టం వారికే. అమ్మాయిలే ఎవరికి వారే లక్షణ రేఖలు గీసుకోవాలి."
    "అవును గౌతమ్. అన్నీ తెలుసునన్న పొగరుతో ప్రవర్తించాను. నువ్వు అర్ధం చేసుకోకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో " కార్తీక గొంతులో నిజమైన పశ్చాత్తాపం పలికింది.
    
                                                ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS