"మీరు....నేను....నేను...." అంటూ గబహరా పడ్తూ లేవబోయింది.
"లేవకమ్మా! ....పడుకో.....నీకేం భయం లేదు గాభరాపడకు, యిప్పుడెలా వుందమ్మా తెలివి వచ్చిందా కాస్త" అంటూ ఆరాటంగా ప్రశ్నించింది సరస్వతమ్మ.
"నే నెక్కడ వున్నాను....మీ రెవరు?" నీరసంగా అడిగింది సరోజ.
"రైల్లో నీవు జ్వరంతో తెలివిలేకుండా పడివుంటే ఒకావిడ తీసుకొచ్చిందమ్మా మా యింటికి. మా అబ్బాయి డాక్టరులే....ఈ మూడు రోజులనించి యిక్కడే వున్నావు..రైల్లో జ్వరం రావడం అది గుర్తుందా..." అంది సరస్వతమ్మ. ఆవిడ చెప్పింది వింటూ ఆశ్చర్యపోతూ తలాడించింది. అవును, రైలులో జ్వరం. రైలునించి దిగి రిక్షా ఎక్కడం - అంతా లీలగా గుర్తు వచ్చింది. కాని యిది డాక్టరు యిల్లయితే వీళ్ళు తనని యిక్కడెందుకు వుంచుకున్నారు...
"అమ్మా. మీ పేషంటు ఏమంటూంది, లేచిందా!" అంటూ కృష్ణమోహన్ లోపలికి వచ్చారు. "లేచిందిరా, మనుష్యుల్లో పడింది. తెలివిగానేవుంది. జ్వరం తగ్గినట్టుంది. చెమటలు పట్టాయి. వళ్ళంతా - కాస్త కాఫీనో హార్లిక్సో యిమ్మంటావా" అంది కొడుకుతో.
"కృష్ణమోహన్ దగ్గిరకి రాగానే సరోజ ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ "బావ బావ..." అంటూ అస్పష్టంగా గొణిగింది. ఆమె పెదాలు వణికాయి. కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. కావాలని ప్రయత్నిస్తూంటే సరస్వతమ్మ లేవనీయలేదు.
"ఏమిటమ్మా మావాడ్ని చూసి "బావా" అంటున్నావు. ఆ రోజుకూడ "బావా" అంటూ ఏడ్చావుట. మీ బావ యిలా వుండేవాడా? ఏ మయ్యాడు మీ బావ. అసలు నీవెవరి అమ్మాయివి....." ఆరాటంగా అడిగింది సరస్వతమ్మ.
సరోజ యింకా తెల్లపోతూ కృష్ణమోహన్ ని చూస్తుంది-బావ కాదు! బావ కాదు- అవును తన వెర్రి కాకపోతే చచ్చిపోయిన బావ, తన కళ్ళతో బావ శవాన్ని చూసిన తను యితన్ని బావని అనుకోవడం ఏమిటి....ఏమిటీ వింత? మనిషిని పోలిన మనుష్యు లుంటారంటారు. కానీ యింతలా పోలికలు ఎలా సంభవం? ఆమె మొహంలో ఆశ్చర్యాందోళనని గుర్తించి "మీరు నన్ను మీ బావగారనుకుని పొరబడ్డారు...కాని నేను మీ బావనికానని యిప్పుడైన గ్రహించారా....ఆరోజు జ్వర తీవ్రతతో వంటి మీద తెలివిలేని మీరు పొరపడ్డారు. కాని యిప్పుడే అర్ధం అవుతూందా నేను మీరనుకునే బావనికానని" అన్నాడు కృష్ణమోహన్.
"మీ బావ ఏమయ్యాడమ్మా..."
"చచ్చిపోయాడు....చచ్చిపోయాడు...."గొణిగింది సరోజ. తల్లి కొడుకులు మొహాలు చూసుకున్నారు. చచ్చి పోయాడనుకున్న బావని కృష్ణమోహన్ రూపంలో చూసిన సరోజ మనస్థితి గ్రహించి వారిద్దరి మనసులు ఆర్ద్రమయ్యాయి. ఆ స్థితిలో యింకా ఏమన్న అడిగి అంత నీరస స్థితిలో వున్న సరోజనిని ఉద్రిక్తత పరచడం మంచి కాదనిపించింది. 'అమ్మాయిని పడుకోనీయమ్మా, ఎక్కువ మాట్లాడించకు రేపు వాళ్ళ వాళ్ళెవరో వివరం అడగచ్చు, జ్వరం తగ్గుతూంది. రేపటికి పూర్తిగా తగ్గచ్చు, టైఫాయిడ్ ఏమో నని భయపడ్డాను గాని కాదు-' అంటూ సరోజ పల్సు అవి చూసి అక్కడనించి వెళ్ళిపోయాడు కృష్ణమోహన్.
ఆరో రోజు పత్యం తినిపించింది సరస్వతమ్మ సరోజకి! పత్యం తినిపిస్తూ సరోజ రావడం, కృష్ణమోహన్ ని బావా అని కౌగలించుకుని ఏడవడం, తరువాత తెలివి తప్పిపోవడం అంతా వివరంగా చెప్పింది. వింటూన్న సరోజ మొహం సిగ్గుతో కందింది. "ఛా అంత పిచ్చి దానిలా ఎలా ప్రవర్తించింది అతనేం అనుకున్నాడో..." అనుకుంది. సరస్వతమ్మకి కృతజ్ఞతగా ఏదో చెప్పాలని ఆరాటపడింది సరోజ. కాని ఏంచెపితే ఎలా చెపితే వాళ్ళు యీ ఆపద సమయంలోతనని ఆప్తురాలుగా చూసినదానికి సరిపోతుంది. వీళ్ళే లేకపోతే తన గతి ఏమయ్యేది! ఎవరో చూసి ఏ జనరల్ ఆప్సత్రిలోనో చేర్చేసి వుండేవారు. దిక్కుమొక్కులేని అనాధలా పడివుండేది. తల్చుకుంటే భయతో వళ్ళు జలదరించింది సరోజకి.
"మీరు చేసిన యీ సహాయానికి నేను మీకే విధంగానూ కృతజ్ఞత చూపలేనండీ, మీరే లేకపోతే..." భారంగా అంది సరోజ. "ముక్కు మొహం ఎరగని నన్ను యింట్లో పెట్టుకుని కన్నబిడ్డలా సాకారు. నేను మీకు బదులుగా ఏం చెయ్యగలను చెప్పండి" కళ్ళ నీరు తిరిగింది సరోజకి. "ఛా...అదేమిటమ్మా...నిన్ను యింట్లో పెట్టుకోటంలో నా స్వార్ధం వుందమ్మా...ఈ వారం రోజులు నిన్ను చూస్తుంటే....నాకు కాస్త మనశ్శాంతిగా వుందమ్మా" అంది సరస్వతమ్మ. సరోజ అర్ధంకానట్టు చూసింది. సరస్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ, "ఆరేళ్ళ తర్వాత మళ్ళీ నా సీతని చూసినట్టుందమ్మా నిన్ను చూస్తుంటే..."
"సీతా!..."
"సీత నా కూతురేలే అమ్మా, సీతకి, నీకు ఎంత పోలిక వుందో తెలుసా, నిన్ను చూడగానే ఆరేళ్ళక్రితం మా సీత గుర్తు వచ్చింది. నిన్ను అందుకే యింట్లో వుంచుకొన్నాను అమ్మా, నీవు మా సీతలా ఉండడం, మీ బావ మావాడిలా ఉండడం ఎంత విచిత్రమో చూడు....ఎప్పటిరుణాను బంధమో మాయింటికి నీవిలా రావడం..." అంటూ ఆరేళ్ళక్రితం చచ్చిపోయిన సీత గురించి అంతా చెప్పుకొచ్చింది. పదహారేళ్ళకే నూరేళ్ళు నిండిపోయిన కుమార్తె గురించి చెప్తూ ఏడ్చింది సరస్వతమ్మ.
కృష్ణమోహన్, తరువాత ఆరేళ్ళకి పుట్టిన సీత యిద్దరే సంతానం సరస్వతమ్మ, రంగనాధంగార్లకి. సంపదకి లోటులేదు. పిల్లలిద్దర్నీ అల్లారుముద్దుగా పెంచారు. కృష్ణ మోహన్ తల్లిపోలిక అయితే సీత తండ్రి పోలిక అదృష్టవంతులే వారు అనేవారు అంతా! కృష్ణమోహన్ విషయంలో అది నిజమేగాని సీత విషయంలో అది అబద్దమైంది. పట్టుమని పదహారేళ్ళు నిండకుండానే దురదృష్టం మశూచి రూపంలో వచ్చి సీతని పట్టుకుపోయింది. కొడుకుకంటే కూడ కూతురుపట్ల అపారమైన ప్రేమానురాగాలు వున్న రంగనాథంగారు ఆ దెబ్బనించి మరి కోలుకోలేకపోయారు. తింటున్నా తిరుగుతున్నా ఆయనని ఆ దుఃఖం లోలోపల దహించి దహించి కృంగదీసేసింది. ఏవేవో కంప్లైయింట్లు ఆరంభించి ఆయన మానసిక స్థితితోపాటు దేహస్థితి రోజు రోజుకీ దిగజారిపోయింది. కూతురికోసం కలవరించి కలవరించి కూతుర్ని వెదుక్కుంటూ మరో ఐదేళ్ళకి రంగనాధంగారు కూతురి దగ్గరికి వెళ్ళిపోయారు. గర్భశోకం నించి పూర్తిగా తేరుకోకుండానే భర్త మరణం. ఈ రెండు దెబ్బలతో సరస్వతమ్మ మంచం పట్టేసింది. 'ఎవరికోసం బ్రతకను, నా కింత విషం యీయరా నాయనా' అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్చేది. రోజుల తరబడి నిద్రాహారాలు లేకుండా ఏడ్చేది. 'అమ్మా, మంచిదే. మీరంతా ఎవరి దారి వాళ్ళు చూసుకుని వెళ్ళిపొండి, నన్నెవరికి అప్పగించి వెడతావో వెళ్ళు.' అన్నాడు కృష్ణమోహన్ కళ్ళనీళ్ళతో కొడుకు మొహంచూసి కనీసం ఆ కొడుక్కోసమన్నా తను ఇంకా కొన్నాళ్ళు బ్రతకడం తప్పనిసరి అని అర్ధం చేసుకుంది సరస్వతమ్మ. ఎంత గుండె దిటవుపరుచుకున్నా ఆ దుఃఖం మరిచి పోగలిగేదా!
