"రైట్..." ప్రబంధ నుదుట స్వేదం పేరుకుంటోంది.
"క్వశ్చన్ నెంబర్ త్రీ.... ప్రపంచంలో తొలిసారి రక్తప్రసరణ గురించి తెలియచెప్పిన డాక్టర్ ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్ టెడ్జీరూజ్ వెల్ట్ కి, టెడ్డీ బియర్స్ కీ సంబంధం ఏమిటి?"
ఆడిటోరియంలో కూర్చున్న సూరికి అర్ధమైపోయింది.
ఆదిత్యని కన్ ఫ్యూజ్ చేసే ప్రయత్నంగా పొంతనలేని ప్రశ్నల్ని గుప్పిస్తోంది ప్రబంధ.
"క్రీస్తుశకం 1628లో బ్రిటీష్ ఫిజీషియన్ విలియం హార్వే రక్తప్రసరణ గురించి కనుక్కోగలిగారు. ఇకపోతే మీ రెండో ప్రశ్నకి జవాబు యు.ఎస్. ప్రెసిడెంట్ టెడ్డీ రూజ్ వెల్ట్ క్రీ.శ.1902లో మిస్సిసిపీ అడవులకి వేటకి వెళ్ళాడు. అక్కడ ఎలుగుబంటి పిల్ల పైకి దుముకుతూ వచ్చినా దాన్ని షూట్ చేయటానికి తిరస్కరించాడు. వాషింగ్టన్ న్యూస్ పేపరు ఓ కార్టూన్ లా ప్రచురించింది. బోస్టన్ షాప్ కీపర్ ఆ కార్టూన్ ఆధారంగా ఎలుగుబంటి బొమ్మల్ని తయారుచేసి వాటిని 'టెడ్డీ బియర్స్' అన్న పేరుతో మార్కెట్లో విడుదల చేశాడు. ఆ టాయ్స్ అమెరికాలో చాలా ప్రసిద్ది చెందాయి."
రెండు క్షణాలపాటు గొంతు పెగల్లేదు ప్రబంధకి.
ఆ సమయంలో సూరి పెట్టిన కండిషన్ ఆమెకు గుర్తుకురాలేదు. తిరుగులేని రాజసానికి గండిపడుతోంది. అదీ ఇన్ని వందలమంది సమక్షంలో!
ప్రశ్నలు మరింత జటిలంగా వుండాలని తీర్మానించుకుంటూ అడిగింది. "చట్టంలో మనం తరచుగా వాడే 'హెబియస్ కార్పస్' అనే పదానికి మూలం ఏది? ఎప్పుడు ఎలా అమలులోకి వచ్చింది?"
నిశ్శబ్దంగా అరా నిముషంపాటు చూస్తూ వుండిపోయాడు ఆదిత్య.
ఇది క్విజ్ లా లేదు. క్విజ్ మాత్రమే అయితే ఇబ్బందికరమైనా సూటిగా జవాబులు చెప్పగల ప్రశ్నలే అడిగేది.
"బ్రిటన్, అమెరికాలే కాక మనదేశంతోబాటు ఇంగ్లీషు మాట్లాడే చాలాదేశాల్లో ఉపయోగించే హెబియస్ కార్పస్ యాక్ట్ 1879 లో బ్రిటన్ లో తొలిసారి చట్టంగా అమలు అయింది. దానిక్కారణం ఓ ఆడ గూండా..." అన్నాడు ఆదిత్య.
"ఆడ గూండా" అన్న పదం ఆడిటోరియంలో చిత్రంగా ప్రతిధ్వనించింది విద్యార్ధులు విజిల్స్ ప్రారంభించారు.
ఆ పదం కేవలం తనను ఉద్దేశించి అన్నట్టే భావించిన ప్రబంధ నిశితంగా చూసింది ఆదిత్యవైపు.
"నోటోరియస్ రౌడీ లేడీ ఆలిస్ రాబిన్ సన్ ఓ పార్టీలో చేస్తున్న అల్లరికి ఒళ్ళు మండిన ఓ పోలీస్ కానిస్టేబుల్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశాడు. తర్వాత చాలా రోజులకి ఆమెని విచారణకి కోర్టుకు తీసుకొచ్చారు. కటిక నేలపైన పడుకోబెట్టి, బట్టలువిప్పి, ఒంటిపై వాతలు పెట్టిన పోలీసుల బార్బరిక్ ట్రీట్ మెంటు గురించి ఆమె చెప్పినప్పుడు రౌడీలేడీ అయినా ప్రజలు చాలా ప్రతిస్పందించారు. దానితో వారెంట్ లేకుండా ఆమెను అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ ని తర్వాత జైలుకి పంపారు. ఆలిస్ రాబిన్ సన్ మూలంగా అలాంటివి చాలా కేసులు చట్టం దృష్టికి వచ్చాయి. దానితో విచారణ లేకుండా ఖైదు చేసిన వ్యక్తుల్ని రక్షించే వుద్దేశంతో హెబియస్ కార్పస్ యాక్ట్ సృష్టించారు. హెబియస్ కార్పస్ అనే ఓ లాటిన్ ఫ్రేజ్.... దాని అర్ధం "లెట్ ది బాడీ బీ బ్రాట్ బిఫోర్ ది జడ్జ్."
"హిపిప్ హుర్రే!" సూరి కేకకి శ్రుతి కలిపారు చాలామంది విధ్యార్ధులు.
తనకు ఎవరూ ఎదురు నిలవలేరు అనుకున్న ప్రబంధకు తన ఎదురుగా వున్నతను సామాన్యుడు కాడని అర్ధమయింది.
ఆమె దృష్టి అసంకల్పితంగా సూరివైపు మళ్ళింది.
రోషం, ఉక్రోషంతో నలిగిపోతూ వాచ్ కేసి చూసింది. అయిదూ నలభై అంటే ఇక మిగిలింది అయిదు నిమిషాలు. కనీసం ఒక్కటంటే ఒక్కటి అతను జవాబు చెప్పలేని ఒక్క ప్రశ్ననైనా అడగలేకపోయింది.
"తొలిసారి స్టెత్ స్కోప్ ని కనిపెట్టింది....?"
"మనిషికి సహజమైన బిడియం మూలంగా" టక్కున అన్నాడు ఆదిత్య.
ప్రశ్నని మధ్యలోనే ఖండించడాన్ని ప్రబంధ అంగీకరించలేకపోయింది. పైగా తననే ఓ బిడియంలేని మనిషిలా అతను చూడటాన్ని సహించలేకపోయింది. "వాట్ డు యూ మీన్?"
"ఎస్ మిస్ ప్రబంధా!" మనిషికి సహజంగా వుండే బిడియం చాలా సమస్యల్నుంచి కాపాడుతుంది. చరిత్రాత్మకమైన సంఘటనలకి కారణమవుతుంది.
"ఈ స్టేట్ మెంట్ ఎవర్ని వుద్దేశించి సెలవిస్తున్నట్టూ?" సర్కాస్టిక్ గా అడిగింది.
"క్షమించండి! నేను చెబుతున్నది మీ ప్రశ్నకి జవాబు" ప్రసన్నంగా అన్నాడు. "పందొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచి ఫిజీషియన్ రెన్ లీనెక్ ఓ సమస్యని ఎదుర్కొన్నాడు. ఆ రోజుల్లో డాక్టర్లు చెవిని ఆనించి గుండెచప్పుడు వింటూ హృద్రోగాలను నిర్ణయించేవారు. ఒకనాడు ఓ అందమైన వయసులో వున్న అమ్మాయి లీనెక్ దగ్గరికి వచ్చి తన జబ్బు గురించి చెప్పింది. లక్షణాలను బట్టి హృద్రోగంగా అనిపించడంతో ఏ ఆచ్చాదనా లేని ఆమె గుండెపైన చెవి పెట్టి వినాల్సిన స్థితి చాలా బిడియంగా నిలబడిపోయాడు. తర్వాత ఆమె గుండెచప్పుడు ఏవిధంగా వున్నదీ తెలుసుకోడానికి ఓ న్యూస్ పేపర్ని గుండ్రంగా చుట్టి ఆమె గుండెపైన వుంచి రెండో రంధ్రం దగ్గర చెవి వుంచి విన్నాడు అంతే! ముప్పై సెంటీమీటర్ల పొడవు ఉన్న ఓ వెదురుబొంగుని గొట్టంలా తయారుచేసి దానితో అలాంటి సమస్యని పరిష్కరించి, అలా స్టెత్ స్కోప్ పుట్టుక్కి కారణమయ్యాడు."
ఓటమిలాంటి స్థితి.
నిభాయించుకోలేకపోయింది.
చివరి ప్రశ్నతోనైనా అతన్ని కంగారు పెట్టాలి.
అసలు ప్రబంధ అలాంటి ప్రశ్న అడుగుతుందని విద్యార్ధినులేకాదు, ఆమె అన్నయ్య శౌరి కూడా వూహించలేకపోయాడు.
"వాత్స్యాయన కామసూత్రాలలో సాంప్రయోగికం అనే..." చాలా ఇబ్బందిగా పదాల్ని కూడగట్టుకుంది. "రెండో అధికరణంలో పదకొండో అధ్యాయంలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయి? అందులో చివరి అంశం ఏది?"
అవాక్కయిపోయాడు ఆదిత్య.
అతను తేరుకునేలోగా నలభై అయిదు సెకండ్ల వ్యవధి దాటిపోయింది.
