మొదటిసారి అతను ముద్దు పెట్టుకున్నప్పుడు నేను పొందిన తన్మయత్వం గుర్తొచ్చి నా కంట్లో నీరు తిరిగింది. 'వర్జిన్ కిస్సెస్ ట!' ఎంత గర్వం!
"సందీప్... ఎవరు చెప్పారు నీకు నేను వర్జిన్ అని? నువ్వు నన్ను ముట్టుకున్న మొదటి మగవాడివి ఎంతమాత్రంకాదు! అలా అని నువ్వనుకుని ఉంటే ఫూలయ్యావన్నమాట" అని గబగబా క్లాస్ కి వచ్చేశాను.
కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి. ఐనా గుండెకి ఎంతో సెవ్వనగా ఉంది. తనే నాకు మొదటివాడే ననుకుంటున్న అతని గర్వాన్ని దెబ్బకొట్టినందుకు నన్ను నేనే అభినందించుకొన్నాను. తను మాత్రం ఎక్స్ పీరియన్స్ గైన్ చెయ్యాలీ, ఆడపిల్ల మాత్రం వర్జిన్ అయి వుండాలీ! ఎంత మేల్ ఈగోయిజమ్!"
వెడ్డింగ్ కార్డ్ చూస్తుంటే బాధ రెట్టింపవుతోంది.
చిత్రా, వైజూ దగ్గరకొచ్చారు.
చిత్ర నా కళ్ళుతుడిచి "వెడ్డింగ్ కార్డు ఇచ్చి పెళ్ళి...అని పిలవగానే యెగురుకొంటూ వెళ్ళిపోతాం అనుకుంటున్నాడు పాపం!" అంది కసిగా.
"వెళ్దాం" కొంచెం గట్టిగా అన్నాను.
"ఏవంటున్నావ్?" వైజూ ఆశ్చర్యంగా అడిగింది.
"వెళ్దామనుకుంటున్నాను" అన్నాను.
వాళ్ళిద్దరి కళ్ళల్లో ఆశ్చర్యాన్ని గమనించి చెప్పాను.
"ఫ్రెండ్ షిప్ ఈజ్ స్మూతింగ్ ఆఫ్ ది పాత్ వెన్ ది గోయింగ్ బికమ్స్ రఫ్"
* * *
సందీప్ నన్ను పెళ్ళికి ఎందుకు పిలిచాడో అర్థమయింది. నాలాగే చాలామంది అమ్మాయిల్ని పిలిచాడు. పెళ్ళికి వచ్చిన అమ్మాయిల్లో సగం మంది అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే అతిశయోక్తిలేదు! అతను అదో పెద్ద ఎచీవ్ మెంట్ లా భావిస్తున్నాడనుకుంట!
ప్రేమ పెద్ద అందగత్తెకాదు. కానీ అతని ఉద్దేశం ప్రకారం వర్జిన్ అయి వుంటుంది. శీలం...పవిత్రతా... అవి శరీరాల్లోనే ఉంటాయనుకుంటారు చాలామంది మగవాళ్ళు. "అన్నయ్యగారు" అంటూ పరాయిమగవాళ్ళతో గంటలతరబడి మాట్లాడేవాళ్ళనీ, క్రికెట్ స్టార్స్, సినిమా స్టార్స్ ఫోటోలకి ముద్దులు పెట్టే భార్యల్నీ తప్పు పట్టరు.
ఎవరయినా పరాయిమగవాడి పక్కసీట్లో భార్య సినిమా హాల్లో కూర్చోవలసి వచ్చినా ఒప్పుకోరు!
ఆ మూడు గంటల్లో ఆమె శీలం చెడిపోతుందని అతని భయం.
వీళ్ళు మాత్రం బస్సులో పరాయి ఆడవాళ్ళని రాసుకుంటూ ముందు నుండే దిగుతారు!
కోటీశ్వరుల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఎంత ఆడంబరంగా జరుగుతాయో తెలిసినట్టయింది. ఒక్కొక్కళ్ళనీ సీల్ చేస్తే అంధ్రప్రదేశ్ మేప్ మొత్తం బంగారంతో నింపి స్వర్ణాంధ్రప్రదేశ్ అని ప్రూవ్ చేయచ్చు! నాకు ఈ మధ్య మరీ పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తున్నాయి.
సందీప్ మా నాన్నకి అల్లుడైతే అతని పెళ్ళి ఎలా జరిగేదీ...అని ఆలోచించి నవ్వుకున్నాను.
చిత్రా, వైజయంతీ వచ్చినవాళ్ళ నగలూ, చీరలూ ఫుల్ ఎంజాయ్ మెంట్ తో చూసి చర్చించుకుంటున్నారు.
ఈ జీవితం అనే మ్యూజికల్ చైర్స్ ఆటలో గెలుపు ఎవరిదో చివరివరకు తెలీదు.
* * *
"ప్రతాప్ వాళ్ళ వూరు యెప్పుడు వెళదాం?" అడిగింది వైజయంతి.
"ఈ శనివారం కర్నూలు వెళ్తానేమో!" అన్నాను.
"ఈ శనివారం మనం ప్రతాప్ వాళ్ళ ఊరువెళదాం. తర్వాతవారం నువ్వు కర్నూలు వెళ్దువుగాని" అంది చిత్ర.
నేను అయిష్టంగా మొహం పెట్టాను.
"పోనీ టాస్ వేద్దాం... బొమ్మపడితే కర్నూలు... బొరుసుపడితే నిజామాబాదు" అంటూ తన దగ్గరున్న రూపాయి బిళ్ళ తీసింది వైజయంతి.
నా భవిష్యత్తు అంతా ఆ బిళ్ళమీదే ఆధారపడి ఉన్నట్లు నేను ఊపిరి బిగబట్టి చూస్తున్నాను.
బొమ్మపడాలి... బొమ్మ...
బొరుసు పడింది! ఉస్సూరుమన్నాను.
వైజయంతి కళ్ళల్లో ఎనలేని మెరుపు!
చిత్ర హుషారుగా "ఇంకేం చెప్పొద్దు... మాటంటే మాటే! ప్రయాణానికి సిద్ధమైపో. కావాలంటే నేనొచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను" అంది.
నేను వైజూ వైపు చూశాను.
'ప్రేమించనట్లు నటిస్తే ఏ బాధ లేదు! ప్రేమిస్తేనే బాధ...' అని ప్రతాప్ కి వీడ్కోలు ఇచ్చి వస్తున్న సందర్భంలో అది అన్న మాటలు గుర్తొచ్చాయి.
ప్రేమించడం అంటే... ప్రతిరోజు గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకోవడం. దూరంగా ఉన్నామన్న విరహం అంతా కాయితాల నిండా నింపి పోస్ట్ చేయడం, కలిసి చెయ్యీ చెయ్యీ పట్టుకుని పార్కుల చుట్టూ, సినిమాహాళ్ళ చుట్టూ తిరగడం... ఇవన్నీ కావు!
'ఇట్ ఈజ్ నాట్ ది వర్డ్స్, బట్ ది థాట్ బిహైండ్ దెన్ కీప్స్ ది బాండ్ ఆఫ్ లవ్ స్ట్రాంగ్ అండ్ ట్రూ'.
'అతని ఆలోచననీ నిత్యజీవనాన్ని ఉత్సాహభరితం చెయ్యడమే నిజమైన ప్రేమ!" చిన్నక్క డైరీలో రాసింది అదే. ఆ చంద్ర ఎవరో చాలా దురదృష్టవంతుడు. అంతటి ప్రేమమయిని పోగొట్టుకున్నాడు!
ఇప్పుడు అతని ఉనికి కావాలనుకునే ఓ ఆడపిల్లకి దొరక్కుండా దాక్కున్నాడు. నాకు చిన్నప్పటినుంచీ 'దాగుడుమూతలు' అనే ఆటంటే ఇష్టంలేదు. అయినా పెద్దయ్యాక కూడా తప్పడం లేదు. ఎంత కష్టం అయినా ఎక్కడదాక్కున్నా పట్టుకోక తప్పదు.
