Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 71


    కబుర్లు అయ్యాక, "మీరింకా అమ్మాయిని చూడనేలేదు" అని కూతుర్ని పిలిచాడు శంకరరెడ్డి. హరనాధరెడ్డి లోనకి వెళ్ళి స్వప్నరాగలీనని తీసుకొచ్చాడు.
    చిరునవ్వు ముఖంతో మౌనంగా చేతులు జోడించి కూర్చుంది.
    రెప్ప వెయ్యకుండా ఆమెవంక చూస్తూ వుండిపోయాడు వీరారెడ్డి.
    "యేమిటి వీరారెడ్డిగారూ మా వూరు యెలావుంది? మీ ప్రాంతం వూళ్ళలా వుండవు ఇటువైపు వూళ్ళు" అన్నాడు హరనాధరెడ్డి.
    "మీ డెల్టా భూముల ఐశ్వర్యం తెలిసిందేగా __ నేను యిటు ప్రాంతంలో చాలాకాలం జాబ్ చేసినాను లెండి" అని శంకరరెడ్డి వైపు తిరిగి, మా వాడు మీ అమ్మాయి గురించి అన్నమాట గుర్తున్నది బావగారూ, నాకూ అదేమాట అనాలనిపిస్తున్నది" అని తృప్తిగా సంతోషంగా చిరునవ్వు నవ్వాడు వీరారెడ్డి!
    శంకరరెడ్డి సంతోషంతో పొంగిపోతూ, "అమ్మా నీ గురించి వీళ్ళబ్బాయి యేమన్నాడో తెలుసా?" అన్నాడు సంతోషం పట్టలేక.
    "వాళ్ళబ్బాయిగారు సీమ దేశాలన్నీ చూసి రాగలిగారు గానీ ఆ మనిషివి వుత్త గుడ్డికళ్ళు నాన్నా!" అని చిరునవ్వు నవ్వి__లేచి వెళ్ళింది లోనకి.
    ఆ నవ్వు, ఆ రూపం, ఆ నడక__ వీరారెడ్డి చెవుల్లో కళ్ళలో నిలిచిపోయాయి.
    వ్యవసాయం, పోలీసు వుద్యోగం కబుర్లలోకి దిగారు.
    పది నిమిషాలు.
    "కతికితే అతకదంటారు. మీరు అభోజనంగానే వెళ్ళిపోవాలి. లేదూ మా తమ్ముడి యింట్లో భోంచేసి వెళ్దురు" అన్నాడు శంకరరెడ్డి.
    "చిట్టితల్లి నాకూ కూతురే. మన చిన్నత్త యింట్లో యేర్పాటు చేస్తాను" అన్నాడు హరనాధరెడ్డి. అతనికి ముగ్గురు కొడుకులు. ఆడ సంతానం కలగలేదు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న డియస్పీ అదివరకు నా దగ్గిర సి.ఐ.గా చేస్తుండేవాడు" అని లేస్తూ "ఆడపెళ్ళివారు శ్రమ మీకే యెక్కువ వుంటుంది. మీ వీలునుబట్టి ముహూర్తం నిశ్చయించి రెండువారాలు ముందుగా తెలియపరచండి" అని బయటికి నడిచాడు వీరారెడ్డి. అన్నదమ్ములిదరు కూడా నడిచారు.
    హరనాధరెడ్డి వీరారెడ్డితో పాటు బస్సెక్కి, "నాకు టౌన్లో కాస్త పని వుందిలెండి" అని కూడా వెళ్ళి, అతనిని డియస్పీ ఇంటివరకూ పంపించాడు.
    స్వప్నరాగలీన ఆ రెండో రోజునే అంది అనంత్ రెడ్డితో__ "పెళ్ళి అంటే టాంటాం వ్యవహారం కాదు. నేనెవర్నీ పిలవను. పెద్దల ముచ్చట తీర్చటం__ అంతే. వాళ్ళెవర్ని పిల్చుకుంటే ఆ మేరకే. మీరు మీ మిత్ర సైన్యాన్ని పిలుస్తున్నారా? యెందరుంటారు? ఆడపెళ్ళివాళ్ళం కదా__వచ్చే జనాభా యెంతో తెలియాలి. మీ నాన్నగారిచ్చే లిస్టులో చేర్చండి. లేకపోతే ఆనక, మమ్మల్ని ఒకపూట తిండైనా సరిగా పెట్టలేకపోయారు అని మీవాళ్ళు మెచ్చుకోగలరు" అని నవ్వింది. ఆమె అభిప్రాయం అలా అని తెలిసి అంతవరకు ప్రత్యేకం యేమీ అనుకోని అనంత్ రెడ్డి తనూ యెవరినీ ఆహ్వానించ దలచలేదు.
    శ్రీపతి యెక్కిన ఎక్స్ ప్రెస్ బస్సు ఉదయం ఆరింటికి ఏలూరు చేరింది. శ్రీపురం వెళ్ళటానికి యే రూటు బస్సు యెక్కాలో వాకబు చేశాడు. బస్సు మరో పావుగంటకే వున్నట్లు చెప్పారు.
    అరగంట ప్రయాణం. శ్రీపురం రోడ్డుకి పక్కనే వుంది. పరిసర ప్రాంతాలంతా పంటభూములు.
    శ్రీపతి తను ఫలానా అని చెప్పగానే, ఆ పక్కనే వున్న హరనాధరెడ్డి "రండి రండి. యెవర్నీ పిలవలేదని చెప్పింది చిట్టితల్లి." అన్నాడు.
    "అవునండీ, స్వప్న యెవర్నీ పిలవదు. నేను పిలవకుండానే వచ్చాను వీళ్ళ పెళ్ళి చూడాలనిపించి" అన్నాడు శ్రీపతి.
    పకపకా నవ్వి "మా చిట్టితల్లి మీ గురించి చెప్పిందిలెండి" అన్నాడు.
    రెండో పినతండ్రి నాగిరెడ్డి ఢిల్లీలో మీటింగుకి వెళ్ళి వుండిపోయాడు. అతనికి టెలిగ్రాం పంపించాడు. అతని భార్య హైదరాబాద్ నుంచి మూడురోజుల క్రితమే వచ్చింది.
    "యిక్కడ మీకు వసతిగా వుండదు. మా యింట్లో బస చేద్దురు__"
    అతను ముగించకుండానే అందుకుని, "యింత చక్కటి పెద్ద మహల్ లో బావుండదంటారా__" అని నవ్వి, హరనాధరెడ్డిని అనుసరించాడు శ్రీపతి.
    మూడు నిమిషాల నడక,
    చిన్న డాబా, పెద్ద దొడ్డి. చెట్లు పూల మొక్కలు. ఒకప్రక్కగా కుటీరం లాంటి ఎత్తైన గోడల రెల్లుపాక.
    ఆ పాకలోకి తీసుకెళ్ళాడు.
    దాన్లో అడుగు పెట్టగానే, విస్తుపోయి చూసి, "యింక నా సంగతి మీరు పట్టించుకోనక్కరలేదు. భోజనం కూడా అక్కర్లేదు" అన్నాడు శ్రీపతి.
    "మీ పుణ్యం. అతిథి సత్కారం సక్రమంగా జరగకపోతే దేవతలు శపిస్తారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మీరు పట్టించుకోకపోయినా __" అని, "అది బాత్రూం. ముందు స్నానం కానివ్వండి. రాత్రంతా బస్సులో ప్రయాణమాయె." అన్నాడు.
    తన ఆసక్తిని వాయిదా వేసి బాత్రూంలోకి వెళ్ళాడు.
    కాలకృత్యాలు ముగించాడు. గోరువెచ్చని నీళ్ళ స్నానం. మైసూర్ శాండల్ సబ్బు, ఇంగ్లండ్ లో తయారైన క్యామీ సబ్బు వుంటే__యేది వాడాలా అని సందిగ్ధంలో పడి__స్వప్నరాగలీన ఒంటినుంచి చందనం తప్ప మరే పరిమళమూ యెన్నడూ రాకపోవటం గుర్తొచ్చి__ శాండల్ సబ్బు ఒంటికి పట్టించాడు. తన తువ్వాలు తియ్యాల్సిన పని రాకుండా__ కొత్త మాయని ఇస్త్రీ మడత__బొచ్చు తువ్వాలుంది సిద్ధంగా.
    కూడా తెచ్చుకున్న బ్రీఫ్ కేస్ తెరిచి పొట్టిచేతుల టీషర్టు పైన ప్యాంటు వేసి బెల్టు బిగించాడు.
    అంతలో__ఇడ్లీలు, ఉప్మా, పెసరట్లు__ పనిమనిషి తెచ్చి బల్లమీద పెట్టి వెళ్ళాడు.
    'ఇవన్నీ నా ఒక్కడికా!' అనుకుంటూండగా, లేత నీలం రంగు గాజు కూజా అదే రంగు గాజుగ్లాసులు తెచ్చి బల్లమీద పెట్టి వెళ్ళాడు.
    ఒక ఇడ్లీ కారప్పొడీ నేతి చుక్కలో తిని, పెసరట్టు తుంచుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS