"ఇంకొక్క మాట పేలితే నీ ప్రాణం తీసి ఈ ఐదో అంతస్తు మీద నించి నీ శరీరాన్ని రోడ్డుమీదకి విసిరేస్తాను" అతను పెదిమని కొరుక్కున్నాడు.
"అంతకంటే ఏం చేయగలవు రా!"
ఈడ్చిపెట్టి ఆమె చెంపల పైన కొట్టాడు. కాలితో ఆమె గుండెల పైన తన్నాడు.
"అమ్మ!" ఆవేదనతో అరిచింది భారతి.
తోటి ఆడపిల్లని కళ్ళముందు అతను పెడుతోన్న హింసని సహించలేకపోయింది శిరీష. అంత తాగిన నిషాలోనూ ఆమెకి అంతా తెలుస్తూనే వుంది.
"ప్రశాంత్ !వ్వాట్ ఆల్ దిస్ హెల్!స్టాపిట్" అరుస్తూ వెళ్లి అతన్ని పట్టుకుంది.
శిరీషని తోసేసి భారతి జుత్తుని పట్టుకుని గుమ్మం వరకు ఈడ్చుకెళ్లి తలుపు తీసి బయటకు నెట్టి తలుపు వేసేశాడు.
"బ్లడీ బిచ్!" అతను కోపంతో అనుకొంటూ అడుగు ముందు కేయబోయాడు.
ఎదురుగా శిరీష.
చేతిలో ఎయిర్ బ్యాగ్.
"ఎక్కడికి!" ఆశ్చర్యంగా అడిగాడు.
"వెళ్తున్నాను" అంది శిరీష.
"ఎందుకని?"
"కళ్ళతో చూసాక, నీ మాటలు విన్నాక ఇంకా ఇక్కడ ఎలా వుండగలననుకొన్నావు!"
"భారతిని చూసి నువ్వు ఏదో అనుకొంటున్నావు శిరీ! అవన్నీ కాగితపు పూలు" ఆమె దగ్గరికి రాబోతూ అన్నాడు ప్రశాంత్.
"న్నో! భారతి కాగితపు పువ్వు కాదు ప్రశాంత్.
ఆమె "మరువం" లాంటిది.
నా కళ్లు తెరిపించింది' అని అతన్ని తప్పించుకొని తలుపు తీసి బయటికి నడిచింది.
గుమ్మంలో నించుని తనకేసి కోపంగా చూస్తున్న అతన్ని "ప్రశాంత్" అని పిలిచింది శిరీష.
అ వరండాలో ఎవరూ లేరు. లిఫ్ట్ తలుపు తెరచి వుంది.
అతను ఆమె దగ్గరగా వచ్చాడు.
అతని వంకే చూస్తూ పెదిమలు ఒంకర్లు తిరిగిపోయేలాయ
"రాస్కెల్" అంది. అతను ఊహించనంత వేగంతో ఆమె చేతిని గాలిలోకి విసిరింది. అతని చెంప ఛెళ్ మంది.
అతను తేరుకొనేలోగా లిఫ్ట్ లోకి పరుగెత్తి తలుపు మూసేసింది శిరీష.
3
బస్సుగానీ, ఆటోగానీ ఎక్కాలన్న ధ్యాసకూడా భారతికి కలగలేదు.
గుండె లోతుల్లోంచి ఉద్వేగంతో తన్ను కొస్తున్న దుఃఖాన్ని కంఠం దగ్గర నొక్కి పెట్టడానికి ప్రయత్నిస్తూనే నడుస్తోంది భారతి.
మనసు అల్లకల్లోలంగా వుంది. కళ్లలోనించి వెల్లువలా పొంగడానికి సిద్దంగా వున్న కన్నీటిని అదుపు చేసుకోడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.
అతను.... ఆ ఛండాలుడు వంచనతో మోసం చేశాడన్న దాని కన్నా చేసిన అవమానాన్ని భరించలేక పోతోంది.
ప్రశాంత్ లాంటి ప్రముఖ రచయిత తనని ప్రేమించాడని మురిసి పోయింది.
తన అదృష్టానికి తనే ఎంతగానో మురిసిపోయింది.
"నువ్వు నా ఎదురుగా వుంటే ఈ ప్రపంచాన్నే జయించగలను భారతీ!" అన్న ప్రశాంత్ మాటల్ని ఎంత వెర్రిగా నమ్మింది.
నిజంగా తనో పెద్ద ఫూల్.
మధ్యాహ్నం వరకూ తనకి నెల తప్పిన విషయం ఆమెకి తెలీదు.
మధ్యాహ్నం లంచ్ అవర్లో వాంతి చేసుకుంది. వికారంగా, తల విసురు మొదలైంది. తన కొలీగు రాజి అంది "పుస్తకాల పురుగు కదా! పాడు నవలలన్నీ రాత్రి పగలు లేకుండా చదివి పైత్యంచేసి వుంటుంది."
"అంతేలే! లేకపోతే "వేవిళ్లు" అనుకొంటామేమిటి?" నవ్వింది నాగమణి.
"నిజమే పెళ్లయిన అమ్మాయి అయితే అలాగే అనుకునేవాళ్ళం. దీనికి పెళ్లికాలేదుగా!" అంది సత్యవతి.
"వేవిళ్లు రావాలంటే పెళ్లేకావాలా?" పగలబడి నవ్వేసింది పద్మ.
ఆ మాట వినగానే ఉలిక్కిపడి కెవ్వున అరవబోయి గొంతుని నొక్కేసుకుంది భారతి.
భయంతో కంపించిపోయింది.
"ఎలా వుందిప్పుడు?" అడిగింది స్నేహితురాలు రాణి.
"ఫర్వాలేదు. రాత్రి నిద్రపోలేదు. అందుకని కళ్లు తిరిగి ఇలా అయింది" సర్ది చెప్పింది కానీ జరిగింది ఏమిటో తనకి అర్దమైపోయింది.
తను ఆరాధిస్తున్న వ్యక్తికి ప్రేమతో తనని తాను అర్పించుకొన్న దానికి 'అది' తను పొందిన బహుమతి అని భారతి తెలుసుకొంది.
ఆ బహుమతిని తను దాచిపెట్టలేదు. అది రోజు రోజుకీ పెరుగుతుంది.
