ధనిక వర్గాల పుత్రులు రంగురంగుల, రకరకాల కలలు కానవచ్చును గానీ పోలీసు బలప్రయోగానికొక్కటే అర్థం ఉంది. పక్వంకాని మనస్సులతో పసికుర్రాళ్ళేమయినా చెయ్యవచ్చును గాని ఊచకోతదాకా వచ్చిందంటే ఏదో గొప్ప కారణమే ఉండి తీరాలి. వచ్చిన చిక్కేమిటంటే, కుర్రాళ్ళు తమాషాకే ప్రారంభించి ఉండవచ్చుగాని పట్టుదల వదలమంటున్నారు. వెర్రివల్లనో, విసుగు వల్లనో ప్రారంభించినా చావో రేవో తేల్చుకుంటామంటున్నారు. ఊరికే ఇందులోకి దిగి ఉంటే, త్వరలోనే అంతా సర్దుకుంటుంది.
డెన్ఫర్ వద్ద మళ్లీ స్టూడెంట్లూ, టీచర్లూ గుమిగూడారు. "జులుం నశించాలి" అని అరుస్తూ మళ్లీ నడుస్తున్నారు.
సాయంత్రానికి చాలా మొఖాలు తెల్లగా అయ్యాయి. బాష్పవాయువుకి తట్టుకోవడానికి టాల్కం పౌడరు రాసుకోవడం వల్ల అలా అయింది. చాలామంది నిమ్మరసంలో ముంచిన జేబురుమాళ్లను నోళ్ళకీ, ముక్కులకీ కట్టుకుంటున్నారు. కొందరు రంగద్దాలు ధరించారు. ఈ సాయంత్రం చలిగా ఉండడం వల్ల చురుగ్గా అడుగు వేస్తున్నారు. పోలీసులు అడ్డురాకుంటే ఇంటర్నేషనల్ పాడుతూ వెచ్చదనం అనుభవించగలరు.
ఎన్నో ఇజాల దేవదూతలు_ మొద్దుబారిన భావనా పరికరాలకు మెరుగులు దిద్దుకుంటూ, వేరువేరు మతాలకు జీవితాలనంకితం చేసుకున్నవాళ్ళు. ఎవరూ వాళ్ళని లక్ష్యపెట్టరు.
కాని, మొన్న నాన్ టెర్ వద్ద, పాత విప్లవాల బూడిదలోంచి కొన్ని నిప్పు కణాలు రాజుకునేటట్టు చేశారు. కాదనడం, మైలపరచడం తాత్కాలికంగా ఒక వాదం అయింది. నియమాల ధిక్కారమే ఆయుధమయింది. ఎన్నో భూగర్భపు మందపు పొరలలో అట్టడుగున పడిపోయిన అతి సూక్ష్మ సత్యం మట్టినీ మురికినీ చీల్చుకుంటూ మీదికి వచ్చింది.
అసహ్యమే వాళ్ళ దైనికాహారం. ఆయుధం. యూనివర్శిటీ-ఫ్యాక్టరీ యొక్క అసందర్భత పట్ల అసహ్యం. ఏడువేల ముసుగులను చీల్చుకు వచ్చిన మాటలకి యూనివర్శిరీ-దేవళంపదును చెక్కింది. అప్పుడు మాటలు చేతలయ్యాయి. అప్పుడు (అప్పుడు మాత్రమే) ఇతరులు కూడా జల్దుకున్నారు- నమ్మలేకపోయినా, మొహమాటంతో నయినా; మబ్బు కళ్ళతోనూ, మహోత్సాంతోనూ!
చాల సులువయిన ప్రయాణం. సాహసోపేతమైన ప్రశ్నల వర్షం ముందు అధికారం చతికిలబడింది. ఆ మీదట పోలీసులు ప్రవేశించారు.
గాయపడ్డ క్రూర జంతువును వెంటాడడంలో, చిన్న చిన్న గర్భ గుడులలో నీడకట్టు జీవితాల నుంచి ఆరాధ్య దేవతల్ని నిరాకరించి గుంపులు గుంపులుగా అంతే వాసులు కలుసుకుంటున్నారు. 22 మార్చి. తేలికయిన, భయంకరమైన తర్కంతో వేట ఋతువు ప్రారంభమయిందని ప్రకటించింది. కొమ్ముబూరాల చప్పుడే సమరాహానం.
సెలయేరు మహానది అవుతోంది.
ఈసారి మహా ప్రవాహం లాటిన్ కార్టర్ ను వదిలిపెట్టాల్సివచ్చి కుడి ఒడ్డుకు మళ్లింది. క్రమక్రమంగా పెరుగుతోంది.
గురుత్వాకర్షణ శక్తి విధిగా వస్తువులనాకర్షిస్తుంది. టోలెమీ బోధించిన ప్రధాన సూత్రాలను పట్టిన బూజు తొలగిపోతోంది. ఎర్రని, నల్లని జెండాలు పట్టుదలకి ప్రతినిధులు. టోలెమీ చెప్పిన ఎన్నడూ కదలని ఏడు ఆకాశాలు సృష్టి అంతటికీ భూగోళమే కేంద్రమని అరుస్తున్నా. ఇప్పుడాకాశాలే దద్దరిల్లిపోతున్నాయి. రాత్రి మళ్ళీ పోరాటం తప్పదు-లాటిన్ కార్టర్ లో. సూత్రం సులభంగానే అర్ధమవుతుంది. బలం అంటే పశుబలమే. దాని నీచ స్వభావాన్ని నిర్దేశించేది దాని అస్తిత కారణమే.
నీ ఎముకలు విరగ్గొట్టడమే శత్రువు లక్ష్యం- అవి మాత్రమే వాడికి కనిపిస్తాయి కాబట్టి. నీ లక్ష్యం, క్షణ క్షణమూ శక్తిని పుంజుకుంటున్న సామూహిక సంకల్పబలాన్ని సంరక్షించుకోవడమే. శత్రువు దెబ్బకొట్టి తీరాలి. అవసరంకొద్దీ కొడతాడు. రెండు కాఫీ క్లబ్బుల్ని ముట్టడించి బాష్పవాయువులతో నింపేశారు. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత చెదురు ముదురు జనాల మీదా, చిన్న చిన్న గుంపుల మీదా చెప్పరాని అత్యాచారాలు చేశారు.
ఒంటరిగా ఉంటే ఎర్రనివి ధరించవద్దు. ఎంచేతంటే భయంకర దీర్ఘరాత్రులు ప్రారంభమైనాయి. దయ్యాల వేట సాగించే రాత్రులు.
రాత్రి తర్వాత పగలు వచ్చేటట్లుగా కూడా కదుల్తున్నారు. తులూస్ లో, మార్సెయిల్స్ లో కూడా. స్ప్రాస్ బార్గ్ స్తబ్దంగా లేదు. సచివోత్తములు సహనం గురించి మాట్లాడుతున్నారు.
రెన్నిస్ లో విద్యార్థులు నిరుద్యోగులతో కలిసి ముందడుగేస్తున్నారు.
6
విప్లవాలను అసంపూర్తిగా వదిలేసేవాళ్ళు తమ సమాధులను తామే తవ్వుకుంటారు.
(సోర్బాన్ చౌకులో, చర్చి వద్ద, మరికొన్ని చోట్ల)
అభివృద్ధి విరోధుల కన్నీరు, దేవతలకు పన్నీరు.
దాడిచేసినప్పుడు ఉద్యమం నెత్తురు కారుస్తుంది, శక్తులు పుంజుకుంటుంది. ఊరుకుంటే స్నేహితులనూ, సానుభూతిపరులనూ సంపాదించుకుంటుంది.
పార్టీ దేవదూతలు ఫ్యాక్టరీలకు సందేశాలు పంపిస్తారు. ఫ్యాక్టరీలకు-అసలైన అన్యాయాలు జరిగేచోటికి, పీడన స్పష్టంగా కనిపించే చోటికి.
పెట్టుబడి చేసిన పాపాలన్నిటికీ మూలం. ఇతర విషయాలన్నింటికీ మేలు బంతి.
కంటికి కనబడనంత బలవంతులుగా ఉన్న కామందుల నియమాలకు కట్టుబడి గుడ్డిగా కార్మికులు ఉత్పత్తిసాగించే చోటు. తిండి కావలిస్తే ఎదురుప్రశ్నలేవీ వెయ్యకూడని చోటు. చాలీచాలని తిండి, బరువైన యంత్రాలూ ఉన్నచోటు. యంత్రాల బానిసలు, బయట సగం నరకం ఆర్జించడానికి లోపల పూర్తి నరకంలో పడి కొట్టుమిట్టాడే చోటు.
వాళ్లకి సంఘాలుంటాయి. బహుశా వాళ్ళ పిల్లలు చూసే విప్లవాన్ని వర్ణిస్తూ. యజమానుల విందు భోజనాల నుంచి రాలే మెతుకులే వాళ్ళ సంతృప్తికి బహుమతి. సంఘాలు ఎంగిలి మెతుకుల కోసం బేరమాడడంలో ఆరితేరాయి. మణుగురాళ్ళలాంటి మనస్సులనూ, పాఠ్యపుస్తకాలనూ ఆయుధాలుగా చేసుకున్న సంఘాధికారులకు జీవితం దుఃఖభాజనమే కాని ఉత్పత్తికి నియమాలుంటాయని తెలుసును. గాయాలకు కట్లు కడుతూ, అగ్నికి వీళ్ళు కాపలా కాస్తారు. కార్మికుల వాటా పెరగక తప్పదని వాళ్ల నమ్మకం.
నౌకరీ పోతుందేమో అనే భయం ఎప్పుడూ ఉంది. పెరుగుతున్న వాళ్ల కుటుంబాలకు కార్లు అవసరమవుతున్నాయి. అంచేత వెనకటి దరిద్రం అంటే అందరికీ భయం. ఇంకా నిర్మూలం కాని ఆ దరిద్రం నిరుద్యోగుల్లో కనబడుతూనే ఉంది. కొన్నిచోట్ల అది పెరగడం కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి కార్మికులకు కావలసింది హెచ్చింపు వేతనం. లాక్కోవడం వల్ల లభ్యమయ్యే మరో చిన్న సదుపాయం. అందుకోసమే కార్మిక సంఘాలు కాస్త ఓపిక పడితే ఇతర వర్గాలు కూడా మెత్తబడి వామపక్షాలని ఎన్నుకోవచ్చు. అప్పుడు వామపక్ష ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఎక్కువ ఇళ్లూ, ఎక్కువ కార్లూ తయారుచేస్తుంది. అందువల్ల కార్మికులు కూడా ఇతర వర్గాలతో సమానత్వం సాధించామనుకుంటారు.
పార్టీ ధర్మమా అంటూ తమ పరిస్థితులు మెరుగైనాయనుకుంటారు. కార్మికులకూ, దేశానికీ ఏది మంచిదో వాళ్లకే తెలుసు. కాబట్టి సంఘాన్ని వదలొద్దు. పార్టీకే ఓటు చేస్తూ ఉండు. ఈ దశాబ్దంలో కాకపోతే వచ్చే దశాబ్దానికైనా పరిస్థితులు బాగుపడతాయి. నిడివి మీద ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుని ఇంకా బాగా నడిపించగలం. కాని ప్రస్తుతానికి కొంచెం వేచి ఉందాం. సంఘాల్లో చేరుదాం. పిలుపు వచ్చినప్పుడు సమ్మె సాగిద్దాం- మనం ఉన్నామని తెలియడానికి.
కార్మిక సంఘాలకి గాభరా పుట్టింది. వాటికి కావలసింది శాంతి భద్రతలు. ఈ విద్యార్థులలో అశాంతి చూస్తే విప్లవంలా కనబడుతోంది. ప్రదర్శన ఇంతతో ఆగకపోతే ఐక్యం కోసం తామూ చేరవలసి వస్తుంది. ఎంత ప్రమాదం. మనస్సులు చెడిపోతున్నాయి. కార్మికుల్లో యువకులున్నారు. ఎక్కువ పీడించబడుతున్నది వీళ్ళే. మున్ముందు మొద్దుబారిపోయేవయినా ఇప్పుడు వీరి నరాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఉత్పత్తికది చాలా మంచిది. కాని వీళ్లు అదుపు తప్పిపోతున్నారు. అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు.
కమ్యూనిస్టు కార్మిక సంఘానికి చెందిన సెగీ, కేథలిక్ వామపక్షపు కార్మిక సంఘానికి చెందిన డెకాన్ విద్యార్థి నాయకులను కలుసుకుంటారు. మేధావి వర్గం పట్ల తమ సానుభూతి ప్రదర్శించడానికి తామూ ప్రదర్శనలో పాల్గొంటామంటారు. విద్యార్థులూ, ఉపాధ్యాయులూ పమస్సుతో పనిచేసే కార్మికులే. యూనివర్శిటీలలో మరింత స్వేచ్చ కావాలంటున్నారు. మంచిదే. సమాజంలో వారొక ముఖ్యమైన భాగం. అభివృద్ధి నిరోధకులు పశుబలంతో వీళ్ళని అణచివేయాలని చూస్తున్నారు. కాబట్టి మన సేనల బలాన్ని కూడా ప్రదర్శించి కాలానుగుణ్యమైన మార్పుని రాబట్టుకోవాలి.
కదలిపోతున్న, పోరాడుతున్న యువజనాల తుఫాను ఘోషను దేశమంతా ఇప్పుడు వింటోంది. "సోర్బాన్ మాది. మా కామ్రేడ్స్ ను విడుదల చెయ్యాలి."
"పోలీసులు పోవాలి. పోలీసు హంతకులు పోవాలి."
తమ్ము బాదుతున్న పోలీసులను హంతకులని అనడంలో వాళ్లకి కావలసిన ఇతర విషయాలు కూడా ఊహించవచ్చు. గవర్నమెంటుకి సందిగ్ధం పట్టుకుంది. సోర్బాన్ తెరిచేసి పోలీసులను ఉపసంహరించడమా, లేక దమనకాండ సాగించడమా అని. రేడియోలలో వార్తలన్నీ వింటున్నవారి అంతరాత్మలు అసహ్యించుకుంటున్నాయి. బాధాకరమైనదే ఈ సందిగ్ధం. దాడిచెయ్యకపోయినా ఉద్యమం పెరుగుతుందనీ, ఎంత పిరికివాళ్ళకైనా ఏవో తీరని కోరికలుంటాయనీ సంఘటనలు ఋజువుచేశాయి.
అయితే ముఖ్యమైన వాదం ఏమిటంటే ఫిర్యాదులు సర్వత్రా ఉంటాయి. పట్టుదలతో కూడిన ఎదిరింపులకు ప్రభుత్వం లొంగిపోకూడదు. అప్పుడు అధికారానికి అర్థమే ఉండదు. సరిగ్గా అదే సమయంలో ఎదిరింపు విప్లవంగా మారుతుందని చరిత్ర బోధిస్తోంది.
సోర్బాన్ ఇంకా మూతపడే ఉంది.
