ఈ రకమైన మంచి అలవాట్లవల్లే, బ్రిలియెంట్ కాకపోయినా ఆమె అగ్రికల్చరల్ బి.యస్సీ.లో సీటు సంపాదించగలిగింది. కృష్ణాపురపు పెద్దలు కూడా ఆమెని అభిమానంతో చూస్తారు. పెద్దలంటే కారణంగారు, ఎ.వో. గౌరీనాథ్ లాటివాళ్ళు. తన తండ్రి తనని చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళని పరిచయం చేసింది.
"మీ గురించి మా అమ్మాయి ఉత్తరాల్లో వ్రాస్తూ వుంటుంది" కరచాలనం చేస్తూ అన్నాడు. భవానీశంకరం పరిచయ వాక్యాలయ్యాక కూతురివైపు తిరిగి, "నిన్ను తీసుకెళ్దామని వచ్చానమ్మా. మీ ప్రోగ్రాం అయిపోయింది కదా" అన్నాడు.
ఆమెకి ఒక్కక్షణం అర్ధంకాలేదు. తెల్లబోయి "అదేమిటి నాన్నా! వద్దంటున్నా నాకు కారు ఇచ్చావు. డ్రైవ్ చేయటానికి రాకేష్ వున్నాడు. ఎల్లుండి నేనెలాగో వచ్చేస్తున్నాను. ఇంత దానికి ఇప్పుడు నువ్వు రావటం దేనికి?" అంది.
భవానీశంకరం ఇబ్బందిగా "నీ కర్ధంకాదులే" అన్నాడు.
కరణంగారు కల్పించుకుని "పెళ్ళయి ఒకరిని పుట్టనివ్వండి. అర్ధమవుతుంది" అన్నాడు. అందరూ నవ్వేరు.
ఆ రాత్రి వెన్నెల్లో ఇంటివెనుక, పెరట్లో చెట్లకింద కూర్చుని వుండగా మళ్ళీ ఈ ప్రసక్తి వచ్చింది.
"ఈ వేసవిలో అమ్మాయికి, పెళ్ళి చేసేద్దామనుకుంటున్నాను" అన్నాడు భవానీశంకరం. "వాళ్ళ బావ తెలుసుగా రాకేష్...."
"చూశాను" అన్నాడు గౌరీనాధ్.
"మా ఇంట్లోనే వుంటున్నాడుగా, చూడపోవటమేమిటి? చక్కటి జోడీ-" అప్పుడే లోపలికి వస్తూన్న రాకేష్ నీ, గౌరీని చూస్తూ అన్నాడు కరణంగారు.
రాకేష్ మొహం విచ్చుకుంది.
"మా ఊర్లోనే ఒక పురోహితుడు వున్నాడు. అతడు ముహూర్తం పెడితే తిరుగులేదంటారు. ఎక్కడెక్కడినుంచో వచ్చి పెట్టించుకుంటారు. ఎలాగూ ఇంతదూరం వచ్చారు కాబట్టి ఆ పనికూడా చూసుకుని వెళ్ళండి".
"అవును, అలా చెయ్యండి. రెండు నెలలు ముందు తెలిస్తేగానీ మాకు శలవు దొరకదు" గౌరీనాధ్ అన్నాడు.
"రెండ్రోజుల శలవుకి రెండు నెలలు ముందు చెప్పాలటయ్యా?" కరణంగారు ఎద్దేవా చేశారు.
"మా కేదారగౌరి పెళ్ళికి రెండురోజు లేమిటయ్యా- నెలరోజులు వెళ్ళి తిష్టవేస్తాం. ఏమంటారు శంకరంగారూ?"
"అంతకన్నానా, వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను".
కేదారగౌరి తలవంచుకుని కూర్చుంది. కొబ్బరాకు నీడలు ఆమె మొహంమీద స్పష్టాస్పష్టమై జీరాడుతున్నాయి.
* * * *
ఆ రోజు ప్రోగ్రాం పూర్తవటానికి ఆఖరిరోజు!
ఊరివాళ్ళకీ, అప్పటివరకూ తమకి ఆతిథ్యం యిచ్చిన వారికీ వీడ్కోలు చెపుతున్నారు విద్యార్ధులు.
కేదారగౌరి సిద్ధార్ధ ఇంటికి వెళ్ళింది అతడి తల్లితో చెప్పటం కోసం! అపుడు రాత్రి ఎనిమిదయింది. ఆమె పాకలోకి వెళ్ళేసరికి గుడ్డిదీపపు వేలుతుట్లో నలుగురు కుర్రవాళ్ళు భోజనం చేస్తూ కనిపించారు. సిద్దార్ధ బయట నులక మంచంమీద కూర్చుని వున్నాడు. ఆమెని చూసి సంభ్రమంతో లేచి లోపలికి తొంగిచూస్తూ "అమ్మా" అని పిలిచాడు. చేహ్తిలో గిన్నెతో తల్లి అలానే బయటకు వచ్చింది.
'రామ్మా-రా' అంటూ లోపలికి తీసుకెళ్ళింది. లోపల వాళ్ళు భోజనం చేస్తూ వుండగా అక్కడ వుండట మెందుకని మళ్ళీ వెలుపలికి వచ్చింది గౌరి. "మీకు కూడా మాతో వచ్చేస్తున్నారా?" అని అడిగింది.
"వస్తున్నాను" అన్నాడు.
ఈలోపు లోపల భోజనం పూర్తిచేసి కుర్రవాళ్ళు బయటకి వచ్చారు. సిద్దార్ధ తల్లికూడా వచ్చి నవ్వుతూ "కొంచెం సర్దుకొని వస్తానమ్మా. కూర్చోయేం" అని మళ్ళీ లోపలికి వెళ్ళింది.
ఆమెకేం మాట్లాడాలో తోచలేదు.
"వాళ్ళెవరు?" అంది దూరంగా పాదు దగ్గర మట్టి సరిచేస్తున్న కుర్రవాళ్ళని చూస్తూ.
"మా ఇంట్లోనే వుంటారు. వాళ్ళకంటూ ఎవరూ లేరు. ఇక్కడే తిని చదువుకుంటారు".
"మరి డబ్బు-"
"నేనక్కణ్ణుంచి పంపిస్తానుగా".
సిద్ధార్ధ తమ ఊళ్ళో ప్రైవేటు చెప్పటం ఆమెకి తెలుసు. ఆమెకి అర్ధంకాలేదు.
"మీ పొలం తాకట్టులో వుందిగా" అంది.
"అవును" అన్నాడు.
"మరి అది విడిపించుకోకుండా- ఇలా వీళ్ళని పోషించటం దేనికి?" అంది. అక్కడ తను 'పోషించటం' అన్న మాట వాడటం తొందరపాటు అని ఆమెకే అనిపించింది. కానీ అతడు దాన్ని పట్టించుకోలేదు. తనమాట సరిదిద్దుకుంటూ, "వీళ్ళ పోషణ భారం మీరెందుకు వహించటం?" అంది.
"మరో నలుగురు సిద్ధార్ధలు తయారవకుండా".
ఆమె స్థబ్దురాలై అతడివైపు చూసింది. అతడు నవ్వేడు. "- ఈ మాత్రం సాయం చేసేవాడు మాకు లేక నన్ను చదివించటం కోసం అమ్మ మా పొలం తాకట్టుపెట్టి అందులోనే కూలీగా చేరింది. ఏదో అదృష్టవశాత్తూ నేను కాస్త సంపాదించగలుగుతున్నాను. మరి నలుగురికి సాయం చేస్తే తప్పేముంది?"
ఆమె అతడివైపు కన్నార్పకుండా చూసింది. మరుగుజ్జులా, అందవికారంగా వున్న అతడిమీద వెన్నెల పడి కూడా మనోహరం చేయలేకపోతోంది. అయితేనేం- అతడి వ్యక్తిత్వం ఒక తేజస్సులా అతడిని ఆవరించుకుని వుంది. అతడింకా విద్యార్థే! అయినా మరికొంతమంది విద్యార్ధులకు ట్యూషను చెపుతున్నాడు. ఆ డబ్బుతో కొంతమంది విద్యార్ధులను పోషిస్తున్నాడు.
"వెతికి చూస్తే మీలోనే వుంటాదమ్మా" అంటూ గౌరీనాధ్- సిద్ధార్ధ గురించి చెపుతూ అన్న మాటలు గుర్తొచ్చాయి. తమలో ఒకడిగా కలిసిపోయి, తన గురించి ఇన్నాళ్ళూ ఒక విషయం కూడా వెల్లడించని ఇతడు-
చిన్న విషయాన్ని కూడా గోరంతలు కొండంతలు చేసి చెప్పుకునే తమ స్టూడెంట్ల కన్నా ఎన్ని రెట్లు గొప్పవాడు!
"-అందరమూ కలిసి మీ ఇంటికి భోజనానికి వస్తాము". అన్నప్పుడు చిరునవ్వుతో మాట ఎందుకు తప్పించాడో అప్పుడు అర్ధంకాలేదు. ఇప్పుడు అయింది. అయినా ఆమెకు ఒక విషయం ఇంకా అసందిగ్ధంగానే వుంది. ఎక్కడో ఒక లింకు అందటంలేదు.
"ఇంకొంతకాలం పోయిన తర్వాత ఈ పనిచేస్తే బావుండేది కదా" అంది.
అతడు చిరునవ్వుతో "ఏ పని గౌరీ" అన్నాడు.
"ఇదే- ఈ విద్యార్ధుల్ని ఇంట్లో వుంచుకుని పోషించటం..."
"ఎందుకు?"
"గత నాలుగయిదు సంవత్సరాలుగా మీరు కష్టపడి నెలకి రెండొందలు పంపి వాళ్ళని చదివిస్తున్నారు. అది మంచి పనే. కాదనను. కానీ అదే డబ్బు, మీరెలాగూ కష్టపడుతున్నారు కాబట్టి మీ అప్పుకి జమ కట్టారనుకోండి. ఇంతేసి వడ్డీ కట్టనవసరం లేకుండా అది తొందరగా తీరిపోయేది కదా. ఒకేసారి పొలం మీదయ్యాక అప్పటికి మీ ఉద్యోగం మీకుంటుంది కాబట్టి, నలుగురికి బదులు ఆరుగుర్ని చదివించవచ్చు కదా" కొత్త మార్గం కనుక్కున్నాదాన్లా ఆమె మొహం ప్రకాశవంతమయింది. "....మీరు చేస్తున్నదాంట్లో ఎందుకో లాజిక్ కనపడటం లేదు".
అతడు అదే చిరునవ్వుతో "మీరు చెప్పినది నిజమే. నాలుగు సంవత్సరాలు ఆగివుంటే అమ్మకి మరింత తొందరగా కూలీ పని తప్పివుండేది. కానీ అప్పటికి మరో నలుగురు సిద్దార్ధలు తయారై వుండేవారు! జీవితంలో లాజిక్ కన్నా విలువైనవి చాలా వున్నాయి గౌరిగారూ. అన్నిటికన్నా ముఖ్యమైనది 'సంతృప్తి'!"
ఆమె విప్పారితమైన కనులతో అతడివైపు చూస్తూ వుండగా, లోపల్నుంచి అతడి తల్లి చేతిలో రెండు బత్తాయి పళ్ళతో బయటకు వచ్చింది.
* * * *
పెళ్ళి పనులు మొదలైనయ్!
నిజానికి అంత తొందరగా మొదలుపెట్టనక్కరలేదు. కానీ ఆయన తొందర ఆయనది. కొన్ని కోట్ల రూపాయల్ విలువగల వ్యవహారాన్ని కూడా చిటికెన వేలిమీద ఆడించగల ఆయన, ఈ పెళ్ళి దగ్గిర కొచ్చేసరికి తెగ కంగారు పడిపోతున్నాడు. నభూతో నభవిష్యతి అన్న పద్ధతిలో దీన్ని చేయాలన్నది ఆయన కోరిక. ఏ డిజైన్ లో పెండ్లి పత్రికలు వేయించాలా అన్న చర్చమీదే మూడురోజులు గడిచినయ్ గానీ ఒక నిర్ణయానికి రాలేదు.
మెయిన్ హాల్లో కూర్చుని డిజైన్లు చూస్తున్నాడు భవానీశంకరం. అతడి భుజాలమీద చేతులువేసి వెనుగ్గా నిలబడివుంది కేదారగౌరి.
"అమ్మా! అన్నిటిలోకి ఇది నచ్చింది నాకు" కార్డు చూపించాడు.
"తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి నాన్నా నీకు!" ఆయన చెప్పింది పట్టించుకోకుండా తలవైపే చూస్తూ అంది.
"వయసు పైబడుతూంది కదమ్మా".
"ఎంత నాన్నా నాకిప్పుడు వయసు?" తల్లవెంట్రుకలు చనువుగా లాగుతూ అడిగింది.
"ఏభై దగ్గిర పడలేదూ...."
"అయితే అదృష్టమే ఇంతవరకూ రాలేదంటే...."
భవానీశంకరం బిగ్గరగా నవ్వేసి, "నువ్వు కూడా మోసపోయేవమ్మా. పాతికేళ్ళప్పుడే తెల్లవెంట్రుకలుండేవి. డై చేసి పెళ్ళిచూపులకెళ్ళాను. పెళ్ళయిన రెండు సంవత్సరాలవరకూ మీ అమ్మకే తెలీదు నాకు తెల్లజుట్టుందని..."
గౌరి కూడా నవ్వుతూ "పెళ్ళికి ముందు అమ్మతో పరిచయం లేదా నాన్నా" అని అడిగింది.
"పరిచయమా- ఇంకా నయం. మీ తాతయ్య పేరుకి హేతువాదీ- ఆధునిక భావాలు వున్నవాడూ కానీ ఇలా పెళ్ళికి ముందు అమ్మాయితో మాట్లాడతానూ అంటే కర్ర తీసుకుని వుండేవాడు. ఆ మాటకొస్తే మీ అమ్మా నేనూ పెళ్ళయిన మొదటి నెలరోజులూ మాట్లాడుకోనేలేదు నాన్నా, ఆ కొద్ది సమయంలో ఎలానూ అర్ధం చేసుకోలేముగా".
ఇలాంటి ప్రశ్నలువేసి అతనిని ఇరుకున పెట్టడం ఆమెకి చిన్నప్పటి నుంచీ అలావాటే. అందుకే నవ్వి అన్నాడు- "ఇద్దరు మనుష్యులు జీవితాంతం కలిసివుండాలీ అంటే, దానికి అవగాహన ఎంతో ముఖ్యం. కొంతమందిని చూడగానే వీరితో స్నేహం ఎంత బావుంటుందీ అనిపిస్తుంది. కొంతమందిని చూడగానే అదోలాటి 'దూరం' అన్న భావం కలుగుతుంది. కేవలం మనక్కాబోయే జీవిత భాగస్వామిని చూడగానే మనకి ఎలాటి భావం కలుగుతుందో తెలుసుకోవటానికే పెళ్ళిచూపులు. ఒకసారి ఆ స్నేహం కలిగేక, ఇక వివాహం ఎలానూ వారిని దగ్గిర చేస్తుంది మరీకళ్ళు మోసం చేస్తే తప్ప. సాధారణంగా అందుకే వివాహాలు ఫెయిల్ కావు".
"అంటే నువ్వు అనేది- 'కళ్ళు చెప్పే నిర్ణయం' ఎప్పుడూ తప్పుకాదని! కొంతమందితో ఎంతకాలం కలిసివున్నా ఆ పొడ అలాగే వుంటుంది. మరికొంతమందిని చూడగానే స్నేహభావం కలుగుతుంది".
"అవునమ్మా. కానీ ఇదంతా ఎందుకు అడుగుతున్నావు?"
"నాలో నేనే కొట్టుమిట్టాడుతూ వచ్చానాన్నా ఇంతకాలమూ. ఒక వ్యక్తితో ఎంత కలిసివున్నా నాకాభావం ఎందుకు కలగటంలేదా అని.... బహుశా నా ఆలోచన్లలో ఎక్కడైనా తప్పు వుందా అనుకుని నీతో సరిచూసుకున్నాను. నువ్వూ నా వైపే మాట్లాడటం నా కెంత సంతోషంగా వుందో చెప్పలేను..."
"ఎవరు చెప్పినా అదే చెప్తారమ్మా. అకారణంగా ఒకరిమీద..."
"అకారణంగా ఒకరిమీద ప్రేమ ఎందుకు జనిస్తుందో కూడా మనం చెప్పలేం కదూ. నిజమే నాన్నా! నేనిప్పుడు ఆ స్థితిలోనే వున్నాను. అతడి పేరు సిద్ధార్థ నాన్నా! మీ రంగీకరిస్తే అతణ్ణి వివాహం చేసుకుంటాను- అదే ముహూర్తానికి".
