Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 68


    చంచల్ గూడా జైలుకి వెళ్ళాడు, అక్కడ తెలిసినవాళ్ళు తక్కువ. రెండు గంటలసేపు అవస్థపడి, యే స్త్రీని ఆరోజు తీసుకురాలేదని తెలుసుకున్నాడు.
    ఇంపల్సివ్ గా యే సినిమాకో వెళ్ళి పొద్దుపోయి యింటికి వచ్చిందేమో_అన్న ఆలోచన వచ్చి గబగబా నడుస్తూ, ఖాళీ ఆటో కనిపించగానే కూర్చుని యింటికి చేరుకున్నాడు. తాళం వేసేవుంది. తలుపు తెరిచాడు. పుస్తకం అలాగే వుంది. తాళం వేసి అదే ఆటోలో కూర్చుని తిన్నగా శ్రీపతి దగ్గిరికి వెళ్ళాడు.
    తలుపు తట్టిన చప్పుడుకి మెలుకువ వచ్చిన శ్రీపతి, కళ్ళు నులుముకుని లేచి__తలుపు తెరిచాడు.
    మోహన్ రెడ్డి వాలకం చూసి, "యేఁవిఁటి అలా వున్నావ్?" అన్నాడు శ్రీపతి.
    విషయం చెప్పాడు క్షుప్తంగా.
    చూపుడు వేలు కణుపుతో పెదవి నొక్కుకుంటూ ఎటో చూస్తూ వుండిపోయాడు శ్రీపతి.
    మోహన్ రెడ్డి కుర్చీలో కాళ్ళు పెట్టుకుని మోకాళ్ళమీద ముఖం ఆనించుకున్నాడు.
    పది నిమిషాలు.
    "మోహన్ లేచి ముందు స్నానం చెయ్యి." అని బలవంతంగా బాత్రూంలోకి పంపించాడు.
    యిద్దరూ కాలకృత్యాలు ముగించారు.
    తలుపు తాళం వేసి నడుస్తూ రిక్షా కనిపించగానే కూర్చున్నారు. తాజ్ దగ్గిర ఆపించాడు శ్రీపతి.
    లోనకి వెళ్ళారు.
    ఇడ్లీ దోశ చెప్పాడు శ్రీపతి.
    మోహన్ రెడ్డి ఆకలిగా లేదు, తిననన్నాడు.
    "రాత్రి ఆ భోజనం ఐవుంటుంది. తెల్లవార్లూ తిరుగుతున్నావు. టీ నీళ్ళైనా తాగి వుండవు. ఆకలిగా అనిపించదులే. గాయత్రికేం అవదు. షి కెన్ మేనేజ్. ఏంచెయ్యాలో ఆలోచిద్దాం." అని బలవంతంగా అవి తినిపించాడు_లేకపోతే తనూ తినను_అని.
    కాఫీ తాగి బయటికి వచ్చారు. నడుస్తున్నారు.
    "అరెస్ట్ చేసి గప్ చిప్ గా ఎటో తీసుకెళ్ళివుంటారు" అన్నాడు శ్రీపతి.
    "యెటు తీసుకుపోతారు యిక్కడ కాకుంటే_రాజమండ్రి, విశాఖ, వరంగల్" అన్నాడు మోహన్ రెడ్డి.
    "ఇట్ ఈజ్ క్వయిట్ పోసిబిల్." అన్నాడు శ్రీపతి.
    "వరంగల్ లో దోస్తులున్నారు. పోయి తెల్సుకొని వస్తా." అన్నాడు మోహన్ రెడ్డి.
    "ఈ మూడ్ లో ఒక్కడివీ వద్దు తోడు అవసరం. కూడా వస్తాను" అని ఆటో పిలిచి, మోహన్ రెడ్డి యింటి వీధి చెప్పాడు శ్రీపతి.
    "వూళ్ళో పోలీస్ స్టేషన్లూ జైళ్ళూ చూశాం. నీ ఆచూకి లేదు. యెవరింట్లోనూ నీ ఆచూకీ లేదు. వరంగల్ రాజమండ్రి జైళ్ళలో కనుక్కోవటానికి వెళుతున్నాం. ఒకవేళ వస్తే ఇంట్లో నిశ్చింతగా వుండు. బెటర్, మీ అమ్మగారింట్లో." అని స్లిప్పు శ్రీపతే రాశాడు.
    తాళం వేసి బయటికొచ్చారు.
    దారిలో సుల్తాన్ బజార్ కోఠీలో ఆపించి, తనొక్కడే ఆంధ్రాబ్యాంకులోకి వెళ్ళి, రెండువేల రూపాయలు డ్రా చేసుకుని వచ్చాడు శ్రీపతి. వచ్చి ఆటోలో కూర్చుని, "బస్ డిపోకి" అన్నాడు.
    వరంగల్ చేరేసరికి నాలుగైంది.
    మోహన్ రెడ్డికి అక్కడ తెలిసిన విరసం మిత్రులు యెక్కువగా వున్నారు. కొందరు అక్కడే జైల్లో వున్నారు.
    సాయంత్రం ఆరింటికల్లా తెలుసుకోగలిగారు _ గాయత్రి అక్కడ లేదని.
    యేడింటికి హోటల్లో భోజనం చేసి రాత్రి రైల్లో బయల్దేరి మరసటిరోజు వుదయం రాజమండ్రి చేరుకున్నారు. అక్కడ వూళ్ళో శ్రీపతికి తెలిసినవాళ్ళున్నారు. ఒకరిద్దరు డాక్టర్లు, లాయర్లు.
    బాగా పలుకుబడి వున్న లాయరు దగ్గిరకి బయల్దేరాడు శ్రీపతి. యేదో చుట్టరికం. మోహన్ రెడ్డిని పరిచయం చేసి విషయం చెప్పాడు. జైలు సూపర్నెంటు ఆ లాయరుకి మంచి మిత్రుడట_ ఫోను చేసి కనుక్కున్నాడు అలాంటిదేం లేదని చెబితే, "వెళ్ళి కనుక్కుంటే_" అన్నాడు శ్రీపతి.
    "డోంట్ బి సిల్లీ మైబోయ్. నా క్లోజ్ ఫ్రెండ్. గొంతు కూడా పొరపడను. సరే_ అనుమానం పెనుభూతం కదా_ యింకో గంటకి కోర్టుకి వెళ్ళాలి నేను. మీరు జైలు దగ్గిర వుండండి. నేను వచ్చి స్వయంగా కనుక్కుంటాను." అన్నాడు.
    గాయత్రి అక్కడ లేదని రూఢి అయింది. విశాఖ ప్రసక్తి తెస్తే "ఓ లాయర్ ఫ్రెండ్ కీ లెటరిస్తాను వెళ్ళు" అన్నాడు.
    సాయంత్రానికి విశాఖపట్నం చేరుకున్నాడు. లాయరు క్లబ్బుకి వెళ్ళబోతున్నాడు. లెటర్ చూసుకుని, కారు వీళ్ళని నేరుగా జైలు సూపరిండెంట్ దగ్గిరికి తీసుకెళ్ళి విషయం చెప్పి, "కేవలం ఇన్ఫర్మేషన్ స్వామీ. మరే ఇతర సహాయం అక్కర్లేదు" అని నవ్వాడు లాయరు.
    అక్కడా లేదని తెలిసింది.
    మరుసటిరోజు సాయంత్రానికి వూరు తిరిగివచ్చారు. రైలు స్టేషన్ నుంచి తిన్నగా మోహన్ రెడ్డి యింటికి వెళ్ళారు. తాళం తీశారు. పుస్తకం అలాగే వుంది. తాళం వేసేసి, మోహన్ రెడ్డిని యింటికి తీసుకొచ్చాడు శ్రీపతి.
    "మోహన్ నువ్వు నాతోపాటు ఇక్కడే వుండు గాయత్రి ఆచూకి తెలిసేదాకా" అన్నాడు శ్రీపతి.
    మోహన్ రెడ్డి కళ్ళలో తడి వుబికింది.
    లేచి అతని దగ్గిరికి వెళ్ళి అతని భుజంతట్టి, "రివల్యూషనరీవి అలా నీరుకారిపోతే యెలా? గాయత్రి అంటే నీకెంతిదో, నువ్వంటే గాయత్రికెంతిదో నాకు తెలుసు. మీ పరస్పరానురాగం, నీ ధైర్యాన్ని సడలించకూడదు" అన్నాడు శ్రీపతి.
    ఆ సాయంత్రం మోహన్ రెడ్డి బజారుకి వెళ్ళిన పావుగంటకి ఒక కుర్రాడు యింటికి వచ్చి గాయత్రితో "సుదతి మా చిన్నాయన కూతురు. మా అక్క ఏదో పర్సనల్ ప్రోబ్లమ్ లో చిక్కుకున్నదట. పబ్లిక్ గార్డెన్ పక్కనున్న స్విమ్మింగ్ ఫూల్ పక్కన వున్నది. మిమ్మల్ని వెంటనే వచ్చి తనను కలవమన్నది. మరలా గంటసేపైతే ఆడగూడ వుండడానికి వీలుకాదట" అని చెప్పాడు.
    ఆ కుర్రాడికి పదిహేనేళ్ళుంటాయి.
    విని, "నేనెవర్నో తెలుసా?" అంది గాయత్రి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS