Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 66


    'నువ్వా వరాహం' అనుకుని ఆపించి దిగిపోయాడు శ్రీపతి.
    "నమస్కారమండీ" అని రత్నాకరరావుని పలకరించాడు వరాహశాస్త్రి. రత్నాకరరావు రమాదేవి పెళ్ళిలో వరాహశాస్త్రి చాలా శ్రమపడ్డాడు.
    "నమస్కారం__బాగున్నారా? ఈమధ్య కనిపించటంలేదు?" అన్నాడు రత్నాకరరావు.
    "ధీసిస్ సబ్ మిట్ చేశాను రెండు నెలల క్రితం."
    "యింకా డిగ్రీ రాలేదా?"
    "ఆ ఫారిన్ ఎగ్జామినర్ వులుకూ పలుకూ లేకుండా వున్నాడట. రిప్లయ్ ఐనా రాయలేదట. చివరికి పంచుతాడేమో!" అని నవ్వాడు వరాహశాస్త్రి.
    "అందాకా తీరికేనేమో__" అన్నాడు రత్నాకరరావు.
    "లేదు సాయంత్రాలు ఓ ట్యుటోరియల్ కాలేజీలో పాఠాలు చెప్తున్నాను_కిళ్ళీలకీ సినిమాలకీ సరిపోతుందని. అన్నపానాదులంటే__కన్నవారి మీద వేసేస్తాం అనుకోండి యెన్నేళ్ళొచ్చినా!" అని నవ్వాడు వరాహశాస్త్రి.
    "మీకు క్లాసుకి లేటవుతుంది" అన్నాడు శ్రీపతి.
    రత్నాకరరావు స్కూటర్ ముందుకు పరుగు తీసింది.
    "యేం శ్రీపతీ_అన్నట్లు, ఆ నక్క వెధవకి వుద్యోగం యిప్పించావుట కదా! అన్నాడు వరాహశాస్త్రి.
    "యెవరికి?"
    "ఆ ఇంగువగాడికి."
    "ఆఁ__ఓరోజు వచ్చి నా ప్రాణం తీశాడు పట్టుకుని. యెలా తెలుసుకున్నాడో ఆ కంపెనీ డైరెక్టరు నాకు తెలుసునని! కెమికల్స్ ఫ్యాక్టరీ యేవేవో యాసిడ్సూ అవీ తయారుచేస్తారు. అతనూ నేనూ ఇంటర్ కలిసి చదువుకున్నాం. బాగా స్నేహం. ఆస్తీ డబ్బూ బోలెడంత వుంది. ప్రభుత్వం నుంచి లోను కూడా పట్టి ఫ్యాక్టరీ ప్రారంభించాడు మూడేళ్ళ క్రితం. బాగా స్థిరపడ్డాడు. ఫ్యాక్టరీని బాగా అభివృద్ధి చేశాడు. ఓ టెక్నికల్ అసిస్టెంటు వుద్యోగం ఖాళీ వుంటే మన గుంటనక్క వచ్చి ఏడిస్తే పోన్లే అని ఇప్పించాను.
    "వాడు థీసిస్ సబ్మిట్ చెయ్యలేదు."
    "చేశాననీ త్వరలో డిగ్రీ వస్తుందనీ చెప్పాడు నాతో. అతనితో ఆమాటే చెప్పాను నేను."
    "వీడికీ గైడ్ కీ గొడవైంది. స్టేషనరీ ఎక్విప్మెంటుల కంటిజెన్సీ డబ్బులో వీడు గైడుకి వాటా. మరి వీడూ ఖర్చుపెట్టకుండా దొంగ బిల్లులు ప్రొడ్యూస్ చేస్తాడుగా ; ఆ వాటాలో యేదో పేచీ వచ్చింది. తెలుసుగా! అది మరికాస్త పాకం ముదిరి__తను చేసిన వర్క్ అంతా గైడ్ కొట్టేసుకుని కూర్చున్నాడని వీడూ, యెంత తోమినా వర్క్ చెయ్యలేకపోతున్నాడని గైడూ__నానా గొడవై చివరికి అట్లా అయిపోయింది." అన్నాడు వరాహశాస్త్రి.
    మాట్లాడుతూ క్యాంటీన్ దగ్గిరికి వచ్చారు.
    "పనుండి వచ్చావా?" అన్నాడు శ్రీపతి.
    "అదే, ఆ ఫారిన్ ఎగ్జామినర్ రిపోర్టు వచ్చిందేమో తెలుసుకు పోదామనీ వచ్చాను. ఇంకా తగలడలేదట."
    "నమస్కారం శాస్త్రిగారూ"
    "హలో భద్రం, బావున్నావా?" అని శ్రీపతి వంక తిరిగి, "యితను దర్భా వీరభద్రరావని మా వూరే. తెలుగు ఎం.ఏ.లో చేరాడు ఈ ఏడు" అన్నాడు వరాహశాస్త్రి.
    "అలాగా, తెలుగులో ఎం.ఏ.లో ఇప్పుడేం చెబుతున్నారు?" అన్నాడు శ్రీపతి.
    అతను వివరించటం మొదలెట్టాడు.
    "కొమ్మరో వానికెంత బిగువే_పిలచిన పలుకకున్నాడేమి సేయుదునే" అని శ్రీనివాసయ్యంగార్ ఖమాస్ జావళీ గొంతులో శృతించుకుంటూ వింటున్నాడు వరాహశాస్త్రి.
    శ్రీపతి కుడిచేతి చూపుడువేలి కడుపుతో పెదవి నొక్కుంటూ వింటూ "ప్రబంధాలన్నీ వుంటాయా?" అన్నాడు.
    "వుంటాయండీ. మనుచరిత్రా, భారతమూ, శృంగార నైషధమూ....." అని ప్రారంభించాడు అతను.
    పంచమ వేదానికెంత క్షుద్ర వైభోగం పట్టిందీ దర్భకుర్రాడి చేతుల్లో అనుకుంటూ నవ్వుకున్నాడు శీపతి.
    అంతలో కులశేఖరరావు వచ్చాడు.
    "హలో శ్రీపతీ, హలో శాస్త్రీ__మన అంకినీడు సినిమా చతికిల పడిందట కదా_ఎమర్జన్సీని సమర్ధిస్తూ సినిమా తీస్తే అంతకాక మరేమవుతుంది! ఆవిడని సమర్ధిస్తే మరేమవుతుంది!" అన్నాడు కులశేఖరరావు.
    "అందుకు పోయివుండదు. నుదిటిరాత బాగోక పోయి వుంటుంది" అన్నాడు వరాహశాస్త్రి__
    "యీ రెంటివల్లా కాదు. పరమ అతుకుల బొంతగా తయారైంది అది! ఒక్క ట్యూనూ ఏరకంగానూ వెంటాడేలా లేదు. ఆడవాళ్ళకి బట్టలూడదీసి నానా ఖంగాళీ చేస్తే సినిమా హిట్ అవుతుందా? వారపత్రికలాగే సినిమాలను పోషించేదికూడా స్త్రీలే. రోజూ స్నానించేటప్పుడన్నా బట్టల్లేకుండా వాళ్ళ వొళ్ళు వాళ్ళు చూసుకుంటూనే వుంటారు. మగాళ్ళు నూటికి యెనభయ్ మంది స్త్రీ పొందు తెలిసినవాళ్ళే. పూర్తిగానో, అవసరంమేరకో బట్టలూడదీస్తూనే వున్నారు. చిత్తకార్తి వెధవ వూరికే వీడి చిత్తకార్తి తనాన్ని తెరమీద వెళ్ళగక్కితే హిట్ అయిపోతుందనుకున్నాడు. దానికితోడు అతకని క్రైమూ గట్రా జోడించాడు. అంత తేలికా సినిమా హిట్ అవటం? సినీ మహామహులే ఒక్కోసారి బిక్కమొహాలేస్తున్నారు. ముందు హైందవ సెంటిమెంటుతో ప్రేక్షకుల్ని కట్టిపడెయ్యాలి. ఆ తరవాత మూడు నాలుగు వయసుల అభిరుచుల పాత్రల్ని కుటుంబ చట్రంలోకి అల్లాలి. అర్ధాలూ, అపార్ధాలూ, గృహఛిద్రాలు కలబోసి, అప్పుడు కాస్త సెక్సు లోషనూ, క్రైమూ పూసి, తిరిగి చెడి బుద్దొచ్చే మగాడూ, యెంత తిరిగీ చెడకుండా ఆమేరా రక్షించుకుంటున్న ఆడదీ__నిఖార్సయిన నూరుశాతం విలనీ మనుషులూ సర్వసలక్షణమైన నూరు శాతం పరమ మంచితనం పాత్రలూ గట్రా వుండి__నానా రసాల మసాలా మహామాయగా తెలివిగా కూరి అందించాలి. లేదంటే భారీ చిచ్రాలజోలికి పోకుండా లోబడ్జెట్ చిత్రం యెంచుకుని సర్కారు వారి లోను  కొంత పుచ్చుకుని సింపుల్ గా స్ట్రీకింగ్ లాంటి సినిమా వారంరోజుల్లో లాగిపారేసెయ్యాలి. పాపం చిక్కుల్లో పడిన చిన్నదాన్ని చూపెట్టబోయి మన అంకినీడు చిక్కుల్లో పడిన చిన్నవాడయ్యాడు" అన్నాడు శ్రీపతి.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS