ప్రతి స్త్రీ తన వయసయిపోయాక ఎవడూ పట్టించుకోడు కాబట్టి తప్పని సరిగా డబ్బు సంపాదించడానికి పనిచెయ్యాల్సొచ్చేది. అక్కడా...ప్రకృతిపరమైన అసమానతే...
అర్థరాత్రి దాకా ఆటోలు నడపలేదు. పోల్ మీదెక్కి కరెంటు వైర్లు గుంజలేదు. ఫ్లాట్ ఫారమ్స్ మీద తలపై పెట్టుకుని మూటలు మొయ్యలేదు. ఆమెకి శారీరకంగా అంత బలంలేదు. సో...బలహీనమైన ప్రాణిని బలమైన ప్రాణి చెరబట్టడం, భక్షించడం ఎక్కడైనా ఉన్నదే! కనీసం మానసికంగా, తెలివిపరంగా మనం వాళ్ళని ఎదుర్కోవాలి.
సింహమూ, చిట్టెలుకా కథలోలాగా మనకి కొన్ని వరాలు ఉంటాయి. అవి సహనం, ఆలోచనా, తెగువా. ఇవి ఆయుధాలుగా మనం అతడిమీద ప్రయోగించాలి. బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి. "ఫైట్...ఫైట్...ఫైట్!" ఆవేశంగా అంది లిల్లీ.
వివాహ వ్యవస్థ గురించి లిల్లీ చెప్పిన తీర్పుకి అబ్బురంగా చూస్తుండిపోయాను. "లిల్లీ నీకు ఎన్ని వందల సంవత్సరాలూ...అడిగాను.
"డేమేజింగ్ గా మాట్లాడకు. ముప్పై ఎనిమిది నిండే వరకూ స్వీట్ సిక్స్ టీన్!" అని నవ్వింది.
"లిల్లీ...మహా ఉంటే నాకన్నా ఓ నాలుగేళ్ళు పెద్దదానివి అనుకుంట! అయినా ఓ నాలుగేళ్ళ తర్వాత కూడా నాకు నీలా ఆలోచించే శక్తిరాకపోవచ్చు! నువ్వు అదృష్టవంతురాలివి. నాలాంటి ఆడపిల్లలా ప్రతిదానికి బుర్ర పాడుచేసుకుని మధనపడిపోవు!" అన్నాను.
లిల్లీ చిన్నగా నవ్వి "నీకు నీ బాధల గురించి మధన. కానీ నాకు అందరి బాధల గురించీ మధనే! ఇప్పుడు చెప్పు...ఎవరు అదృష్టవంతులో!" అంది.
ఈసారి మరీ ఆశ్చర్యంగా చూసి "నేనే" అన్నాను.
"జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మిగతా వాళ్ళ అజ్ఞానం చూస్తుంటే నరకంగా వుంటుంది! చిన్న ప్రోబ్లెమ్స్ కే ఎందుకింత అప్ సెట్ అవుతారూ? ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుందిగా అని బాధేస్తుంది" అంది.
నేను లిల్లీ దగ్గరకెళ్ళి ఆమె భుజంమీద చెయ్యివేసి - "నీ పర్సనల్ విషయాలు నేను ఎప్పుడూ అడగలేదు. కానీ ఇప్పుడు నా ఈడు ఆడపిల్ల ఐనా జీవితంలో పండిపోయినట్లు మాట్లాడుతోందంటే నీ బ్యాక్ డ్రాక్ గురించి ఆసక్తిగా వుంది. అభ్యంతరం లేకపోతే చెప్పు..."
"నువ్వు అడగలేదు కాబట్టే నేను చెప్పలేదు. మనిషి దొరకగానే వాళ్ళు అడిగినా అడగకపోయినా మన గతం, వర్తమానం, భవిష్యత్తూ వాళ్ళ ముందు పరచడం నాకు నచ్చదు! నా గురించి నీకు కొంత తెలుసు! మా నాన్నగారికి వ్యాపారాలున్నాయనీ, మా అమ్మనీ, నన్నూ, తమ్ముడ్నీ చాలా బాగా చూసుకొంటారనీ, మా ఇంట్లో నాకు ఎలాంటి కట్టడ్లూ లేవనీ...నీకు తెలుసు! కానీ అదంతా ఒకవైపే! ఇంకోవైపు చాలా చీకటిగా ఉంటుంది. అందులోకి తొంగి చూడాలంటే ధైర్యం చూపే దీపం కావాలి! మా అమ్మని మా నాన్న పెళ్ళి చేసుకోలేదు."
నేను అదిరిపాటుతో చూశాను.
"ఆయనకి మా అమ్మ పరిచయం అయ్యేనాటికే భార్యా పిల్లలూ ఉన్నారు. అమ్మ ఆయన దగ్గర ఉద్యోగానికి చేరింది. ఆమె అందం ఆయన్ని ఆకర్షించింది. ఆవిడకి ఆయన చూపించే కన్ సర్న్ నచ్చి ఉంటుంది.
ఇద్దరూ ఒకటయ్యారు. ఆమెకి ఒక ఇల్లు చూసి పెట్టారు. వేరే మాటల్లో ఉంచుకున్నారు.
అమ్మకీ, మాకూ ఏలోటూ లేకుండా చూసేవారు. కానీ...అప్పుడప్పుడే ఊహ వస్తున్న మాకు రోజూ రాత్రుళ్ళు నాన్న మాతో ఎందుకు ఉండడో, ఆయనరాణి రోజు అమ్మలో అభద్రతా భావం ఎందుకో అర్థం అయ్యేది కాదు.
ముంబైలో ప్లాట్స్ లో ఉండేవాళ్ళం. ఎవరూ పట్టించుకొనేవారు కాదు.
కానీ ఒకరోజు... తమ్ముడికి ఒళ్ళుమండేలా నూటమూడు జ్వరం. ఎంతకీ తగ్గడంలేదు. రాత్రంతా అమ్మ మేల్కొని ఏడుస్తూనే వుంది. అర్దరాత్రి పిచ్చి, పిచ్చిగా కలవరించడం మొదలెట్టాడు.
అమ్మ నన్ను లేపింది. ఏం చెయ్యాలో తెలీని పరిస్థితి! ఎదురింటివాళ్ళ కాలింగ్ బెల్ ఎంత నొక్కినా తియ్యలేదు. అమ్మ నన్ను కౌగలించుకుని 'తమ్ముడు మనకి దక్కడు. ఇలా చూస్తూ కూర్చోవలసిందేనా? నువ్వు మగపిల్లాడివైనా అయ్యావుకావు. అయివుంటే మీ నాన్న దగ్గరకి పంపేదాన్ని' అని ఏడ్చింది.
ఆ మాటలకి నాకు బాధేసింది.
వెళ్ళి ఎదురింటి వాళ్ళ తలుపులు గట్టిగా బాది, వాళ్ళు లేచాక పరిస్థితి చెప్పి 'ఫోన్ చెయ్యాలి' అన్నాను.
ఆ నిమిషంలో ఎదురింటి ఆవిడ నావైపు ఎంత నిరసనగా చూసిందో, ఇన్నేళ్లైనా నేను మరిచిపోలేను!
"ఎవరికి చేస్తావు?" అంది.
"మా నాన్నకి" అన్నాను.
"ఆయనేమైనా మీ అమ్మని కట్టుకున్న మొగుడా పరిగెత్తుకు రావడానికి?" అంది.
"ఏవన్నావు?" అని నేను ఆవిడ మీద కలబడితే, అమ్మొచ్చి విడదీసింది.
"అందుకే ఇలాంటి నీతిలేని అలగా వాళ్ళని సంసార్ల మధ్యలో ఉండనియ్యకూడదు. రేపే మీటింగ్ లో ప్రెసిడెంట్ తో మాట్లాడ్తాను" అందావిడ కోపంగా.
అమ్మ చెయ్యని తప్పుకి ఆవిడకి చేతులు జోడించి క్షమార్పణలు చెప్పుకొంది. నన్ను రెండు దెబ్బలు వేసింది కూడా.
నేను ఆ అర్ధరాత్రి, చలిలో, తమ్ముడ్ని ఎత్తుకుని బైటికి నడిచాను. అమ్మ విధిలేక నన్ను అనుసరించింది. ఆ వీధిలోనే ఉండే డాక్టర్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాము.
అతను వచ్చి విసుగ్గా 'ఏమిటీ?' అని అడిగాడు.
అమ్మ తమ్ముడ్ని ఆయన కాళ్ళమీద పారేసి కాపాడమంది. అతను ఒంగి అమ్మను పైకి లేపాడు.
ఆ తర్వాత లోపలికి తీసుకెళ్ళి తమ్ముడికి ఇంజెక్షన్ చేశాడు. కాసేపటికి తమ్ముడికి టెంపరేచర్ తగ్గింది. నేనూ, అమ్మా వాడి బెడ్ పక్కనే క్రింద పడుకున్నాం. నాకు వెంటనే నిద్రపట్టేసింది. తెల్లవారుఝామున తమ్ముడు కదులుతుంటే నాకు మెలకువ వచ్చింది. వాడు 'దాహం' అన్నాడు.
