రాజారావు మనసు సంతోషంతో నిండిపోయింది. ఈ వేసంగుల్లో లక్ష్మీ పెళ్ళి జరిపించేయగలిగితే అది గొప్ప అదృష్టం గానే భావించాలి. ఒకవేళ తండ్రి చెప్పింది నిజమేనేమో - లేకపోతె - వెతుక్కుంటూ పెళ్ళివారు రావడమేమిటి ?
"నేను క్యాజువల్ లీవు మీద వచ్చాను. ఇంకో రెండ్రోజులు మాత్రమే ఇక్కడుంటాను. చెల్లాయి పెళ్ళి నిశ్చయమైతే అప్పుడెలాగూ పెద్ద సెలవు మీద రావాల్సుంటుందని కదా! అందుకని అన్ని వ్యవహారాలూ మీరే చూసుకోండి. అన్నీ మీకే తెలుసును కాబట్టి మీకు మేము వేరే చెప్పవలసినది లేదు --' అని లోపలకు వెళ్ళాడు రాజారావు.
"కాళ్ళు కడుక్కున్నావా?" అనడిగింది పార్వతమ్మ.
"అందుకే నూతి దగ్గరకు వెడుతున్నాను---" అంటూ రాజారావు దొడ్లోకి వెళ్ళాడు. నూతిలోకి గొట్టాలు దింపి ఏర్పాటు చేసిన పై పోకటి వుందక్కడ. శ్రీకాంత్ అతనికి నీళ్ళు కొట్టిచ్చాడు. రాజారావు కాళ్ళు కడుక్కుని ---"ఏరా - ఎలా వున్నాయ్ - నీ ఉద్యోగ ప్రయత్నాలు --- " అనడిగాడు.
శ్రీకాంత్ తలవంచుకుని - "నీమాట వినకపోవడం పొరపాటయింది . చాలామంది వాగ్దానాలు చేస్తున్నారు. కానీ పని జరగడం లేదు. ఈ సంవత్సరం ఎగ్జే మ్షన్ కప్లయి చేసి ప్రైవేట్ గా ఎమ్మేకి కడదామకుంటున్నాను"-- అన్నాడు.
రాజారావు నవ్వి ఊరుకున్నాడు. ఈరోజుల్లో బియ్యే కు బొత్తిగా విలువలేదని , ఎమ్మే చదవమనీ --- తనూ మొహనరావూ ఆ బాధ్యతను స్వీకరిస్తామని రాజారావు మరీమరీ చెప్పాడు తమ్ముడికి. కానీ త్వరగా సంపాదన ప్రారంభించేయాలన్న ఆత్రుత శ్రీకాంత్ ను ఆ సలహా వినకుండా చేసింది. ఆ సలహా విని వుంటే వృధాగా గడిచిపోయిన ఈ కాలంలో యింకో డిగ్రీ వచ్చి వుండేది- మరో మూడు నాలుగు నెలల్లో. ఏదేమైనా జరిగిపోయిందానికి యిప్పుడనుకుని లాభం లేదు.
చదువు గురించి నిర్లక్ష్యం చేయడంలో శ్రీకాంత్ ది పూర్తి తప్పులేదు. అందులో కొంతవరకు బాధ్యత అతని అన్న మోహనరావుది. అతని బాబయ్యగారిదీ కూడా వుంది.
మోహనరావు మనసు మంచిదే కానీ అతను అట్టే దూరమాలోచించే మనిషి కాడు. ఆరోజుల్లో బియ్యే చదివినా ఎమ్మే చదివినా దొరికే ఉద్యోగామొకలాంటిదేననీ - అందుకని పై చదువు డబ్బు దండుగనీ - తనవద్దకు వస్తే - తనకు బాగా తెలిసినవాళ్ళు చాలా ముందున్నారు కాబట్టి - ఏదో ఉద్యోగం దొరకవచ్చుననీ అతను తమ్ముడికి నచ్చజెప్పి తనతో తీసుకుపోయాడు. వెంకట్రామయ్య గారి పెద్దకొడుకు కాబట్టి ఎంతో కొంత అయన పోలిక రాకుండా వుండదు కదా - ఆవిధంగా అతనూ ఇతని పని వాయిదా వేస్తూ వచ్చాడు. అయితే శ్రీకాంత్ వదిన దగ్గిర గోల పెడుతూండేవాడు. మరిది బాధ నర్దం చేసుకున్న విరజ - భర్తను మందలిస్తుండేది. ఆమె పోరు భరించలేక ఒక పర్యాయం అతను శ్రీకాంత్ ని తనకు తెలిసిన కొంతమంది పెద్ద మనుష్యులకు పరిచయం చేశాడు. వాళ్లకు శ్రీకాంత్ ప్రస్తుత పరిస్థితి వివరించి చెప్పాడు. అదయ్యేక శ్రీకాంత్ ని బయటకు పిలిచి "వాళ్ళు తల్చుకుంటే నీకు క్షణాల మీద ఉద్యోగమిప్పించగలరు" అని చెప్పాడు.
వాళ్ళు తల్చుకున్నారో లేదో తెలియదు కానీ శ్రీకాంత్ అన్న దగ్గర ఆర్నెల్లున్నాడు. అతనికి ఏమీ పని జరగలేదు. శ్రీకాంత్ బాగా నిరుత్సాహపడిపోయాడు. అతను బాగా డీలా పడిపోయాడని గుర్తించిన మోహనరావు ---'అసలు నీకిక్కడోచ్చిన నష్టమే ముంది? తక్కువేం జరుగుతోంది- ఇంకా కుర్రాడివి గద- ఉద్యోగం గురించి అంత కంగారెందుకు - అయినా ఈ రోజుల్లో ఉద్యోగాలంత సులభంగా పిల్చి యిస్తారనుకున్నావా --" అంటూ మందలిచ్చాడు.
'అన్నయ్యసలేవరికీ సరిగ్గా చెప్పలేదు. ఊరికే నన్ను పరిచయం చేసి వూరుకున్నాడు. నోరు విడిచి అడగందే ఎవరు సహాయపడతారు ?' అంటూ వదిన దగ్గర గోలపెట్టాడు శ్రీకాంత్.
"భాద్యత గల ప్రభుత్యోద్యోగిని. నోరు విడిచి ఎలా అడుగుతాను? నేను చేసిన పరిచాయాని కర్ధం అదే - వాళ్ళూ చాలా మంచి వాళ్ళు. ఎంతోమందికి సహాయం చేశారు. దేనికైనా టైము రావాలి. అంతవరకూ మనమే ప్రయత్నం చేసినా బూడిదలో పోసిన పన్నీరై పోతుంది "-- అన్నాడు విరజతో మోహనరావు.
"లక్ష్మీకి పెళ్ళంటే టైము రావాలని మీ నాన్నగారంటారు - ఇతనికి ఉద్యోగమంటే మీరు టైము రావాలంటారు. తండ్రీ కొడుకు లిద్దరికీ పెద్ద తేడాలేదు ---" అని తేల్చింది విరజ.
ఆ పరిస్థితుల్లో ఒక పర్యాయం మోహనరావు బాబయ్యగారా ఊరొచ్చారు. అయన పేరేదైనా మోహనరావు వగైరాలంతా ఆయన్ను బాబయ్యగారనే పిలుస్తారు. పార్వతమ్మ చెల్లెలి మొగుడాయన.
బాబయ్యగారిది మెత్తటి మనసు. ధనసంపాదనకు సంబంధించినంతవరకూ అద్భుతమైన తెలివితేటలాయనవి. కాంట్రాక్టులు చేస్తూ లక్షలకు లక్షలు గడిస్తున్నాడాయన. భార్య నీలవేణి మాట ఆయనకు వేదం. సంసార బాధ్యతలన్నీ ఆమె కప్పగించేశాడాయన.
నీలవేణికి అక్క కొడుకులంటే విపరీతమైన అభిమానం. ముఖ్యంగా మొహనరావూ, రాజారావూ అంటే ఆమెకు మరీ ఇష్టం. వాళ్ళిద్దర్నీ ఆమె చిన్నతనంలో బాగా సాకింది. మోహనరావు కంటే సుమారు పది సంవత్సరాలు మాత్రమే పెద్దదయిన నీలవేణికి - అటు సిరిసంపదలకూ- ఇటు అడరాభిమానాలకు లోటు లేదు. ఆమెలో వున్న ముఖ్యమైన లోపమల్లా అసహనం. పెళ్ళయి ఏడాది తిరక్కుండానే ఆమె ఐశ్వర్యపుటానుభూతుల్ని రుచి చూసింది. ఆ తర్వాత ఆమె అంతస్థు రోజురోజుకూ పెరిగిపోయింది. తగు మాత్రం గర్వమున్నప్పటికీ ఆమె తన దగ్గర బంధువులందరికీ అంతో యింతో ఆర్ధిక సహాయన్నందజేస్తుండేది. ప్రతిఫలంగా ఆమె ఆశించేది చిన్న పొగడ్త! తన బంధువర్గంలో తనకు మించిన అదృష్టవంతురాలు లేరని అంతా అనాలని అమెకుంటుంది. ఆ కిటుకు తెలిసిన చాలామంది అలా చేసి ఆమె వద్ద ఆర్ధిక సహాయం పొందుతుండేవాడు.
మోహనరావు , రాజారవుల కుద్యోగాలు దొరికేవరకూ వెంకట్రామయ్య ఇంటి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. మొహనరావూ, రాజారావు కూడా పిన్ని పట్ల గౌరవ భావంతో మసలుకుంటుండేవారు. అయితే వీళ్ళిద్దరకూ మంచి ఉద్యోగాలు దొరకగానే మొదట్లో సంతోషించినా క్రమంగా నీలవేణికి కొన్ని అనుమానాలు రాసాగాయి. అక్క పిల్లలకు తన మీద గౌరవం తగ్గిపోతోందేమోనన్నది వాటిల్లో ముఖ్యమైనది. అక్క కొడుకుల ఆహ్వానం మీద స్వయంగా వెళ్ళి - వాళ్ళ ఉద్యోగపు హోదాలను చూసి వచ్చింది నీలవేణి. నిస్సందేహంగా వాళ్ళు మంచి హోదాలో ఉన్నారని గ్రహించగానే ఆమె అనుమానాలు రెట్టింపయ్యాయి. వాళ్ళ దగ్గరా, వీళ్ళ దగ్గరా - స్వతంత్రంగా కాంట్రాక్టులు చేసుకోవడంలో ఉన్న గౌరవం- ఎవరికిందో ఉద్యోగం చేయడంలో లేదనేది. తన హోదాను తరచుగా అక్క కొడుకుల హోదాతో పోల్చి పెద్ద చేసుకుంటుండేది. రాజారావుని కానీ మొహానరావుని కానీ కలిసినప్పుడల్లా అభిమనపు పలకరింపులు కట్టిపెట్టి - తన హోదా ఔన్నత్యాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తుండేది. ఈ ప్రవర్తనకు రాజారావు సహించాడు కానీ మోహనరావు సహించలేకపోయాడు. అతను తరచుగా కాంట్రాక్టర్లను చిన్నబుచ్చడం ప్రారంభించాడు.
"పిన్నీ - నువ్వు కాంట్రాక్టర్ల జీవితం స్వతంత్రంగా ఉంటుందనుకుంటావు కానీ - బిల్లుల ప్యాసు చేయించడం కోసం వాళ్ళు మా ఆఫీసుల చుట్టూ పడిగాపులు పడి తిరుగుతుంటారు ----" అనేవాడు మోహనరావు.
"అదినిజమే --- ' అని బాబయ్యగా రొప్పుకునేవాడు.
గుడ్లురిమి చూసేది నీలవేణి ---"అన్నింటికి తలాడించి లోకువై పోతుంటారు మీరు. మీ బిల్లు నొక్కి పెట్టేశాడని - ఒక అఫీసర్నేం చేశారు మీరు ? ట్రాన్సుఫర్ ఆర్డరు చేతికి రాగానే పిల్లల చదువులు దెబ్బతింటాయి. నా సంసారం పరిస్థితే దెబ్బ తింటుందని ఇంటికొచ్చి మీ కాళ్ళు పట్టుకోలేదూ ఆ ఆఫీసర్ ----' అని సమర్ధించుకునేది.
