అరటి తొక్క
నాలుగురోడ్ల జంక్షన్ దగ్గిర -- బిజీ బజారు సెంటర్లో కోటమ్మ కిళ్ళీ కొట్టు ముందు కోటమ్మ -- వీర్రాజు ఘోరాతి ఘోరంగా బూతులు తిట్టుకుంటూ జుత్తులు పట్టుకుని కొట్టుకుంటున్నారు. చుట్టూ చేరిన జనం ఏ గారడీనో, సర్కసో చూస్తున్నంత కుతూహలంగా , ఆనందంగా తిలకిస్తున్నారు ఆ పోట్లాట ---
"దొంగసచ్చినోడా-- ఆడకూతుర్ని , దిక్కుదివాలం లేనిదాన్ని కిళ్ళీ బడ్డీ ఎట్టుకుని నాలుగు రాళ్ళు తెచ్చుకు గంజినీళ్ళు తాగుతంటే కల్లల్లో నిప్పులేసుకుంటావా దుప్పనాతి నంజకొడకా . ఆడకూతురితో తగులడ్డానికి సిగ్గు నేదురా - ఆడకూతురి మీద నట్రా నీ ప్రతాపం ఆ మూతి మీద మీసం తీసేసి చేతికి గాజులు ఏనుకోరా ఎదవా --' అంటూ తుపుక్కున ఊసింది.
"నీవాడకూతురివా , ఆడకూతురివైతే యింటికాడ కూకుని బుద్ధిగా వన్నం వండుకోవాలి , పిల్లల్ని సాక్కోవాలి - యిలా నడిరోడ్డు ఎక్కి కిళ్ళీ బడ్డి ఎక్కి కూకుని దారంటే పోయే మగాల్ల అందరితో కులుకులాడతవే గుడిసేటి నంజా -" వీర్రాజు తక్కువ తినలేదన్నట్టు కాండ్రించి ఉమ్మేసాడు.
'ఏట్రా....ఏట్రా పెలతన్నావు నీ జిమ్మడ - గుడిసేటినంజనా....' రొప్పుతూ విడిన జుట్టు ముడివేసుకుని అమ్మవారిలా, అపరకాళిలా అవతారం ఎత్తింది కోటమ్మ.
'నీ పెళ్ళం నంజ - నీ అమ్మ గుడిసేటి నంజ - నీ అప్ప చెల్లెళ్ళు నంజలు ....కోటమ్మ నోరిప్పితే మరి మూతపడదు- వీర్రాజు మూడుతరాల ఆడవాళ్ళందరిని లంజలు, ముండలు చేశాక - చుట్టూ జనం వంక తిరిగింది --- 'అయ్యలు, బాబులు - చూశారా ఆడకూతుర్నట్టుకు ఎంతెంత మాట లంటున్నాడు. మొగుడు సచ్చినోడు వోగ్గేసి పొతే ఆడకూతుర్ని ఏ బతుకు తెరువు నేక ఈ కిళ్ళీ కొట్టేట్టుకు గంజినీళ్ళు తాగతంటే సూడలేక కళ్ళు కుట్టుకుని కాట్లకుక్కలా కలియబడతన్నాడు వీడి జిమ్మడ '- మెటికలు విరిచింది.
'ఓయమ్మా - నీ నంగనాచి కబుర్లు నాకాడ సెప్పకు - గంజినీళ్ళు ఖర్మ నీకేటి - సానిపాపలా సింగారించుకుని , కొట్టేక్కి కూకుని దారిన పోయే మగాల్లందరికి వగలు చూపి యాపారం చేసే నీకు గంజినీళ్ళెం ఖర్మ - యీ సీరలు, జాకెట్లు ఆ కంపెనీ బాడీలు , ఆ గాజులు, పూసలు, ఆ సింగారం సూడండి బాబూ గంజినీళ్ళు తాగతందట - తాగే, ఆ గంజినీళ్ళు కూడా నేకుండా మా నోట్లో దుమ్ము కొట్టి .....కోపంతో ఉడికిపోతూ వీర్రాజు.
'సాతకాని సన్నాసి -- నామీద పడి ఏడవకపోతే కొట్టు మీద నీ పెళ్ళాన్ని కూకోపెడతానంటే నా నొద్దన్నానా.....సుప్పనాతి నంజాకొడుకులు - ' మరోసారి ఉమ్మేసింది. 'మాటలు తిన్నగా రానీ నేదంటే మక్కెలిరగ దన్నగలను- నంజ కొడుకులు యిక్కడెవరూ లేరు - నంజికూతురు తక్క, మా ఆడోళ్ళు పరువు మర్యాద గలవోరు - నీలా బరితెగించిన బజారు రకాలు గాదు....'
'ఓ యబ్బ పతివతలన్నమాట. మరింకేం ఆ పతివత పెళ్ళాం వుండగా నీకు గంజెం ఖర్మ - వండకుండానే చేతులాడించి పంచభత్య పరమాన్నాలు వడ్డీస్తది మరెడు పెందుకురా సన్నాసి-' చూసిన పతివతల సినిమా నాలెడ్జిత హేళనగా ఎత్తి పొడిచి జోకు ఎలా ఉందన్నట్టు చుట్టూ చూసింది కోటమ్మ - భళ్ళున నవ్వారు అందరూ -- వీర్రాజు అవమానంతో వీరావేశం వచ్చి ముందు కరికాడు. కోటమ్మ మీదకి. అంతదాకా వినోదిస్తున్న జనం వ్యవహారం ముదిరి పాకాన పడిందని గ్రహించారు. నలుగరైదుగురు మగాళ్ళు వీర్రాజుని వెనక్కి లాగారు -' ఆడకూతురుతో నీకేటి అసలేటయింది?- ఎటాసలు గొడవ .....' అంటూ వీర్రాజుని అడిగారు. వీర్రాజు ఆవేశంగా రొప్పుతూ - ' అసలేటయిందా, దాన్నే అడగండి - బాబూ....అరటి తొక్క....అరటి తొక్క బాబూ....దాని గురించి తగూ బాబూ ....' అంతకంటే చెప్పలేకపోయాడు ఆవేశంతో.
'అరటి తొక్క!' జనం ఆశ్చర్యంగా 'అరటి తొక్కేమిటి ?' అని తెల్లబోయారు.
అవును, అరటి తొక్క - ఎందుకూ పనికిరాని అరటి తొక్కే యీ తగవుకి కారణం అదెలా? ఆ కధ ఏమిటయ్యా అంటే....
* * * *
మూడు నెలలక్రితం --- నాలుగు రోడ్ల కూడలిలో బజారు సెంటర్లో కాకుల మధ్య హంసలా .....కిళ్ళి కోట్ల మధ్య కోటమ్మ కిళ్ళీ కొట్టు వెలసింది - వున్న అరడజను కిళ్ళీ షాపులకి గిరాకి పడిపోయింది. పువ్వు మీద వాలే తుమ్మెదలా ప్రతివాడు కోటమ్మ కిళ్ళీ షాపుకే రావడం ఆరంభించాడు -- అంతమంది మగవాళ్ళ మధ్య ఆడది కోటమ్మ అప్సరస కాకపోవచ్చు --- కాని కోటమ్మ నలుపులో మెరుపుంది - ఎత్తుగ బలంగా పుష్టిగా పోత పోసిన యినప విగ్రహంలా నిగనిగలాడుతుంటుంది. టెరికాటన్ , పుల్ వాయిల్ నైలాను చీరలు కట్టి కంపెనీ బాడీ , మాచింగ్ జాకెట్టు తొడిగి , రంగు రంగుల బొట్లు, గోళ్ళకి పాలిష్ - తలలో పూలు- నీటుగా తయారై కొట్టేక్కి కూర్చుంటే చూడని మగాడిది తప్పు - వేషమే కాదు నడకలో , మాటలో, నవ్వులో ప్రత్యేకత తుంది - మాటలో గడుసుతనం వుంది- నవ్వులో కొంటెతనం వుంది - చూపుల్లో కవ్వింపుంది.
ఇన్నీ వున్న కోటమ్మని మొగుడెందు కోదిలేశాడన్నది ఎవరికీ తెలియదు -- తెల్సినవాళ్ళు కొందరు మొగుడు దీన్ని వదలలేదు - ఇదే మొగుడ్ని వదిలేసిందంటారు -- చవటసన్నాసి దీని జాణతనం ముందు ఆ నోటి ధాటికి తాళలేక పారిపోయాడంటారు-
సన్నాసి పారిపోగానే కోటమ్మ కిళ్ళీ కొట్టేక్కేసింది - సన్నాసి కూర్చునున్నాళ్ళు సన్నాసి మొగం ఏం చూస్తాం అన్నట్టు కిళ్ళీ కొట్టు దరిదాపులకి వెళ్ళని వాళ్ళందరూ కోటమ్మ కిళ్ళీ కొట్టు ఎక్కగానే బెల్లం చుట్టూ చేరిన చీమల్లా తయారయ్యారు. తక్కిన కిళ్ళీ షాపులకి లేని గిరాకి తన షాపుకి ఎందు కొచ్చిందో గ్రహించలేని చిన్నదీ కాదు. వెర్రిది కాదు కోటమ్మ- ఆ అవకాశాన్ని జారవిడిచేటంత పతివ్రతా కాదు! పోలీసులని కాకా పట్టింది. కుర్రకారుతో హస్యాలాడింది - లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు , క్లీనర్ల తో రిక్షా వాళ్ళతో అన్నా, మావా, బావా అంటూ వయసులు చూసి వరసలు కలిపింది - ' బాబ్బాబూ , ఆరు వెట్టకు బాబూ, ఆడకూతుర్ని లెక్క డొక్క రాని దాన్ని పైసలిచ్చే యండి - బాబూ -' అంటూ కుర్రకారుని బతిమిలాడి మంచిగా తెలివిగా అరువులు లేకుండా వ్యాపారం చేసుకుంది -- మూడ్నేల్లకే వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారగానే పాత వాయిల్ చీర ల్లోంచి ధగధగ లాడే పల్చటి సిల్కు కోకలు , కంపెనీ బాడీలకి దిగింది - రాబడి తో పాటు సోకు పెరిగింది - సాకుతో పాటు కులుకులు - కులుకుతో పాటు జాణతనం పెరిగింది' ఆ సెంటర్లో కోటమ్మ కిళ్ళీ కొట్టు పెద్ద ఎట్రాక్షన్ అయి కూర్చుంది నాలుగు నెలలకే!
