బాలకార్మికులను బడికి పంపుతు నీవు
భవితనిచ్చి వారి బతుకుమార్చు
వారి వృద్ధితోనె వసుధ వృద్ధిగదర
వందనాలు తండ్రి వాసుదేవ. 89
పారిజాతపూలు పాలు పెరుగు వెన్న
తులసి మాలవేసి కొలచినిన్ను
మొక్కి వేడుచుంటి చక్కని బుద్ధికై
వందనాలు తండ్రి వాసుదేవ. 90
హాయికొలిపె బతుకు యంధకారముజిక్కె
ధనమె మిన్నయనుచు దలచిజనులు
రగలవలదు మీరు పగలు పెంచుకొనుచు
వందనాలు తండ్రి వాసుదేవ. 91
నమ్మివచ్చుగదర నాతి నీతొగలసి
గుండెలోన నిలుపు గుర్తుపెట్టి
మోజుతీరగానె మోసమ్ముజేయకు
వందనాలు తండ్రి వాసుదేవ. 92
ఒంటరైనవాడు నోడిపోడు యెపుడు
కరములిచ్చి తనను కలుపుకొనగ
వర్ణభేదమేల ? వసుధయందున నేడు
వందనాలు తండ్రి వాసుదేవ. 93
తృణములోనకరుగు దొరికినట్టి ధనము
కష్టపడిన ధనము కలసివచ్చు
పగటికలలు గనకు పనిచేస్తు బతుకరా !
వందనాలు తండ్రి వాసుదేవ. 94
ముద్దుగారె చిన్ని మురిపాల బాల్యము
బతుకుపోరులోన బందియయ్యె
చదువువిలువ తెలిపి నాదుకో వారిని
వందనాలు తండ్రి వాసుదేవ. 95
చేటుదెచ్చు నీకు జెడుయలవాట్లురా
చేరబోకువాటి చెంతనీవు
అదుపులుంచు మనసు నందమవ్వు బతుకు
వందనాలు తండ్రి వాసుదేవ. 96
కలిసియుండవలయు గష్టసుఖములందు
విడువవలదు జెలిమి విత్తమునకు
మంచిస్నేహమెపుడు మధురమేయగునుగా
వందనాలు తండ్రి వాసుదేవ. 97
వనముయందుబెంచు వనమూలికలుయెన్నొ
ధనముకన్న విలువ ధరణిలోన
మనకు గూర్చునవియె మంచియారోగ్యము
వందనాలు తండ్రి వాసుదేవ. 98
మాటయందు యెపుడు మర్యాద పాటించు
పాటతోడగలుగు బరవశంబు
తోటపెంచునీవు తోడుగా నదినిల్చు
వందనాలు తండ్రి వాసుదేవ. 99
విద్యనేర్చియెంతొ విజ్ఞానిగనుమారె
సమతకొరకు తాను సల్పె పోరు
మహిళ జాతిరత్నమయ్యె రీతిసాగు
వందనాలు తండ్రి వాసుదేవ. 100
సూటిపోటిమాట సూదిగా గుచ్చినా
స్ఫూర్తినింపు నీవు సుజనులందు
మహిళకెపుడు విలువ మహిలోన నిలుపురా
వందనాలు తండ్రి వాసుదేవ. 101
కొలచి పిలుచుచుండ్రి గోవింద యనుచును
వేచి నిలిచినారు వేంకటేశ
కన్నతండ్రివోలె కాచి రక్షణజేయు
వందనాలు తండ్రి వాసుదేవ. 102
మేలుజేయవచ్చు మేరుపర్వతమంత
ధనములేకయున్న ఘనముగాను
చిత్తశుద్ధినెంచు విత్తముగాదిట
వందనాలు తండ్రి వాసుదేవ. 103
అక్షరములు కొన్ని యర్థాలు ఎన్నెన్నొ
పద్యగద్యరూపు పరిఢవిల్లు
చదివి నేర్చి పొందు జక్కనీ జ్ఞానమూ
వందనాలు తండ్రి వాసుదేవ. 104
తండ్రి వాసుదేవు దల్లి సుభద్రయు
పెంచె నన్ను యెంతొ బేర్మితోడ
మీరెనాకు గురువు మీరె నామార్గమూ
వందనాలు తండ్రి వాసుదేవ.
అన్నివేళలందు నాదుకొనుచునన్ను
అమ్మవలెను కాచు యక్క పద్మ
స్వర్ణపురమునాది స్వగ్రామమందురు
వందనాలు తండ్రి వాసుదేవ.
* సమాప్తం *
