"మీరు చెప్పాలి ఆంటీ! నా గురించి అన్నయ్య ఏమేం చెప్పాడో నాకు తెలియాలి" రెట్టించింది ప్రబంధ.
"ఖచ్చితంగా ఫలానా అని తెలీదుకాని, నువ్వీ మధ్య సరిగ్గా ఇంటిపట్టున ఉండడంలేదని మాత్రం చెప్పినట్టుంది."
"నేనేం ఆ తాగుడు, తందనాలతో అన్నయ్యలా ఆవారాలా తిరగడం లేదే!"
"మీ అన్నయ్య మగపిల్లాడమ్మా!"
"అయితే ఏమిటట?"
"ఆ విషయం నాకు తెలుసు కాని పాపం మీ నాన్నగారు కొడుకునే సమర్ధిస్తారుగా... ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి కాబట్టి."
ఆమె అందరు ఆడపిల్లల్లాంటిది కాదని తెలిసిన సౌదామిని కాకుండా ఉండాలనే కోరుకుంటూ అదే పదాన్ని మరోమారు ఒత్తిపలికింది. సహజంగా మొండిదయిన ప్రబంధని ఏ పనికయినా పురికొల్పాల్సింది అహంకారాన్ని రెచ్చగొట్టి ఇప్పుడు అదే సూత్రాన్ని అమలుపరుస్తూంది సౌదామిని.
"పిచ్చిపిల్లా!" ప్రబంధకు తను మాత్రమే ఆత్మీయతనందించే ప్రాణినన్నట్టు అక్కున చేర్చుకుంది. "ఇష్టపడిన మగవాడు నీకు కాకుండా మీ వాళ్ళంతా ఏదో చేస్తారని ఆందోళన పడుతున్నావేమో కదూ! సహజమేనమ్మా! ఈ ప్రపంచంలో ఏ ప్రేమకథ సవ్యంగా ముగిసిందని? ఆ బాధేమిటో నేనూహించగలను."
"అంతదాకా వస్తే నేను ఎవర్నీ కేర్ చేయను ఆంటీ!"
"తెలుసమ్మా! ప్రాణం పోయినా పట్టువదలని జూలియట్ అంత మొండిపిల్లవని తెలుసు. కాని ఏం చేయగలవు?"
"అందరికీ బుద్ది చెపుతాను"
విస్మయంగా చూసింది సౌదామిని.
"అవును ఆంటీ! నా ప్రపంచం నాది. అందులో నేను కోరుకున్నదే నాకు దక్కాలి తప్ప ఎవరు అడ్డం వచ్చినా వూరుకోనంతే"
ఇదే, సరిగ్గా ఈ 'టెంపో' మెయింటైన్ చేస్తే చాలు తన లక్ష్యం నెరవేరిపోతుంది. రెండు క్షణాలు నిశ్శబ్దంగా వుండిపోయిన సౌదామిని నెమ్మదిగా అంది. "అవునూ ఆదిత్య ఏమంటాడు?"
మండిపోతున్న మనసుపైన తుషారబిందువులు చిలికినట్టయిందేమో రిలక్సింగ్ గా సోఫాలో కూర్చుండిపోయింది.
చేపపిల్లలా కదులుతున్న ప్రబంధ కళ్ళను చూస్తూ రహస్యంలా అంది సౌదామిని "అంటే....చాలాదూరం సాగిందన్నమాట నాకా నమ్మకము వుంది ప్రబంధా! నువ్వనుకున్నదేదయినా సాధించగలవు."
చెప్పింది ప్రబంధ సిగ్గుతో తలవంచుకునే ఇలాంటి విషయాలు పంచుకునే ఓ ఆత్మీయురాలి అవసరం ఎంతుందో తెలిసిన తొలిక్షణమది.
అందుకే మొత్తం కథలా చెప్పేసింది.
"నీకు పోటీగా ఎవరు నిలబడగలరే పిచ్చిపిల్లా! చూడు...ఇంతటితో ఆగటంకాదు, తెలివయిన ఆడపిల్లంటే మనసుని అలా తెలియచెప్పటమే కాదు, కోరుకున్న మగాడి వెంటపడి, తన వెంటపడేట్టు చేసుకోగలగాలి" మరో సూత్రాన్నీ తెలియచేసింది.
సరిగ్గా ఇదే సమయంలో తన ఇంట్లో అడుగుపెట్టిన ఆదిత్యని చుట్టుముట్టరు అతడి మిత్రబృందమంతా.
నిశ్చేష్టుడయ్యాడు. అసలే మనసంతా చికాకుగా వుంటే అందరూ తన కోసం కాపలా కాయడం నచ్చలేదు.
"నువ్వు ఇచ్చిన పజిల్ కి జవాబు తెలీక మొత్తం ఇలా తరలివచ్చేశాము."
"రేపు చెబుతాను" తప్పించుకోబోయాడు.
"నీ ప్రేమకథ కాదురొరే! కనీసం ఆ ఒక్క పజిల్ జవాబు చెబితే మనశ్శాంతిగా ఇళ్ళకు వెళతాం."
"చెప్పు" సూరి అన్నాడు. "వాట్ టైం ఈజిట్ వెన్ ది క్లాక్ స్ట్రయిక్స్ థర్టీన్?"
"ఇటీజ్ ది టైం టు హేవ్ క్లాక్ రిఫైర్ద్" టక్కున చెప్పాడు ఆహ్దిత్య "అంతేరా! ఏ గడియారమూ పదమూడు గంటలు కొట్టదు. ఒకవేళ కొట్టిందీ అంటే దాన్ని రిఫైర్ చేయించే టైం వచ్చిందని తెలుసుకోవాలి."
"కండుజల్ల కొట్టావురొరే!" జవాబు తెలుసుకున్న మిత్రబృందం హతాశులైపోయారు.
ఆ తరువాత అందరూ వెళ్ళబోతుంటే సూరిని ఆపేడు ఆదిత్య ఎందుకో అర్ధంకాలేదు సూరికి.
ఈ మధ్య సూరితో మనస్సు విప్పి మాట్లాడి చాలా రోజులయింది. ఈ రోజు కూడా మాట్లాడేవాడు కాదు కాని ఒక ఆత్మీయుడిగా అతఃదితో మనసు పంచుకోవాల్సిన క్షణం వచ్చింది.
చెప్పాడు ప్రనయతో పెరిగిన పరిచయం మొదలుకుని ప్రబంధ ఎక్స్ ప్రెస్ చేసిన విషయందాకా.
హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది.
"ఏం చేయాలో పాలుపోవడంలేదు సూరీ! నిశ్శబ్దంగా నా ఒంటరి ప్రపంచంలో బ్రతుకుతున్నవాడిని... కారణం ఏమన్నాకానీ ఇప్పుడు ఇలాంటి సమస్యలో చిక్కుకున్నాను."
"ఇది సమస్యకాదు ఆదిత్యా! అదృష్టం" మృదువుగా అన్నాడు. "నేను మెటీరియలిస్టి క్ గా ఆలోచిస్తున్నాననుకోకు. ఒకేసారి ఇద్దరు అర్హులయిన వ్యక్తులనుంచి ఇలాంటి అవకాశం రావడం నిజంగా అదృష్టమే. దానికి పరోక్షంగా నేను కారణమైనందుకు ఆనందిస్తున్నాను."
నిజమే ఆరోజు క్విజ్ లో పాల్గొని వుండకపోతే తనకీ పరిచయాలే అయ్యేవి కావు.
"ఏ వస్తువయినా కదలటానికిగాని, కదులుతున్నది ఆగటానికిగాని ఒత్తిడి అవసరమన్న న్యూట్రన్ మొదటి సూత్రమే నిజమైతే, అది ప్రేమకీ వర్తిస్తుంది ఆదిత్యా!"
"కాని నేను ప్రణయకి మాటిచ్చాను."
"ప్రబంధ నీ నుంచి మాట తీసుకోవాలనుకుంటోంది."
"ఎలా?"
"కాదని తిరస్కరించటం అంత కష్టంకాదు ఆదిత్యా! కాని అంత కంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి."
