Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 52


    సీత తండ్రీ వాళ్ళు మరుసటిరోజు మధ్యాహ్నానానికి వచ్చారు. మిగతావాళ్ళు ఆ సాయంత్రానికి వచ్చారు.
    "వైరల్ ఫీవర్. వస్తే ఒక్కరోజు కంటే మించి బతకరంట. చెప్పటమే ఆలస్యంగా చెప్పింది" అన్నారు.
    మూడోరోజుకి సీత తల్లిదండ్రులు ఒకరిద్దరు బంధువులు వున్నారు.
    "పిల్లలన్నా లేరుగా వెంటనే మా ఐదు లక్షలూ ఇచ్చేసెయ్యండి" అన్నాడు సీత తండ్రి.
    "అవి అప్పుడే మీ అమ్మాయి కిచ్చేశాం అడిగితే." అన్నారు.
    "యిస్తే మాకే యిచ్చేదిగా. అట్లాంటి అబద్ధం మాటలెందుకు?"
    "ఐతే మేం అబద్ధాల కోరులమా?" అని పోట్లాటకి దిగారు. ఆమె పేర మిల్లులో వున్న షేర్స్ ఇమ్మని యెదురు అడిగారు.
    మూడోరోజు సాయంత్రానికి ఆమె అన్న వచ్చాడు, ఖరగ్ పూర్ నుంచి.
    "అంత హడావుడిగా యెందుకు చెయ్యాల్సొచ్చింది దహనం?" అని అడిగాడు.
    "ఇప్పుడొచ్చి యక్షప్రశ్నలేస్తున్నావు. వుంచితే కీడు అని చెపితే చేశాం." అని బుకాయించటం మొదలెట్టారు.
    ఆ మరుసటిరోజున ఒకరినొకరు బూతులు తిట్టుకోవటంతో ముగిసింది.
    ఆ వెంటనే వీళ్ళు, "ఆ కంపనీ షేర్లు మాకే రావాలి. అట్లా ఆ సీతంది. తన అభిమతం నెరవేరటం ధర్మం_" అని కోర్టులో కేసుపెట్టారు.
    సీత తరపువాళ్ళు "స్త్రీ ధనంగా యిచ్చిన ఐదులక్షలూ ఇప్పించమని" కోర్టులో కేసు వేశారు_ కట్నం అనే అర్థం రాకుండా జాగ్రత్తపడుతూ.
    కేసులు నడుస్తున్నాయి.
    విజయ్ కుమార్ ప్రవర్తనా, సీత స్వభావమూ తెలిసినవాళ్ళు_ సీత ఆత్మహత్య చేసుకుని వుంటుందనీ, అందుకే అంత గోప్యంగా వేగిరం జరిపించేశారు_ అని అనుకున్నారు_ యింట్లో పనివాళ్ళతో సహా.
    "ఒరే నువ్వు కొన్నాళ్ళు ఎటన్నా పోయిరా. ఢిల్లీలో ఆ పనుందిగా అక్కడి కెళ్ళు" అన్నాడు పినతండ్రి.
    "ఓ యస్" అన్నాడు విజయ్ కుమార్.
    "ఒరే. ఇందుకైతే నచ్చావ్ గానీ. కట్టుకున్నదాన్ని హింసించకురా పాపిష్టాడా _ మళ్ళీ పెళ్ళి తగలడితే" అన్నాడు.
    "నాకు పెళ్ళీ వొద్దు పాడూ వొద్దు బాబాయ్."
    "నీ బాబుకీ మాకూ నువ్వొక్కడివే. నువ్వు పెళ్ళి తగలడకపోతే యిదంతా యామైపోను! కుక్క తిరుగుళ్ళు మానరా సన్నాసీ."
    "ఛా ఛా, లేదు బాబాయ్. అవన్నీ కుర్రతనంలో. మానేసి చాల్రోజులైంది. యెందుకు చేసిందో ఆ పని. ఒట్టి మూర్ఖపుది. దాని తల్లి తీరేదానిదీ" అని సమర్ధించుకుని ఢిల్లీకి రైలెక్కాడు విజయ్ కుమార్.  

                                                97

    టాక్సీ దిగి డబ్బులిచ్చి లోనకి నడిచాడు రవి.
    రవిని చూస్తూనే, "రండిసార్. మీకు ఫోను చేయించిన రెండు నిమిషాలకి అర్జంటు పనేదో వచ్చి వెళ్ళారు. యిప్పుడే వచ్చేస్తారు" అన్నాడు మంత్రిగారి పర్సనల్ సెక్రటరీ.
    రవి కూర్చోబోతుంటే, "మిమ్మల్ని లోన కూచోబెట్టమన్నారు. ఇక్కడ విజిటర్స్ తో రద్దీగా వుంటుంది" అని లోన గదిలో కూర్చోబెట్టాడు.
    ఐదు నిమిషాలకి కాఫీ పట్టించుకొచ్చాడు పర్సనల్ సెక్రటరీ.
    "ఎంతసేపు పడుతుందన్నారు?" అన్నాడు రవి.
    "మహా అయితే అరగంట. వస్తే ఆలోగానూ రావచ్చు" అని అంటూండగా బయట కారు హారన్ చప్పుడు విని, "అది బాబుగారి కారే" అంటూ వేగిరం బయటికి పరిగెత్తాడు పర్సనల్ సెక్రటరీ.
    మరుక్షణం మంత్రి ఆతుకూరు తాతయ్య రవి కూర్చునివున్న గదిలోకి వచ్చాడు.
    రవి లేవకుండానే కూచుని, "నమస్కారమండీ" అన్నాడు.
    ఆ వేళకి తన పర్సనల్ సెక్రటరీ అక్కడ లేనందుకు సంతోషిస్తూ, "నమస్కారం__కులాసా" అన్నాడు తాతయ్యచౌదరి.
    "మీ దయవల్ల" అన్నాడు రవి. గొంతులో ఒకలాంటి వ్యంగ్యం.
    ఆ మినిస్టర్ ది కేబినేట్ హోదా.
    కండవా సోఫా అంచుమీదవేసి కూచుంటూ, "మాలాంటాళ్ళ దయ కావాల్సినాళ్ళా మీరు. బోలెడుమంది ఇండిపెండెంటు మెంబర్లకి లీడరువి." అన్నాడు చిన్నగా నవ్వుతూ.
    "ఇండిపెండెంట్స్ లీడర్ ని నేను కాదనేది విదితమేగా!"
    "వచ్చే సెషనుకి ఖాయం. అంతా మీవైపునే వున్నారులే"
    కేక్సు, బిస్కట్సు.
    "చాలా బిజీగా వున్నట్లున్నారు. వచ్చే బుధవారం కేబినేట్ మీటింగు వుందికదా, ఆ బోనస్ సంగతేమన్నా టేకప్ చేస్తారా?" అన్నాడు రవి.
    "ప్రస్తుతం యేదీ టేకప్ చేసే స్థితి కాదు. అన్నట్లు ఆ బ్లాక్ ఆ ఆఫీసరు గొడవ చేస్తున్నాడు. బదిలీ చేయించి ప్రమోషను ఇప్పించావంట వొకతనికి. దానిమీద గొడవొచ్చిపడింది. ఏంటని అడిగితే రవిగారు చెపితే చేశాను మీకు సన్నిహిత వ్యక్తి అని అన్నాడు."
    "మీ పేరు నేనేం చెప్పలేదు. దబాయించి అడిగాననుకోండీ."
    "అసలెందుకొచ్చిందా అవసరం? అదంతా యిప్పుడు కెలికితే తను తప్పుకోటానికి మీరు రాసిన లెటరూ మీ పేరూ బయటపెట్టి తప్పుకునేటట్లున్నాడు."
    "ఆ గంగారాం కోరితే చేయించాల్సొచ్చింది."
    "గంగారాం ఎవడు?"
    "అదే. నిజామాబాద్ జిల్లా మెంబరు. బచ్చు గంగారాం.
    "ఆ చేయించుకున్న బొచ్చుగాడు నీ పక్షం నిలుస్తాడా అసలు? వాడు గోడమీద పిల్లివాటంగాడు. ఐతే వాడికి ఆంధ్రా ద్వేషం. నీతో సరిగానే వుంటాడేమోలే."
    "అసలు అదంతా గొడవెందుకైంది?" అన్నాడు రవి.
    "మా జిల్లా వాడితోనే వచ్చింది. వాడు కొమ్మినేని సుబ్రహ్మణ్యేశ్వరావని లేడూ. వాడి చుట్టం ఒకడున్నాడంట. మీరు ఆ పని చేయించకపోతే వాడికి వచ్చేదంట. కాస్త ముఖ్యమైన ఎమ్మెల్యే. కొట్టిపారెయ్యటానికి లేదు. నా మాట కాదనడనుకో. చెప్తానులే, ఐనా మీరు ఆడినొకసారి కలవండి మర్యాదకి." అన్నాడు తాతయ్యచౌదరి.
    "అట్లాగే. ముందు ఆఫీసులో మాట్లాడి కనుక్కుంటా. అసలెందుకట్లా చెయ్యాల్సొచ్చిందో. నేనేం రూల్స్ కి వ్యతిరేకంగా చెయ్యమనలేదే!"
    "మనం చెప్పినాక__రూల్సు ప్రకారం చేయటానికి లేకపోతే పక్కదార్లు చూడటం ఆఫీసర్ల విధికదా!" అని నవ్వాడు మినిస్టరు.
    కాఫీ అందుకుంటూ, "తీసుకోండి. అన్నట్లు బాజీ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ లో యేదో గొడవగా వుందంట." అన్నాడు మినిష్టర్ తాతయ్య.
    "గొడవేం లేదు. కోర్కెల విజ్ఞాపన పత్రం. ఎమర్జన్సీలో అంతకంటే యేం చెయ్యగలరు చెప్పండి! మీరు చెప్పుకింద నొక్కి కాలరాచరుగా!" అన్నాడు రవి.
    "మీరే జైల్లో సర్వ మర్యాదలతో జరిగిపోయిందిగా!"
    "అది వేరే సంగతి. మీలాంటివాళ్ళు పర్సనల్ గా కల్పించుకోవటం వల్ల__"
    "ఆ కాంప్లెక్సు పరిస్థితి క్రిటికల్ గా వుంది. అట్లాంటప్పుడు__"
    "కార్మికులవన్నీ న్యాయమైన కోర్కెలే__"
    మధ్యలోనే అందుకుని, "న్యాయమైనవి కాదనికాదు, నేననటం. యాజమాన్యం పరిస్థితి నిజానికి సరిగాలేదు. సమ్మెకి వీల్లేదని, వేరే చాలా మార్గాలు అనుసరిస్తారు. ప్రొడక్షను దెబ్బతింటే ప్రస్తుతం వాళ్ళు డిఫెన్సుకీ వేరే పెద్ద ఇండస్ట్రీసుకీ చెయ్యాల్సిన సప్లయ్ లు సమంగా వెళ్ళకపోతే__ వాళ్ళ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసే హక్కు వాళ్ళకుంది. మీరు వర్కర్స్ కి నచ్చజెప్పి ప్రస్తుతానికి ప్రొడక్షను తినకుండా__
    'అమ్మ నా కొడకా ఇందుకోసమా__ ఆ ప్రమోషను గొడవకీ దీనికీ లంకెపెట్టావా!" అనుకుంటూ, "నేను ఆ కంపెనీల లీడరుని కాదు. నా మాట ఏం చెల్లుతుంది" అన్నాడు రవి.
    "సిటీలో మీ మాట చెల్లని కార్మికవర్గాలున్నాయటండీ! మీరు తల్చుకుంటే సాధ్యంకానిదేలేదు. మిమ్మల్ని దేవుడుగా భావిస్తారంటగా వాళ్ళంతా!" అని 'అలగా జనాన్ని కూడగట్టటం బాగా నేర్చావు. లేకపోతే నీ మొఖం యెవడు చూసును! నిన్నగాక మొన్న అనామకంగా వచ్చి పెద్దవాడివై కూచున్నావు కుర్రనాయాలివి!' అని అనుకున్నాడు మనసులో దుగ్ధగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS