అరగంట తరువాత అనూష, భారతమ్మ కలిసి నీరజని చెరోచేత్తో పట్టుకుని నడిపిస్తూ కారులో కూర్చోబెట్టారు.
బాబుని వెచ్చగా బ్లాంకెట్ లో చుట్టి, నీరజ ఒళ్ళో పడుకోబెట్టి, స్టీరింగ్ ముందు కూర్చుంది అనూష.
* * * *
నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతంగా వున్న ఓ విశాలమైన ప్రాంగణం....
ఆ ప్రాంగణంలో ఓ పక్కగా వున్న తెల్లటి బిల్డింగు మంచులో తడిసిన బొండుమల్లె చెండులా వుంది. ప్రధాన ద్వారానికి పెద్దగేటు. ఆ గేటు తీసుకుని లోపలికి వెళ్ళగానే ఓ పక్కనుంచి కరచాలనం చేస్తూ రంగురంగుల గులాబీలు స్వాగతం చెబుతోంటే.... మరోపక్కనుంచి చిరునవ్వులు చిందిస్తూ క్రోటన్స్ కుశలమడుగుతుంటాయి.
ఆ ప్రాంగణంలో వున్న రకరకాల పెద్ద చెట్లమీంచి గాలి సంగీతం పాడుతూ వుంటుంది.
ముందుకి వెడితే కుడిపక్క బిల్డింగు బాధితులను ఆదుకొని అక్కున చేర్చుకోడానికి నేనున్నానన్నట్లు ఠీవిగా కనిపిస్తూ వుంది. ఎడంపక్క పెద్ద నీటిపంపు... కొంచెం ఎడంగా రకరకాల కూరగాయల పాదులు, అవి దాటి వెళితే సన్నటి నందు బిల్డింగు వెనక భాగానికి తీసుకెళుతుంది. వెనకభాగంలో కూడా కరివేపాకు చెట్లు, జామచెట్టు, మరికొన్ని కూరగాయల పాదులున్నాయి. ఓ మూలకి నీళ్ళకోసం కట్టిన సిమెంటు తొట్టి, దాని పక్క నుంచి నడిచివెళితే బిల్డింగ్ కి మరోపక్క ద్వారం, కొంచెం ఎడంగా అయిదారు బాత్ రూములు, లావెట్రీలు, బట్టలు ఉతుక్కోడానికి వీలుగా సిమెంటుతో కట్టిన గచ్చు, పంపు వున్నాయి.
పదేళ్ళ క్రితం తండ్రి తనకోసం కొన్న రెండువందల గజాల స్థలంలో రెండుగదులు వేసి, జీవితంలో దగాపడి ఆత్మహత్యలు చేసుకోబోయిన ఇద్దరు ఆడపిల్లలని కాపాడి, ఆ రెండుగదులు వాళ్ళకి నివాసంగా మలచింది అనూష... ఆ ఇద్దరులో ఒకరు సుశీల.
మధ్యతరగతి కుటుంబంలో మూడో ఆడపిల్లగా పుట్టిన సుశీలని పదోతరగతి దాకా చదివించారు. కట్నం వద్దన్నారు కదాని ఒక బస్సు కండక్టరుకిచ్చి పెళ్ళిచేశాడు తండ్రి. పెళ్ళికాగానే విజయనగరంనుంచి భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చింది సుశీల. సనత్ నగర్ బస్సు డిపోకి దగ్గరగా ఓ చిన్నగదిలో వాళ్ళ కాపురం ప్రారంభమైంది. రెండు నెలలు గడిచాక రోజూ రాత్రిళ్ళు డ్యూటీ వుందని చెబుతూ ఇంటికి రావడం మానేశాడు భర్త.
అమాయకురాలైన సుశీల అతని మాటలు నమ్మి, అతను ఇంటికి ఎప్పుడు వస్తే అప్పుడే మహాభాగ్యంగా భావించి సేవలు చేసేది. ఏడాది గడిచాక మగపిల్లాడికి జన్మనిచ్చింది. పురిటికి పుట్టింటికివెళ్ళి తిరిగివచ్చిన సుశీలకి తను అతనిని పెళ్ళిచేసుకునేటప్పుటికే అతనికి భార్యా, ఇద్దరు పిల్లలు వున్నారన్న విషయం ఆనోటా, ఈనోటా తెలిసింది. అలా అన్యాయం ఎందుకు చేశావని, నిలదీసింది. ఫలితంగా ఆమెను ఇంటినుంచి వెళ్ళగొట్టాడు భర్త. అయినా మొండిగా తిరిగి అతని దగ్గరకేవెళ్ళి తనకి, పిల్లాడికి వేరేదారి చూపించి వదిలేయమని, చెడి పుట్టింటికి వెళ్ళలేనని చెప్పింది. ఆ మొండితనానికి మండిపడ్డ అతను ఇంటికి రావడం మానేయడంకాక వాళ్ళతిండీ, తిప్పలు కూడా చూడడం మానేశాడు. దాంతో జీవితంమీద విరక్తిచెందిన సుశీల విషం తాగింది. ఆమె కేకలకి పక్కింటివాళ్ళు ఆమెని దగ్గర్లో వున్న ప్రవేటు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ హాస్పిటల్ లో పనిచేసే డాక్టరు ఉదయ అనూషకి స్నేహితురాలు.....
ఉదయ ద్వారా సుశీల గురించి తెలుసుకున్న అనూష హాస్పటల్ నుంచి సుశీలని డిశ్చార్జిచేశాక, బాబుతోసహా తనింటికి తీసుకొచ్చింది. తనింట్లోనే ఓ గది ఇచ్చింది.
అలాంటి విదివంచితే శారద, ప్రేమించి పెళ్ళిచేసుకుంటానని నమ్మించి, కాదన్న తల్లిదండ్రులను కూడా వదిలేసి తన దగ్గరకు వచ్చిన శారదని ఏడాదిపాటు అనుభవించి, ఆ తరువాత కంటికి కనిపించకుండా పారిపోయాడు. అలాంటి స్థితిలో అటు కన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళలేక, ఇటు వంటరిగా సమాజంలో అవమానాలు భరిస్తూ బతకలేకా నలిగి, చివరకు తెగించి బతకడం నేర్చుకుంది.
కర్ణాటక సంగీతంలో డిప్లొమా సంపాదించుకున్న శారద ఆ సర్టిఫికెట్ నే జీవనోపాధికి ఉపయోగించుకుని, పిల్లలకు సంగీతం పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. ఒక గది అద్దెకి కావాలని వచ్చిన శారదని చేరదీసి, సుశీలకి తోడుగా సుశీలకిచ్చిన గదిలోనే శారదని వుండమన్నది.
అప్పుడే అనూషలో బాధిత స్త్రీలకు తానేదన్న చేయాలన్నా ఆలోచన కలిగింది. వెంటనే ఖాళీగా పడివున్న తన ఫ్లాట్ లో ఇలాంటి వాళ్ళ కోసం ఒక బిల్డింగ్ కట్టిస్తే ఎలా వుంటుందన్న ఆలోచన కలిగింది. కలిగిందే తడవుగా అప్పటి తన ఆర్థికస్తోమత దృష్టిలో పెట్టుకుని, తనేప్లాన్ గీసి, ముందు రెండు గదులు, బాత్ రూము కట్టించి సుశీలను, శారదను, సుశీల కొడుకును, తన దగ్గర పనిచేసే అయిలయ్యను ఆ రెండు గదుల్లోకి పంపించింది.
కొన్నాళ్ళ తర్వాత శ్యామల ఎదురైంది. శ్యామల భర్తకి హార్ట్ ఎటాక్ రావడంతో ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అతని తమ్ముడు, శ్యామల కలిసి, దురదృష్టవశాత్తూ అప్పటికి ఓపెన్ హార్ట్ సర్జరీచేసి బతికించే అవకాశం కూడా దాటిపోయింది. అతని భార్య శ్యామల అనూష కాళ్ళా వేళ్ళాపడి బతిమాలింది ఎలాగయినా భర్తని బతికించమని. కానీ అనూష మానవత్వం వున్న మనిషేకానీ, దైవంకాదు కదా! అతను పోవడంతో పిల్లలు కూడా లేని శ్యామల వంటరిదయింది. మామగారిచ్చిన ఒకే ఒక ఇంట్లో మరిది, అతని భార్యాపిల్లల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి బతకడం ఇష్టంలేని శ్యామలని సుశీల,శారదలకి పెద్దదిక్కుగా వాళ్ళ దగ్గరికి పంపిందింది అనూష.
ఆ తరువాత ఈ ప్రపంచంలో తన అవసరం వున్న స్త్రీలు చాలా మంది వున్నారని భావించిన అనూష ప్రభుత్వానికి అర్జీలు పెట్టి, కలెక్టరుని కలుసుకుని, కొన్ని సంస్థలకు కలిసి, తాను ప్రారంభించిన బాధిత మహిళల హోమ్ కి ఆర్థికసాయం అర్థించింది. తన స్వంత స్థలంలో తను కట్టించిన రెండుగదులు చూపించి, అది అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం చేయూక ఎంత అవసరమో వివరించింది. ఆమెలోని సేవాభావానికి, ముగ్థుడైన కలెక్టరు ఆమె స్థలానికి సమీపంలోనే ఇంకా కొంత ప్రభుత్వ స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్ధికసాయం అందించాయి. ఫలితంగా రెండు గదులు, ఇప్పుడు పది పడకగదులతో ఒక పెద్ద హాలు, కిచెన్, డైనింగ్ హాలు, ఐదారు బాత్ రూంలు, లావెట్రీలు వగైరా వాటితో పకడ్బందీగా రూపుదిద్దుకుంది. న్యూస్ పేపర్ల ద్వారా, పాంప్లెట్ ల ద్వారా తను స్థాపించిన సంస్థకి పబ్లిసిటీ ఇచ్చింది అనూష. రెండేళ్ళలోపలే అక్కడ పాతికమంది స్త్రీలు చేరారు.
