"వస్తున్నా, ఒక్క నిమిషం" అన్నాడు శ్రీపతి, ప్యాంటు నడుం కొక్కెం పెట్టుకుని నిలువు జిప్ పైకి లాగుతూ.
ఎవరొచ్చినా సాధారణంగా లోపలి గదిలోకి వచ్చే అవకాశం ఇవ్వడు. తన పెయింటింగ్ హంగామా చూడనివ్వటం యిష్టం వుండదు. ముందు గదిలోంచే పంపేస్తుంటాడు. పూర్తిచేసిన పెయింటింగ్స్ కనపడకుండా దాచేస్తుంటాడు.
అతను వుండే బంగళా విచిత్రంగా వుంటుంది. చూడటానికి చిన్నదిగానే అనిపిస్తుందిగానీ దాన్లో కింద పైనా పక్కలా కలిపి యెనిమిది తొమ్మిది కాపరాలున్నాయి. కాపరం కాని కాపరం శ్రీపతిది ఒక్కటే. ధనలక్ష్మిది, రోగిష్టి తండ్రితో కాపరం. ఆ ఇల్లు వున్న వీధి చిన్నదే అయినా వీధికి రెండువైపులా కొత్తవీ పాతవీ, కొత్తగా తీర్చిన పాత బంగళాలు కిక్కిరిసినట్లుగా చాలా వుంటాయి. రకరకాల ఉద్యోగాల్లో వ్యాపకాల్లో వ్యాపారాల్లో వున్న వాళ్ళుంటున్న వీధి.
ముందు గదిలోకి అడుగువేస్తూ "నిలుచునేవున్నారు కూచోండి" అన్నాడు.
"ఎటో బయల్దేరుతున్నట్టున్నారు. తొందర పనైతే వెళ్తాను__ మళ్ళీ కలుసుకుందాం" అంది.
"అదేం లేదు. కూచోండి అలా, ఓ కప్పు కాఫీకని_"
"కప్పు కాఫీ కోసం అంత దూరం దేనికండీ! నే పట్టుకొస్తా రెండు కప్పులు కలిపితే మా నాన్న వద్దన్నాడు. రడీగా వుంది ప్లాస్కులో" అని లేవబోయింది.
"కూచోండి, కూచోండి. మీ ఫ్లాస్క్ లో కాఫీ అలా వుండనీండి. మీ యింటికొస్తాను. అప్పుడు ఇద్దురు. చిరుతిండి అలవాటైన ప్రాణికి ముప్పూటలా పీకలదాకా తిండిపెట్టి_అది తిని వుండమంటే యెంత కష్టమో అంత కష్టం__అలవాటైన హోటలు మురికి వేన్నీళ్ళు గొంతులో పడుతూండకపోతే!" అని తనూ కూచున్నాడు.
"నాకు మీ గురించి యేమీ చెప్పనేలేదు?" అంది.
"నాదేముంది చెప్పటానికి?"
"మీ గురించి నాకు అంతా తెలిసిపోయిందిలెండి, మా కంపెనీలో ఒక క్లర్క్ ది మీ వూరి ప్రక్క టౌను, కంకిపాడు. అతను చెప్పాడు మీరు జమిందారులటగా!" అంది.
"యింకా మన దేశంలో జమీందారులంటూ వున్నారా!"
"యిన్ని నెలలనుండి తెలిసుండి కూడా యేమీ చెప్పలేదు" అంది.
"యెన్నో యేళ్ళగా తెలిసిన వాళ్ళకయినా అంతే నా గురించి నేను చెప్పుకోవాల్సినవీలేవు. నా గురించి నేను చెప్పుకోకూడనివీ లేవు. మనిషి మాట, స్వభావం, పరిచయంలో తెలుస్తాయి. వెనుకా ముందూ తడుముకోకుండా సామాన్య జీవనం గడిపే స్థోమత వుందని గ్రహిస్తారు."
"లక్ష్మి!"
గుమ్మం బయట నిలుచున్న ముప్ఫయ్ ఐదేళ్ళ వయసు స్త్రీని చూసి, లేచి గుమ్మంలోకి వెళ్ళింది ధనలక్ష్మి.
"మీ గుమ్మం బయట గడియవేసి వుంటే_యిటు నీ గొంతు వినిపించి వచ్చాను. మా వారింకా రాలేదు. నేను అలా మా లేడీస్ క్లబ్బుకి వెళ్ళాలి. కీస్ ఇస్తావేమోనని. యెక్కడికీ వెళ్ళడంలేదుగా?"
"లేదు అలాగే" అని తాళం చెవులగుత్తి తీసుకుంది ధనలక్ష్మి.
వచ్చి కూచుంటూ "ఆవిడ తెలుసా?" అంది.
"ఈ అగ్గిపెట్టెల మహల్లో వుంటున్న భర్తల్లో కొందరు తెలుసు. ఆ కొందరిలో కొందరి భార్యలు తెలుసు. ఈవిడ ఒకరిభార్య అనుకుంటాను. తరచూ చూస్తుంటాను" అన్నాడు శ్రీపతి.
శ్రీపతి మాటలు యెంతో నచ్చినట్లుగా చూస్తూ, "ఆమె భర్త సిండికేట్ బ్యాంకులో క్యాషియర్. ఆవిడ రచయిత్రి. వంటలూ వార్పులూ అంటూ వ్యాసాలు రాస్తుంది. పత్రికలకి కొన్ని కథలు కూడా రాసింది_ యింకా అచ్చు అవలేదు. తిరిగి వస్తుంటాయ్. నాకు చూపెట్టింది. యేదో వున్నయ్__ మెంతికూర చింతామణి అని వారపత్రికల్లో చూశారా?"
"పత్రికలు చూసే అలవాటు లేదు సరిగా."
"శ్రీపతిగారు యెక్కడుంటారండీ?" బయటి నుంచి మగగొంతు.
"మీకోసం యెవరో వచ్చినట్లున్నారు" అంది.
"అడిగాడుగా చెబుతారు. వస్తాడుగా యిందాక వచ్చిన మనిషి."
మరు నిమిషంలో, గుమ్మంలో నుంచుని, యెదురుగా శ్రీపతిని చూసి "హలో శ్రీపతిగారూ" అంటూ గుమ్మంలోకి అడుగులు వేశాడు విజయ్ కుమార్.
"హలో రండి" అన్నాడు శ్రీపతి కూచునే__చేత్తో పక్కన వున్న కుర్చీ చూపెడుతూ.
లోనికి వచ్చి కూచుంటూ యెదురుగా కుర్చీలో వున్న స్త్రీని చూసి, చూపు శ్రీపతివైపు మరల్చి, "గుర్లింగం కనిపిస్తే అడిగితే చెప్పాడు మీ అడ్రసు." అన్నాడు విజయ్ కుమార్.
"ఆఁహాఁ"
"క్రితంసారి మనం కలిసినప్పటికి మీరింకా హాస్టల్లోనే వున్నారనుకుంటాను" అన్నాడు విజయ్ కుమార్.
"అనుకుంటాను" అన్నాడు శ్రీపతి.
"నేను క్రితంసారి హాస్టల్ కొచ్చినప్పుడు...." అని యేదో మాట్లాడుతూ, మధ్య మధ్యలో కంటి కొసలోంచి ధనలక్ష్మిని గమనిస్తూ వున్నాడు విజయ్ కుమార్. పరిచయం చేస్తాడేమోనని శ్రీపతి వంక చూశాడు.
"వూఁ యేఁవిఁటి. కులాసా? మీ లా చదువు యెంత వరకూ వచ్చింది?" అన్నాడు శ్రీపతి.
"ఆఁ యేదో పేరుకి చదువు" అని ధనలక్ష్మి చనుకట్టుమీద చూపు క్షణకాలం నిలిపాడు విజయ్ కుమార్.
"మంచిది. నాన్నగారికి చెప్పండి. నేనొచ్చి కలుసుకుంటానని." అన్నాడు శ్రీపతి ధనలక్ష్మి వంక చూసి.
తను వచ్చి కూచుని వున్నప్పుడు యెవరన్నా రావటం జరిగితే వచ్చిన వాళ్ళని పరిచయం చేసేవాడు శ్రీపతి. పరిచయం చెయ్యకపోగా, అలా అనేసరికి యేదో విశేషం వుండి వుంటుందనిపించింది ఆమెకి. తరవాత అడగాలనుకుంటూ, "మంచిది" అంటూ లేచి వెళ్ళింది ధనలక్ష్మి.
వెళుతున్న ఆమె పిరుదుల వంక చూస్తూ, "ప్రస్తుతం యేం చేస్తున్నారు?" అన్నాడు విజయ్ కుమార్.
"మిమ్మల్ని చూస్తున్నా" అన్నాడు శ్రీపతి.
"యిఁహీఁ" అని "పేపర్లో వర్క్ చెయ్యటం లేదటగా?" అన్నాడు విజయ్ కుమార్.
