నాన్నగార్ని హాస్పిటల్లో ఎడ్మిట్ చేసి నాలుగు రోజులపాటు అన్ని రికార్డింగులూ కేన్సిల్ చేశాను. ఒక ప్రముఖ సంస్థ వాళ్ళు గాన సరస్వతి అవార్డు ఇస్తున్నారు. అందుకోసం హైదరాబాద్ వెళ్ళాలి. అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు వాళ్ళు. నాన్నగారి పరిస్థితి సీరియస్ గా వుంది. సాయపడమని అన్నా వదినల దగ్గరకెళ్ళే పరిస్థితికాదు! రఘుతో నా ప్రోబ్లెం చెప్పుకుని దాసమ్మగారిని పిలిపిస్తానన్నాను.
రఘు షూస్ వేసుకుంటున్న వాడల్లా నావైపు తీక్షణంగా చూసి- "అహల్యా....నీ స్వంత తండ్రి అంటే తప్పదని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. వాళ్ళని కూడా ఎక్కడ భరిస్తాం చెప్పు. ప్రాక్టికల్ గా ఆలోచించు. ఆవిడతో బాటు దాసుగారు కూడా వస్తారు. వాళ్ళూ వయసయిపోయిన వాళ్ళే! మళ్ళీ ఇద్దరు పేషంట్స్ తయారయితే నువ్వు చూడగలవా? పని వాళ్ళు డబ్బు పారేసినా చెయ్యరని నీకు అర్ధమయిందిగా!" అన్నాడు.
"తెచ్చి పెట్టుకున్నాను. ఎక్కడ భరిస్తాం?" అనే మాటలు నాకు గుచ్చుకున్నాయి. ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో కూడా నాకు అధికారం లేదా? నన్ను పెంచిన తల్లిదండ్రులు నాకు బరువా? రఘుతో వాదించదలుచుకోలేదు. నేను హైదరాబాద్ రావడం కుదరదని వాళ్ళకి చెప్పేశాను. ఆఖరి రోజుల్లో తండ్రిని చూసుకున్నానన్న ఆత్మ సంతృప్తి అయినా దక్కించుకోవాలనుకున్నాను.
ఒకరోజు పెద్దన్నయ్య వచ్చాడు. బాగా చిక్కిపోయి చిరిగినా చొక్కాతో వచ్చాడు. ఇల్లు గడవడం కష్టంగా వుంది ఓ పదివేలిమ్మన్నాడు.
నేను లోపలికెళ్ళి బీరువాలోంచి డబ్బు తీస్తుండగా రఘు వచ్చాడు.
"అహల్యా....డబ్బు ఇస్తున్నావా? ఇది ఆరంభం అవుతుందే కానీ ఆఖరుకాదు. వాళ్ళెంత సోమరిపోతులో నీకు తెలుసు" అన్నాడు.
"పిల్లలు పస్తులుంటున్నారట!" అన్నాను.
"చావనీ!" అన్నాడు.
నాకెందుకో కడుపులో కలుక్కుమంది. రక్త సంబంధం అంటే అదేనేమో, నేను డబ్బు తీసుకుని హాల్లోకి వెళ్ళి అన్నయ్యకిచ్చాను.
"చాలా థాంక్స్" సిగ్గుగా అన్నాడు బాబు.
ఇంతలో పైనుంచి రఘు గొంతు వినిపించింది. "ఆడపిల్ల సొమ్ము తినడం వ్యక్తిత్వం వున్నవాడు చేసేపని కాదు. కష్టపడి సంపాదించి నీ కుటుంబాన్ని పోషించుకో లేదా అందరూ కలిసి కట్టకట్టుకుని చావండి!"
వాడేమనుకున్నాడో కానీ డబ్బు అక్కడే టీపాయ్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు.
నేను రఘు ప్రవర్తనకి నిరుత్తరురాలనయ్యాను. నేను డబ్బు ఇచ్చాకా అతనలా అనడం, అన్నయ్యని కాదు నన్ను అవమానించడం! నాకేం అధికారం లేదా? మరి తనకి ఇరవై లక్షలు ఎవర్ని అడిగి ఇచ్చానూ? అప్పుడది ఆడపిల్ల సొమ్ము కాదా? నాకు చాలా బాధ కలిగితే మాటలు రావు. అదే పెద్ద మైనస్ పాయింట్!
ఆ రాత్రి రఘు నామీద చెయ్యి వేసినప్పుడు నేను ఎప్పటిలా అతని వైపు తిరిగి అల్లుకుపోలేదు.
ఆ విషయం కనిపెట్టి అతనే అన్నాడు. "మీ అన్నయ్యలు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టి నా మొహం మీదే తలుపులు ధడేల్న వెయ్యడం నేను మరిచిపోలేకపోతున్నాను హలా? అందుకే అలా చేశాను."
"సమస్య వాళ్ళది కాదు. నాది! నాకు ఈ ఇంట్లో స్వతంత్రం లేదా? అధికారం లేదా?" దుఃఖంతో అడిగాను.
"నువ్వు అమాయకురాలివి. వాళ్ళు నిన్ను ఎంతగా ఎక్స్ ప్లాయింట్ చేసి నీ జీవితంతో దారుణంగా ఆడుకున్నారో మరిచిపోయావా? నిన్నాసాలెగూడు నుండి బయటికి తీసుకురావడానికి నేనంత కష్టపడ్డానో తెలుసా? మళ్ళీ వాళ్ళని చేరదీస్తావా?" అన్నాడు.
నాకు ఆ మాటల్లో నిజం వుందనిపించింది. అటు తిరిగి పడుకున్న అతని మీద నెమ్మదిగా చెయ్యి వేశాను.
* * *
రఘు వ్యాపారం అభివృద్ధి చెందింది. అతనికి క్షణం తీరిక లేకుండా కొత్త వెంచర్స్ ప్రారంభిస్తున్నాడు. నాన్నగారింక రోజుల్లో వున్నారనీ కావాలంటే ఇంటికి తీసుకెళ్ళమనీ డాక్టర్స్ చెప్పేశారు.
కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు. కానీ ఆల్ రెడీ కమిట్ అయిన వాళ్ళకి మాత్రం పాడుతున్నాను. ఒకరోజు రిహార్సల్స్ లో వుండగా చాలా నీరసంగా అనిపించింది.
మధ్యలో కడుపులో తిప్పి వాంతి కూడా అయింది. ఇంటికొచ్చేశాను.
రఘుకి ఫోన్ చేస్తే కంగారుపడుతూ డాక్టర్ ని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆయన పరీక్షించి "కంగ్రాచ్యులేషన్స్ రఘురాంగారూ!" అన్నాడు.
నేను తల్లిని కాబోతున్నాను! ఒక్కసారిగా స్వర్గం దిగి వచ్చినట్లు అనిపించింది. ఎవరెస్ట్ ఎక్కినవాళ్ళు కూడా అంత ఎత్తుగా ఫీలవరేమో, నాకు అంత ఎత్తుకీ ఎదిగిపోయినట్లు అనిపించింది.
రఘు అయితే ఆనందంతో గంతులేశాడు. అసలు మంచం దిగకూడదన్నాడు. పాలూ, హార్లిక్స్, పండ్లరసాలూ అంటూ నా ప్రాణం తీశాడు. అతని ప్రేమలో నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఊపిరి సలపని ఆ ఆనందంలో ఇంటికొచ్చిన ప్రొడ్యూసర్లు చిన్న మొహాలేసుకుని వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కొత్త సినిమాలేం ఒప్పుకోడానికి వీల్లేదన్నాడు రఘు. నాన్నగారు విషయం విని ఆనందంగా చూశారు. అదేనేమో నేను ఆయన్ని మిక్కిలిగా సంతోషపెట్టిన సమయం. ఆ గుండె తట్టుకోలేక ఆగిపోయింది. ఆయన పడ్తున్న నరకయాతనకి తెరపడింది.
ఇంటికి అన్నయ్యలూ, వదినలూ అందరూ వచ్చారు. పదమూడోనాడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళేటప్పుడు చిన్నన్నయ్య తన పరిస్థితేం బాగాలేదని పీకలోతు అప్పుల్లో కూరుకుపోయాననీ ఒక యాభైవేలు సహాయము చెయ్యమనీ అన్నాడు.
"నేను లోపలికి వెళ్ళి పాస్ బుక్కులతో తిరిగి వచ్చాను. "మీ ఇద్దరి పిల్లల పేర్లమీదా యాభైవేల చొప్పున ఫిక్స్ డ్ వేశాను. కన్నారు కాబట్టి వాళ్ళని బాగా పెంచండి. మీకు మాత్రం నేనేం ఇవ్వను. మీ మీద నాకు నమ్మకం లేదు."
ఆ మాటలకి వాళ్ళు చిన్న మొహాలేసుకుని వెళ్ళిపోయారు. వదినలు మాత్రం సంతోషించారు. నాకు వాళ్ళమీద జాలేసింది. ఇంత చాతగాని మొగుళ్ళని కట్టుకున్నందుకు.
దాసుగారూ, దాసమ్మగారూ వార్త విని వచ్చారు. నేను ఒట్టి మనిషిని కాదని తెలిసి పొంగిపోయారు. ఆ నాలుగు రోజులూ దాసమ్మగారు నాకు తల్లిలేని లోటుని మరిపించింది. వాళ్ళు వెళ్ళే రోజు నాకు చాలా బెంగగా అనిపించింది. రఘుతో "వాళ్ళని ఇక్కడే వుండిపోమందామా?" అన్నాను.
అతనేం మాట్లాడలేదు.
మధ్యాహ్నం భోజనాలు చేస్తుండగా రఘు వచ్చి "ఇదిగోండి మీ టికెట్స్ అరటిపండ్లూ, కాఫీ డ్రైవర్ కిచ్చి పంపించు అహల్య. ఏమీ అనుకోకండి. మీరెళ్ళేటప్పుడు నేను ఇంట్లో వుండలేకపోతున్నందుకు!" అన్నాడు.
నాకు అతని అభిమతం అర్ధమైంది.
నెలలు దగ్గరపడి భారంగా ఇంట్లో తిరుగుతుంటే అమ్మ గుర్తుకొచ్చేది. ఆడపిల్ల పుడితే అమ్మ నన్ను పెంచినట్లు పెంచాలి అని కలలు కనేదాన్ని మధ్యాహ్నాలు తంబూరా మీటుతూ సాంప్రదాయ కీర్తనలు పాడుతుండేదాన్ని.
