ఈసారి అక్కడినుంచి బిచాణా ఎత్తబోతూండగా, బజార్లో గోవిందన్ నాయర్ అని బట్టల బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వో యేదో_ అతను పాత పరిచయం_కనిపించాడు. అతని భార్య పెళ్ళయిన యేడాదిన్నరకే యెవరితోనో వెళ్ళిపోయింది. "లక్షణంగా ఓ పిల్ల నిన్ను పెళ్ళాడితే, బుద్ధిగా ఆ పిల్లకి ఒండిపెడుతూ, కడుపుచేస్తే_ సిగ్గులేకుండా కడుపుచేస్తావా అని కసిరి చక్కా నిన్నొదిలేసి వెళ్ళిపోతే ఆ మాత్రానికి యిలా తయారయ్యావన్నమాట" అని హాస్యం పట్టిచ్చేది.
అతను వాళ్ళ బాస్ తో హైదరాబాద్ వెళుతున్నట్లూ, అక్కడ వాళ్ళ బాస్ దిగడిపోతాడనీ, అక్కడి నుంచి యిద్దరూ కలిసి కొచ్చిన్ వెళ్ళొచ్చనీ చెప్పాడు. చెప్పిన ప్రకారం రమణి రైలు దిగేసరికి కలుసుకున్నాడు గానీ వాళ్ళ బాస్ కొచ్చిన్ దాకా అఘోరిస్తున్నాడనీ విడిగా అక్కడికి రమ్మని చెప్పాడు. ప్రయాణం ఖర్చులకి డబ్బిచ్చాడు. కానీ రమణికి బుకింగ్ కౌంటర్లో టిక్కెట్ కొన్న అనుభవం యింతవరకు లేదు. కదులుతున్న రైల్లో యేదో ఒక పెట్టెలో ఎక్కేస్తుంది సాధారణంగా టిక్కెట్టు కొనాల్సికాదు. దొంగ ప్రయాణం కాదు. రైల్వే టిక్కెట్ ఇన్ స్పెక్టర్ల అతిథిగా ఫ్రెండుగా ప్రయాణిస్తుంది. యెప్పుడన్నా అవసరం అయితే కొంటుంది. కానీ ఆమె జీవితంలో వందలాది ప్రయాణాల్లో అలా టిక్కెట్టు కొన్న సందర్భాలు వేళ్ళమీద లెక్కించవచ్చు.
ఆ రకంగా యీ రాత్రిపూట యీ నగరంలో రికామిగా వుండిపోయింది. అలా రికామిగా నుంచుంటే _ పక్కనించి పోతూ తనవంక చూసిన రామ్మూర్తి మీద కన్నుపడింది. కన్నుపడిన మరుక్షణంలో ఆ మనిషి చిక్కుతాడో లేదో కనిపెట్టేసెయ్యగలదు.
నాంపల్లి సెంటరు. రాయల్ హోటల్ కి పక్కన వున్న పంజాబ్ హోటల్లోకి దారితియ్యబోతున్న రమణి, అటు స్టేషన్లో రైలింజను కూత విని, బుర్రలో యేదో ఆలోచన మెరిసినట్లుగా గిరుక్కున వెనక్కి తిరిగింది. "బ్లడీ ఫక్కెన్ హోటల్స్" అనుకుంటూ. రామ్మూర్తి కాలు మెలిక పడవలసింది. పిసరంతలో తప్పింది. ఆ కదలికకి అతని చేతిని కొంచెం గట్టిగా పట్టుకుంది.
రైల్వే స్టేషన్లోకి నడిచింది.
నలుగురైదుగురు గుంపుగా కూచుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళవంక చూసి "దేఖో" అంది _ వింటూనే అందరూ తలలు ఇటు తిప్పారు. పైకి మడచిన చూపుడు వేలితో దర్పంగా సూచించింది. ఒక పోర్టర్ లేచి వచ్చాడు. నడుస్తూంది. నడుస్తూ, "కూడా రా" అన్నట్లుగా చెయ్యి వూపింది. తన కాలి పక్కగా.
సైడింగ్ ఫ్లాట్ ఫాం మీదికి నడిచింది.
ఓ పదినోటు పోర్టర్ చేతికి అందించింది.
రామ్మూర్తి విస్తుపోయాడు_ ఆ నోటు యెక్కడనుంచి తీసి ఇచ్చిందీ తెలుసుకోలేక. పర్స్ లేదు. బ్లౌజ్ లోంచో, బొడ్లోంచో కొంగు నుంచోకాదు. "మరి" అనుకున్నాడు.
రెండో చేతులో వున్న చేతి రుమాలలోంచి.
"ఆ ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటు తెరువు" అంది ఉర్దూలో.
"అదెట్లా?" అన్నాడు అతను ఉర్దూలో.
"నీకు సాధ్యమవుతుందిలే తెరువు"
పోర్టర్ గ్రహించి, "వెయిటింగ్ రూంలు హోటళ్ళు వున్నయ్ గా" అన్నాడు.
పెదవి విరిచి, "దీన్లో అయితే మజా వస్తుంది. పొద్దున్నే యీ రైల్లోనే ఆ పెట్టెలోనే ప్రయాణం చెయ్యాలి కూడా" అంది.
పది నిమిషాలు.
కంపార్ట్ మెంట్ తలుపు తెరుచుకుంది. అతని ముఖంలోకి చూస్తూ.
పైకి గెంతగానే ఆమె చెంపకి చెంప భుజానికి భుజం ఆనాయి. తలుపు మూసింది.
అడుగులు వేస్తోంది. ఆమె వెనక అతను. కటిక చీకటి. ఒకూపే తలుపు తెరిచింది.
రోజూ రైళ్ళలో తిరిగే టిక్కెట్టు ఇన్ స్పెక్టర్లు కూడా ఆ చీకట్లో తడుముకోకుండా అంత నేర్పుగా వెళ్ళలేరేమో _ అనుకున్నాడు రామ్మూర్తి.
కిటికీ తెరిచింది.
చెరో బెర్తు మీదా కూచున్నారు. బయటి విద్యుద్దీపపు కాంతి, కిటికీ లోంచి వాళ్ళమీద పడుతోంది.
ఒక పాదం, అతని రెండు కాళ్ళ మధ్యగా బెర్తుమీద నిడుపుగా ఆనించింది. పాదం అతనికి తగులుతూంది.
రామ్మూర్తి వణికిపోతున్నాడు.
"అప్పుడెక్కడినుండి వస్తున్నారు?"
"సినిమా చూసి"
"ఏం సినిమా?"
"కె.ఎ. అబ్బాస్ కాల్ గర్ల్"
"చూడటానికి అంత పాతదే దొరికిందా? అదీ తెరమీదది వుత్త బొమ్మ" అని నవ్వి బొటనవేలితో_
అతని ముఖం చుట్టూ ఆమె చూపు.
వణికిపోతున్నాడు.
యేదో గమనించినట్లుగా రవ్వంత కనుబొమ్మలు చిట్లించి, "పెళ్ళయిందా" అంది.
"వూఁ_"
"ఎన్నాళ్ళయింది?" అంది.
"యేడాది పైగా"
"వూళ్ళో వుందా?" అంది.
"వూ__"
"ఒంట్లో బాగుందా?" అంది.
"వూ."
"బాగుంటుందా?" అంది.
"వూ."
"యింట్లో ఒక్కతే వుందా?" అంది.
"వూఁ"
"యింట్లో ఒక్కత్తెనే వదిలి 'కాల్ గర్ల్' బొమ్మ చూడటానికి వచ్చారూ" అని నవ్వు ఆపుకుంటూ, "బొమ్మెప్పుడూ చూడనేలేదా?" అని పకపకా నవ్వింది.
రామ్మూర్తి వణికిపోతున్నాడు.
"ఆడవాళ్ళని_" అని చేత్తో మూడు నాలుగు చోట్ల చూపెట్టుకుంటూ "యిక్కడో, యిక్కడో, యిక్కడో, దొంగచూపులు చూస్తూ అడ్డమైన ఆలోచనలతో నానా ఖంగాళీగా వూహించేసుకుంటూ గడిపేస్తూ__ చివరికో పిల్లని__ ఓ చలిమిడి ముద్దని చేసేసుకుంటారు. బతుకు చప్పగా చొప్పదంటులాగా వుంటుంది. మీ అర్ధాంగి మీ చూపులు వాలేలాగా వుండాలిగాని మరెవరి చూపూ వాలకూడదు. అందరూ మనలాంటివాళ్ళే_ ఒకరిద్దరు తప్పపుట్టినవాళ్ళు తప్ప. తన కళ్ళకి బట్టలే లేనట్లుగా కనబడాలి. ఇతర్ల కళ్ళకి గొంగళికప్పుకున్నట్లుగా కనపడాలి. కానీ కళ్ళు అందరివీ ఒకటే. పరమ నిష్పక్షపాతమైన పాపిష్టివి. యే ఆడదాని రూపమూ ఎల్లకాలం ఒక్కలాగే వుండదు. యిరవై యేళ్ళ వయసులో మీ బందరు లడ్డూలా వుంటారు. ముప్ఫయ్ కి తిరుమల లడ్డూలా వుంటారు. నలభయ్ కి, కంటికీ, పంటికీ నచ్చని తిరపతి వూళ్ళో చచ్చు లడ్డూలా వుంటారు. లడ్డూ లేదు....లేదు.... ఇరవయ్యేళ్ళకే సలిమిడి సుద్దలు. సలివిడి సుద్దని చక్కని లడ్డూలాగా చెయ్యొచ్చు గానీ_ చేస్తే ఏం కొంప మునిగిపోతుందో అని భయం. వుద్యోగం చేసే ఆఫీసులోనూ అంతే. యెదురు చెప్పడానికి భయం. చెప్పింది చెయ్యడానికీ భయం. చెయ్యకపోవడానికీ భయం. వూహల్లోకి పగటి కలల్లోకి నిద్ర కలల్లోకి_ అంతలో అర్ధాంగి రావడంతో వాటిమీద తలుపు ధడాలున మూత పడుతుంది కనీసం ఊహలూ లేవు. కలలూ లేవు. యాంత్రికంగా కాల్ గర్ల్ గుడ్డ బొమ్మలు, వాల్ గర్ల్ కాగితం బొమ్మలు చూస్తూ కాపురం వెలగబెడుతూ యేడాదిన్నరకొకసారి కడుపు చేస్తూ మనలాంటి మరికొందర్ని భూమ్మీదకి వదులూ_" అని ఆయాసంగా శ్వాస పీల్చుకుని, "బతుకులో మొదటిసారిగా నూటికి నూరుపాళ్ళూ అంచనా తప్పింది. తొలి అపశృతి కానుందో__" అని పకపకా నవ్వి భారంగా శ్వాస విడిచి చివాలున లేచి వడివడిగా నడిచి వెళ్ళిపోయింది రమణి.
