నేను వెంటనే వెళ్ళి, "ఏమిటండీ ఈ అవతారం! బట్టలు వేసుకు రాకూడదూ ! ఈ తువ్వాలేమిటి? బనీనయినా వేసుకోలేక పోయారా" అని అడిగాను.
'బతిమాలుకున్నానక్కా! ససేమిరా నా మాట వినలేదు. ఓహో_ఏమిటడుగుతావు? బావగారి అవతారం చూడు" అని మా తమ్ముడు అన్నాడు. "రండి. బట్టలు మార్చుకొని వద్దురుగాని. నేనూ వస్తాను పదండి" అన్నాను.
"ఏమీ అక్కర్లేదు సరోజా! వచ్చేవాళ్ళు శ్రీశ్రీని చూడడానికి వస్తారుగానీ శ్రీశ్రీ వేసుకున్న బట్టల్ని చూడడానికి కాదు. నేను ఇలాగే ఊరంతా చుట్టి వచ్చేస్తాను. ఈ చీరలో నువ్వు తిరిగి రాగలవా? నీకేమి తెలీదు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో" అన్నారు.
అందరికీ అరిటాకులు వేసి గ్లాసులతో నీళ్ళుంచాను.
"మకేమిటి, టిఫిన్లు పెడతారా, లేక భోజనాలా" అని జ్వాలాగారు అడిగారు.
"తొమ్మిది గంటలకి భోజనాలేమిటండీ బాబూ! లైట్ గా టిఫిన్లే" అన్నాను.
విస్తరెక్కడా ఖాళీలేదు. శ్రీశ్రీగారు జోకులతో వాళ్ళని తెగ నవ్వించేస్తూ వుంటే, పదకొండు గంటలదాకా కూర్చున్నవాళ్ళు లేవలేదు.
"అమ్మబాబోయ్! టిఫిన్లే ఇంత హెవీగా వుంటే భోజనాల సంగతి మరేమైనా వుందా" అన్నారు.
సాయంకాలం అందరం మీటింగ్ హాల్ లో మీటయ్యాం. జ్వాలాముఖిగారు ఆ రోజు ఉపన్యాసంలో అందర్నీ అదరగొట్టేశారు. వారు ఎంత పవర్ ఫుల్ స్పీకరో ఆనాడు నాకు అర్ధమయింది.
అందరి మీటింగులూ అయిన తర్వాత శ్రీశ్రీగారు ప్రారంభించారు.
మధ్యలో చిన్న చిన్న జోక్ లు వేసే అలవాటు వారికి వుంది. ఆ రోజు సభలో ఈ చిన్న కథ ఒకటి చెప్పారు.
"ఓ ఇద్దరు అమాయకులు మద్రాసు మీనంబాక్కం విమానాశ్రయాన్ని చూడడానికి వచ్చారుట. వాళ్ళిద్దరూ విమానాన్ని చూసి తెగ ఆశ్చర్యపోతూ దాన్ని వర్ణించడం ప్రారంభించారుట. అందులో మొదటాయనకి అన్నీ సందేహాలే.
రెండవాయన్ని చూసి 'ఏరా తమ్ముడూ ! ఈ విమానం ఇంత పెద్దది కదా, దానికి రంగులు (పెయింట్లు) వెయ్యాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుద్ది ? ఎంత రంగు కొనాలి ? అలా కొన్నా ఇంత పెద్దదిగా వుందే_దీనికెలా రంగు వేస్తారురా' అని అడిగాడట.
దానికి ఆ రెండవాయన 'ఓరి తెలివితక్కువ దద్దమ్మా ! ఇది ఇక్కడుండగా రంగులు వెయ్యడం ఎవరి తరంరా! ఆకాశం మీదికి ఎగిరిపోతే చిన్నదై పోతుంది చూడు అప్పుడు వేస్తారురా' అన్నాడట" అని చెపుతూ "ఈ జోక్ నాదికాదు. నా కొడుకుది. వాడు ఇలాంటి జోక్స్ తెగ చెపుతూ వుంటాడ"ని అనేసరికి ఆ జోక్ విన్న ఆడియన్స్ లో నవ్వులూ చప్పట్లూ రెండు నిముషాలవరకూ ఆగలేదు. చాలాసార్లు విన్న జోక్ అయినా నేనూ నవ్వకుండా వుండలేకపోయాను.
ఇంతలో చిన్న తెల్లకాగితాల్లో ప్రశ్నలు రావడం మొదలయ్యాయి. శ్రీశ్రీగారు అవి చదివి జవాబులివ్వసాగారు.
కవిత్వం ఎలా వుండాలని మీ అభిప్రాయం?
కవిత్వం మేలుకొలపాలిగానీ జోకొట్టకూడదు.
మీరు దేవుడ్ని నమ్ముతారా?
మానవుడ్ని నమ్ముతాను.
కవికీ 'కష్టజీవి'కీ గల సంబంధం ఎలాంటిది?
'కష్టజీవికి రెండువైపులా నిలిచేవాడు కవి.
ఒకటీ ప్లస్ ఒకటి, ఒకటెలా అవుతుంది?
ప్రేయసీ ప్లస్ ప్రియుడు ఇద్దరూ ఒక్కటే. దేవుడూ ప్లస్ మానవుడు ఇద్దరూ ఒక్కటే.
మీకు జాతకాలమీద విశ్వాసం వుందా?
లేదు.
'శ్రీశ్రీ తాగగా లేనిదీ నేను తాగితే తప్పేమిటి?' అనే యువకవికి మీరిచ్చే సంజాయిషీ ఏమిటి?
'శ్రీశ్రీ రాయగా లేనిది నేను రాస్తే తప్పేమిటి' అని కూడా ప్రశ్నించుకోమంటాను.
__అంటూ, "ఇంక నోమోర్ క్వశ్చన్స్" అనేశారు.
* * * *
ఆ మర్నాడు ఖుర్దావాళ్ళు వచ్చి ఆహ్వానించారు. 'శ్రీశ్రీ ఎగ్జిబిషన్ పెడుతున్నామని, పగలంతా ఎగ్జిబిషన్, సాయంత్రం మీటింగ"ని చెప్పారు.
"ఏమంటావు సరోజా? నువ్వూ వస్తావా?" అని వాళ్ళ ఎదురుగానే అడిగారు.
"నేను వస్తానుగానీ ఒక కండిషన్" అన్నాను.
"ఏమిట"ని అడిగారు.
"నన్ను పూరీకి పంపిస్తానంటే వస్తాను" అన్నాను.
"నిన్ను పూరీకి పంపమని అడిగావుకానీ నేను రావాలని కండిషన్ పెట్టలేదుగా. ఓకే. శాంక్షన్" అన్నారు.
మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చినవాళ్ళు "మిమ్మల్ని పూరీ మేంపంపిస్తామమ్మా" అని హామీ ఇచ్చారు.
అంతవరకూ నేను పూరీ వెళ్ళలేదు.
వచ్చిన వాళ్ళలో మమ్మల్ని తీసుకువెళ్ళడానికి మాత్రం ఒకరు వుండిపోయి, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు.
