Previous Page Next Page 
పరిహారం పేజి 4


    "బాబు పేరేమిటండీ?"
    "మనోహర్"
    ఆ తరువాత ఒకటి రెండు మాటలు మాట్లాడి సెలవు తీసుకొన్నాడు కృష్ణారావు.
    అచిరకాలంలోనే ఆ లోగిలిలో అందరి మనస్సుల్నీ దోచుకో గలిగింది పారిజాత కుమారి. ఇంతటి చక్కని అమ్మాయికి తల్లిని కరువు చేయడానికి భగవంతుడు ఎంత నిర్దయుడో అనుకొంటారు. కోమలమ్మకూడా అప్పుడప్పుడూ పిలిచి లడ్డో, మైసూర్ పాకో, ఏదో ఒకటి చేతిలో పెట్టి పంపిస్తూంటుంది.
    ఇప్పుడు కృష్ణారావుకు కూతురికి స్నానం చేయించి జడ అల్లి బొట్టూ కాటుక దిద్దేపని తప్పిపోయింది. ఇరుగు పొరుగు ఇళ్ళలోని గృహిణులే ఆ పనులు సంతోషంగా స్వీకరించారు. కృష్ణా రావుకు వంటపని కూడా అట్టేలేదు. వాళ్ళ పిల్లలకు ఉచితంగా నాలుగు అక్షరముక్కలు చెబుతూండడంవల్ల కూరలూ పప్పులూ వాళ్ళ ఇళ్ళనుండి వస్తున్నాయి.
    మొత్తానికి కృష్ణారావుకు రోజులు నిశ్చింతగా గడిచిపోసాగాయి.
                                 4
    ఒకరోజు బడికి వెళ్ళివచ్చిన పారిజాత పుస్తకాలు గూటిలోపెట్టేసి కళ్ళలోనీళ్ళు తిరిగిపోతుంటే విసురుగా తండ్రి వైపు తిరిగింది. "నేనిక బడికి వెళ్ళను నాన్నా"
"ఎందుకమ్మా?" గాబరాగా ప్రశ్నించాడు కృష్ణారావు.
    "ఆ రౌడీ నన్ను వేధించటం ఎక్కువై పోయింది. ఈరోజు ఓపది మందిని వెంటేసుకొని నోటికొచ్చినట్టల్లా కూస్తూ దారికడ్డంగా నిలబడ్డాడు" పారిజాత కంఠం దుఖంతో రుద్దమైపోయింది.
    "ఎవరేమన్నా తలవంచుకు వచ్చేయమన్నాను కదమ్మా?" అనునయంగా అన్నాడు.
    "ఉహు. నేనిక వెళ్ళను బడికి, నాకీ చదువులేక పోతే పీడపోయింది."
    "ఎవరో ఏదో అన్నారని నీ చదువుని నాశనం చేసుకొంటావా?"
    "ప్రైవేటుగా పరీక్ష కడతాను"
    ఇంతసేపు అక్కడే మౌనంగా కూర్చొన్న మనోహర్ కళ్ళు ఎర్రబడిపోగా, "ఎవరా రౌడీ. పారూ? ఎవడో తెలుసా!" అని అఢిగాడు ఆవేశంగా.
    "ఆఁ సిటీ కాలేజీలో బి.ఎస్.సి ఫస్టియర్ చదువుతున్నాడు పేరేమిటో, ఇల్లెక్కడో తెలియదు."
    "తెలీకపోతే నేను తెలుసుకొంటాను. నువ్వు నిశ్చింతగా బడికి వెళ్ళు"
    ఒక్క క్షణం కళ్ళెత్తి మనోహర్ ముఖంలోకి చూసిందిపారు. అక్కడ ఏమి అభయం దొరికిందో మౌనంగా ముఖం కడుక్కోడానికి అవతలికి వెళ్ళిపోయింది.
    మనోహర్ ఎమ్.ఎ.పాసై ఈ మధ్యనే అసిస్టెంట్ లెక్చరర్ గా అపాయింట్ అయాడు.
    పారిజాత ఎస్.ఎస్.సి. చదువుతోంది.
    ఇరుగు పొరుగుతో ఉండే స్నేహబంధాలే ఈ రెండిళ్ళమధ్యా ఉన్నాయి.
    మరునాడుదయం -
    పారిజాత బెరుకుగా అటు ఇటూ చూస్తూ గబగబా నడుస్తోంది. ఏడెనిమిది గజాల వెనుకగా.......మనోహర్ స్కూటర్ మీద ఆగి ఆగి ఆమెను అనుసరిస్తూన్నాడు.

    "ఓ! మైడార్లింగ్!"
    రోజూ పారిజాతను అల్లరిపెట్టేరౌడీ ఏ సందునుండో వచ్చికలిశాడు "బెదిరిన లేడిలా ఏమిటమ్మా ఆ పరుగు? ఎందుకంత భయం? నేనున్నానుగా నీకు?"
    మరుక్షణం డేగకాళ్ళ మధ్య చిక్కిన కోడిపిల్లలా అతడి మెడ ఓ ఉక్కుపిడికిట చిక్కికళ్ళు బయటికి వచ్చినంత పనయింది.
    "పారిజాతకు నువ్వున్నావా? వెంటబడి వేధించే రోమియోగానా? తాళికట్టిన మొగుడిగానా? ఏ వరుసతో ఉన్నావో కొంచెం చెబుతావా?" మనోహర్ వెటకారంగా ప్రశ్నించాడు మెడ ప్రక్కనుండి.
    "మనూ!" కంగారుగా పిలిచింది పారిజాత.  "ఊపిరి అందడం లేదులా ఉంది బక్కపీనుగ చచ్చిపోతాడు వదిలెయ్యి."
    మనోహర్ అతడిని ఒక్క త్రోపు త్రోసి "మొదటి సారి వదిలేస్తున్నాను. బ్రతికావ్ ఈసారికి. మరోసారి మా పారిజాత కేసి నువ్వు కన్నెత్తి చూశావంటే నీ కళ్ళు తోడేస్తాను. నీ ప్రాణం తీసేస్తాను. జాగ్రత్త" అని చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS