"కౌశిక్! మీ ఇంటికి నన్ను భోజనానికి ఎప్పుడు పిలుస్తావు?" తిరిగి అతనే అడిగాడు.
ఖాళీ కప్పుని క్రింద వుంచాడు కౌశిక్.
అతనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
"నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదేం?" మళ్ళీ అడిగాడు కిరణ్.
"సమాధానం చెప్పడానికి ఏముంది? నీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావచ్చు" పొడిగా అన్నాడు.
"నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నన్ను భోజనానికి ఎప్పుడు పిలుస్తావు?" అన ఉద్దేశ్యంతోనే అతను ఆ మాట అన్నాడని కౌశిక్ కి తెలుసు.
సిగరెట్ యాష్ ట్రేలో పడవేశాడు కిరణ్.
"కౌశిక్! అయామ్ టాకింగ్ ఎబౌట్ యువర్ మ్యారేజ్...." ఇంకా ఏదో అనబోయాడతను.
అతని మాటలకు అడ్డు వస్తూ అటుగా వచ్చాడు ఎస్ పి మల్హోత్రా.
"హలో ఫ్రెండ్స్! హౌ ఆర్ యూ?" అంటూ.
"హాయ్ మల్హోత్రా! ఏమిటిలా పోలీస్ ఎకాడమీకి వచ్చావు? ఎంతసేపయింది వచ్చి? ఏదయినా పనిమీద వచ్చావా?" గబగబా అన్నాడు కౌశిక్ అంతకుముందు కిరణ్ మాట్లాడుతున్న టాపిక్ కట్ చేసే ఉద్దేశ్యంతో.
"ఎకాడమీ ఐ జి తో కొంచెం పనుండి వచ్చా. ఎలాగూ వచ్చావు కదా రాత్రి డిన్నరయ్యాక వెళ్ళు అన్నారు ఐ.జి. అందుకే ఆగిపోయాను. మీరిక్కడున్నారని తెలిసింది. ఇటువైపు వచ్చాను అందుకే" వాళ్ళకి కొంచెం దూరంలో వున్న చైర్ ని దగ్గరకు లాక్కుంటూ అన్నాడు మల్హోత్రా.
"ఆ....మల్హోత్రా! ఏమిటి విశేషాలు?" అడిగాడు కిరణ్.
"విశేషాలు ఏమున్నాయ్....అన్నట్లు కౌశిక్! నీకు మన ఇంటెలిజన్స్ ఐ జి ఒక స్పెషల్ డ్యూటీ వేస్తున్నారు తెలుసా?" అన్నాడు మల్హోత్రా.
"నాకు స్పెషల్ డ్యూటీనా?"
"అవును. ఈ నెల ఇరవై ఆరో తారీఖున సెంట్రల్ హోంమినిస్టర్ హైదరాబాద్ వస్తున్నారు కదా! అందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీ ఇన్ ఛార్జ్ గా నిన్ను అపాయింట్ చేస్తున్నారు. హోంమినిస్టర్ ఎయిర్ పోర్ట్ లో దిగినప్పుడు....తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఎయిర్ పోర్ట్ ని అప్రమత్తంగా వుంచాల్సిన బాధ్యత నీ మీద పెడుతున్నారు."
"ఈసారి సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్త అవసరమవుతుంది. టెర్రరిస్ట్ లు హోంమినిస్టర్ మీద ఎటాక్ చేయటానికి ప్రయత్నించుతున్నారని మనకి ఇంటెలిజన్స్ రిపోర్టులున్నాయి కూడా. ఏ మాత్రం తేడా వచ్చినా కౌశిక్ నీ పని ఔట్. జాగ్రత్త!" అన్నాడు హెచ్చరికగా కిరణ్.
"ఇంకా ఆయన పని సులభమే బాబూ! మనిద్దరికి అంతకంటే ప్రమాదమైన డ్యూటీ పడింది" అన్నాడు మల్హోత్రా.
"ఏమిటో అది?" అన్నాడు కిరణ్.
"ఏమిటా....హోంమినిస్టర్ పాతబస్తీ సందుల్లో పాదయాత్రలు చేస్తారట. ఆ సమయంలో ఆయన మీద ఎటువంటి ఎటమ్ట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత నీది, నాది."
చైర్ క్రింద స్టెన్ గన్ పేలినట్లుగా అదిరిపడ్డాడు కిరణ్.
"చచ్చాం....ఇది మరీ ప్రమాదం కదా! చాలా క్లిష్టమైన డ్యూటీయే తేడాలొస్తే ఉద్యోగాలు ఎగిరిపోతాయి...." ఇంకా ఏదో అంటున్నాడు కిరణ్.
కౌశిక్ చెవులకి వాళ్ళ మాటలు వినబడటంలేదు. అతని మెదడులో తీవ్రమైన ఆలోచన మొదలయిపోయింది. ఈ నెల ఇరవై ఆరు హోంమినిస్టర్ వస్తున్నాడు. అంటే....సరిగ్గా పదకొండు రోజులు టైముంది. ఈలోగా ఎయిర్ పోర్ట్ దగ్గర ఏం చెయ్యాలి? ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి? పరిస్థితులు ఎలా మేనేజ్ చెయ్యాలి?
హోంమినిస్టర్ కి ప్రమాదం ఎవరి రూపంలో ఎదురయ్యే ఛాన్స్ ఎక్కువ?
ఒక ప్రయాణీకుడి రూపంలో కాని, ఎయిర్ పోర్ట్ సిబ్బంది రూపములో కాని, ఎవరైనా టెర్రరిస్ట్ రూపంలోకానీ రావచ్చు. అందుకుగాను ఏం చెయ్యాలి?
వాట్ షుడ్ బి ది ప్లానింగ్?
* * * *
"ఎస్....కమిన్!"
తలుపు మీద సున్నితంగా తట్టిన శబ్దానికి సమాధానంగా అన్నాడు ఎడ్వర్ టైజింగ్ మీడియో ప్లానింగ్ మేనేజర్.
డోరు తోసుకుని లోపలికి వచ్చింది అర్చన.
చిన్నగా వున్న ఆ గదిలో కూర్చుని వున్నారు మార్కెటింగ్ మేనేజర్, మీడియా మేనేజర్ లు.
"ప్లీజ్ బి సీటెడ్" చెప్పాడు మార్కెటింగ్ మేనేజర్ పిళ్ళై.
అతను తమిళనాడు నుంచి వచ్చాడు. నల్లగా, లావుగా, ఎత్తుపళ్ళతో తమిళ సినిమాల్లో కమేడియన్ లా వుంటాడు.
ఆమె చెయిర్లో కూర్చోగానే అడిగాడు "అర్చన ప్రీమియర్ ఆడియోస్ వాళ్ళ యాడ్ ఫిల్మ్ తయారుచేయటానికి ప్లాన్ ఎలా చేశావు? నీ ఐడియా ఏమిటి? ఇంక సరిగ్గా నెలరోజుల్లో మనం టి వి లో, పేపర్స్ లో ఎడ్వర్టయిజింగ్ కాంపెయిన్ మొదలుపెట్టాలి కదా!"
పిళ్ళై మాటని అడ్డుకుంటూ అన్నాడు మీడియా మేనేజర్ "నీకు తెలుసు ఆడియో సిస్టమ్స్ లో ఎంత పోటీ వుందో. బాగా పేరు తెచ్చుకున్న కంపెనీలు ఎన్నో వున్నాయి. వాటి మధ్య ఈ కొత్త కంపెనీ టేప్ రికార్డర్లు, స్టీరియోలు అమ్మటం చాలా కష్టం. కాబట్టి ఈ కాంపెయిన్ చేయటం మన కత్తిమీద సాములాంటిది. ఏ మాత్రం తేడా వచ్చినా.... అంటే మన ఎడ్వర్ టైజ్ మెంట్ ద్వారా సేల్స్ అనుకున్నంతగా చూపలేకపోతే మన కంపెనీకి కూడా చాలా చెడ్డపేరు వస్తుంది. దాని పరిణామాలు చాలా చెడ్డగా వుంటాయి."
"అందుకే నేనొక ఐడియా ఆలోచించాను సార్" జవాబు చెప్పింది అర్చన.
"గుడ్....టెల్ మి వాట్ ప్లాన్స్ యూ మేడ్" ఒకింత ఉత్సాహముగా అడిగాడు పిళ్ళై.
చైర్లో కూర్చున్న ఆమె ముందుకు వంగింది. అలా వంగినప్పుడు ఆమె కురులు చెంపల మీదకు జారాయి.
"ఇంతవరకు ఆడియో సిస్టమ్స్ యాడ్ కాంపెయిన్స్ లో ఎవరూ చేయని క్రొత్త ట్రెండ్ తో చేద్దాం సార్! నెలరోజుల్లో మనం చేస్తున్న ప్రీమియర్ ఆడియోస్ కాంపెయిన్ పాపులర్ అయ్యే ప్లాను చేస్తాను."
"ఫైన్....టెల్ మి వాట్స్ దట్" పిళ్ళై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. అతనికి తెలుసు....అర్చన ఏదయినా ఎడ్వర్ టైజ్ మెంటు ప్లాన్ చేసిందంటే అది స్మాష్ హిట్ అవుతుందని.
"మీకు సంజు తెలుసు కదా! ఐ మీన్ ఆమె గురించి విని వున్నారు కదా!"ఇద్దర్నీ చూస్తూ అంది.
"సంజు....అంటే....పాప్ సింగర్ సంజు గురించి కదా నువ్వు చెప్పేది?"
"ఎస్ సర్! ఆమెతో మన ప్రీమియర్ ఆడియోస్ కాంపెయిన్ ప్రారంభించుదాం."
"ఎలా! ఆమె ఇప్పుడిప్పుడే ఇండియాలో పాపులర్ అవుతోంది కదా! ఆమెతో యాడ్ కాంపెయిన్ చేయటం రిస్క్ అవుతుందేమో!" సందేహం వ్యక్తం చేశాడు మీడియా మేనేజర్.
"సంజు విషయంలో కొన్ని ఎడ్వాంటేజెస్ వున్నాయి సర్. ఆమె పుట్టింది ఇండియాలో. అదీ మన ఆంద్రప్రదేశ్ లో విశాఖపట్నంలో. తన పదో ఏడు ఇంగ్లండ్ వెళ్ళి స్థిరపడిపోయింది. పాప్ సింగర్ గా పేరుతెచ్చుకుంది. సుమారు పదిహేను సంవత్సరాల తరువాత మళ్ళీ ఇండియా తిరిగి వస్తోంది. తన మొదటి ప్రోగ్రామ్ తను పుట్టిన ఊరు అయిన వైజాగ్ లోనే యిస్తోంది. మన ఆంధ్రప్రదేశ్ లోనే అయిదుచోట్ల ప్రోగ్రామ్స్ యిస్తోంది. ఇండియా మొత్తం మీద దాదాపు ఇరవై అయిదు ప్రోగ్రామ్స్ యిస్తోంది.
ఆమె టూర్ పూర్తయ్యేసరికి పాప్ మ్యూజిక్ అభిమానులందరిలోనూ ఆమె పాపులర్ అయిపోతుంది. అంతేకాదు ఆమె ఇటీవలే రెండు ఆల్బమ్స్ అక్కడ రిలీజ్ చేసింది. ఆ క్యాసెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి. ఆమెది మరొక్క ఆల్బం రిలీజ్ కావలసి వుంది. అది కూడా హిట్ అయ్యిందంటే సామంతాఫాక్స్, మడోన్నాలతో పోటీ పడగలదు. ఆమె ఇండియా వచ్చినప్పుడే వాటిని కూడా యిక్కడ రిలీజ్ చేస్తున్నారు."
మాట్లాడకుండా వింటున్నారిద్దరూ.
"ఇప్పుడు నేను అనేది ఏమిటంటే....ప్రీమియర్ ఆడియోస్ ని ఆంధ్రాలో మొదటగా అమ్మలనుకుంటున్నారుకదా! వైజాగ్ లో ఆమె ప్రోగ్రామ్ మొదలయినప్పుడు అక్కడే ఆ ప్రొడక్ట్ ఆమెచేత లాంచ్ చేయిస్తే సరి. ఆమె ప్రోగ్రాంలు జరిగిన అన్ని సిటీలలోను, మైక్స్ అరేంజ్ మెంటంతా ప్రీమియర్ వాళ్ళనే అరేంజ్ చేయమందాం. అలా ప్రతి ఒక్కచోటా ప్రీమియర్ కంపెనీ పాపులర్ అవుతుంది. భారతీయ యువతి అయివుండి అంతర్జాతీయంగా ఆమె సింగర్ గా పేరు తెచ్చుకుంది. కాబట్టి మన జనాభా అంతా ఆమెను అమితంగా అభిమానిస్తున్నారు. ప్రీమియర్ ఆడియోస్ అన్ని సేల్ చేసేది ఇండియాలోనే కాబట్టి వాటి సేల్ కూడా చాలా బావుంటుంది. ఆమె ప్రోగ్రామ్స్ అన్నింటినీ వీడియో కవరేజ్ చేసి అవన్నీ కలిపి యాడ్ ఫిల్మ్ తయారుచేసి పాప్యులరైజ్ చేద్దాం."
"ఫెంటాస్టిక్....వండ్రఫుల్" పట్టలేని ఆనందంతో చప్పట్లు చరిచాడు పిళ్ళై.
"అర్చన యువార్ బ్రిలియంట్" ఆనందంగా అన్నాడు మీడియా మేనేజర్.
"ఆమె ఇండియా రావటానికి ఇంకా ఎన్నాళ్ళ టైమ్ వుంది?" డెస్క్ క్యాలెండరు వైపు చూస్తూ అన్నాడు పిళ్ళై.
"సరిగ్గా పదకొండు రోజులు" చెప్పిందామె.
"మనం తొందరపడాలి. అర్జెంటుగా ఆమెను కాంటాక్ట్ చేయాలి. ఆమె లండన్ లో వుందో లేదో కనుక్కోవాలి. ఉంటే మన మనిషిని ఒకరిని పంపి ఆమెతో వివరాలు అన్నీ మాట్లాడించాలి. ఆమె ఎంత డబ్బు డిమాండ్ చేస్తుందో చూడాలి."
