"నిజమేననుకోండి..."
"చైర్మన్ గారికి మేనల్లుడు కాబట్టి ఆ రోగ్ విరించి గాడు మనకో డైరెక్టర్. జర్నలిజంలో ఓనమాలు రాని-అప్పారావుగాడు సీనియర్ ఎగ్జిక్యూటివ్. పైగా స్టాఫ్ రిపోర్టరట! రోగ్"
"అప్పారావు గాడు చాలా డేంజరస్ ఫెలో సార్."
"విరించిగాడికి అమ్మాయిల్ని తార్చిన వెధవవాడు. వాడికెప్పుడూ అదేపని. వాడి గురించి మాట్లాడితే ఆరు పెగ్గుల బ్రాందీతో నోరు కడుక్కోవాలి!"
"వెల్ సెడ్!"
"అన్నట్టు రాజా, నాదొక సలహా....నన్ను రిజైన్ చెయ్యమని బహుశః ఇవాళ అడుగుతారని నా అనుమానం. నేనెలాగూ వెళ్ళి పోయేవాణ్ణి..."
"అదన్యాయం సార్...పైగా మీరూ చైర్మన్ గారూ మంచి స్నేహితులు కదా!"
"అది చెడగొట్టారుగా టప్పాల అప్పారావూ ఇంచీ మొహం....విరించి గాడూ..."
"అంతేనంటారా?"
"శుభ్రంగా ఇంతకీ నే చెప్పేది విను నా అంచనా ప్రకారం నిన్ను ఎడిటర్ గా చేస్తారు. నే పేరు కూడా పేపర్లో వేస్తామంటారు. కాని అందుకు ఒప్పుకోవద్దు. ముళ్ళ కిరీటం నెత్తిని పెట్టుకోకు."
"అలాగే సార్"
"ఉంటాను...అంతేనా విశేషాలు?"
"అంతే సార్!"
"రైఠో"
బరువెక్కిన గుండెతో బాత్ రూం వేపు నడిచాడు రాజారామ్.
o o o
మధ్యాహ్నం పన్నెండున్నర.
స్కూటర్ని ఫాన్సీ కార్నర్ ముందు ఆపి దిగాడు రాజారామ్.
షాపులో వీరయ్యతో ఎవరో ఒకమ్మాయి మాట్లాడుతోంది. రాజారామ్ షాపులోకి వెళ్ళగానే ఆమె ఇటు తిరిగి అతనికి నమస్కారం చేసింది.
"నా పేరు సుమిత్ర సార్. మీ అమ్మాయి రమణితో నిన్న ఫ్రెండ్ షిప్ అయింది."
"ఆఁ అవును. మీ గురించి చెప్పింది. మీరేదో మాట్లాడాలన్నారట."
"ఒక్క అయిదు నిమిషాలు.."
"ఓకే"
వీరయ్య రెండు కుర్చీలు తెచ్చివేసాడు. ఇద్దరూ కూర్చున్నారు.
"ఈ సమయంలో మీరు వస్తారని ఈయన చెప్పారు. మీ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడున్నాను. సుందరి నాకు, వరసకి అక్కయ్య అవుతుంది సార్. ఇక్కడే ఈ కాలనీలోనే ఉంటుంది. బహుశః మీరు చూసే ఉంటారు.."
అంతలో వీరయ్య అందుకున్నాడు.
"తెల్లగా పొడుగ్గా ఉంటుంది సార్. మన షాపుకి రోజూ వస్తూ ఉంటుంది. ఇల్లు కూడా మీ ఇంటి దగ్గరే...."
"ఏమో చూసి ఉంటాను. గుర్తులేదు" అన్నాడు రాజారామ్.
"రెండు నెల్ల కిందటి వరకూ సుందరి విజయవాడలో నాతోనే ఉండేది. అక్కడ ఒక ప్రయివేటు కంపెనీలో టైపిస్టుగా పని చేసేది. హఠాత్తుగా ఆ ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుని ఒక్కర్తీ ఉంటోంది. నేను గత ఆదివారం ఇక్కడికి వచ్చాను. వస్తున్నట్లు తనకి చాలా రోజులు ముందుగా టెలిగ్రాం ఇచ్చాను. స్టేషన్ కి వస్తానని తను జవాబు కూడా రాసింది కాని స్టేషన్ కి రాలేదు. ఏమైందా అని అడ్రస్ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇంటి తలుపు తాళం వేసి ఉంది. ఇంటిగల వాళ్ళు చాలా మంచివాళ్ళు. తాళం పగలగొట్టి నన్ను ఉండమన్నారు. ఇవాళ అప్పుడే బుధవారం. ఇంతవరకూ సుందరి ఇంటికిరాలేదు."
సుమిత్ర మొహంలో ఆందోళన. అందమైన మొహంమీద ముత్యాల్లా చిరుచెమట.
"పోలీసులకి రిపోర్టు చేశారా?"
"వచ్చిన మర్నాడు సోమవారంనాడే ఆ పని చేశాను సర్. సైఫాబాద్ పోలీస్ స్టేషన్నుంచి ఒక ఎస్సయ్ వచ్చారు కూడా. ఇల్లంతా సోదా చేశారు. టూత్ బ్రష్ వగైరా సామాన్లేవీ ఇంట్లో లేవు కనక ఏదైనా ఊరు వెళ్ళి ఉండవచ్చునని ఆయన అన్నారు."
"అవును. అలా జరిగి వుండొచ్చుగా!" అన్నాడు రాజారావు ఆమెని ఓదారుస్తున్నట్టు.
"నేను వస్తున్నానని తెలిసి కూడా ఇంట్లో ఉండకుండా ఊరు వెళ్ళేరకం కాదు సుందరి"
"సరే, వాళ్ళ ఆఫీసులో వాకబుచెయ్యకపోయారా?"
"ఎక్కడా పనిచేస్తోందో నాకు తెలీదు."
"ఆమెకెవరైనా పరిచితులు కాని, ఫ్రెండ్స్ కాని ఉన్నారా? ఈ వూళ్ళో?"
నిస్సహాయంగా తల ఊపింది సుమిత్ర.
"పోనీ విజయవాడలో?"
"విజయవాడలో ఒకతనితో రెండు మూడు సార్లు చూశాను"
"అతని పేరు"
"తెలీదు సార్. తనతన్ని ప్రేమిస్తున్నానని చెప్పింది సుందరి....అంతే"
"ఫోటో ఉందా?"
"ఓ ఏస్ దయచేసి మా ఇంటికోసారి రాగలరా? ఇక్కడే వాకింగ్....డిస్టెన్స్....
"సరే..." అంటూ లేచాడు రాజారామ్.
0 0 0
"ఇదిగో చూడండి...." అంటూ సుమిత్ర ఓ ఫోటో అందించింది.
పోస్ట్ కార్డ్ సైజు ఫోటో.
ఏదో హోటల్ ముందు లాన్ లో నిలబడి తీయించుకున్నది. తీసింది ఎవరో అమెచూర్ ఫోటోగ్రాఫర్ స్లీవ్ లెస్ జాకెట్టూ, బొడ్డూ కనిపించేలా చీర కట్టులో ఉంది. ముఖం చిన్నగా అస్పష్టంగా ఉంది. ఫోటోలో యిలా వుంది కాని అసలు వ్యక్తి చాలా అందంగా, ఉంటుందన్పించింది.
