'ఎవడవయ్యా నీవు -----నీ మోచేతి కింద నీళ్ళు తాగుతున్నామా , నీ బాబుగాడి సొమ్ము జీతం యిస్తున్నారా పోవయ్యా నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను....ఆ హాహా --ప్లాట్ ఫారం మీదకి ముష్టి వెధవని రాకుండా చెయ్యడమా .... ఇదేదో పెద్ద జోక్ సార్ ----ఎప్పుడూ వినలేదు . మీరేదో పిచ్చివాళ్ళులా వున్నారు సార్ , వాళ్ళని ఆపడం , రానీకుండా చెయ్యడం అన్నదీ నాకే కాదు, నన్ను పుట్టించిన దేముడికైనా చేతకాదు ---ప్రైం మినిష్టరోచ్చినా ఏం చెయ్యలేడు --- వెళ్ళండి సార్ -------- మీ కోపం యింట్లో పెళ్ళాం పడితే ఆవిడ మీద చూపుకోండి , అంతేకాని నామీద కాదు చూపడం , ఆహాహా ఉద్యోగం ఊడబీకిస్తావూ ------అసలింతకీ నీవేవడివయ్యా ------ ఏ బోడి అధికారంతో నన్ను నిలబెట్టి దులుపుతున్నావు -------రైల్వే మినిస్టరువా, సెక్రటరీవా-- ఆ చెప్పు వింటాను - కావలిస్తే కంప్లయింటు రాసుకో- ఫో - ఫో ....అనేద్దామనుకున్నాడు స్టేషను మాస్టరు ఆవేశంగా. అనేసేవాడే ------- ఖర్మ కొద్దీ ఎమర్జన్సీ వుండబట్టి కోపం కంట్రోల్ చేసుకున్నాడు. ఏ పుట్టలో ఏ పాముందో వీడెవడో ఇంత ఎత్తు ఎగురుతున్నాడంటే ఎంతేత్తాఫీసరో అయే వుండచ్చు ---వీడి కోపం మండిపోనూ - నిజంగా కంప్లయింట్ రాశాడంటే --- ఎమర్జన్సీ దేబ్బాల్లో ఉద్యోగం ఊడినా ఊడచ్చు అని ........లోపల్నించి తన్ను కొచ్చిన కోపాన్ని పౌరుషాన్ని శివుడు గొంతులో గరళం యిముడ్చుకున్నట్టు యిముడ్చుకుని --- మరీ భయపడినట్లు కనిపించడానికి నామోషి అన్పించి కాస్త దర్పంగా తలెత్తి ---' ఏం చెయ్యమంటార్ సార్ . ఆ వెధవలు యిటు తన్నితే అటు వస్తారు ---- ఈ మిష్టి వెధవల్ని తోలడమేనా మాకున్న డ్యూటీ .....' అన్నాడు కాస్త దబాయిస్తున్నట్టు.
'ఆఫ్ కోర్స్ - అదీ నీ డ్యూటీలో భాగమే - స్టేషనులోకి ప్రతి ముష్టి వెధవా జొరబడి ప్రయాణికులని యిబ్బంది పెట్టకుండా కంట్రోలు చెయ్యడం నీ డ్యూటీ ' అన్నాడు ఆఫీసరు మరింత ఫైరవుతూ -------తనపై అధికారి కాకుండా మరెవరో వచ్చి చెడామడా నిలబెట్టి దులిపెస్తుంటే , చుట్టూ జనం మూగి వింత చూస్తుంటే అవమానం ముంచుకు వచ్చింది. పౌరుషం తలెత్తింది . మొహంలో రక్తం పొంగి ఎర్రబడింది. ఏదో అనేలోపలె యింకా పూర్తవ్వలేదన్నట్టు ఆఫీసరు తోటి ప్రయాణికులు సపోర్టు బలంతో మరింత పుంజుకుని విజ్రుంభించి "నీ డ్యూటీ కాదంటే ---- నీ డ్యూటీ నీవు చెయ్యలేనంటే చెప్పు -- అది నీ డ్యూటీ కాదో అవునో పైవాళ్ళనే తెల్చమంటాను. ఏదీ కంప్లయింట్ బుక్ యిలాతే --- నేనెవరో తెలుసా ------నే తల్చుకుంటే ....నీవు మరింక ఏ డ్యూటీ చెయ్యక్కర లేకుండా చేసేస్తా -------' అంటూ యింగ్లీషు లో అరిచాడు . చుట్టూ జనం ----' అవునండి ఎవరో వకరు కలగజేసుకోకపోతే లాభం లేదు -- చా --చా -- తిండి తిననీరు, కంపార్టు మెంటులో చొరబడి పోవడం, రామ - రామ - ప్రయాణం అంటే అసహ్యం ....కావాల్సిందే - బొత్తిగా ఎవడికీ పట్టనట్టురుకుంటే వాళ్ళు జలగల్లా పీక్కు తినకేం చేస్తారు. స్టేషను మాస్టర్ ఆ మాత్రం కంట్రోలు చెయ్యకపోతే మరింకెందుకు ....నాలుగు తగలనిస్తే మళ్ళీ వస్తారా...." ప్రయాణీకులంతా అఫీసరుతో కలిసి పోగానే స్టేషను మాస్టరు మొహం మరింత ఎర్రబడిపోయింది.
"ఏం కంప్లయింట్ రాయమంటారా ----మళ్ళీ ప్లాట్ ఫారం మీద ముష్టి వెధవల్ని రాకుండా కంట్రోల్ చేస్తావా ----- నీతో ఆర్గ్యూ చేయడానికి నాకు టైము లేదు --' అసహనంగా అరిచాడు ఆఫీసర్.
"మీరు వెళ్ళండి సార్. మరెప్పుడూ యిలా జరగకుండా చూస్తాం లెండి. ట్రైను కదులుతుంది. పదండి సార్' యిద్దరు ముగ్గురు టికెట్ కలక్టర్లు, గార్డు అంతా రాజీ ధోరణిలో మాట్లాడారు.
"రైలు కదులుతుంది --- ఎలా కదులుతుందో నేనూ చూస్తాను ------ ఈ అంతు తేలందే కదలను ' ....ఆఫీసరు మొండి కేత్తాడు. స్టేషను మాష్టరు తల దించక తప్పలేదు.....' మీరు వెళ్ళండి సార్, ఏక్షన్ తీసుకుంటాను" అన్నాడు గొంతు పెగల్చుకుని ఆఖరికి.
నిజంగానే ఏక్షన్ తీసుకున్నాడు. ఆఫీసరు జరిపిన అవమానం, నలుగురి ముందు జారిగిన పరాభవం ---- దాని కంతటికీ కారణం ఆయన ఆ గుంట వెధవల మీద చాలా పెద్ద ఏక్షనే తీసుకున్నాడు. కాంటీను దగ్గర ఎంగిలాకులు నాకుతున్న యిద్దరిని చెరో కాలితో తన్నాడు. బూటుతో కుళ్ళ బొడిచాడు, చేతిలో లాఠీతో కాళ్ళు విరగగొట్టాడు ---కసిదీరా చెంపలు అదరగొట్టాడు ----- గొడ్డుని బాదినట్టు యిద్దర్నీ బాది, ఇద్దర్నీ కలిపి పులిస్తరాకులు గోడ మీద నించి విసిరినట్టు స్టేషను కటకటాల మీద నించి రోడ్డు మీదకి విసిరేశాడు.
బండబూతులు తిట్టాడు, మళ్ళీ ఆ చాయల కనిపిస్తే పాతేస్తానన్నాడు. లోపలికి అడుగు పెడితే కాళ్ళిరగ కొడ్తానన్నాడు. నోరు మెదిపితే నాలుక తెగ గోస్తానన్నాడు. అరగంట సేపు వాళ్ళని తన్ని, కుమ్మి, తిట్టి తన కోపం శాంతించాక, "రాస్కేల్స్, డర్టీ రాస్కేల్స్ - లంజా కొడుకులు ---- ఏ ముండో కని పారేయడం ----ఈ వెధవలు మా పీకల మీద ఎక్కి కూచోడం ...... గాడిద కొడుకులు యీసారి కనిపించండి ..." అంటూ అరుస్తూ లోపలికెళ్ళాడు. పెంటిగాడు, సిన్నిగాడు యీ జరిగిన గొడవ కంతటికీ తామె కారణం అన్న సంగతి అర్ధం కాక స్టేషను మాష్టరు ఎందుకు కొడుతున్నాడో, తిడుతున్నాడో తెలియక కళ్ళప్పగించి బిక్కచచ్చిపోయి వుండిపోయారు. వాళ్ళిద్దరినీ కొట్టడం చూసి మిగతా ముష్టి వాళ్ళంతా తాత్కాలికంగా ఆ చెట్టు కింద నించి జారుకున్నారు.
