ఉండలేకపోయిందక్కడే.
శక్తిని కూడగట్టుకుని విజూష శృతి తప్పుతున్నా ఇంకా పలికే వాయులీనంలా కన్నీళ్ళ మధ్య కరుగుతూ గమ్యం తెలీనట్టు పరుగెత్తింది పైకిలేచి.
బయట వర్షం ఉధృతి తగ్గలేదు ఇంకా.
విజూష గదులన్నీ తిరుగుతోంది పరుగులాంటినడకతో.
"మిల్లీ!"
ఆమె కేకలు ప్రకృతి పుక్కిలించి చూసిన ప్రతిధ్వనుల్లా భయానకంగా వినిపిస్తున్నాయి ఆమెకి.
అలా ఎంతసేపు పరుగు తీసిందో ఆమెకే గుర్తులేదు.
కాళ్లు ముళ్లకంచెల మధ్య చీరుకుపోతుంటే పాతరాతి యుగంలో ప్రాణిలా దూసుకుపోయి ఓ ప్రక్కన ఆగింది చివరి గదిలో.
వెనక్కి తిరిగి నిలబడి వున్నాడు మిలింద్ బయట వర్షాన్ని చూస్తూ అదికాదు.
తనతోపాటు మరో ప్రాణీ వుంది అన్న విషయం మరచినట్టు ఏ చీకటి దూరాల్లోకో ఆలోచనల పయనంలో అంతర్దానమైనట్టుగా...
"మిలింద్!"
అప్పటికీ జవాబులేదు.
రోషం...ఉక్రోషం.
మనసుకీ మేధకీ పూలవంతెనలు వేసుకుని కడదాకా కలసి వెళ్దాం అన్న మనిషి ఎందుకిలా కఠినంగా మారిపోయాడు.
అశ్రుతర్పణంతో మనస్సమర్పణ చేసి ఆర్తిగా మిగిలిన ఆరు జన్మలూ నీతోనే గడుపుతానూ అంటే సరేనన్న మనిషి పరిమళాల మకరందాలు పంచినట్టు నటించి ఇప్పుడు తనకేమీ కానట్టు ప్రవర్తిస్తున్నాడు.
" మిలింద్!"
కసిగా అతడ్ని వెనక్కి తిప్పింది.
అంతే!
ఆమె పగిలిపోయింది అణ్వాయుధం అమర్చిన పర్వతంలా.
మిలింద్ మామూలుగా లేడిప్పుడు.
అతడినేత్రాలు రక్తపు నురగలు కక్కుతున్న భూతంలా వున్నాయి.
ఆలాపన రసరాగాల్ని పంచే అతడి పెదవులు గాందారీత్వానికి గంతలువిప్పి మనసుని తినేసే కొండచిలువల్లా అనిపిస్తున్నాయి.
మిలింద్ రెండడుగులు ముందుకేసాడు.
"మిలీ!"
పిలిచింది ఇంకా తనను గుర్తుపట్టలేదేమా అని.
"మిలీ!"
సమాధినుంచి పైకి లేచిన డ్రాక్యులాల చూస్తూ అతడు ముందుకు నడుస్తుంటే ఏ రుద్రవీణానాదంతోనో ఆమె జ్ఞాపకాలను కూసే పికాల గొంతుతో ఏ ధైర్యాన్ని కూడగట్టుకోవాలనో విజూష పిలిచింది మరీ మరీ.
అప్పటికే చాలా సమీపంగా వచ్చాడు మిలింద్.
ఆమె తాకుతున్న అతడి వేడి ఉచ్చ్వాశ నిశ్వాసాలు వూర్పుల సుడిగుండంలోకి నెడుతున్నంత భీతిగా వుంది.
'కాంతి దూరాలకవతల గూళ్లు కట్టుకుని బ్రతుకుదాం' అంటూ నిన్నటిదాకా పలికిన అతడి గొంతు పొంగే ఏ అగ్నిసాగర తరంగాన్నైనా మింగేట్టుగా పలికింది 'రా... నిన్నే!'
విజూష వూహించలేదు.
ఆరడుగుల దూరంలో వున్న మిలింద్ చేతులు రబ్బరులా సాగి ఆమెను చేరుకున్నాయి.
ఆమె వెనక్కి మరలబోయేంతలో ఆమె కంఠాన్ని పట్టుకున్నాయి.
రెక్కలు విదుల్చుకున్న పక్షిలా ఆమె పారిపోవాలనుకుంది కాని అప్పటికే ఆలస్యమైంది.
ఉన్నట్టుండి కోరల్లా రెండడుగులు పొడుచుకువచ్చిన మిలింద్ పళ్లు ఆమె కంఠంలోకి గుచ్చుకున్నాయి చురకత్తుల్లా...
కెవ్వుమన్న ఆర్తనాదం.
గభాల్న నిద్ర లేచింది విజూష.
గుండె గొంతులోకి జారినట్లు ఇంకా అలజడి పడుతోంది.
ఇంతసేపూ తను కన్నది కల మాత్రమే అనుకుంటే కాస్త రిలీఫ్ గా వున్నా ఆందోళన తగ్గలేదింకా.
టీపాయ్ మీదున్న గ్లాసులో నీళ్లు తాగి వాల్ కున్న డిజిటల్ క్లాక్ ను చూసింది.
తెల్లవారుఝామున రెండు గంటలు కావస్తోంది.
సెంట్రలైజ్డ్ కండిషన్డ్ హౌస్ కావడంతో లోపలి బెడ్ లైట్ కాంతి తప్ప బయట చీకటి కనిపించలేదు.
చిరాగ్గా అనిపించింది.
తను చాలా ధైర్యవంతురాలే.
ఇలాంటి పీడకల ఎందుకొచ్చింది?
పైగా మిలింద్.
ఎవరతను?
తను ఎప్పుడూ చూసినట్టులేదే. అందంగా వున్నాడు సరే.
అయినాగానీ తను అంతగా అతడికోసం తపించిపోవడమేమిటి?
యూనివర్శిటీలో పి జీ చేస్తున్న విజూష అసహనంగా తల పట్టుకుంది.
తనకోసం ఎందరో అబ్బాయిలు తపించిపోవడం తెలుసుగానీ ఇలా తను ఏ అబ్బాయినీ కోరుకోవడంలేదే.
అసలు మనసులోకి అలాంటి ఆలోచనే రానివ్వని ఆడపిల్లే.
ఈరోజు ఎందుకిలా బలహీనురాలైపోయింది.
తన్నెవర్నయినా ప్రేమిస్తుందా?
లేక....
సబ్ కాన్షస్ గా ప్రేమకోసం మనసు పరితపిస్తోందా...
ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు.
