ఒకనాడు ప్రబంధమీద గెలుపుకోసం సూరి కూడా ఇలానే అడగడం గుర్తుకొచ్చింది. కాని ఆ పరిస్థితులు వేరు.
ఎలా? రోహిత్ నిజంగా ఆ స్థాయివాడే అయితే తను ఎదుర్కోగలడా?
"బలవంతంలేదు ఆదిత్యా! దీనికోసం మీరింతగా ఆలోచించాల్సిన పనిలేదు"
ఆదిత్యని ఎలా మార్గంలోకి మళ్ళించాలో అప్పటికే 'స్టడీ' చేసిన ప్రణయకి అతడు కాదనలేడని తెలుసు. అది మాత్రమే కాదు. ప్రణయమనస్ఫూర్తిగా అతడి గెలుపును కోరుకుంటూంది కూడా ఈ గెలుపు రోహిత్ మీద మాత్రమే కాదు తండ్రిపైన, మేనత్తపైన చివరగా ఆదిత్యపైన గెలుపుగా కూడా అన్వయించుకోడానికి ఆఖరి అస్త్రం అవుతుంది.
"ప్రణయా!" చాలాసేపటి నిశ్శబ్దం తరువాత అన్నాడు ఆదిత్య.... "నేను అర్హుడినో, కానో నాకు తెలీదుకాని ఇంతకాలం మీ గురించి అస్పష్టంగా నేను పేర్చుకున్న ఆలోచనలకి రూపం ఏర్పడి, అది మీ ద్వారానే వ్యక్తం అయిన ఈ క్షణాలలో మిమ్మల్ని కోరుకుంటున్నది ఒక్కటే!"
ఒక మనిషిపైన ఏర్పడ్డ ఆరాధన ఏ మనిషినైనా ఎంత ఉద్విగ్నుడిని చేసేదీ తెలియజెప్పే వ్యక్తిత్వాన్ని అతడు ప్రదర్శిస్తుంటే రెప్పలార్పకుండా చూస్తూ వుండిపోయింది.
"నేను ఉన్మాదిలా నన్ను ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నానూ అనుకోకపోతే మీ కోసం, మిమ్మల్ని దక్కించుకోవడం కోసం..." ఈ పోటీకి నేను సిద్దపడాలనుకుంటున్నాను. ఏ రోజూ నేను గెలుపు కోసం ఆరాటపడలేదు ప్రణయా! కాని ఈ సారి త్రికరణశుద్దిగా గెలవాలనుకుంటున్నాను. ఒకవేళ ఓడితే మళ్ళీ మీకు నా మొహం చూపించను. సో! అతన్ని పిలిపించండి".
ఏదో గుర్తుకొచ్చినట్టు వెంటనే అన్నాడు "అంతకుముందు నాకు నేనుగా ఓ పరీక్షకి సిద్దపదాలనుకుంటున్నాను."
"చెప్పండి"
"ఆ రోజు రోహిత్ మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు గుర్తున్నాయా?" లోపలి గదిలోనుంచి ఓ నోట్ బుక్ తీసుకొచ్చింది. "ఇందులో రాసి భద్రంగా పెట్టాను. ఇవి చదివితే రోహిత్ ట్రెండ్ అర్ధమవుతుంది"
"నాకు అర్ధం కావాల్సింది అది కాదు ప్రణయా! నేను అవి ఇప్పుడు చూసి చదవాలనుకోవటం లేదు."
"మరి?" విస్మయంగా అడిగింది.
"ఆ రోజు రోహిత్ మిమ్మల్ని అడిగిన ప్రశ్నలెన్ని?"
"ఇరవై"
"అందులో మీరు చెప్పిన జవాబులెన్ని?"
"పదిహేను మాత్రమే."
"అంటే మిగతా అయిదూ చెప్పలేకపోయారు."
ఇదంతా ఆదిత్య ఎందుకు అడుగుతున్నదీ ఆమెకు అర్ధంకాలేదు "అవును! మరోమూడు జవాబులు చెప్పగలిగి వుంటే గెలిచేదాన్ని."
"ఇప్పుడా ప్రశ్నలన్నీ మీరు నన్ను అడగండి."
"దేనికి?"
"ప్రిపరేషన్ లేకుండా నేను ఎన్నింటికి జవాబు చెప్పగలనో తెలుసు కోవడానికి. అంతేగాదు.... ఇది నాకు ప్రిలిమినరీ పరీక్ష లాంటిది. ఇందులో మీకన్నా నేను ఎక్కువ స్కోర్ చేస్తేనే రోహిత్ తో నేను పోటీకి సిద్దపడాలనుకుంటున్నాను."
"అవసరంలేదు ఆదిత్యా!"
"ప్లీజ్! ఇది నాకు నేనుగా పెట్టుకున్న నియమం. కాదనకండి."
ఆదిత్య కూడా మొండితనం ప్రదర్శించగలడని ఆమెకు తెలిసిన తొలిక్షణమది. ఇక నచ్చచెప్పాలని ప్రయత్నించలేదు.
చేజారిపోతున్న ఏ పెన్నిధినో దక్కించుకోవాలని సర్వశక్తులనూ కూడగట్టుకుని స్వయంవరంలా పోటీకి సిద్దపడుతున్నట్టు కనిపిస్తున్న ఆదిత్యని చూస్తూ "సరే" అంది నోట్ బుక్ తెరుస్తూ.
ఓ ధ్యానంలోలా కళ్ళు మూసుకున్నాడు ఆదిత్య.
ప్రాణాలు పోయే పరీక్ష కాదది.
ప్రేమను కోల్పోయే పోరాటం.
సన్నని ప్రకంపన ఆదిత్యలో.
అప్పుడు సమయం మధ్యాహ్నం పన్నెండున్నర కావస్తూంది.
"మధ్యాహ్నమే వచ్చేశావేం?" మొహమంతా వాడిపోయి వున్న ప్రబంధని చూస్తూ అడిగింది సౌదామిని.
సౌదామిని ఆ రోజు ఉదయమే హైదరాబాద్ నుంచి వచ్చింది. వస్తూనే "నిన్ను చూడాలనిపించింది ప్రబంధా!" అంటూ ఓ అందమయిన వాక్యంతో ప్రబంధ అహాన్ని చల్లార్చింది.
ప్రబంధకిగాని, శౌరికిగాని సౌదామిని ఎవరూ అన్నది చూచాయగా తెలిసిన విషయమే అమ్మ చనిపోయాక తమ తండ్రికి మానసికమయిన ఏంకర్'గా సౌదామిని ఎంత సహకరించిందీ వారికి తెలుసు.
ఒక్కమాటలో చెప్పాలీ అంటే సౌదామినిమీద వాసుదేవరావుకున్న అభిప్రాయంకన్నా ప్రబంధ, శౌరీలకున్న సదభిప్రాయం చాలా ఎక్కువ.
కాబట్టే కొన్ని రోజులపాటు యిక్కడే వుండాలని వచ్చాననేసరికి చాలా ఆనందించారు ఇద్దరూ.
సౌదామిని ఎంత తెలివయినదీ అంటే వస్తూనే సుధీర్ అనే ఓ 'పేర సైట్' శౌరికి ఆత్మీయుడుగా గుర్తించింది.
అరగంటసేపు అతఃదితో చనువుగా మాట్లాడి ప్రబంధకి అతడిమీద వున్న మక్కువ గురించీ తెలుసుకుంది.
అంతేకాదు. హోంమినిస్టర్ పద్మనాభం ఆదిత్య, ప్రణయలనే వ్యక్తులను గురించి సేకరించిన సమాచారమూ ఆమె దగ్గర వుంది.
మరో పది నిముషాలలో ప్రబంధ యింటికి వస్తుందనగా సుధీర్ ఫోన్ చేసి సౌదామినికి చెప్పాడు యూనివర్శిటీలో జరిగిన రాద్దాంతం గురించి.
