Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 37


                               కేక

నిద్రకు వెలియై....
నేనొంటరినై...
నా గది లోపల చీకటిలో,
చీకటి లోపల నా గదిలో,
నా గదిలో....
చీకటిలో...

నే నొక్కడనై....
నిద్రకు వెలియై....
కన్నుల నిండిన కావిరితో,
కావిరి నిండిన కన్నులతో,
కన్నులతో...
కావిరితో....

నిద్రకు వెలియై...
నేనొక్కడనై...
గుండెల కప్పిన కుంపటితో,
కుంపటి కప్పిన గుండెలతో,
గుండెలలో....
కుంపటితో...

నా కనుగోనల,
నా యెద గోడల,
నాలుగు దిక్కుల బాకులతో...
బాకుల తోటల బాటలతో...
బాటలలో....
బాకులతో....

భగ భగ భుగ భుగ
భగ భగ మండే
నా గది చీకటి నాలుకతో!
నాలుక చీలిన నాగులతో!
నా గదిలో...
నాగులతో...

ఇరవై కోరల,
అరవై కొమ్ముల,
క్రూర ఘోర కర్కోటకులో?
కోరకి కన్నూ,
కొమ్ముకి కన్నూ,
కర్కాటక కర్కోటకులో?

దారుణ మారణ దానవ భాషలు,
ఫేరవ భైరవ భీకర ఘోషలు,
ఘోషల భాషల,
ఘంటల మంటల,
కంటక కంఠపు గణగణలో?
చిటికెల మెటికల చిటపటలో?

నే నొంటరినై...
నిద్రకు వెలియై...
చీకటి లోపల నాగదిలో,
నాగది లోపల చీకటిలో,
చీకటిలో...
ఆకటితో...
                                                                            20-6-1939

                                                     * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS