"ఇటురా" అన్నట్లు సైగచేశాడు.
అతనితోపాటు ఆ గది మూలకు వెళ్ళాడు ఉపేంద్ర.
"నువ్వు చెప్పిందంతా బాగానేవుంది కానీ ఒకవేళ పాల్ మీద పోలీసులు ఫైరింగ్ చేశారనుకో అదెలా తెలుస్తుంది?" అడిగాడు.
"ఎలా ఏముంది? వాళ్ళ రివాల్వర్స్ కి, గన్స్ కి సైలెన్సర్స్ వుండవు. కాబట్టి గన్ షాట్స్ వినిపిస్తాయి.
"వాళ్ళు ఫైర్ చేసినప్పుడు తప్పించుకుని మన దగ్గరకి వస్తున్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఎంతసేపు మనం ఎదురుచూస్తాం?"
"సరిగ్గా నిమిషం! ఆ లోపు పాల్ మన దగ్గరకు వస్తే సరే లేకుంటే మనం వెళ్ళిపోతాం."
"ఒకవేళ వాళ్ళ బుల్లెట్స్ తగిలితే...."
"చనిపోతాడు....అంతే" చాలా కూల్ గా అన్నాడు ఉపేంద్ర.
"గాయపడి ప్రాణాలతో పోలీసులకి దొరికితే?"
"అది అసంభవం. కారణం....పాల్ మెడలో సైనేడ్ కాప్స్యూల్ వుంటుంది .తను ప్రాణాలతో దొరుకుతానేమో అనుకుంటే అది మింగుతాడు" చెప్పాడు ఉపేంద్ర.
ఇంకా ఏదో సందేహం వ్యక్తం చేయబోయాడు రాజు.
"ఇంకేం అడగద్దు. ఆ ముగ్గుర్నీ మనం ఖచ్చితంగా చంపుతున్నాం. దట్సాల్" స్థిరంగా పలికాడు ఉపేంద్ర.
* * * * *
నవంబర్ 26....
గేటు బయట ఆటో ఆగిన శబ్దమయ్యింది.
నుదిటి భాగాన్ని అరచేత్తో నొక్కుకుంటూ టెన్షన్ గా ఎదురుచూస్తున్న చంద్రకాంత్ ఒక్కసారిగా కుర్చీలోంచి లేచాడు.
కిటికీలోంచి చూసిన అతనికి ఆటోలోంచి దిగుతున్న అర్చన కనిపించింది.
వడిగా అడుగులు వేస్తూ బయటికి నడిచాడు.
ఆటో డ్రైవర్ కి డబ్బులిచ్చి ఇటు తిరిగిందామె.
చిన్నగా రొద చేస్తూ వెళ్ళిపోయింది ఆటో.
ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
ఆమె కళ్ళు ఏ క్షణంలోనయినా వర్షించేందుకు సిద్ధంగా వున్న శ్రావణమేఘాల్లా వున్నాయి.
"అర్చనా! వాట్ హేపెండ్?" ఒకింత ఆందోళనగా అడిగాడు చంద్రకాంత్ ఆమె వెనుకనే ఇంట్లోకి నడుస్తూ.
ఇంట్లోకి రాగానే బ్యాగ్ క్రింద వదిలి సుడిగాలిలా అతన్ని చుట్టుకుపోయి వెక్కి వెక్కి ఏడవసాగిందామె.
ఆమెను అలాగే పొదివిపట్టుకున్నాడు.
అతనికి విషయం అర్ధమయిపోయింది.
ఏది జరగకూడదనుకున్నాడో అదే జరిగింది.
"అర్చనా!" అనునయంగా పిలిచాడు.
ఆమె చిన్నపిల్లలా ఏడవసాగింది.
ఆమెనలాగే నడిపించుతూ తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు.
పది నిమిషాలపాటు ఆమె కళ్ళు అలా వర్షిస్తూనే వున్నాయి.
ఏం మాట్లాడాలో అర్ధంకాక నిస్సహాయంగా కూర్చున్నాడతను. జరిగిన సంఘటన అర్చన చెప్పకపోయినా స్పష్టంగా అర్ధంచేసుకోగలడతను. తనకి పెళ్లయిన విషయం తల్లిదండ్రులతో ఆమె చెప్పింది. వాళ్ళు అర్చనను కోపగించుకున్నారు, తిట్టారు. కొట్టి బయటికి తరిమినంత పనిచేసి వుంటారు.
ఆ బాధ తట్టుకోలేక ఆమె ఇలా వచ్చేసుంటుంది అనుకున్నాడు.
ఆమెలోని ఉద్వేగ ధోరణి తగ్గింది. ఆమె ప్రక్క నుండి లేచి ఫ్రిజ్ వైపుకి నడిచి అందులో నుండి ఒక బాటిల్ నీళ్ళు తీసుకుని గ్లాసులో పోసి ఆమెకు అందించాడు.
మౌనంగా గ్లాసు అందుకుని తాగిందామె.
"నీళ్ళతో ముఖం కడుక్కునిరా" చెప్పాడు.
అతను చెప్పినట్లే చేసిందామె.
"ఈ పెళ్ళి మీ తల్లిదండ్రులకు ఇష్టం వుండదన్న విషయం మనం ముందుగా వూహించినదే. ఇంకెందుకు అంతవర్రీ" అనునయంగా అన్నాడు.
దించిన తల మెల్లగానే పైకి ఎత్తిందామె.
"మీరు అన్నది నిజమే. బట్....ఈ నిజాన్ని నేను తట్టుకోలేక పోతున్నాను."
"ఏం జరిగింది? పెద్ద ఘర్షణ ఏమయినా జరిగిందా?"
"ఇంట్లోంచి పొమ్మన్నారు. నాన్నగారికి బి పి వచ్చింది" ఆమె గొంతు గద్గదమైంది.
"వాళ్ళు నాతో అంత కటువుగా ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళ హృదయాలను గాయపరిచాను. వాళ్ళు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అవన్నీ వమ్ముచేశాను. నాకు పెళ్ళయిపోయింది అన్న నిజాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇది ఏనాడూ వూహించని సంఘటన.
బొటనవేలితో నుదుటి మీద రుద్దుకుంటూ కూర్చుండిపోయాడతను.
"వాళ్ళతో చెప్పాకనే ఈ పెళ్ళి చేసుకోవాల్సింది" అందామె.
మాట్లాడలేదతను.
"వాళ్ళ మనస్సు విరిగిపోయింది. ఇంక నాతో మాట్లాడతారని నమ్మకము లేదు. అమ్మని, నాన్నని ఇంతగా బాధపెట్టి యీ పెళ్ళి చేసుకుని నేను పొందే సుఖం ఏమిటో అర్ధం కావటంలేదు."
ఆమె మాటల ధోరణికి ఏ మాత్రం అడ్డుపడే ప్రయత్నం చేయటం లేదతను.
"నాన్నగారికి ఇప్పుడన్న బి పి చూస్తే చాలా భయంగా వుంది. ఆయన్ని హాస్పిటల్ లో చేర్చాడు. ఏదయినా జరగకూడనిది జరిగితే...." ఆమెకింక మాటలు రాలేదు.
మౌనంగా కూర్చోవటం తప్ప మరేమీ చేయలేకపోయాడు.
మరికొద్ది నిమిషాలు వాళ్ళ మధ్య నిస్సబ్ధమే అలుముకుంది.
ఆమెలో ఆ సమయంలో ఒకరకమైన నిర్లిప్తత అలుముకుంది.
"చూడు అర్చనా!"
అతని పిలుపు విని తల పైకెత్తి చూసిందామె.
"మన పెళ్ళికి ముందు ఇదిలా జరుగుతుందని వూహించినదే. నువ్వు దానికి సిద్ధపడ్డావు కూడా. ఇది కేవలం కొద్ది కాలమే. ఆరంభంలో ఆవేశాలుంటాయి. అహంకారాలు తిరిగి చిగురుతొడుగుతాయి. కొన్నాళ్ళకి మామూలవుతారు. ఇది అందరి విషయంలోనూ సహజం. కాబట్టి జరిగినవి మర్చిపోయి ఎడ్జస్ట్ అయ్యేందుకు ప్రయత్నించు."
నిశ్శబ్దంగా కూర్చుందామె.
ఆమె అంతరంగంలో తుఫానులు సుడులు తిరుగుతున్నాయని అతనికి తెలుసు. ఆమె మానసిక స్థితి అర్ధం చేసుకోగలడతను.
"అర్చనా! ట్రై టు బికమ్ నార్మల్" అనునయంగా అన్నాడతను ఆమె ప్రక్కనే కూర్చుంటూ.
అతని భుజం మీద వాలిపోయిందామె.
ఆమె కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి.
* * * *
జేబులోని రివాల్వరుని కుర్చీలో పడవేసి ,షర్టు విప్పి మంచం మీద బోర్లా పడుకున్నాడు సెబాస్టియన్.
"సుబ్బూ! దాహంగా వుందిరా" అన్నాడు ఎండిపోయిన పెదవులు తడుపుకుంటూ.
కోడిగ్రుడ్డు పగులగొట్టి గిన్నెలో వేసి చెంచాతో కలపబోతూ సెబాస్టియన్ మాట వినపడటంతో చేస్తున్న పని ఆపి బయటి గదిలోకొచ్చాడు సుబ్బు.
అంతవరకు ప్రక్క గదిలో చాప మీద పడి దొర్లుతున్న కణ్ణన్ కూడా బయటికి వచ్చాడు అతని మాట విని.
అతనికి దాహంగా వుందంటే అర్ధం ఏమిటో సుబ్బుకి తెలుసు.
గాజు గ్లాసులో విస్కీ, సోడా నిలిపి తీసుకువచ్చి అతని ప్రక్కనున్న స్టూలు మీద వుంచి లోపలికి వెళ్ళిపోయాడు సుబ్బు.
మంచం మీద నుండి లేచి కూర్చుని స్టూలు మీద గ్లాసులో వున్న విస్కీని మంచినీళ్ళలా గడగడా తాగేశాడతను.
"సుబ్బూ! ఇంకా కావాలిరా!" అసహనంగా అరిచాడు.
"నీ కన్నింటికీ తొందరే" మరింత అసహనంగా అరుస్తూ లోపలి నుండి వచ్చాడు సుబ్బు.
"కణ్ణన్! మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు?" లోపలి గదిలోకి తొంగిచూస్తూ అన్నాడు సెబాస్టియన్.
"పడుకుని నిద్రపోతున్నారు. పిలుస్తానుండు" అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
గ్లాసునిండా విస్కీని నింపి యిచ్చాడు సుబ్బు.
ఈసారి మెల్లగా సిప్ చేయసాగాడు సెబాస్టియన్.
నిమిషం తర్వాత ఆ గదిలోకి వచ్చారు కణ్ణన్, మరో నలుగురు.
కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు సెబాస్టియన్.
అక్కడే వున్న బెంచ్ మీద కూర్చున్నారు వాళ్ళందరూ.
"అన్ని ఏర్పాట్లూ పూర్తయిపోయాయి. సంజును చంపడానికి రంగమంతా సిద్ధమైపోయింది" చెప్పాడు సెబాస్టియన్.
సైలెంటుగా వింటున్నారు వాళ్ళు.
"ఈ హత్య జరిగిందంటే మన బాస్ చాలా ఆనందిస్తాడు" సెబాస్టియన్ అన్నాడు.
"అవును. బాస్ ఆనందించాడంటే మనందర్ని కూడా అన్ని రకాలుగా ఆనందపరుచుతాడు."
కణ్ణన్ మొహంలో సంతోషం తొణికిసలాడింది.
"నలభై ఎనిమిది గంటల్లో ఆమె హత్య జరిగిపోతుంది" ఖాళీ చేసిన గ్లాసు క్రింద పెడుతూ అన్నాడు సెబాస్టియన్.
"ఏమిటంత నమ్మకంగా చెబుతున్నావు?" ఆమెట్ల ప్లేటు తీసుకొచ్చి స్టూల్ మీద వుంచుతూ అన్నాడు సుబ్బు.
"అంటే?" మంచం మీద నుంచి లేచి నిలబడుతూ అన్నాడు సెబాస్టియన్.
"అదే....హత్య జరుగుతుందని ఏమిటంత నమ్మకం?" రెట్టించాడు సుబ్బు.
