Previous Page Next Page 
ఆలింగనం పేజి 35


    నేను షాకయి వింటున్నాను.

 

    రేవతీ సిద్ధార్థ!!! అంటే ఇతనికి పెళ్ళయిపోయింది. ఒక బాబు కూడా! ఎంత మోసం?

 

    ఎర్రనైన మొహంతో గబుక్కున లేచాను.

 

    అతను నావైపు తిరిగేసరికి నేను తలుపు తీసుకుని వడివడిగా బయటికి నడిచాను.

 

    అసలు ఏడుపు కూడా రావటంలేదు. గుండెకి ఎగదన్నిన భావన. అసలు ఎన్నిసార్లని మోసపోతాను? ఈ మగాళ్ళంతా ఇంతేనా? ప్రతివాడూ ఎంత తియ్యగా ఉచ్చు బిగిస్తాడూ? సమయానికి ఆ రేవతి ఫోన్ చెయ్యబట్టి కానీ లేకపోతే...

 

    "ఆటో..." ఖాళీగా వస్తున్న ఆటోని ఆపి అటు పరిగెత్తాను. వెనక నుండి సిద్దార్థ "ముక్తా" అని పిలవడం వినిపిస్తోంది. పరుగు వేగం పెంచాను.

 

    ఆటో నేను ఆపేలోగానే ఎవరో అవతలవైపు నుండి చటుక్కున ఎక్కి కూర్చున్నారు.

 

    "ప్లీజ్...నన్ను కూడా ఎక్కనీయండి" ఏడుపు తన్నుకొస్తుండగా అడిగాను.

 

    "ఆముక్తా!" అని ఆశ్చర్యంగా చూశాడు మాధవ్. అతనే ఆటోలో ఆ పక్కనుండి ఎక్కి కూర్చున్నది!

 

    "ఆముక్తా...ఆగు...సిద్దార్థ దగ్గర కొచ్చేస్తున్నాడు.

 

    నేను గబుక్కున ఆటోలోకి ఎక్కికూర్చుని "పోనీ!" అన్నాను. ఆటో స్టార్టు అయి దూసుకుపోతోంది.

 

    నేను పక్కనున్న వ్యక్తిని పట్టించుకోకుండా, దోసిట్లో మొహం దాచుకుని ఏడుస్తూ కూర్చున్నాను.

 

    "ఏమైందమ్మా?..." మాధవ్ నా తల నిమురుతూ లాలనగా అడిగాడు.

 

    ఏం చెప్పను? నేను రెండోసారి కూడా ప్రేమలో ఘోరంగా మోసపోయానని చెప్పనా? అదీ నా అక్కకి కాబోయే భర్తతో! చెప్పలేను.

 

    "పిచ్చికుక్క వెంటపడింది" చెప్పాను.

 

    "అయ్యో...ఎక్కడైనా కరిచిందా?" నా పాదం మీదనున్న పరికిణీ కుచ్చిళ్ళు తప్పించి చూస్తూ అడిగాడు!

 

    "లేదు, పరిగెత్తుకొచ్చేశాను!" కుచ్చిళ్ళు సరిచేసుకుంటూ చెప్పాను.


                                   *  *  *


    చాలాసేపట్నుండీ ఏడవటం వలన నా కళ్లు రెండూ వుబ్బిపోయాయి. ఎంత ఏడ్చినా ఆ కన్నీళ్ళు నా గుండెలోని నెగడుని ఆర్పలేకపోతున్నాయి.

 

    "ఏడవకమ్మా...ఊర్కో..నాకు అంతా అర్థమైంది" అన్నాడు నా తల నిమురుతూ మాధవ్.

 

    కళ్లు తుడుచుకుని "నేను వెళ్తానండీ!" అన్నాను.

 

    "మా అమ్మా చెల్లీ వచ్చేదాకా ఆగచ్చుగా" అన్నాడు.

 

    "ఈ రూపంతోనా?" విరక్తిగా అన్నాను.

 

    అతను నిట్టూర్చి "తనకు తల్లీ, చెల్లీ ఉన్నా ఇంకో ఆడదాన్ని ఈ రకంగా మోసగించాలని మగవాడు ఎందుకనుకుంటాడో నాకు అర్థంకాదు... మీరు పైపై మెరుగులు చూసి అలాంటివాళ్ళ వలల్లోనే పడిపోతూంటారు" అన్నాడు.

 

    మర్యాదగా, పద్ధతిగా వున్న అతన్ని 'బుద్ధూ' అనుకున్నందుకు మనసులోనే బాధపడ్డాను.

 

    మాధవ్ ఎంతో బలవంతం చేయటంవల్ల అతని ఇంటికొచ్చి మనసులో బాధంతా వెళ్ళగక్కాకా కొంచెం ఉపశమనంగా అనిపించింది.

 

    అతని చెయ్యి ఇంకా నా తలని నిముర్తూనే ఉంది.

 

    "ఇంట్లో ఎదురుచూస్తుంటారు...వెళ్ళొస్తా" అన్నాను.

 

    "కాఫీ కలుపుతాను. తాగి వెళ్ళమ్మా" అన్నాడు.

 

    అతణ్ణి ఇంక వారించలేక ఆగిపోయాను.

 

    మాధవ్ వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపాడు.

 

    నేను సోఫాలో కూర్చుని నా భవితవ్యం గురించి ఆలోచించాను. చచ్చిపోతేనో...అని కూడా అనుకున్నాను. కానీ...బ్రతుకంటే తీపి ఆ ఆలోచనని తోసిపారేసింది. సిద్ధార్థ మీద పగ ఒళ్ళంతా నోళ్లై బుసలుకొడ్తోంది. నా చావుకి వీడే కారణం' అని రాసిపెట్టి ఛస్తే భలే ఉంటుంది! కానీ ఆ తర్వాత వాడు కేసులో ఇరుక్కోవడం, కోర్టుల చుట్టూ తిరగడం, పెళ్ళాం ముందు తలవంచుకోవడం నేను చూడలేనుగా...ఏం లాభం?

 

    మాధవ్ కాఫీ కప్పులతో వచ్చాడు.

 

    నేను కాఫీ అందుకుంటూ ఉంటే,

 

    "ఏదీ...ఒకసారి నీ చెయ్యిచూడనీ..."

 

    "మీకు హస్తసాముద్రికం తెలుసా?" అడిగాను.

 

    "కొద్దిగా" అంటూ నా ఎడమచెయ్యి అందుకున్నాడు.

 

    ఆ గీతలతో నా జీవితం ఎంత ఒంకర టింకరగా కనపడిందో కానీ 'హూ!' అని నిట్టూర్చి, "చాలా త్వరగా మోసపోయే టెండెన్సీ ఉందమ్మా నీకు!" అన్నాడు.

 

    అది చెప్పడానికి నా చెయ్యి చూడక్కర్లేదు. నా కళ్లు చూస్తే చాలు! పైటకొంగుతో అద్దుకున్నాను.

 

    "ఈ సంవత్సరం గడిస్తే బావుంటుంది. ఇదిగో ఈ గీత...చూడు... వేళ్ళతో నొక్కి చూపిస్తూ" ఇది మ్యారేజ్ లైన్...ఏ ఒడిదుడుకులూ లేకుండా స్ట్రెయిట్ గా ఉంది. పిల్లలూ...ఆ..." నేను కొంచెం సిగ్గుపడి చటుక్కున చెయ్యి వెనక్కి లాగేసుకున్నాను.

 

    "చూడనీ-ఇద్దరూ..." నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకుంటూ అన్నాడు.

 

    "అబద్ధం! ఒక్కరే" అన్నాను.

 

    అతను ఆశ్చర్యంగా చూసాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS